Saturday 25 July 2020

8. ఫక్కీరప్ప జననం – స్వామి వారి జీవసమాధి సమయం


ఒకరోజు సంజమ్మ ఏదో దిగిలుగా ఉండడం గమనించి, స్వామివారు “ సంజీవా ఈ మధ్య ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నావు? కారణము ఏమిట”ని అడిగారు. నంజమ్మ “ స్వామీ! నా తదనంతరం మీకు సేవ చేయడానికి ఒక పిల్లవాడు ఉండుంటే  బాగుంటుందనిపిస్తోంది.” అని సమాధానమిచ్చెను. స్వామివారు సంజమ్మ మాటలు విని “ దానికి ఇంత దిగులెందుకు? ఆ సంగతి నేను చూసుకుంటాను. అని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలము గడిచిపోయింది. ఒక రోజు సంజమ్మ” నేను చెప్పినది స్వామివారు ఆలోచించారో లేదో ఇంతవరకు ఆ సంగతే పట్టినట్లు లేదు. స్వామివారికి  తనదగ్గరకూ వచ్చిపోయే వాళ్ళ కష్టసుఖాలు చూడడమే సరిపోతుంది. అనుకుంటూ మధ్యాహ్నం నడుం వాల్చింది. కొంచెం కునుకు పట్టినట్లయ్యింది సంజమ్మకు. కొంత సేపటికి “సంజీవా! సంజీవా!” అని స్వామివారు పిలిచినట్లయ్యింది. అయ్యో స్వామి పిలుస్తున్నారే అని స్వామి ఉన్న చోటకి వెళ్ళి  చూసింది. స్వామి మాత్రం ధ్యానంలో ఉన్నారు. సంజమ్మ “నన్ను పిలిచారా స్వామి” అనడిగింది. అపుడు స్వామి అవును పిలిచినది నిన్నే. అంత పరధ్యానంగా ఉన్నావేమి. నీవు పిల్లవాడిని అడిగావు కదా. ఆ అడ్డు కొండలో ఒక పిల్లవాడు ఏడ్చుచున్నాడు. వెళ్ళి తెచ్చుకొమ్మని చెప్పి మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. సంజమ్మ ఇది నిజమేనా! అనుకుంటూ వడ్రంగివారి చేనులోంచి అడ్డుకొండ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక పిల్లవాడు తుంటిగుడ్డమీద పడుకొని ఏడ్చుచున్నాడు. అది చూసి స్వామి వింత మహిమకు అబ్బురపడి, తన్ను నమ్మిన భక్తుల కోర్కెలను ఎట్లా తీరుస్తాడో, స్వామివారి లీలలను గురించి తలచుకుంటూ ఆ పిల్లవాణ్ణి తెచ్చుకున్నది.

