Friday 24 July 2020

చొక్కభూపాలుడు - భీమకవి


భీమకవి అనుగ్రహపాత్రులలో చొక్కభూపాలుడు ముఖ్యుడు.రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రవరమును పాలిస్తున్న కాలంలోనే చాళుక్య వంశస్థుడైన చొక్కభూపాలుడు ఏలూరు సమీపంలో ఉన్న పెదవేంగి పట్టణమును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
        భీమకవి ఒక రోజు చొక్కభూపాలుడిని కలవడానికి పెదవేంగి పట్టణానికి వెళ్ళారు. తానాడిందల్లా ఆట, పాడిందల్లా పాటయ్యే వేములవాడ భీమకవే స్వయంగా తన రాజ్యానికి వచ్చారన్న సంగతి తెలుసుకున్న వెంటనే,భీమకవికి ఎదురెళ్ళి సగౌరవంగా తన ఆస్థానానికి  పిలుచుకువచ్చాడు. తగిన ఆసనముపై కుర్చోబెట్టి,కస్తూరి, పునుగు, జవ్వ మొదలైన సుగంధవస్తువులను ఇచ్చి ఘనంగా సత్కరించాడు. భీమకవీశ్వరుడు తన ఆస్థానమునే ఉంటే,ఆ సర్వజ్ఞుడితో ఇష్టాలాపనము చేస్తూ కాలము గడపవచ్చని ఆలోచించేవాడు. భీమకవి తన వద్ద ఉన్నంతకాలము దేనికీ లోటురానీయకుండా చూసుకున్నాడు.
        చొక్కన అతిథిమర్యాదలు భీమకవికిబాగా నచ్చాయి. కొంతకాలము ఇక్కడే ఉండటానికి రాజుతో చెప్పారు. అదే పదివేలుగా భావించి చొక్కన సంతోషంగాభీమకవి ఉండటానికి ఒక రమ్యమైన భవనము ఇచ్చి, అందులో అన్ని వసతులను కల్పించి, మర్యాదలు చూసుకోవడానికి భటులను ఏర్పాటుచేసి, సేవకులను నియమించాడు. భీమకవితో “దేవా! తమకు అన్ని సదుపాయాలను కల్పించాను. ఏ లోటు కలిగినా వెంటనే  నాకు తెలియజేయండి. నన్ను అనుగ్రహించి నా ఆస్థానమునే ఉండండి” అని కోరాడు.
        ఒక రోజు సాయంత్రం ఉద్యానవనంలో భీమకవితో మాట్లాడుతూ నడుస్తున్నపుడు చొక్కభూపాలుడు “మహానుభావా! మీరు ఏమన్నా అది జరుగుతుందనిఆ ఊరా, ఆ ఊరా  చెప్పుకుంటునారు. అది వినడమే కానీ, మీ మహిమను ఎన్నడూ చూసి ఎరుగను. ఒక్కసారి మీ మాధుర్యకవితా మహిమను కనులారా చూడాలని కుతూహలంగా ఉంది. ఒక పద్యము చెప్పి ఈ మల్లెపందిరిన పాతపడి ఉన్న కొయ్య స్తంభాన్ని చిగురింపచేయవా” అని అడిగాడు.
        భీమకవి అలానే అని అతని అభీష్టమును తీర్చదలచి ఈ క్రింది పద్యమును చెప్పారు.

                శా.     ఆనీతాభ్యుపదాన శృంఖల పదాభ్యాలంబిత స్తంభమా
                        నేనే వేములవాడ భీమకవినే నిఁ జిత్రకూటంబులో
                        భూనవ్యాపిత పల్లవో ద్భవ మహాపుష్పోపగుచ్ఛంబులన్
                        నానా పక్వ ఫలప్రదాయి వగుమా నా కల్పవృక్షాకృతిన్
భావము:
 భూమిలో చక్కగా పొందింపబడి సంకెళ్ళతో బంధింపబడినట్లు ఉండి మల్లెపందిరికి ఊతనిస్తున్న స్తంభమా! నేను వేములవాడ భీమకవిని. నా మనోభీష్టం ప్రకారం ఈ మాయా కొలువుకూటానవేర్లతో భూమిలోకి వ్యాపిస్తూ, కొమ్మలతో చిగురిస్తూ, పుష్పపుగుచ్ఛాలను, రకరకాల మాగిన పండ్లను అందించే కల్పవృక్షంలా రూపు పొందుమా!
       
        వెంటనే అందరి కళ్ళ ముందే ఆ స్తంభము చిగురించి పువ్వులతోనూ, ఆకులతోనూ, పిందేలతోనూ, పండ్లతోనూ ఎంతో అందంగా మారి చొక్కభూపతికి నేత్రపర్వం చేసింది. చొక్కభూపతి భీమకవి కవితామహిమకు ఎంతో ఆశ్చర్యముపడి సభవారిమధ్య పొగుడుతూ,భీమకవివైపుకు చూసి “కవిసార్వభౌమా! నీ మహిమను కనులారా చూసి నాజన్మ ధన్యమయ్యింది. నీ అంతటి వాడిని ముల్లోకాలలో కానీ, త్రికాలాలలో కానీ చూడడం సాధ్యపడదు. నీకు నీవే సాటి. నీతో సరిపోల్చగల వారెవ్వరూ లేరు. అనుగ్రహించి ఈ వృక్షమును మునుపటిలా మల్లెపందిరి కొయ్య స్తంభంగా మార్చివేయండి” అని అడిగాడు.  భీమకవి ఈ క్రింది పద్యమును చెప్పారు.

