Friday 24 July 2020

భీమకవి మహాకావ్యాలు


కవిజనాశ్రయం(భీమన ఛందస్సు):
        భీమకవి పద్య నియమాలను తెలుతూ వర్తమానకవుల కోసం కవిజనాశ్రయం లేదా భీమన ఛందస్సు అను పేరిట ఒక ఛందశ్శాస్త్ర గ్రంథాన్ని వ్రాశారు. ఈ గ్రంథము శ్రీ జయంతి రామయ్య పంతులు గారిచే శోధించబడి ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచే ప్రచురించబడినది.
        అందులోని ఈ క్రింది పద్యాలు భీమకవి రచించిన గ్రంథమనుటకు ఆధారములు. 
      వేములవాడను వెలసిన
        భీమేశ్వరు కరుణఁగల్గు  భీమసుకవినే
        గోమటి రేచన మీదను
        నీమహిఁ గవులెన్న ఛంద మెలమి రచించున్
భావము: భీమేశ్వరుని కరుణ వల్ల, వేములవాడన జన్మించిన భీమకవిని నేను. కోమటి రేచన చేతున మీద ఈ భువిలో కవులు ఎంతదగ్గ ఛందస్సును రచించాను.

కవిరాక్షసీయం:
భీమకవి సంస్కృతమున రచించిన గ్రంథాలలో “కవిరాక్షసీయం” అనే లక్షణమైన కావ్యం ఒకటి. ఇది ద్వ్యర్థి కావ్యము(రెండర్థముల కావ్యం). ఈ గ్రంథములో ప్రతి పద్యానికీ రెండు అర్థాలు కలవు. ఒక అర్థంలో పోలిక. రెండవ అర్థం తాను చెప్పదలచుకున్న విషయము. ఈ కావ్యాన్ని “శ్రీనివాసపురము లోకనాథ కవి” తెలుగులో టీకాతాత్పర్యవ్యాఖ్యాన (ప్రతి పదార్థ భావ) సహితముగా అందించారు.

రాఘవపాండవీయం:
కవిరాక్షసీయంలా రాఘవపాండవీయం కూడా ద్వ్యర్థి కావ్యము. ఇది తెలుగులో మొదటి  ద్వ్యర్థి కావ్యము.ఈ కావ్యంలో ప్రతి పద్యం  ఒక అర్థంలో రామాయణ కథను, మరొక అర్థంలో మహాభారతకథను వివరిస్తాయి. ఈ కావ్యము గురించి ఆకాలమున నలుగురూ గొప్పగా చెప్పేవారు. కానీ నేడు ఈ కావ్యంఎక్కడా దొరకలేదు. అందువలన పింగళిసూరన తానకు అలాంటి కావ్యమును వ్రాసే శక్తి కలదని తలచి మళ్ళీ అదే పేరుతో (రాఘవపాండవీయం)ద్వ్యర్థికావ్యమును రచించాడు. పింగళిసూరన తాన “రాఘవపాండవీయం”లో ఇదే విషయాన్ని మొదటి పద్యాలలో ప్రస్తావించాడు.

              రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
                కుండుందద్గతిఁ గావ్యమెల్లనగునే నోహో!యనం జేయదే
                పాండిత్యంబున నందునుం దెనుగు కబ్బంబద్భుతంబండ్రు ద
                క్షుం డెవ్వాడిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్

భావము: రెండర్థముల పద్యము ఒకటి కూర్చుటకే సాధ్యము కాదు. అటువంటి  కావ్యమే నిర్మింపజేస్తే ఆ అద్భుతము అందరినీ అశ్చర్యపోయేలా చేయక మానదు.  అటువంటి కావ్యము మన తెలుగులో అరుదు. అటువంటి కావ్యం రామాయణ, భారతములను జోడించి, ఆ రెండర్థాలనూ ఒకే పద్యమాలికలో ఈ భూమిపై ఎవరు చెప్పగలరు.

              భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందునొం;
                డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము నా
                నామహిత ప్రబంధరచనా ఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్,
                నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గల దంచు నెంచెదన్

భావము: మొదట భీమకవి రెండర్థముల కావ్యమును చెప్పెనని పెద్దలు చెప్పారు, కానీ ఆ కావ్యంలో ఎక్కడా ఒక్క పద్యం కూడా నేటికి లభించలేదు. ఏ ఒక్కరు కూడా చూసి ఎరుగరు. ఈ విషయం అలా ఉంచితే, ఎన్నో విధాలుగా పూజ్యులైన, మీకు (వేములవాడ భీమకవి) కావ్యరచన వలన అధికమైన ఖ్యాతి లభించుట వలన ఈ రెండర్థముల ప్రబంధము యొక్క కూర్పు నందు నైపుణ్యము(కవితా శక్తి) నీకు కలదని నా హృదయము నందు తలచెదను. 



నృసింహపురాణము(వరాహపురాణం):
        ఇది వరకే నృసింహపురాణము తెలుంగరాయుడి అస్థానమున ఉన్నపుడు, రచించాడన్న సంగతి విదితమే. అందులోని కొన్ని పద్యాలను ఇక్కడ పొందుపర్చబడ్డాయి.
                   
              సురచిరపానపాత్రమున సుందరియొక్క తే కేలనిండు చం
                దురుడు ప్రకంపితాంగములతోఁ దిలకించెఁ దదానంబుజ
                స్ఫురిత వికాస వైభవము సొంపులడంకువమ్రుచ్చిలింపఁ జె
                చ్చెరఁ జనుదెంచికట్టువడి చేడ్పడి భీతివడంకుచాడ్పునన్

భావము: భావము: ఆ సుందరి చేతిలో ఉన్న మిక్కిలి రమణీయమైన పానపాత్రము (లోటా లేదా పాత్ర)లో చంద్రుడు అత్యంతగా ప్రకాశిస్తున్నాడు. చంద్రుని అందాలన్నీయూ ఆ సుందరి ముఖవైఖరులచే దొంగలింపబడినట్లుగా ఆమె చేతిలో (ఉన్న పాత్రలో) కట్టుబడపొయి భయముతో వణుకుతూ ఉన్నట్లుండెను.

              భువిఁ బుట్టి పీచమడఁచెను
                దివిజారాతుల దినేశ దీప్తులడర రా
                ఘవుఁడనుచు మునులు వొగడిరి
                దివిని దివౌకనులు మిగుల దీవించి రొగిన్

              కలగకుఁడీ నభశ్చరులు కంపము జెందకుఁడెప్దు గిన్నరుల్
                తలకకుఁడచ్చరల్ మునులుఁదత్తరమందకుఁ డేను వచ్చి మీ
                యల జడులెల్లఁ బాపి మిమునందఱఁ గాచెదనంత వట్టు మీ
                గలిబిలిమాని యుండుఁడని కైటభమర్దనుఁడెల్ల భంగులన్

              ఈక్షితికి వచ్చి వేగమ
                ద్రాక్షారామమున వార తరుణులనృత్యం
                బీక్షించి యంతకంటెను
                దక్షణమున నేర్చి రంభతగ వేర్పడగన్

              శ్రుతిమత ధర్మయోగములు చోద్యపుమూల్యములప్పురంబునఁ
                జతురతఁ బుణ్యవస్తువులు సారవిముక్తి వదంబు లమ్ము వా
                రతులిత విఘ్న శాసన సమాహితులైన మహాత్ములందితో
                ద్ధతిఁ గొనువారు మీసువిహితవ్రత పారగులైన బోధనుల్.

        తే.గీ    అదరుపాటున వెసనిచ్చి పొదివికొనిన
                దొలగిపోవఁగూడక యుండి మలయపవనుఁ
                డిందుఁ దలదూర్చుకొనియెనో యిప్పుడనఁగ
                నమరుఁదాళవృంతముల మందానిలంబు!

        తే.గీ    పొదవియొండొండ దివియును భువియు దెసలుఁ
                బొదవికొని యుండు చీకటి ప్రోవువలన
                మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్లు
                కరవటంబునజగదండ ఖండమమరె

              అది యట్ల కాదె నిప్పునఁ
                జెదలంటునె దేవదేవు శ్రీరమణీశుఁ
                మదినుంచుకొన్న వానిని
                బొదవునె యాపదలు? దవినిఁ బొందునె తమమున్

              శ్రీస్తవకుంకుమద్రవ నిషిక్త భుజాంతరభాగ విస్ఫుర
                త్కౌస్తుభ నూతనార్కరుచి గర్వితనాభిసరోజ సౌరభ
                వ్రస్తుత మత్తభృంగవర రాగరసోల్పణ భోగిభోగ త
                ల్పాస్తరణుందలంచు సుకృతాత్ముల పాస్త సమస్త కల్మషుల్

              కడిఁది వరంబు వారిరుహగర్భునిచేఁ గొనినాడు వాడు మీ
                యెడ ననిశంబుఁ బెన్బగయు నీనును దోషము నెమ్మనంబులో
                జడిగొని యుండుఁగావున నసాధ్యుఁడవధ్యుఁడు దైత్యనాధుడే
                వడువునఁబౌరుషంబుఁగొని వానిజయించుట వ్రేగుచూడగన్

        తే.గీ    పొగడమ్రాకుల మొదలను బుష్పరసము
                తొరగి నెత్తావియందున నెరయనొప్పెఁ
                బూచు కొఱకుసు మున్ను నింపులు దలిర్పఁ
                గడగి వనలక్ష్మి యుమిసిన కళ్ళయనగ

             ధరణీమండలి దిర్దిరం దిరిగెఁ బాతాళంబు ఘూర్ణిల్లె ని
                ర్జరనాధ ప్రముఖాఖిలామర నివాస శ్రేణులం దోలిమై
                నెరయుఁ బంకజ సంభవాలయమునఁ నిండారె నెవ్వేళ శ్రీ
                కర దైతేయ తనూభ వోద్భవకథా కల్యాణ ముద్ఘోషమై

              మీఱీన మౌనుల కినుకకు
                మాఱలుగక యున్న మీసమగ్రక్షమవే
                మాఱుఁగొని యాడఁగా దగు
                గీఱునె సాత్వికుల బుద్ధిఁ గిల్బిషచయముల్

              వేదములాదిగఁగలయ
                ష్టాదశ విద్యలకునీవ స్రష్టవుతత్త
ద్బోధకులును భవదాజ్ఞా
                పాదకులు సమస్త ధర్మపాలన చతురా.

శతకంఠరామాయణం: భీమకవి రచించిన శతకంఠరామాయణం అను కావ్యము నేటికి దొరుకలేదు. ఆ గొప్ప గ్రంథములోని ఒక పద్యము ఈ క్రింద ఇవ్వబడింది.  ఈ పద్యము ఎంతో జిగిబిగి, సొంపులతో కూడి ఎంతో వినసొంపుగా ఉన్నది. ఈ పద్యము భీమకవి ఉద్దండ స్వభావమునకు గుర్తు.

                వారక వారకామినుల వర్తులచారుకుచోపగూహముల్
                కోరక కోరకోల్లసితకుంజములఁ జిగురాకు పానుపుల్
                చేరక చారుకేరళ కళింగ కుళింగ నరేంద్ర మందిర
                ద్వార విహారులై సిరులనందక నందకపాణిఁ కొల్వరే

భావము: స్త్రీవ్యామోహముతో వేశ్యల పొందు కోరక, విలాసవంతమైన, సుఖమయమైన జీవితమును ఆశించక, రాజాస్థానములను చేరి సిరులను ఆశించకుండా, ఎల్లవేళలా నందకపాణి అయిన విష్ణుమూర్తిని కొలవండి.