ఆ పిల్లవానికి స్నానాదికాలను చేయించి, స్వామీ ఈ పిల్లవానికి పాలు ఎట్లా అని అడుగగా, స్వామివారు “ఇప్పటి నుండీ ఒక నల్లకుక్క ఇక్కడకు వస్తుంది.ఈ పిల్లవానికి ఆ కుక్కపాలు పట్టమ”ని చెప్పారు. స్వామి చెప్పిన కొంత సేపటికి నల్లని కుక్క వచ్చి నిలబడింది. సంజమ్మ ఆశ్చర్యంతో ఎప్పుడూ రాని కుక్క స్వామివారు చెప్పినట్లే వచ్చింది. ఇదంతా స్వామి వారి మహిమనే తలచుకుంటూ, ఆ పిల్లవాణ్ణి తెచ్చి ఆ కుక్క స్తనానికి పెట్టగానే ఆ పిల్లవాడు తల్లిపాలలాగే కడుపునిండా పాలు త్రాగెను. ఇలానే కాలము గడుస్తుండగా ఆ పిల్లవాడికి 6,7 నెలలు నిండాయి. రోజూ స్వామి కొరకు వచ్చే జనులు ఆ పిల్లవానికి అప్పుడే పిండిన ఆవుపాలు తీసుకురావడం, ఆ పిల్లవాడు సంపూర్ణ ఆహారంతో పాటు స్వామివారి ఆశీర్వాదబలంతో దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. ఒకరోజు సంజమ్మ ”స్వామీ ఈ పిల్లవానికి ఏమి పేరుతో పిలవాలో మీరే సెలవీయమ”ని అడుగగా, స్వామివారు “పక్కీరప్ప” అని పేరు పెట్టారు.  
భీమలింగేశ్వరస్వామి ఎన్నో స్థలాలలో కూర్చొని(ధ్యానము, తపస్సు చేసి) లేచి వచ్చినారు. తరువాత గడేకల్లు గ్రామమునకు వచ్చి తన స్థిరనివాసము కొరకు చేరుకున్నారు. ఒకరోజు స్వామివారిని దర్శించడానికి వచ్చిన ఊరిపెద్దలు, ప్రజలందరి ఎదుట నేను ఈ లోకానికి వచ్చిన కార్యము ముగిసినది. ఇక మీ అందరికీ నా నిజదర్శనము కలుగదు. వచ్చే ఆషాడశుద్ధ దశమినాటికి జీవసమాధిలో ప్రవేశించుటకు నా తండ్రి పరమేశ్వరుని నుండి అజ్ఞ వచ్చినది. అందువలన మీరందరూ నా సమాధికి కావలసిన బండలు, ఇతర సరంజామాను సిద్ధం చేయాల్సిఉందని చెప్పగా అందరూ ఒక్క క్షణం శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారు. తేరుకొని “మీ పట్ల ఏమైనా అపచారము జరిగినదా స్వామీ! మా తప్పు ఉంటే క్షమించండి. మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాము.” అని పాదాలపై వాలారు.
స్వామివారు “మీరు ఏ అపరాధమూ చేయలేదు. నేను ఈ కలిలోకంలో ఉండుటకు వీలు లేదు. మీరు నిర్మించిన ఈ సమాధిలో ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీ కోరికలను తీర్చుతూ, మీకు కష్టనష్టాలను రాకుండా కాపాడుతాను. ఎవరు నన్ను మిన్నగా తలచుకుంటారో వారు అంత సుఖసంతోషాలతో తులతూగుతారు. నేను ఈశ్వరాంశసంభూతుడను. నాకు మరణమనేది లేదు. సూర్యచంద్రాదులు ఉన్నంతవరకూ ఇప్పుడు ఎట్లా మీ ఎదుట ఉన్నానో,  అలానే మీ భక్తి శ్రద్ధలను బట్టి సమాధిలో ఉన్నా మీ దగ్గరే ఉంటాను.” అని సమాధానపరచి ఇంక 5 నెలలలో మీరు నా సమాధికి కావలసిన పై మందిరానికి కావలసిన సరంజామాను భక్తి శ్రద్ధలతో తయారు చేసుకోండని” చెప్పి ధ్యానమగ్నుడైనారు.
                                   
ఇది అంతా విని సంజమ్మ స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ ఉన్నవారు ఆమె ముఖం మీద నీల్లు చల్లగా కళ్ళు తెరచి “స్వామీ మీరు సమాధిస్థితి పొందినచో నేను ఎలా ఉండగలను. ఎవరికి సేవచేసుకోను” అని చెప్పి బాధపడగా స్వామివారు ”నీవు బాధ పడవద్దు. నేను సమాధి స్థితి పొందిననూ, ఎక్కడికీ పోను. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకొనెదను. మీరు పిలిచిన వెంటనే పలికెదను. నీవు పెంచిన కొడుకు (పక్కీరప్ప)కు పెళ్ళి చేసి వానికి కావలసినవి అన్ని సమకూర్చిన తర్వాత దేహమును విడిచెదవు. నీ సమాధి నా సమాధి కన్నా ముందు భాగంలో ఉండి, నా కొరకు వచ్చే భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకుంటారు. నా కీర్తి ఉన్నంతవరకు నీ కీర్తి ఉంటుంది.. నీవు దిగులు పెట్టుకోక నన్ను సమాధిలోకి వెళ్ళనివ్వు.” అని చెప్పెను. “స్వామీ పక్కీరప్ప ఏ రీతిగా బ్రతుకగలడు. వానికి ఏ ఆధారమూ లేదు. ఎలా బ్రతుకు కొనసాగించును.” అని సంజమ్మ స్వామిని అడగ్గా స్వామి “ పక్కీరప్ప గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఇంటి ముందు నిలిచి భీమలింగేశ్వరుని పూజారి వచ్చినాడు. అని నాపేరు చెప్పిన వానికి కావలసినంత సంపద లభించును. పక్కీరప్ప అతని సంతతియే మా జీవసమాధి పూజాదులు నిర్వహిస్తారు. వేరే ఎవ్వరికీ అర్హత ఉండదు.” అని సంజమ్మతో చెప్పెను.
సంజమ్మ “పక్కీరప్పను నేను సాధారణంగా పెంచాను. మీరా బ్రాహ్మణోత్తములు. పక్కీరప్పకు వేదమంత్రాలూ, పూజా పూజాపద్దతులు తెలియవు కదా. ఎలా?” అని సందేహించగా, స్వామివారు “నేను పరమేశ్వరుని వలె నిరాడంబరుడను. నేను ఏ మతానికీ, ఏ కులానికీ చెందినవాడను కాదు. గొప్పవంశము వారమని కొందరు నీచ కులస్థులని హీనముగా చూడ్డం నేను సహించను. మానవులందరూ ఒకే జాతి, ఒకే కులము అని భావిస్తాను. అందరికీ అన్నపానీయాలు, ఆకలి దప్పులు సమానమే. అందువలన భక్తికొద్ది, ప్రేమకొద్ది ఎవరు ఏది నైవేద్యముగా ఇచ్చినా నేను స్వీకరిస్తాను. మీరు ఏది ఇష్టంగా స్వీకఇస్తారో అదే నాకు నైవేద్యంగా సమర్పించవచ్చు. మీరు చేసినదే పూజ. పలికినదే నాకు మంత్రము అగును. నేను సర్వసామాన్యున్ని కాను. ద్రాక్షారామ భీమేశ్వరుని వర పుత్రుడిని. వేములవాడ భీమలింగేశ్వరుడను. నన్ను భక్తిప్రపత్తులతో కొలిచినవారి భక్తికి మెచ్చి నేను నా సమాధి నుండే పలుకుతాను. కాపాడుతాను. నా మాటలు ఖచ్చితమైనవి. పొల్లుపోవు” అని మాటిచ్చి సంజమ్మ సందేహాలను తీర్చారు. ఊరిలోని పెద్దమనుషులు స్వామివారి సమాధిపనిలో నిమగ్నమయ్యారు. అందరూ వారివారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించసాగారు. స్వామి సమాధిలోనికి పోయిన మనకు దిక్కెవరనుకుంటూ, అందరూ స్వామివారు ఏమి వాక్కు చెబుతారో, ఏమి సందేశము ఇస్తారో అని ఎక్కువ సమయం స్వామివారి దగ్గరే గడిపేవారు. స్వామివారు ఆధ్యాత్మిక సంగతులను చెబుతూ, వారిలో భక్తిభావములను పెంపొందించేవారు. రోజులు దగ్గర పడేకొద్దీ ఊరిలోని వారు గుంపులు గుంపులుగా వచ్చి స్వామివారి ఉపదేశాలను వినేవారు. సమాధి పనులు అన్నీపూర్తీ అయ్యక ఊరిపెద్దలు స్వామితో “ ఇంకా ఏమి చేయమందురు” అని అడగగా స్వామి వారితో “విభూది పండ్లు, రుద్రాక్షమాలలూ, బిల్వపత్రి, ఇంకా సుగంధద్ర్వ్యాలూ, ఆవు పంచితమును తెప్పించి” తరువాత మఠాధిపతులను(లింగాయతులను) పిలిచి వారితో ”అఖండ అభిషేకము చేయించి, సమాధిలో బిల్వపత్ర ఆకులను పరిచి, విభూధి, రుద్రాక్షమాలలను తెచ్చి సంజమ్మకు ఇవ్వండని చెప్పెను. స్వామి సంజమ్మను పిలిచి సమాధి కుడిభాగమున వేపచెట్టు వద్ద ఆవునుగ్గులతో ఒక దాలిని (నుగ్గులను గుంపుగా పేర్చడం) నిప్పు పెట్టమని చెప్పెను.
                స్వామి సమాధిలోనికి వెళుతున్నారని అది చూడడానికి ఊరి జనం, చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. స్వామి ధ్యాననిమగ్నుడై ఉన్నారు. స్వామి ఒంటినిండా విభూధి రేకులతో మెడలో రుద్రాక్షమాలలు ధరించి, కుడిచేతిలో జపమాలను, ఎడమచేతిలో దండమునుపట్టుకొని ధ్యాననిమగ్నుడై చూచుటకు అపరరుద్రుని వలె తేజోవంతముగా కనిపించుచున్నాడు. అందరూ స్వామివారిని తదేక దీక్షతో చేతులు జోడించి నిల్చున్నారు. ఆషాడ శుద్ధ దశమినాడు శుభఘడియలలో స్వామివారు “ సంజీవా! జ్యోతిని ప్రజ్వలింపచేసి సమాధి ముందు భాగమున పెట్టుము. దాలిలోని కాల్చిన  భస్మమును ఒక కుందలో తీసుకునిరమ్మని ఆనతిచ్చెను. సంజీవమ్మ స్వామి చెప్పినది తూచ తప్పకుండా భక్తిశ్రద్ధలతో చేసినది. అప్పుడు స్వామి కన్నులు తెరచి గంభీరస్వరంతో ఇప్పుడు ప్రజ్యలింపచేసిన జ్యోతిని రేయింబవళ్ళు వెలుగుతూ ఉండేలా చూచుకొనవలెను. నేను సమాధిస్థితి పొందిన తర్వాత సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజా కార్యక్రమాలనూ, నిత్యనైవేద్యములను జరుపవలెను. వీటికి ఏలోటు రానీయకుండా చుసుకొనమని చెప్పి, సంజీవమ్మ తెచ్చిన భస్మమును తన అంగాంగాలకు రాసుకొని, మిగిలిన భస్మమును “సంజీవా దీనిని ఎప్పుడూ నా జీవసమాధి ఎదుట పెట్టవలెను. ఎందుకనగా ఇది నా అంగాంగాలకు రాయబడినది కనుక ”అంగారు” అని దీనిని పిలుస్తారు. ఇంకా భస్మము గురించి ఇలా చెప్పారు. భస్మము ఎప్పటికీ రూపాంతరము చెందనిది. శాశ్వతమైనది. శాశ్వితమైనది అని చెప్పబడేది పరమేశ్వరునికి చెందినది. పరమేశ్వరునికి ప్రియమైనది. అందువలననే ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా భస్మమును శరీరానికి రాసుకుని ఉంటాడు. నా భక్తులు ఏ బాధతో వచ్చినా, ఎక్కడ బాధ కల్గినదో అక్కడ అంగారు రాసుకుని, నన్ను స్మరించుకుంటూ, నొసటన బొట్టు పెట్టుకొని చిటికెడు నోటిలోనికి వేసుకొనిన వారి బాధలు వెంటనే ఉపశమనం కలుగును.” అని చెప్పారు.


                గంభీరస్వరంతో పలికి “నేను ద్రాక్షారామభీమేశ్వరుని కుమారుడను భీమలింగేశ్వరుడను నా మాటలు పొల్లుపోవు. నేను సమాధిలోకి వెళ్ళిన  10 ఘడియలకు పైన మూత చేయుము. మరలా 6 మాసములకు మూత తొలగించిచూడుము” అని చెప్పి సమాధిలోనికి పోయెను. ప్రజలందరూ “జై భీమలింగా! జై భీమలింగా!” అంటూ విజయధ్వనులు చేస్తూ అక్కడే ఉండిరి. తరువాత 10 ఘడియలకు  స్వామివారి సమాధి మీద మూతవేసి పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వాటితో  అభిషేకము చేసి, విభూధితో సమాధికి బొట్లు పెట్టి, బిల్వపత్రి, పువ్వులతోనూ అలంకరించి మఠాధిపతులు పూజలు చేసారు.

 లెక్కకు మిక్కుటముగా టెంకాయలు కొట్టి, హారతులిచ్చారు. స్వామివారి సమాధి ఘట్టమును చూడడానికి వచ్చిన వారందరూ అక్కడే ఉండి 5 రోజులు రేయింబవళ్ళు అఖండభజనలు జరిపించారు. ఐదురోజులుగా అఖండభజనకు వచ్చిన వారికి షడ్రసోపేతముగా భోజనాదులను ఏర్పాటు చేసారు. ఆషాఢఫూర్ణిమ రోజునాటికి అందరూ స్వామి కార్యాన్ని ఘనంగా విజయవంతంగా జరిపించినందుకు ఒకప్రక్క సంతోషముతో, మరోప్రక్క స్వామివారు ఇక మనకు కనపడరు అన్న దిగులుతో వారివారి ఇండ్లకు వెళ్ళిపోయారు.

 ఆ తర్వాత ఆ ఊరి పెద్దలందరూ సంజమ్మ, పక్కీరప్పలతో “మీకు కాలసినవన్నీ ఊరి ప్రజలే చూసుకుంటారు. మీరు స్వామివారి ధూపదీప నైవేద్యాలకు లోటురాకుండా చూసుకుంటూ సేవ చేసుకొండని చెప్పి” నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తర్వాతి కాలములో దేవాలయమును నిర్మించడం జరిగింది.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...