                   ఉ.    “శంభువరప్రసాద కవి సంఘవరేణ్యుడనైన నావచో 
                          గుంభన మాలకించి యనుకూలత నొంది తనూన భావనన్  
                          గుంభినిఁజొక్క నామ నృపకుంజరు పందిటి మల్లెసాలకున్ 
                          స్తంభమురీతినీతనువు దాలిచి  యప్పటియట్లయుండుమా”

భావం: పరమేశ్వరునివరపుత్రుడను, కవితాగ్రేసరుడనైననాపలుకులను విని,నా అభీష్టం ప్రకారం నీ తనువును దాల్చావు. భువిలో చొక్కన అనేమహాచక్రవర్తి పందిటిలోని మల్లెశాలస్తంభముగా నీ మునుపటి రూపాన్ని పొంది యెప్పటిలాగాఉండుమా!   
        వెంటనే ఆ వృక్షం ముందులాగా కొయ్యస్తంభముగా మారిపోయింది. ఇది కనులారా చూసిన వారందరూ భీమకవిని అమొఘవాక్యాధురీణుడని ఎంతో పొగిడారు. మరొక సారి “మహాత్మా మీరు చిరస్థాయిగా ఇక్కడే ఉండమని ప్రార్థిస్తున్నాను. మీరు ఉంటే మారాజ్య ప్రజలెల్లవేళలా  సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు.” అని చొక్కన విన్నవించుకున్నాడు. భీమకవి “మహారాజా తొలుత మీ దర్శనమే చేసుకున్నాను. నానా రాజ సందర్శనము చేసిన తర్వాత మీ ఆస్థానమునకు వచ్చి కొంతకాలము ఇక్కడ ఉండి అనుగ్రహిస్తాను” అని సమాధానపరిచారు. చొక్కభూపాలుడు “సరే అలానే కానివ్వండి. ఇప్పుడు కనకాభిషేకము చేసి, సంతృప్తి చెందుతాననగా భీమకవి “మహారాజా మీ ఆదరాభిమానాలు నన్ను మహదానందభరితుడను చేస్తున్నాయి” అని చెప్పారు.
చొక్కభూపతి “భామలకు బంగారం, మునులకు తపస్సు, యాచకులకు దాత, కవులకు కనకాభిషేకము, నా వంటివానికి స్నేహితులంటే ఆశ కదా” అని చమత్కరించాడు. అలా చొక్కన సన్మానం తర్వాత పెద వేంగి నుంచి సెలవు తీసుకుని వెళ్ళారు. 
        భీమకవి వెళ్ళిన తర్వాత కొంతకాలానికిసాహిణిమారుడు ప్రచండసైన్యంతో పెదవేంగిపై దండెత్తి వచ్చాడు. పొరుగు రాజైనరాజరాజనరేంద్రుడు చొక్కభూపాలుడు ఓడిపోతే తన సామ్రాజ్యం విస్తరించుకోవడానికి మంచి అవకాశము దొరుకుతుందని ఏమాత్రమూ సహాయము చేయకుండా తటస్థముగా ఉన్నాడు. కొంత కాలం తర్వాత తిరిగి వస్తానని చొక్కనకు మాటిచ్చిన భీమకవి సాహిణీమారుడికి, చొక్కనకూ యుద్ధం జరిగే   సమయానికి పెదవేంగి పట్టణం చేరుకున్నారు.
        సాహిణిమారుడికి, చొక్కనకూ మధ్య యుద్ధము మొదలైంది. సాహిణిమారుడు తన సైన్యాన్ని బాగా ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాడు. ఒక్కోదినం ఒక్కొక్కరికి ఆధిక్యం వస్తూ ఎటూతేలని విధంగా దాదాపు నాలుగు రోజులు యుద్ధం జరిగింది. ఐదవ రోజుసాహిణిమారడు విజయమో వీరస్వర్గమో అన్నవిధంగా తన సైన్యాన్నిఉసిగొల్పాడు. ఎదో ఒకటి తేలే వరకు యుద్ధరంగము నుండి వెనుతిరగరాదన్న నిశ్చయముతో ఉన్నాడు.అసంఖ్యాకమైన సాహిణిమారడి సైన్యప్రతాపానికి చొక్కన సైన్యము చెల్లాచెదురయ్యింది. ఒక వైపు తన సైనికులు వెనుదిరిగి పారిపోతున్నా, చొక్కన మాత్రం భయపడకుండా తిరిగి సైన్యాన్ని కూడదీసుకొని మరీ పోరాడాడు. కానీ చొక్కనకు గెలుపు మీద నమ్మకం పోయింది. విజయం పట్ల ఆశలు సన్నగిల్లాయి. ఎలాగో ఆరోజుకిఓటమి నుంచి తప్పించుకున్నాడు.ఆరవరోజున చొక్కన భీమకవినితనతో పాటి యుద్ధభూమికి ఆహ్వానించి పిలుచుకుపోయాడు. కొంతసేపు యుద్ధము చేసిన తర్వాత ఈరోజు కూడా తన గెలుపు దుస్సాహసమనిపించి చొక్కన, భీమకవిని చూసి “మహాత్మా! ఈ యుద్ధము నాకు ఎంతో దుస్సాహసమనిపిస్తోంది. ఎన్ని రోజులయినా కానీ ముగియకున్నది. నాకు నానాటికీ విజయం పట్ల విశ్వాసము సన్నగిల్లుతోంది. ఇంతటి ఘోరమైన యుద్ధమును నేను ఎన్నడూ చూడలేదు. ఇక ఈ రాజ్యమును మీ అనుగ్రహబలము వలననే కానీ, నా బాహుబలము వలన కాపాడుకోవడం సాధ్యపడదు. మీ అమోఘకవితా శక్తి వలన మాత్రమే ఈ సాహిణిమారడు కృంగిపోగలడు. నా మీద పరిపూర్ణమైన కటాక్షమును ఉంచి ఓటమి అంచున ఉన్న నాకు విజయమును కలిగేలా చేయుము” అని  వేడుకున్నాడు. తనను అమితముగా ఆరాధిస్తూ, ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ వినయవిధేయుడు, గుణసంపన్నుడు అయిన చొక్కన ప్రాణాపాయస్థితిలోఉంటే, కరుణార్ద్రహృదయుడైన భీమకవి గమ్మునుండగలరా!
        భీమకవి చొక్కనకు విజయం చేకూరేలా అనుగ్రహిస్తూ ఈ క్రింది పద్యమును చెప్పారు.

