Saturday 25 July 2020

4. చాబాల గ్రామం – సంజీవమ్మ శిష్యరికం + స్వామివారు గడేకల్లు చేరుట


స్వామివారు ఊరూరు తిరుగుతూ, తనకిష్టమైన చోట ఒకటి రెండు రోజులు ఉంటూ వేరే పల్లెలకు వెళ్తూ ఉండెను. అలా అనంతపురము జిల్లాలోని చాబాలా అను గ్రామమునకు వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. పెద్దలు చెప్పిన కథనం ప్రకారం స్వామివారు ఒకరోజు కొన్ని మాంసపుముక్కలను తీసుకొని లింగాయతులు నివసించు వీధిలోని ఒక ఇంటిలో విసిరేశాడట. ఇది చూసిన వీధిలోని వారు “ఎవరో పిచ్చివాడు మాంసపుముక్కలను జంగమవారింట్లో  వేశాడట“ అని చెప్పుకుంటుండగా, ఆ ఇంట్లోని వారు ఇల్లంతా వెతికారట. అశ్చర్యంగా వారికి మాంసపుముక్కలకు బదులు నాలుగు “సిద్దోటము” పండ్లు దొరికాయట. ఆ పండ్లు ఘుమఘుమలాడే వాసనతో ఆ ప్రదేశమంతా వ్యాపించెనట. ఆ ఇంటివారు ఆ పండ్లను ఇంటి బయటికి తెచ్చి అందరికీ చూపుతూ, మీరంతా మంసపుముక్కలంటున్నారు, కానీ విసిరినది ఈ పండ్లను చూడమనిరి. అపుడు వీధిలోనివారు ”అయ్యా! ముసలాయన విసిరినపుడు మేము కళ్ళారా చూసాము. అవి మాంసపు ముక్కలు.కానీ అవి “సిద్దోట పండ్లుగా ఎలా మారాయో ఏమో ఏం మహిమ చేసినాడో “ అని ఆశ్చర్యంగా చెప్పుకోసాగారు.
స్వామి వారు భక్తులు అడిగినదానికి సలహాలిస్తూ, అనారోగ్యాన్ని తనచేతి స్పర్శతో నయము చేస్తుండెను. ఎన్నో రోజుల నుండీ నయం కాని ధీర్గవ్యాధులు సైతము స్వామివారి కరస్పర్శతో నయమయ్యేవి. కొంతమంది “మాకు సంతానము లేదు స్వామి. ఎన్ని చోట్ల తిరిగినా కలుగలేదు” అని అడిగే వారు. అపుడు స్వామి “మీకు సంతానము కలుగుతుంది“ అని ఆశీర్వదించి పంపేవారు. స్వామి పలికిన పలుకులు పొల్లుపోకుండా జరుగుతుండడం చూసిన గ్రామస్థులు స్వామివారి గొప్పతనమును కీర్తిస్తూ, ఎక్కడకూ వెళ్ళనీయక తమ గ్రామముననే ఉంచుకొనిరి. ఆ ఊరిలో అందరూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారిదాకా స్వామివారితో, వారివారి బాధలను చెప్పుకుంటూ, ఉపశమనము పొందుతూ, స్వామి వారినే దేవునిగా భావిస్తూ, పాలూపండ్లూ తెచ్చిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలకు గ్రహబాధలు, ఇతర వ్యాధులు కల్గినపుడు స్వామి దగ్గరకు తీసుకు వెళితే, స్వామి వారిని తాకిన వెంటనే ఆ పిల్లలు సంతోషంగా నవ్వుతూ తిరిగి వెళ్ళేవారు.
                  గురువు త్రిమూర్తి స్వరూపుడు. నిరాకారుడైన భగవంతుడు సాకారుడై సద్గురువు రూపంలో భూమిపై అవతరిస్తాడు. తల్లిదండ్రులు తనువునిస్తారు. పెంచి పోషిస్తారు. కానీ ప్రారబ్ధాన్ని తప్పించలేరు. కానీ సద్గురువుల అనుగ్రహానికి పాత్రులైనవారు ఈ కష్టనష్టాలను అధిగమించగలరు. కల్పవృక్షమూ, కామదేనువూ కోరినవి మాత్రమే ఇవ్వగలవు. గురువు వాటితో పాటి ముక్తిని కూడా ఇవ్వగలడు. గురువు లేకుండా మోక్షం కలుగదు. గురువు మూలంగానే సదనద్వివేకము, భక్తి వైరాగ్యాలు, జ్ఞానము, వాటిద్వారా మోక్షము సిద్ధిస్తుంది. అట్టి సద్గురువును సేవించిన ఆదర్శశిష్యురాలు సంజీవమ్మ. ఈమె దృఢమైనభక్తి, అచంచలవిశ్వాసములతో త్రికరణశుద్ధిగా శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామిని సేవించింది. పూజించింది. సూర్యచంద్రులున్నంత కాలం, స్వామి పేరు నిలుచున్నంతకాలం చిరస్థాయిగా నిలిచి పూజలందుకొనేలా వరము పొందింది.

                చాబాల గ్రామంలో బెస్తకులానికి చెందిన సంజీవమ్మ అను ఆమె ఉండేది. ఆమెకు పరమేశ్వరుడంటే అపారమైన భక్తి. ఊరి వారందరూ స్వామివారి మహిమను కీర్తించడం విని ఆమె ఆ మహానుభావుని ఒకసారి చూడడానికి స్వామి వద్దకు వెళ్ళింది. స్వామి వద్దకు వచ్చిన భక్తులు తమతమ సమస్యలను ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటుండగా, ఆమె స్వామితో మాట్లాడ్డమాలస్యమయ్యింది. ఈ సమయమంతా స్వామివారి దివ్యతేజస్సును చూస్తూ నోరు మెదపక నిలబడింది. చివరికి స్వామివారి దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేసి ఏమీ మాట్లాడక నిలబడి ఉండెను. అప్పుడు స్వామి సంజీవమ్మను చూసి “నీవు మనసులో ఆందోళన పడుతున్నావు. ఏమీ ఫర్వాలేదు. నిదానముగా ఉండమనెను. స్వామివారి వాక్కులు వేదవాక్కులుగా తోచి, సంజీవమ్మ ఒక పక్కగా నిలబడి ఉండెను. అపుడు భార్యాభర్తలు నెల పిల్లవాన్ని ఎత్తుకువచ్చి స్వామివారి పాదాల చెంత పరుండబెట్టి, స్వామీ మీ వరంతో పుట్టిన ఈ బిడ్దకు మీరే  నామకరణముచేసి ఆశీర్వదించమని వేడుకొనారు. స్వామి ఆ బాలునికి భీమన్న అని నామకరణం చేసి ఆశీర్వదించి వారిని పంపారు. ఇదంతా చూస్తూ నిలబడిన సంజీవమ్మను, స్వామి పిలిచి ఏమి కావలెనమ్మా? అని ప్రశ్నించారు.  అపుడామె “స్వామీ! మీ దర్శనభాగ్యము కలిగినది. ఇంక నాకేమి కావలెను. మిమ్మల్ని చూస్తూంటే సక్షాత్తు ఆ పరమేశ్వరున్ని చూసినంత ఆనందము కలిగినది. పోయి వచ్చెద”నని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన సంజమ్మకు ఏ దేవుని పటము చూసినా స్వామి రూపమే గోచరించేది. ఒకరోజు సంజీవమ్మకు స్వప్నములో పరమేశ్వరుడు కనిపించి కొద్ది సేపటికి స్వామి రూపముగా కనిపించాడట. అప్పటి నుంచి ఆమె పరధ్యానంగా ఉంది. ఇది చూసిన కొడుకులు “అమ్మా! కొద్ది రోజులనుంచి నీవు పరధ్యానముగా ఉంటున్నావు. పిలిచినా పలుకవు. గట్టిగా పిలిస్తే ‘ఆ’ అంటావు. కారణమేమిటని అడిగారు. అప్పుడు ఆమె భర్త “ మీ అమ్మకు ఊరిలో స్వామివారిని దర్శించినప్పట్నుంచి పరమేశ్వరుని రూపము కనిపిస్తోందట” అని చెప్పి స్వప్నములోని వృత్తాంతమును కూడా చెప్పాడు. అప్పుడు సంజీవమ్మ “ అవును నాయనా! ఈ సంసారమూ, బంధములూ ఏవీ మనసుకు రావట్లేదు. వేదాంత ధోరణితో మనసంతా నిండిపోయింది. ఏపని చేయడానికీ మనసు అంగీకరించట్లేద”ని చెప్పి పరధ్యానములో మునిగింది.

