Friday 24 July 2020

గొల్లభామ కథ


ఒకరోజు ఓ యువతి అత్యంతవిలాసంగా, ఒయ్యారంగా నడుస్తూ, నెత్తిన కుండలోని మజ్జిగ చల్లిపోయేలా చేతులు ఊపుతూ, “మజ్జిగోయమ్మ మజ్జిగ” అని అరుస్తూ నడుస్తోంది. ఈమె వయ్యారమును చూసి కొందరు ఆమె ఎంత ధర చెప్పినా, బేరమాడక కొనేవారు కొందరు. అవసరము లేకున్నా ఆమెతో మాట్లాడాలన్న నెపంతో కొనేవారు ఇంకొదరు. కొనకున్నా ఆమెతో కాసేపు బేరమాడి కాలయాపన చేసేవారు మరికొందరు. ఒకనాడు మేడపై భీమకవితో మాట్లాడుతూ ఆమెను చూసి తెలుంగరాయుడు “కవివర్యా! చూసారా ఆ యువతి నెత్తిపై నుంచి మజ్జిగ చల్లిపోతున్నా పట్టించుకోకుండా ఎంత విలాసంగా నడుస్తోందో. ఎంత నిర్లక్ష్యం లేకపోతే” అన్నాడు. అందుకు భీమకవి మహారాజా! ఆమె విలాసవతి అని ఆమె వేషము, నడకలే చెబుతున్నాయి ఆమె దుశ్చరితను” అన్నారు. రాజు “ఆమె ఎవరు? మీకు ఆమె నడవడి గురించి నీకెలా తెలుసు” అని అడుగగా, భీమకవి “ కవిగాంచు రవి చూడగా లేని యర్థంబు. అగతానాగత వివేకియు, నిరంతర సత్యాన్వేషణాపరుడనగు కవీశ్వరుడను నేను. నాకు తెలియనిది ఉంటుందా? ఆమెను చూసిన వెంటనే ఆమె చరిత్ర అంతా నా కళ్ళకు కనపడింది” అని చెప్పారు. ఆమె ఉదంతమంతా వివరించమని తెలుంగరాయుడు అడుగాడు, భీమకవి ఆమె మనసులోని భావాన్ని, ఆమె మాటల్లో చెబుతూ, ఈ క్రింది పద్యమును చెప్పారు.

              భూపతిఁజంపితిన్ మగడు భూరిభుజంగము చేతఁ జావగా
                నాపద జెంది జెంది యుదయార్కునిపట్ణముఁ  జేరి వేశ్యనై
                పాపముఁగట్టుకొంటి సుతుఁబట్టి బొజుంగని జెట్టవట్టి సం
                తాపముఁజెంది యగ్ని బడ దగ్ధముగాకిటు గొల్లభామనై
                యీవని కోర్చు కొంటి నృపతీ! వగపేటికిఁ జల్ల చిందినన్

భావము: మహారాజును చంపాను. భర్త పాము కాటుకు మరణించడముతో ఆపదల పాలై ఉదయార్కునిపట్టణమును చేరి వేశ్యనై పాపము కట్టుకున్నాను. కొడుకు నను మోహించగా ఆ బాధతో అగ్నిలో దూకాను. అగ్ని దేవుడు కూడా తనను దహించకపోవడంతో ఇక్కడకు వచ్చి గొల్లభామనై విలాసావతినై మజ్జిగ చిందించుకుంటూ బ్రతుకుతున్నను మహారాజా!
       