              చక్కఁదనంబు దీవియగు సాహిణిమారుఁడు మారుకైవడిన్
                బొక్కి పడంగలండు చలముం బలమునం గల యీచళుక్యపుం
                జొక్కనృపాలుఁడుగ్రుడయి చూడ్కుల మంటలు రాలంజూచినన్ 
                మిక్కిలి రాజశేఖరుని మీఁదికి వచ్చిన రిత్తవోవునే?

భావము:ఎంతో చక్కగా పాలింపబడుతున్న రాజ్యము మీదకు సాహిణి మారుడు తన వినాశనము కోసమేయుద్ధానికి కాలుదువ్వాడు.అమిత శౌర్యపరాక్రమవంతుడూ,చాళుక్యరాజూ అయిన చొక్కనృపాలుడు ఉగ్రుడై చూడగానే, ఆ చూపులకు రాలే మంటలలో సాహిణిమారుడి శరీరము కాలి మసైపోవుతుంది. గొప్ప చక్రవర్తి మీదకి వస్తే, దాని ఫలితం వూరికే పోతుందా?
        భీమకవి అలా అనగానే అన్నంత పని అయిపోయింది. చొక్కన చూసిన రెప్పపాటిలోనే సాహిణిమారుడు భస్మీభూతుడయ్యాడు(మసైపొయాడు). రాజులేని సైన్యం యుద్ధరంగం నుంచి పారిపొయారు. క్షణకాలంలో యుద్ధభూమి శత్రుశూన్యం అయ్యింది. ఇది చూసిన చొక్కభూపాలుడు ఎంతో సంతోషంతో భీమకవికి సాష్టాంగ ప్రణామము చేసి “ మహాత్మా! నేడు ఈ రాజ్యము, ఐశ్వర్యము తమరి కరుణ వలన నిలిచింది. కావున నాకీ రాజ్యము నీవు ఇచ్చినదే. నేను మీకు సేవకుడను. ఈ సింహాసనం పై కూర్చొని మీరే రాజ్యచక్రము తిప్పవచ్చు. నేను మీఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను.” అని చెప్పగా భీమకవి “ రాజా! నేను కవిత్వం చెప్పుదునే  కానీ కత్తిపట్టి యుద్ధమును చేయను కదా? అటువంటప్పుడు మాకీ రాజ్యభారము యెందుకు? నీవు పుత్రమిత్రకలత్రాదులతో సుఖసంతోషాలతో వర్ధుల్లుతూ రాజ్యమును పాలించుము. మీ వద్దనే ఇంకొంత కాలము ఉండునట్లు ఆనుగ్రహించెదను” అని చెప్పి సమ్మతింపచేసారు. కొంతకాలము చొక్కన ఆస్థానములోనే ఉండి, ధర్మసందేహాలను తీరుస్తూ, దిశానిర్దేశము చేస్తూ, రాజ్యపరిపాలనలో సహాయపడ్డారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...