జ్యోతిష్యామృతసారము:
జ్యోతిష్యామృతసారమను కావ్యాన్ని భీమకవి రచించారు. భీమకవి రచించిన జ్యోతిశ్శాస్త్రంలో జ్యోతిష్యమునకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని చెబుతారు. భీమకవి రచించిన జ్యోతిష్యామృతసారమును పారశీక భాషలో అనువదించబడింది.

లకోటాప్రశ్నశాస్త్రము:
భీమకవి సంస్కృతంలో రచించిన ప్రశ్నశాస్త్రము. ఇది తెలుగులో అనువదించబడింది. ఈ పుస్తకము నేడు ద్రాక్షారామ ప్రాంతములో లభించును. మనసులో తలచుకున్న సంఖ్యను బట్టి ఆ తరువాత రోజుల్లో ఎలా జరుగునో (వార ఫలాల మాదిరి) వివరించారు.
        ఇంకనూ ఈ మహానుభావుడు కవిత్వములోను, జ్యోతిశ్శాస్త్రము,  గణితశాస్త్రము, వైద్యశస్త్రములలో కూడా ప్రావీణులు. “భావప్రకాశికఅను పేరుతో ద్వాదశ(12) భావములను తెలుపు ఒక గ్రంథమును కూడా రచించారు. “భీమేశ్వర నాడీనిదానముఅనే పేరుతో 108 పద్యములను ద్రాక్షారామభీమేశ్వరా! అను మకుటముచే వైద్యశ్శాస్త్ర గ్రంథమును రచించారు. భీమకవి గణితశ్శాస్త్రములో కూడా గ్రంథమును రచించారని చెబుతారు. కాని ఆ గ్రంథము పేరు తెలియరాదు.
        భీమాకవి సాహిణి మారుడిపేరున చెప్పిన పద్యాలు కొన్ని కనపడుతాయి. కానీ ఆ  సాహిణి మారన, చొక్కభూపాలుని ప్రార్థన మేరకు కదనరంగమున తుదముట్టించిన సాహిణి మారడా? లేదా వేరేవాడా? అనేది తెలియరాదు. బహుశా భీమకవి నిగ్రహానుగ్రహ సమర్థుడగుట వలన ప్రయోజనమును బట్టి తరువాత అతనిని బ్రతికించిన తర్వాత ఏదైనా సందర్భములో ఈ పద్యాలు చెప్పాడో ఏమో తెలియరాదు.
పద్యాలు:
              అప్పులిడు నతడు ఘనుడా
                అప్పుడొసగి మఱలఁ గాంచునాతడు రాజా?
                చెప్పగవలె సాహిణిమా
                రప్పను దానమున ఘనుడు రాజునటంచున్!

              మాటాడరాదు సభలన్
                మాటాడినఁ దప్పరాదు మగసింగముకున్
                మాటయె మానము  కాదా
                పాటువుగల వారికెల్ల సాహిణిమారా!

              ఇంతుల మనముల నరిసా
                మంతుల మనములను బుద్ధిమంతులమదిలోఁ
                జింతింపని బ్రతుకేటికి
                సంతత సత్కీర్తి హారా సాహిణిమారా!
సుమతీ శతకము:
        ఈ సుమతీ శతకము చాలా పురాతనమైనది. అయితే ఈ సుమతీ శతకమును రచించిన కవి ఎవరన్న చిక్కుముడి ఇప్పటికీ వీడలేదు. ఈ సుమతీ శతకము మద్రాసులోని  ప్రాచ్యులిఖిత భాండాగారము(గ్రంథాలయము)లో D1810 అను తాళప్రత ప్రతిలో “భీమన” అను కవి రచించినట్లున్నది.

                శ్రీకరమగ భీమన మును
                లోకమునకు బొగడగా విలోకించి మదిన్
                బ్రాకతముగా సుమతికి మతి
                చేకూడగ సుమతి నీతి చెప్పెదొడంగెన్

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...