Showing posts with label గడేకల్లు శ్రీభీమలింగేశ్వర స్వామి/వేములవాడ భీమకవి. Show all posts
Showing posts with label గడేకల్లు శ్రీభీమలింగేశ్వర స్వామి/వేములవాడ భీమకవి. Show all posts

Saturday 16 January 2021

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే పలుకుతాను అని వరమిచ్చారట. భీమలింగేశ్వరునితాతాఅని పిలిచేవాడట. ఇతడు శ్రీమంతుల ఇండ్లలో, పాలెగాల్ల ఇండ్లులో దాచిపెట్టిన ధాన్యాన్నిదోచి తాగడానికి గంజి, తినడానికి గింజలు లేని బీదసాదలకు పంచేవాడట. బళ్లారి - అనంతపురం జిల్లాలు బ్రిటీషు వారి అధీనంలో ఉండగా బళ్లారి కచేరి దోచి బీదలకు పంచిపెట్టినాడట.

తను ఏపని చేయదలచినా ఎక్కడికి వెల్లదలచినా మొదట తాత గుడికి వచ్చి దర్శించుకొని విన్నవించుకొని తాత సరే అని పలికితే వెల్లేవాడట. తాత అనుగ్రహం వల్ల తలపెట్టిన ప్రతి పనులలో ఎదురు లేకుండా ఉండేదట.

కానీ చివరికి తన మరణం సమయంలో “తాత వెళ్ళవద్దు. ముప్పు ఉంది” అని చెప్పినా చెల్లి కి కట్టుబడి చెల్లి ఇంటికి ఇంటికి వెల్లాడట. ఎన్నాళ్ళుగానో అవకాశం కోసం కాపు కాసిన శత్రువుల పన్నాగానికి మోసానికి చిక్కి మరణించాడు.

నాగిరెడ్డి శూరత్వము గురించి, దానధర్మాల గురించి జానపదులు ఇప్పటికీ ఇలా పాడుకుంటారు.


Saturday 25 July 2020

13. దేవాలయ వర్ణన - స్వామివారి మహారథోత్సవాలు



గడియాద్రిపురము (గడేకల్లు) లోని స్వామివారి దేవాలయము తూర్పుముఖాన నిర్మింపబడి ఆలయముందరి భాగాన దాదాపు 50 అడుగుల ఎత్తైన ద్వజస్తంభము ఉండును. స్వామివారి జీవసమాధి మందిరాన స్వామివారివెండివిగ్రహాలు రెండు, సంజీవమ్మ వెండివిగ్రహము ఒకటి, పంచలోహాలతో చేసిన పార్వతీపరమేశ్వరులు నిత్యం వేలిగే పంచ అఖండజ్యోతుల మధ్య కొలువుదీరి ఉండును.


 సమాధి వెనుకభాగాన స్వామివారి రూపము చిత్రీకరించబడిన చెక్కఫలక ఉండును. సమాధి మందిరము ముందు భాగాన విశాలమన మంటపము ఉన్నది. ముఖమంటపమునకు ఇరు వైపులా పీరుజాతి వారు బహుకరించిన నగారాలు ఇప్పటికి కూడా కొలువుదీరి ఉన్నాయి. ముఖమంటపమునకు ముందరిభాగాన స్వామివారి కాలంనాటి గుర్రము సమాధి ఉన్నది. దానిపై ఒక బృందావనము నిర్మింపబడి అందులో హనుమంతరాయ పూజా విగ్రహము కొలువుదీరి ఉండును. ఆలయప్రధాన ద్వారానికి ఉత్తరభాగాన మహాభక్తురాలు, శిష్యురాలైన సంజీవమ్మ సమాధి, సంజీవమ్మ సమాధి ముందరి భాగాన మొదటిపూజారి ఫక్కీరప్పగారి సమాధి ఉన్నది. పక్కీరప్ప వారసులు ఈ దేవాలయపూజాదికాలను చూసుకుంటారు.
స్వామివారిశిష్యురాలు శంజమ్మ అవ్వ 




స్వామివారిభక్తులు మొదట సంజీవమ్మను దర్శించిన తర్వాతనే స్వామివారిని దర్శించడం ఆనవాయితి. ఆలయధ్వజస్తంభానికి దక్షినభాగాన భోజనశాలనికి, కుడివైపునొక మంటపము ఉండును. జీవసమాధి మందిరానికి వాయువ్యభాగాన ఆ కాలాన త్రవ్వబడిన బావి, ఈశాన్యమూలన స్వామివారి కాలము నాటి గోని వృక్షము వేప వృక్షములు ఉన్నవి. 101 స్థానమైన గడేకల్లులో ఇప్పుడున్న వేపచెట్టు స్థానంలో స్వామివారు దంతదవనము తర్వాత నాటిన వేపపుల్ల మరుసటి రోజుకంతా చిగురించడం, స్వామివారు ఇక్కడ జీవసమాధి పొందాలని నిర్ణయించుకోవడం జరిగింది.

                స్వామివారి మహారథోత్సవాలు ప్రతి సంవత్సరం ఆశాడ శుద్ధ పౌర్ణిమి (గురు పౌర్ణిమ) రోజు నుండి బహుళ పంచమి వరకు అయిదురోజులపాటు అంగరంగవైభవంగా జరుగుతాయి.  మొదటి రోజున బిందెసేవ (గంగోత్సవం), రెండవరోజున మహారథముపైకి పంచకలశాదిరోహణము, మూడవరోజున ఉచ్చాయము మరియు  మహారథోత్సవము, నాలుగవరోజున కుడుములాట మరియు గరుడోత్సవం, అయిదవరోజున వసంతోత్సవముతో స్వామివారి మహారథోత్సవాలు ముగుస్తాయి. అంతేకాక ప్రతి యేటా శ్రావణశుక్లపంచమి నాడు స్వామివారి జన్మదిన వేడుకలు, ఎంతో ఘనంగా జరుగుతాయి. స్వామివారి ఆలయములో ప్రతి సోమవారము, శనివారము విశేషపూజలు జరుపడుతాయి. ప్రతి అమావాస్యరోజున అన్నదానము జరుపబడుంది.
స్వామివారి ఆలయము గడేకల్లు

బిందెసేవ(ఆషాఢపూర్ణిమకు)కు ముందురోజు పల్లకిలో స్వామివారి వూరెరిగింపు
                                       

                                     
ఆషాడపూర్ణిమ రోజున స్వామివారి బిందెసేవ ఉత్సవం

ఆషాఢపూర్ణిమ తరువాత రోజు సాయంత్రము స్వామివారి నైవేద్యనిమిత్తం
కుండలను  తీసుకురావస్తున్నప్పుడు వూరేగింపు
ఆషాఢపూర్ణిమ తరువాత రోజు సాయంత్రము రథారోహనానికి సిద్ధమవుతున్న పంచకలశాలు
                                           
రథోత్సవము రోజున తెల్లవారుధ్యామున వూరేగింపుకు సిద్దమవుతున్న ఉత్సాయము
                                                   
ఊత్సాయసేవ అనంతరము స్వామివారికి మంగలహారతులు
                             
ఉత్సాయము తరువత అలసిపొయిన స్వామివారి పవలింపు సేవకి సిద్దమవుథున్న ఉయ్యాల 

                                                   
ఉత్సాయము తరువత అలసిపొయిన స్వామివారి పవలింపు సేవకి సిద్దమవుథున్న ఉయ్యాల 
                             
స్వామివారికి జోలపాట - పవలింపుసేవ
స్వామివారి మహారథము
                                 
                                     
స్వామివారి మహారథోత్సవము
                                         
గజవాహన సేవలో స్వామివారు 
                                               
స్వామివారి ఆలయములో మహాయాగము
                             
                                            
శ్రీ భీమలింగేశ్వరస్వామిమఠం పూజార్లు 



                             


                                       

                                       






14. కరడిగుడ్డం మంగమ్మ అవధూత


               కరడిగట్టు మంగమ్మవ్వ జన్మతః అవధూత. యల్లార్తికి ఇవతల కరడిగుట్ట అనే గ్రామము ఉంది. అక్కడ ఈమె భవ్య మందిరము వెలసింది. పెళ్ళయి పసుపు బట్టలతో గడేకల్లు భీమలింగేశ్వరుని ఆలయ శిఖరాలను చూడ్డానికి వచ్చింది. 
                                                 
తలుపు వద్ద నుండి భీమలింగున్ని దర్శించింది. స్వామిని గురువుగా ఆరాదించింది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కరడిగుట్టలో ఒక బండమీద కూర్చుంది. దాన్ని తపస్సుగుండు అంటారు. 12 సంవత్సరాలు స్వామి ద్యానంలో ఉండిపోయింది. వంటిమీద బట్టలు చిరిగిపోయినామారుబట్ట తొడగలేదు. దిగంబరంగానే ఉండిపోయింది. ఆమె పలికిన పలుకులన్నీ అమోఘవాక్కులే. గట్టు మీద కూర్చొని వ్యాపారము చేసేవారికి గానీవ్యాజ్యం పోయేవారికి గానీ, “అవుతుందిరో” అంటే బాగయ్యేది. కాదురో” అంటే అంతే. అవ్వదగ్గరకు అనేకమంది తినడానికి మంచి మంచి పదార్థాలను తెచ్చెవారు. ఒకసారి అన్నిటినీ వదిలి అంత్యజుడు తెచ్చిన ఎండిపోయిన రొట్టె ముక్కను బ్రహ్మానందంగా తినింది. అతని పంట పండి ధనిక శ్రేణికి చేరుకున్నాడు. ప్రతి ఏడాది మంగమ్మవ్వ జాతరరోజున ఉదయానే  పసుపుకుంకుమవిబూధిపండ్లుహారాలునెయ్యినిమ్మపండ్లువివిధ రకాల పండ్లు మొదలయిన పూజా సామాగ్రిని తెచ్చి అవ్వ గురువైన  భీమలింగేశ్వరుని జీవసమాధి పూజ జరిపించిజీవసమాధి పూజా తీర్థమునఅంగారుసామి జీవసమాధిపై ఉంచిన పూలుపండ్లునిమ్మకాయలుపసుపు కుంకుమ మొదలగు వాటిని కరడిగుట్టకు తీసుకెళ్ళి వాటితో అవ్వరథోత్సవవేడుకలు ప్రారంభమవుతాయి. 

12. ఎమ్మిగనూరుపట్టణంలోఅటకారు వాడు భంగపడుట


స్వామివారి జాతరకు ముందు అనగా జాతర 2 నెలలు ఉండగానే పూజార్లు స్వామివారి విగ్రహమును పల్లకీలో ఉంచుకొని, స్వామి భక్తులు ఏ ఏ గ్రామాలలో ఉన్నారో ఆ గ్రామాలకు జాతర ఖర్చుకు గానూ (పట్టీ) సంపాధన కొరకు పోయేవారు. పూర్వము దాదాపు 180 సంవత్సరాల క్రిందట స్వామివారి పూజార్లు ఎమ్మిగనూరు అను పట్టణమునకు సంచారమునకు పోయి ఉండిరి. ఆ పట్టణంలో అటకారు వాళ్ళు విశేషముగా ఉండేవారు. వారిలో ఒకడు మాత్రము విద్య యందు చాలా నిపుణుడై ఉండెను. అతని పేరు చెప్పు వారు ఎవరూ లేనందున ఆ పేరు వ్రాయలేదు. అతడు తన క్షుద్రవిద్యాగర్వంతో, భాజాభజంత్రీలతో ఊరేగుతున్న స్వామీవారిని చూచి, పల్లకీ మోసేవాండ్లకు, భజంత్రీ చేయువారికి నోటమాట రాకుండేలా, చేతులు కదలకుండా క్షుద్రవిద్య చేసినాడు. అప్పుడు స్వామివారి పల్లకీ ప్రధానవీధిలో ఆగిపోయింది. అపుడు పూజారి, మేలగాళ్ళను చూసి మేళము వాయించమని గర్జించెను. మేళగాల్లు నోటిమాటరాక, కాల్లూ చేతులూ కదల్చలేక, కన్నీరు విడువసాగిరి. పల్లకీ మోసేవాళ్ళను కదలమనగా, వాళ్ళు కూడా కదలలేక, మాట్లాడలేక, దిక్కుతోచని స్థితిలో బాధ పడుతూ స్వామిని ప్రార్థించిరి. అప్పుడు పూజారి ఈ క్రింది విధముగా చేయునట్లు స్వామి బుద్ధిపుట్టించాడు. వెంటనే ఆ పూజారిపల్లకీని, భజంత్ర్రీ వాళ్ళను అక్కడనే వదిలేసి, సమీపాన ఉన్న బావిలో స్నానము చేసి పల్లకీ వద్దకు వచ్చి, పల్లకీలో ఉన్న విబూధి(అంగారు)ను కొంచెము తీసుకొని, వారందరి మీదా చల్లి స్వామివారి బెత్తముతో పల్లకీ మోసేవారిని, మేళగాళ్ళను తట్టినాడు, వెంటనే వారికి ఆ క్షుద్రప్రయోగం నాశనమై చలనము వచ్చింది. ఇదిలా ఉండగా క్షుద్రవిద్య ప్రయోగము చేసిన ఆ అటకారువాడికి ఇంట్లో కడుపునొప్పి, కడుపుబ్బరముతో ఆయాసపడుతూ పొర్లుచుండెను. ఇది తెలిసి  ఆ పట్టణంలో మిగిలిన విద్యావంతులైన అటకారు వారు వచ్చి, తమ శక్తిమేర ప్రయత్నించి చూసారు, కానీ ఫలితము కనపడలేదు. అపుడు వారు జరిగిన విషయమును తెలుసుకొని, ఇది ఆ భీమలింగేశ్వరిని మహిమ వల్ల జరిగిందని ఇతడు ఇట్లే ఉన్న ఎడల ప్రాణము నిలుచుట కష్టము, మనచేత ఏమి కాదు. కావున ఇతనిని ఆ స్వామివారి ముందుకు తీసుకు పోదాము రండని ఆ అటకారు వాడిని మోసుకొని, బజారులో పోవుచున్న పల్లకీకి అడ్డుగా వేసారు., పూజారి ఏమిటని విచారించగా వారు స్వామికి నమస్కారము చేసి , ఈ పడి ఉన్న దుర్మార్గుడు చేసిన క్రూరకృత్యములు యావత్తూ, ఒక్కటీ దాచక విన్నవించారు స్వామివారి పూజారి “నేను ఏమి చేయగలను. నాచేత ఏమవుతుంది. నేను మీలా విద్యావంతున్ని కాదు. నా చేత ఏమీ కాదని  చెప్పగా” వాల్లందరూ నోటమాట రాక నిర్వీణులై నిల్చున్నారు.
భీమలింగేశ్వరుడి వైభవము చూసి, గర్వముతో ఇట్టి విద్యలు ప్రయోగిస్తున్నప్పుడు మహసాద్వి, మహ భక్తురాలైన ఆ అటకాడి భార్య తనభర్తతో “మీరు విద్యావంతులు, మానవులకు చేసినట్లు స్వామివారిపై క్షుద్రప్రయోగములు చెసినా అది సాగక, స్వామి వారి కోపానికి గురికావాల్సి ఉంటుందని” హెచ్చరించినా లెక్కచేయక తిరిగి ఆమెను కోపగించుకున్నాడు.  మరోసారి అమె తన భర్తకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ “ ఆ స్వామి నీకేమి అపకారము చేసినాడు. నీవు పని కట్టుకొని ఈ విధంగా చేస్తున్నావు”అని అడగ్గా,  ఈ పట్టణంలో ఎవరు వచ్చినా, నా అనుమతి లేనిదే బసచేయరు, నా అనుమతి లేకుండా పల్లకిలో ఉరేగిస్తూ, ఇక్కడే బస చేస్తారా, వీళ్ళకి బుద్ధి చెప్పాలి?” అని భార్యను చెంపదెబ్బ కొట్టాడు. ఆమె ఇక బదులు చెప్పక, చింతిస్తూ, స్వామి ఈ మూర్ఖుడిని ఇక నీవె రక్షించాలి అని ప్రార్థించెను.
ఆమె పతిమీద భక్తి కలిగినది అగుటవలన  తన మాంగళ్యానికి ఏటువంటి అపదరాబోతుందో అని భయపడుతూ, స్వామివారి పల్లకి వద్దకు వచ్చి స్వామిని అనేక విధములుగా ప్రార్థించింది. ఇది చూసిన స్వామి పూజారి “ అమ్మా మేము ఏం అపరాధము చేసామని ఈ విధంగా చేశాడు” అనెను.  ఆమె జరిగినదంతా వారికి చెప్పి తన భర్తను క్షమించమని, తనకు పతిభిక్ష పెట్టమని,  స్వామిని కోరుతున్నపుడు, పల్లకీలో స్వామివారి విగ్రహముపైన ఉన్న పత్రి పుష్పములు దేవుని కుడిభాగమున రాలెను. ఇది గమనించినవారు  స్వామివారు ఈమె భక్తికి మెచ్చారు అని తలచిరి. స్వామి వారి పూజారి కూడా జరిగినదానిలో ఈమె తప్పు ఏమీ లేదు.

అంతలో పడిఉన్న అటకారు వాడు మెల్లగా కల్లుతెరచి చూడసాగాడు. అక్కడున్న వారు స్వామి అనుగ్రహముతో ఇతనికి మెలకువ వచ్చింది. ఇక స్వామివారి పూజారి అనుగ్రహించాలని కోరారు. పల్లకీలోని అంగారును కొంచెము తీసుకొని అటకారువాడి నోట్లో వేసి, బొట్టు పెట్టి స్వామివారి బెత్తమును తీసుకొని మూడు సార్లు తట్టాడు.  ఆ అటకారువాడు వెంటనే లేచి కూర్చొని తన బాధలన్నీ తొలగుట తెలుసుకొని, స్వామివారి పూజారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు చేసి స్వామిని క్షమించమని వేడుకున్నాడు. స్వామివారి పల్లకీని తన ఇంటికి ఆహ్వానించి, ప్రత్యేకపూజలు చేయించాడు.

స్వామివారి మహిమలను తెలుసుకొని, జాతరకు ఖర్చులకు తాను కూడా కొంత సొమ్మును కానుకగా సమర్పించుకొని, స్వామి పల్లకీ మోస్తూ, తాను కూడా స్వామితో పాటు అ పట్టణంలో తిరిగి గడేకల్లు చేరే వరకు వెంటనే ఉండి, ఆలయములో ఆరాధన జరిపి, తన పట్టణానికి వెళ్ళాడు.

11. ధ్వజస్తంభమును నిలిపెట్టప్పుడు జరిగిన అద్భుతమహిమ


       

       స్వామివారి ఆలయమునకు ముందు భాగమున గొప్పశిలతో నిర్మింపబడిన ఒక ధ్వజస్తంభమును నిలిపినారు. దీనిని నిలబెట్టుటకు ఆ రోజుల్లో యంత్రములేవీ లేవు. జనసహాయముతో నిలబెట్ట వలెనని ఈ గ్రామమునకు చుట్టూ ఉన్న పల్లెలనుంచి పిలిపించిరి. ఎంతో మంది నాలుగు రోజులు శ్రమించినా కూడా ద్వజస్తంభము లేవలేదు. ఐదవరోజున ఈ ద్వజస్తంభము చేసిన సంత్రాసు, స్వామివారిని ఈ విధముగా వేడుకునెను.” స్వామీ! నాకు చేతనైనంత వరకూ కష్టపడి పనిచేసి, ధ్వజస్తంభమును చేసితిని. దానిని ఎన్ని విధములుగా ప్రయత్నించిననూ లేవలేదు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన వారందరూ ఈ గ్రామమున ఎన్ని రోజులుండగలరు? ధ్వజస్తంభము గతి ఏమిటని స్వామిని వేడుకుంటూ, చింతిస్తుండగా, అతనికి నిద్దుర వచ్చినట్లు కాగా, అతడు ఆలయప్రాంగణంలోనే పడుకున్నాడు. వెంటనే ఆ పడుకున్న సంత్రాసుకి స్వామి స్వప్నములో కనిపించి “ఒరే సంత్రాసు, నీవు చింతించనక్కర్లేదు. ఇప్పుడు వెళ్ళి, అక్కడ ఎవరుంటే వారితో పట్టించుము. ధ్వజస్తంభము తప్పక నిలుస్తుంది.” అని ఒక సాధువు వేషములో కలలో సాక్షాత్కరించాడు. సంత్రాసుకు వెంటనే మెలకువ వచ్చింది.


అతడు స్వప్నం ప్రకారము ధ్వజస్తంభము ఉన్న చోటకు వెళ్ళి అక్కడున్న స్త్రీ, పురుషులను పట్టమని కోరాడు. అయితే అక్కడున్న వారు నవ్వి వందలమంది నాలుగు రోజులుగా ప్రయత్నము చేసినా ఇంత కూడా లేవని ఈ ద్వజ స్తంభము ఈ కొద్దిమంది చేత లేవడం అసంభవము. నీకు పిచ్చిగానీ పట్టిందా అని పరిహాసము చేసారు. అప్పుడు ఆ సంత్రాసు “ అయ్యా! ఇక్కడ ఉన్న యావత్తు స్త్రీపురుషులందరూ కలిసి ప్రయత్నించండి. ఈ సారి ఈ స్తంభము లేవకపోతే ఇక్కడే నా ప్రాణములను అర్పిస్తానని వారితో చెప్పాడు. అపుడు అక్కడున్నవారు అతని మాటప్రకారము ప్రయత్నించారు. ఆశ్చర్యకరంగా ఆ ధ్వజస్తంభము లేచి, సరిగ్గా స్థలములో కూర్చొనింది. ఆ సమయానికి పక్కగ్రామమువారు కొంతమంది, ఈ గ్రామము వారు భోజనానికి వెళ్ళి ఉన్నారు. ఆ గ్రామములోని కొందరు పెద్దలు ఈ వార్త విని, చాలా సంభ్రమాశ్చర్యాలకులోనై, సంత్రాసును విచారించగా అతను తనకు స్వప్నమైన విషయమంతా చెప్పగా, అందరూ దేవున్ని అనేకవిధములుగా ప్రార్థించి, పూజా పురస్కారాదులాచరించి, గ్రామస్తులందరూ వారివారి ఇండ్లకు వెళ్ళిరి. ఈ ఘన చరిత్రను కలిగిన ధ్వజస్తంభము నేటికీ దేవాలయము ముందర ఉన్నది.

10.గడేకల్లులో స్వామి వారి దేవాలయం నిర్మించేటప్పుడు ప్రత్యక్షమై మహిమను చూపిన విధానము


స్వామివారి ఆలయమును బళ్ళారి నివాసులైన జొన్నగడ్ల పాపయ్య అనునతడు కట్టించుటకు గాను, బళ్ళారియందే స్వామి ఆలయమునకు కావలసిన రాతిదూలములు, స్తంభములు, బండలు మొదలైన యావత్తు సామానులు తయారు చేయించారు, వాటిని అచ్చటి నుండి, గడియాద్రిపురము (గడేకల్లు)నకు తెచ్చుటకు గాను,బళ్ళారిలోనే బాడుగ బండ్లవారిని  పిలిపించి, ఈ సామానులు చూపిన వెంటనే బాడుగ వారందరూ, ఇంత పెద్ద సామానును బండ్లు ఎత్తినచో, బండ్లు నిలబడలేవు. ఈ కష్టము మాకు అక్కర లేదంటూ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. ఈ స్థితిని చూచి, పాపయ్య వారందరికీ ఎంత బాడుగ అడిగితే అంత ఇస్తానని ఎంత చెప్పినా కూడా ఎవరూ వినలేదు. కారణమేమని విచారించగా హగిరి వంక వద్ద దారి సరీగా ఉండదని, అక్కడ 6 ఎద్దులు కట్టినా ఈడ్చలేవని, ఇబ్బందులు పడాల్సివస్తుండని చెప్పి బండ్లవాళ్ళువెళ్ళిపోయారు.
ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఈ భక్తుడు చాలా చింతించి, స్వామిని అనేకవిధములుగా ధ్యానిస్తూ, తన ఇంటికి వచ్చి స్నానము చేసి, సంధ్యవార్చునపుడు దివ్యస్వరూపముతో ఒక యోగి దర్శనమిచ్చి “ఒరే, నీవు చింతించనక్కర్లేదు. బండ్లవాళ్ళకు, బండ్లకు ఏమైనా నష్టము కలిగినట్లయితే వాటిని సరిచేయిస్తానని, ఒకవేళ ఎద్దులు ఈడ్చలేకపోయిన ఆ బండ్ల్లను అక్కడే వదిలి వెనుతిరిగి రమ్మని, ఒక బండికి నాలుగు వంతులు కట్టిస్తానని వారితో చెప్పమన్నారు. అప్పుడు వారు బండ్లు కడతారు. బండ్లకు నష్టము కలుగకుండా, ఎద్దులు కష్టపడకుండా, సామాను అంతా నా స్థలమునకు చేరును. నువ్వు చింతించవద్దని” చెప్పి అదృశ్యమయ్యాడు. భీమలింగేశ్వరుని అనుగ్రహానికి సంతోషించి, తక్షణము భోజనము చేసి,, బండ్లవాళ్ళను పిలిపించి వారితో స్వామి చెప్పిన విధంగా భాషించాడు. కానీ ఆ బండ్లవాండ్లు అనుమానము ప్రకటించగా, పాపయ్య “ప్రమానపూర్వకముగా ఎటువంటి నష్టము కలిగినా నేనే భరిస్తాను. ఇది ఆ భీమలింగేశ్వరునిమీద ఆన. అని పలికాడు.
బండ్లవాళ్ళు అతని భక్తివిశ్వాసములను చూసి, సమ్మతించారు. కానీ వారిలో ఒకడు హగిరి వంక వద్ద దాటునపుడు ఎద్దులు పోలేకపోతే ఎలాగని సందేహము తెలిపెను. అపుడా భక్తుడు అపూర్వవిశ్వాసముతో “ అలా ఆటంకమైతే ఈ వస్తువులన్నీ అక్కదే వదిలివేసి రమ్మని చెప్పారు. వారందరూ ఆ దేవుని మహిమ ఎట్టిదో ఏమో! మనమెందుకు వాదింపవలెనని, బండ్లకు  సామాను ఎత్తించుకొని బయలుదేరారు. బండ్లన్నీ హగిరి వరకు నిరాటంకంగా ప్రయాణించాయి. బండ్లను హగిరి వద్ద ఆపి, కాడి పెట్టించాలని ఆలోచిస్తుందగా అంతలో బండ్లన్నిటిలో ముందున్న బండి ఎద్దులు తమంతట తామే, మనిషిలేకనే హగిరి వంక వద్ద తోవ తప్పకుండా, ఆయాసపడకుండా దాటాయి. ఇది చూసిన బండ్ల వాళ్ళు ఆశ్చర్యమానసమగ్నులై, ఇది దేవుని మహిమనే కానీ వేరొకటి కాదు. ఇంతబరువైన బండ్లు ఇంత సునాయాసంగా వంకదాటడం చాలా విడ్డూరమనుకుంటూ బండ్లనన్నిటినీ హగిరి వంకను దాటించారు. తరువాత రోడ్డుమార్గమున జోళిదరాశి అను గ్రామము వద్దకు రాగానే ఒక బండికి మాత్రము యేరుకోలు పటపటమని శబ్దమయ్యింది.
అప్పుడు బండి తోలువాడు కొంచెము అంతుకొని ఉన్న ఇరుసును చూచి ఇది విరుగుట నిశ్చయము, విరిగిన తరువాత ఎద్దులపై పడుతుందని తలచి, బండి విడిచినాడు.  మిగితా వారందరూ వచ్చి చూసి ఏమి చేయాలని చింతించునంతలో ఒక తెల్లనిగుర్రంపై కుర్చోని ఒక సాధువు వాళ్ళ వద్దకు వచ్చారు. తెల్లటి వెంట్రుకలతో, తెల్లటి గడ్డముతో ఉన్న ఆ సాధువు “నాయనా మీది ఏ గ్రామము? వీటిని ఏ గ్రామానికి తీసుకెళ్తున్నారు? ఏ దేవుని ఆలయము కట్టడం కోసం?” అని విచారించగా, వాళ్ళు  ఈ సామాను గడియాద్రిపురమున శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి ఆలయనిర్మాణము కోసం తీసుకు వెళ్తున్నామని చెప్పగా, మరి బండ్లను ఇక్కడ ఎందుకు ఆపారు అని ప్రశ్నించారు. ఈ బండి యేరుకోలు కొద్దిగా విరిగిందని ఆ సాధువుకు చూపించారు. ఆ సాధువు దానిని చూసి, ఇది ఏమాత్రమూ విరిగిపోదు. దీనికి ఒక కొయ్యవేసిబిగించినయెడల దీనికి భయము లేదని చెప్పగా, దీనికి తగువైన కర్రను ఎక్కడ తేవాలని వాళ్ళు ఆలోచిస్తుండగా, ఆ సాధువు తన చేతిలో ఉన్న చండ్రాయుధమును వాళ్ళ చేతికి ఇచ్చి దగ్గర ఉన్న కొండవద్ద ఉన్న వేపకొమ్మను కోసుకు రమ్మని చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఒక వేపకొమ్మను తీసుకురాగా, దానిని యేరుకోలుకు వేసి బిగించారు. వాళ్ళు కదిలిన వెంటనే, సాధువు అదృశ్యమయ్యారు.
అప్పుడు ఆ బండ్లవారందరూ అయ్యో! స్వామి మనకు దర్శనమిచ్చుటకే ఈ విధంగా జరిగినదేమో అని స్వామిని తలచుకుంటూ, ఎటువంటి ఆటంకములూ లేకుండా గడేకల్లు స్వామి అలయము చేరారు.
అంతలోనే బెళ్డోణ గ్రామము నుండి కొంతమంది భక్తులతోకూడి స్వామివారి పూజారి గడేకల్లు ఆలయము వద్దకు వచ్చారు. ఆ బండ్ల వాళ్ళు, ఈ పూజారిని చూసి, ఈయనే మాకు జోలిదరాశి వద్ద దర్శనమిచ్చి, అదృశ్యమయ్యారు. ఇపుడు ఇక్కడ దర్శనమిచ్చారని అతని పాదాలకు నమస్కరించి “మీరు జొలిదరాశి వద్ద సహాయము చేయకుంటే ఎంతో ఇబ్బంది పడేవారము స్వామి”. అనగా అపుడు ఆ పూజారి “నేను బెళ్డోణ గ్రామము వెళ్ళి మూడు రోజులయ్యింది. ఇప్పుడే రావడము. కావాలంటే నాతో పాటు వచ్చిన వీరిని విచారించండని” చెప్పెను.


ఆ బండ్ల వాళ్ళు “మాకు ఈ సాధువే కనిపించినది. తెల్లని గుర్రంపై చేతిలో చంద్రాయుధముతో కన్పించారు.” అని చెప్పగా, వారందరూ చంద్రాయుధము స్వామివారి జీవసమాధిపై ఉండును. ఈ పూజారి చేతిలో ఉండదు, అని స్వామివారి సమాధిపై ఉన్న చండ్రాయుధమును చూసారు. ఆ చంద్రాయుధముపై చెట్టు కొట్టిన రసము కూడా ఉండింది. అది పరీక్షించి అందరూ ఆశ్చర్యపడి, ఇదంతా స్వామి ప్రత్యక్షముగా నడిపిన కార్యము, లేకున్న ఈ చంద్రాయుధమునకు రోజూ విబూధి పూజ చేస్తారు. ఈ చెట్టు  కొట్టిన ఆనవాలు ఎలా వస్తుంది. అంతా స్వామి మహిమ అనుకున్నారు. ఆ బండి వాళ్ళందరూ స్వామి ఆలయానికి సంబంధించిన సామాను అంతా దింపివేసి, ఆనందమైన మనసుతో బళ్ళారికి ప్రయాణమయ్యారు. అక్కడ పాపయ్యను కలిసి జరిగిన వృత్తాంతమంతా చెప్పి మాకు బాడుగ అవసరం లేదు. మేము స్వామి కృపకు పాతృలమయ్యామని పలికారు. అపుడు ఆ పాపయ్య స్వామి వారి మహత్యము తెలుసు కావుననే నేను అంత నమ్మకంతో ఈ కార్యమునకు ఉపక్రమించాను. మీరు డబ్బు వద్దంటే నాకు ఫలితం ఉండదు అని బలవంతముగా వారికి బాడుగలు ఇచ్చి పంపాడు.


9. కంతి ధరించునపుడు జరిగిన మహిమ


                స్వామి సమాధి అయిన తర్వాత కొన్ని రోజులకు గడేకల్లు గ్రామములో ఉండే మఠపతి బసయ్య అను అతను, కంతి (బండల మధ్య ఖాళీని కానీ రంధ్రమును కానీ పూడ్చడానికి  వేసే పదార్థము) ధరించు ఆయనకు తోడుగా పని చేయుచుండెను. ఇతడు స్వామి సమాధికి ఒక రంధ్రము ఉన్నది.
ఆ రంద్రమునకు తన హస్తమును పెట్టి చూడగా సమాధిలో నుండి చల్లని మారుతము చేతికి తాకడం అతను గమనించాడు. ఇతను ఈ సమాధిలో ఏమున్నదో చూడాలన్న కోరికతో ఒక పొడవయిన కర్రను తీసుకొని సమాధిరంధ్రములో పెట్టి సమాధి నాలుగు మూలలా కర్రతో తాకుతూ, ఒకటి రెండు మూలలకు కర్రను తగిలించాడో లేదో అంతలోనే సమాధి నుండి భగ్గునమి మంట పుట్టి, ఈ కర్ర జొప్పించిన అతని దేహమాద్యంతము కాలి, బొబ్బలు పుట్టి, దేహమంతా మంటలు అధికమై చాలా బాధతో అరవసాగెను. ఆ అరుపుకు నలుగురూ వచ్చి, జరిగిన విషయం విషయం తెలుసుకొని “మనము చేయడానికి ఏమున్నది. ఇక ఇతనిని ఆ భీమలింగుడే కాపాడాలి గానీ, వేరెవ్వరి వల్లా కాదు” అనుకుని పెద్దలందరూ స్వామిని వేడుకొని కాలిన బసయ్యను స్వామి సమాధి ముందర పరుండబెట్టి, స్వామి పైనే భారము వేసారు. ఆ కాలిన బసయ్య స్వామిని “స్వామీ ‌అజ్ఞానముతో నేను చేసిన తప్పును మన్నించండి. ఈ బాధను భరించలేకుండా ఉన్నాను. నన్ను కాపాడండి “ అని ప్రార్థిస్తూ సొమ్మసిల్లిపోయాడు. నిద్రలో స్వామి సాక్షాత్కరించి బెత్తముతో మూడుసార్లు తట్టి ఇకనైనా బుద్ధితో మెలగమని” చెప్పి అంతర్థానమయారు.

స్వామి బెత్తము తగలగానే స్వామీ అని గట్టిగా కలవరించుకున్నాడు. అప్పుడు చుట్టు ప్రక్కలవారు ఏమైందని ప్రశ్నించగా, తనకు కలలో జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పటికే అతనికి సగము బాధ తగ్గిపోయింది. సూర్యోదయము తర్వాత బసప్ప మామూలుగా నిద్రలేచి జరిగిన సంఘటన తలచుకొని స్వామివారి ఆగ్రహమూ, అనుగ్రహము ఎలా ఉంటాయో తెలుసుకున్నవాడై, స్వామికి కాయా కర్పూరాలను తెచ్చి, పూజలు చేసి ఇంటికి వెళ్ళెను.

8. ఫక్కీరప్ప జననం – స్వామి వారి జీవసమాధి సమయం


ఒకరోజు సంజమ్మ ఏదో దిగిలుగా ఉండడం గమనించి, స్వామివారు “ సంజీవా ఈ మధ్య ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నావు? కారణము ఏమిట”ని అడిగారు. నంజమ్మ “ స్వామీ! నా తదనంతరం మీకు సేవ చేయడానికి ఒక పిల్లవాడు ఉండుంటే  బాగుంటుందనిపిస్తోంది.” అని సమాధానమిచ్చెను. స్వామివారు సంజమ్మ మాటలు విని “ దానికి ఇంత దిగులెందుకు? ఆ సంగతి నేను చూసుకుంటాను. అని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలము గడిచిపోయింది. ఒక రోజు సంజమ్మ” నేను చెప్పినది స్వామివారు ఆలోచించారో లేదో ఇంతవరకు ఆ సంగతే పట్టినట్లు లేదు. స్వామివారికి  తనదగ్గరకూ వచ్చిపోయే వాళ్ళ కష్టసుఖాలు చూడడమే సరిపోతుంది. అనుకుంటూ మధ్యాహ్నం నడుం వాల్చింది. కొంచెం కునుకు పట్టినట్లయ్యింది సంజమ్మకు. కొంత సేపటికి “సంజీవా! సంజీవా!” అని స్వామివారు పిలిచినట్లయ్యింది. అయ్యో స్వామి పిలుస్తున్నారే అని స్వామి ఉన్న చోటకి వెళ్ళి  చూసింది. స్వామి మాత్రం ధ్యానంలో ఉన్నారు. సంజమ్మ “నన్ను పిలిచారా స్వామి” అనడిగింది. అపుడు స్వామి అవును పిలిచినది నిన్నే. అంత పరధ్యానంగా ఉన్నావేమి. నీవు పిల్లవాడిని అడిగావు కదా. ఆ అడ్డు కొండలో ఒక పిల్లవాడు ఏడ్చుచున్నాడు. వెళ్ళి తెచ్చుకొమ్మని చెప్పి మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. సంజమ్మ ఇది నిజమేనా! అనుకుంటూ వడ్రంగివారి చేనులోంచి అడ్డుకొండ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక పిల్లవాడు తుంటిగుడ్డమీద పడుకొని ఏడ్చుచున్నాడు. అది చూసి స్వామి వింత మహిమకు అబ్బురపడి, తన్ను నమ్మిన భక్తుల కోర్కెలను ఎట్లా తీరుస్తాడో, స్వామివారి లీలలను గురించి తలచుకుంటూ ఆ పిల్లవాణ్ణి తెచ్చుకున్నది.

ఆ పిల్లవానికి స్నానాదికాలను చేయించి, స్వామీ ఈ పిల్లవానికి పాలు ఎట్లా అని అడుగగా, స్వామివారు “ఇప్పటి నుండీ ఒక నల్లకుక్క ఇక్కడకు వస్తుంది.ఈ పిల్లవానికి ఆ కుక్కపాలు పట్టమ”ని చెప్పారు. స్వామి చెప్పిన కొంత సేపటికి నల్లని కుక్క వచ్చి నిలబడింది. సంజమ్మ ఆశ్చర్యంతో ఎప్పుడూ రాని కుక్క స్వామివారు చెప్పినట్లే వచ్చింది. ఇదంతా స్వామి వారి మహిమనే తలచుకుంటూ, ