Friday 24 July 2020

సాగిపోతురాజు - భీమకవి



కళింగగంగు, గురునాథులు భీమకవి పట్ల అపచారము చేసి తొలుత కోపానికి గురైనా, తమ తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకొని భీమకవి కృపానుగ్రహాలను పొందారు. కానీ సాగిపోతురాజు గర్వమదము తలకెక్కినవాడై భీమకవి దేశయాటనం ఉపయోగించు గుర్రాన్నేఅపహరించుకుపోయాడు. భీమకవి ఎన్నిసార్లు నెమ్మదిగా తనగుర్రమును ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. భీమకవి ఆగ్రహము చెంది ఏడురోజులకు(తప్పు తెలుసుకునేందుకు ఏడు రోజుల గడువు) మరణిస్తావని శాపమిచ్చారు. భీమకవి పలుకులు నన్నేంచేయగలవని పెడచెవినపెట్టడంతోఏడవరోజున మరణించాడు. దేశయాటనముచే తన కవితాశక్తిని లోకానికి వెల్లడిచేయాలని సంకల్పించి, భీమకవి ద్రాక్షారామభీమేశ్వరునికి మొక్కుబడిగాఇవ్వబడిన ఒక గుర్రంపై ప్రయాణమయ్యారు.ద్రాక్షారామభీమేశ్వరుని గుఱ్ఱమును అధిరోహించే సమర్థుడు,అర్హుడుభీమేశ్వరుని తనయుడైన ఒక్కభీమకవి తప్ప మరొకరు లేరు, కావున ఆ గుఱ్ఱాన్ని భీమకవికి ఇచ్చారు. నాటి నుంచి భీమకవి ఎక్కడికి వెళ్ళినా, ఆ గుఱ్ఱము మీదే వెళ్ళేవారు.ఒకసారి కృష్ణ మండలంలో నందిగామకు నాలుగు క్రోశముల దూరంలో నైరుతి మూలాన ఉన్న గుడిమెట్టకు వెళ్ళారు.

          అలా గుడిమెట్ట చేరిన తర్వాత భీమకవి భోజనానికి వెళ్ళినపుడు, పోతురాజు ఆ గుఱ్ఱాన్ని చూసాడు. అది తన గుఱ్ఱాల నుంచి తప్పిపోయిన గుర్రమని భావించాడు. కనీసంఆ గుఱ్ఱము తనదా? కాదా? తనదే అయితే భీమకవి వద్దకు ఎలా వచ్చింది? అని ఏ మాత్రం విచారించక కనీసం భీమకవికి తెలియజేయకుండా, ఆ గుర్రాన్ని తన అశ్వశాలకు తోలుకు పోయి కట్టేశాడు. తనను ఎదురించే ధైర్యం ఎవరికుందన్న పొగరుతో ఇలా చేసాడు. భీమకవి భోంచేసి వచ్చేసరికి గుఱ్ఱం లేదు. అక్కడే నివసిస్తున్న  రాహుతిమారుడను ఒకడు "అయ్యా మీ గుర్రమును పోతురాజు తీసుకొని పోయాడు" అని భీమకవికి చెప్పాడు. అక్కడి వారంతారాజే నిజానిజాలు విచారించక అన్యాయంగా ప్రవర్తిస్తే,మనలాంటి వారి పరిస్థితి ఏంటని” నివ్వేరపోయారు.
          భీమకవి పోతురాజు పినతండ్రి కుమారుడైన వాత్సవరాయలక్ష్మీగజపతిరాజుకి జరిగిన విషయం చెప్పారు. ఇతను భీమకవి ఉద్దండచరిత్రతెలిసినవాడు కావున భయపడి ఎలాగైనా తన అన్నను ఒప్పించి గుర్రమును తిరిగి ఇప్పిస్తాననిమాటిచ్చాడు. 
          లక్ష్మీగజపతిరాజు, పోతురాజు వద్దకు వెళ్ళి "అన్నా భీమకవి మహాకోపి. తను కోపగించుకోక ముందే గుఱ్ఱమును తిరిగి ఇచ్చి వేయండి. లేదంటేనిన్ను నాశనము అయ్యేలా శపించి వెళ్ళిపోతాడు" అని హితువు చెప్పాడు. పోతురాజు "ఆ గుఱ్ఱమును ఇవ్వను గాక ఇవ్వను" అంటూ మూర్ఖంగా పట్టుపట్టాడు.
        తన తండి ద్రాక్షారామభీమేశ్వరునికి బహుమానంగా ఇవ్వబడిన గుఱ్ఱం. భీమకవికి గుఱ్ఱాన్ని రప్పించుకోవడం పెద్ద విషయమేమీ  కాదు. కానీ పోతురాజుకు తప్పు తెలుసుకుంటాడనిఇంత కాలము ఆగారు. ఇక పోతురాజు దిగిరాక పోవడముతో ఇటువంటి పాలకుడికి మరణదండమే న్యాయమనిక్రింది పద్యంతో శిక్షించారు.

                   హయమది సీత పోతవసుధాధిపుడారయ రావణుండు ని 
                   శ్చయముగ నేను రాఘవుడసహ్యజ వారధిమారుడంజనీ 
                   ప్రియతనయుండులచ్చన విభీషణుఁ డీ గుడిమెట్ట లంక నా 
                   జయమును బోతరక్కసుని చావును నేడవనాడు చూడుడీ.   

భావము:గుఱ్ఱము సీత వంటిది. అపహరించిన పోతురాజు రావణుడు. నేను ఖచ్చితముగా రాముడిని. ఈ కృష్ణానదిసముద్రము. గుఱ్ఱము ఆచూకీ తెలిపిన రాహుతీమారడు అంజనీ ప్రియతనయుడైన హనుమంతుడు. తనకు రాయబారము నడిపిన పోతురాజు తమ్ముడు లక్ష్మీగజపతిరాజు విభీషణుడు. పోతురాజు పాలిస్తున్న ఈ గుడిమెట్ట లంక. నా గెలుపును పోతురక్కసుని చావును ఏడవరోజున చూడండీ.
          ఇలా ఈ వృత్తాంతాన్ని రామాయణంతో ఎంతో అద్భుతంగా పోల్చిచెప్పారు.ఎడవ రోజు దగ్గర పడుతున్నా, పోతురాజు తప్పును తెలుసుకోలేకపోయాడు.అమోఘమైన భీమకవి శిక్షము ఎవరు తప్పించగలరు?ఏడవరోజున ఖచ్చితంగా పోతురాజు చనిపోయాడు.
        భీమకవి దైవాంశసంభూతుడు. ఆశ్రయించిన వారికిదయాసాగరుడు, తన సంకల్పానికి అడ్డుతగిలిన వారికి మహాకఠినుడు. అంతేకాక గుణవంతులూ, ధర్మపరిపాలకులూ, గొప్ప దాతలూ ఎదురైతే వారిని పొగుడకుండా ఉండలేరు.అటువంటి వారిని గురించి, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించిన వారిని వదిలేవారు కాదు.వారికి తగినవిధంగా సమాధానమిచ్చేవారు. ఇలా భీమకవి నుంచి పొగడ్తలందుకున్న ధర్మాత్ములుచాలా మంది  ఉన్నారు. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...