        తెలుంగరాయుడు ఆసక్తితో ఆ యువతిని పిలిపించి “నీ కథ ఏమి? ఎవరు నువ్వు? ఇలా మజ్జిగ చల్లవేసుకుంటూ వయ్యరముగా నడుస్తున్నావు? నిజం చెప్తావా లేదా? ” అని గద్దించి అడిగే సరికి ఆమె తన పూర్వచరిత్రను ఇలా చెప్పింది.
        “ధాన్యకటకనగరము సమీపాన ఉన్న ఆనందపురమును ఆనందుడనే రాజు పరిపాలించేవాడు. ఆ పట్టణమంలో దంతవిశ్రుతుడను బ్రహ్మణుడి భర్యను నేను. నా భర్త ఎప్పుడూ వైదికాచారాలలో మునిగిపోయి నా సంతోషాన్ని పట్టించుకోకపోవడముతో నాకు అతడు సరికాడని భూపతితో స్నేహమును చేసి అతనితో సంతోషంగా గడిపేదాన్ని. నా భర్త దంతవిశ్రుతుడు ఎప్పుడూ పెళ్ళీపేరంటాలు చేయిస్తూ ఊళ్ళు తిరుగుతూ ఉండడం వలన నా స్వేచ్ఛకెప్పుడూ ఆటంకము కలుగలేదు. ఒకసారి అతడు ఆకస్మికంగా ఇంటికి వచ్చినపుడు భూపతి, నేను ఆయన కంటపడ్డాము. నాటి నుంచి నన్ను ప్రేమతో చూడక దూషించడం మొదలుపెట్టాడు. రానురాను అతనిని భరించడము చేతకాలేదు. భర్త దంతవిశ్రుతుని చంపితే కాని తాను భూపతితో సుఖంగా ఉండలేనని, అతని కోసం చేసిన ఫలహారములో విషం కలిపి ఉంచి నా పనిలో నిమగ్నయ్యాను. ఇంతలో ఆనందుడు(భూపతి) వచ్చి పళ్ళెములో ఉన్న ఆ ఫలహారాన్ని చూసి తన కోసమే తయారు చేసి ఉంచాననుకొని తినేసాడు. అంతలో నా భర్త రావడం గమనించి, అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి తెల్లరింటిలోపు ఆనందుడు మరణించాడు. కొంతకాలము దుఃఖించిన తర్వాత మంత్రి కుమారుడగు విలాసుడిని పట్టాను. ఒకనాడు ఇంటికి వస్తూ భర్త పాముకాటుతో మరణించాడు. ఇక నాకు ఏ అడ్డూలేకపోవడంతో  విలాసునితో అత్యంత సుఖముగా గడిపాను. ఆ ఫలితంగా గర్భమును దాల్చి కుమారున్ని కన్నాను. లోకము తప్పుగా చూస్తుందని ఆ కుమారుని ఊరి బయట ఉన్న అరణ్యములో ఒక పాతబావిలో పారవేసి వచ్చాను. ఉదయార్కపురమును పాలించు ఉదయార్కుడు వేటకై అక్కడకు వచ్చాడు. నీటి కోసం బావి దగ్గరకు వెళ్ళినపుడు ఏడుస్తున్న బాలుడిని చూశాడు. తనకు సంతానం లేకపోవడము వలన భగవంతుడు ఇచ్చిన బిడ్డగా భావించి దేవదత్తుడు అని నామకరణం చేసి కడుగారాభముగా పెంచాడు. పెరిగి పెద్దయ్యాక ఆ బాలుడికి పట్టాభిషేకం చేసి తాను తపోవనముకు వెళ్ళాడు.
        ఇక నా సంగతికి వస్తే కొంత కాలానికి విలాసుడికి ఆత్మబోధ కలిగి నన్ను వదిలివేసాడు. ఇంటికి రావడము కూడా మానేసాడు. పోశించేవారు కరువై, ఉన్న వస్తువులను  అమ్మివేసి ఆ డబ్బుతో కొంతకాలము గడిపాను. తరువాత ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి వచ్చింది. కానీ ఏపని చేయలేక వేశ్యగా మారి ఉదయార్కపురము చేరాను. నా కుమారుడు దేవదత్తుడు రాజ్యమేలుతూ నన్నే మోహించాడు. చూడగామే అతన్ని నా కుమారుడేనని గ్రహించాను. ఎంతో బాధపడ్డాను. ఇక నేను బ్రతికుండి ప్రయోజనము లేదనిపించి అగ్నిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసాను. ఆ అగ్నిదేవుడు కూడా నన్ను తాకుటకు ఇష్టపడక వదిలేసాడు. ఇక గత్యంతరము లేక ఆ ఊరు వదిలి ఇక్కడకు వచ్చి గొల్లభామనై, నానా అవస్థలు పడుతూ, జీవితము గడుపుతున్నాను. నేను చాలా పాపాత్మురాలను, కానీ దైవాంశసంభూతుడగు భీమకవి దర్శనభాగ్యము వలన నాకు  పాపముల నుంచి నిష్కృతి లభించునని తలుస్తున్నాను.” అని పలికింది. రాజు ఆమె మాటలు వినగానే భీమకవిని భూత,భవిష్యత్,వర్తమాములను తెలిసిన దైవాత్ములని కీర్తించాడు. ఆమె తన కంఠస్వరముతో భీమకవి రచించినపై పద్యాన్నే మరల చెప్పి, ఆయన పాదాలపై వాలి పశ్చాత్తము చెందింది. భీమకవి “ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. ఎప్పుడైతే చేసిన తప్పులను తెలుసుకొని, వాటి నిష్కృతికై పరితపిస్తూ, నా పాదాల వాలావో ఆ క్షణానే నువ్వు పవిత్రురాలివయ్యావు. ఇకనుంచైనా చక్కగా బ్రతుకుము” అని చెప్పి ఆశీర్వదించారు. తగిన ఉపాధి కోసము ఆమెకు రాజు నుంచి  కొంతధనమును ఇప్పించి పంపారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...