ఇలా కొంతకాలము తర్వాత స్వామివారు చాబాల నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలిసిన సంజమ్మ చాలా బాధతో నాకు భర్తా, కొడుకులూ కోడల్లతో “ నాకు ఈ సంసారబంధములు వద్దు. ఇన్నేళ్ల నా పూజలు పలితంగా సాక్షాత్తు సకలలోకాలకూ తండ్రి అయిన పరమేశ్వరుడే నాకు దర్శనభాగ్యమిచ్చారు. ఈ మిగిలిన జీవితం ఆ భీమలింగేశ్వరుని సేవతో తరించాలనుకుంటున్నాను. ఆ మహానుభావునికి శిష్యురాలిగా, నేను కూడా ఆయన వెంట వెళ్తానని” చెప్పింది. ఇక ఆమె భర్త కూడా సంజమ్మ మనము ఎంత చెప్పినా వినదని స్వామి దగ్గరకు పిలుచుకు వచ్చి జరిగిన విషయమంతా స్వామివారికి చెప్పారు. స్వామివారు సంజీవమ్మతో “అమ్మా! పిల్లలను,కోడల్లనూ భర్తను వదిలి రావడము నీకు క్షేమము కాదు. మేము ఒక చోట స్థిరముగా నివసించే వారము కాదు. మా గమ్యస్థానమును చేరుదాకా మా ప్రయాణము ఆగదు. మా మాట విని నీవు భర్త పిల్లలతో ఉండమ్మ” అని చెప్పి వారించారు. అయినా సంజీవమ్మ మాట వినకపోవడంతో ఇక చివరకు చేసేదేమీ లేక ఆమె భర్త పిల్లలూ స్వామివారి దగ్గరకు వచ్చి “స్వామీ మా అమ్మ ఎవరు చెప్పినా వినదు. మీ శిష్యురాలుగా ఉండడానికి నిశ్చయించుకున్నది. దయచేసి మీ శిష్యురాలుగా స్వీకరించండి. ఎక్కడ ఉన్నా ఆమె సంతోషము, క్షేమమే మాకు ముఖ్యము” అని చెప్పారు. స్వామివారు కొంతసేపు ఆలోచించి “ఈమె నా శిష్యురాలుగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కీర్తించబడుతుంది. మీరు కూడా పిల్లా పాపలతో ఉన్నతస్థాయికి ఎదిగి మీ కుటుంబము వృద్ది చెందుతుంది” అని వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ తరువాత స్వామి వారు శిష్యురాలిగా సంజమ్మకు ఎన్నో పరీక్షలు పెట్టాడు. తిండి తిప్పలు పట్టించుకోకుండా, కొండలూ, గుట్టలూ ఎక్కుతూ దిగుతూ, ముళ్ళదారులూ దాటుకుంటూ పరుగులు తీసాడు. సంజమ్మ అన్నిటికీ తట్టుకొని స్వామివారిని అనుసరించింది.
స్వామివారు గడేకల్లు చేరుట

చాబాల నుంచి మొదలైన కాలినడక పుణ్యప్రదమైన గడేకల్లు చేరి చౌడమ్మ కొండకు కొంతదూరంగా ఉన్న చెరువు గుంట వద్ద దాకా సాగింది. అక్కడ నివాసస్థలమును ఏర్పరచుకొని ఉండెను. సంజమ్మ స్వామివారి భోజనానికి కావలసిన వంటపదార్థాల కోసం గ్రామానికి వస్తూ పోయేది. ఇది గమనించిన ఊరివారు సంజమ్మను ఎవరు మీరని ఎక్కడినుంచి వచ్చారని విచారించారు. సంజమ్మ “ద్రాక్షారామ భీమేశ్వరుని వరప్రసాది వేములవాడ భీమలింగేశ్వరుడు ఈ ఊరి చివరనున్న చెరువు గుంత వద్ద విడిది చేసారు. నేను ఆయన శిష్యురాలిని. స్వామిసేవ నిమిత్తమై నేనూ ఇక్కడే ఉంటున్నానన్నది. అప్పటికే స్వామి మహిమలను, ఆ నోటా ఈ నోటా విన్న గ్రామప్రజలు, స్వామి తమ వూరికి వచ్చారని విని, వారిని చూడానికి వచ్చారు. స్వామితో మీకేమైనా కావలసినచో సమకూర్చెదము అని చెప్పారు. స్వామివారు తన దర్శనానికి వచ్చేవారికి భగవంతుని ఓన్నత్యాన్నీ, భగవంతున్ని ఎలా ఆరాధించాలో, ఎలా బ్రతకాలో చెప్పేవారు. పిల్లలకు, పెద్దలకు జ్వరాలు వచ్చినా స్వామిని అశ్రయించేవారు. ఆయన మాటలను తూచాతప్పకుండా పాటించేవారు.
గడేకల్లులో స్వామివారు చౌడేశ్వరి కొండపై ధ్యానం చేసిన చోటు


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...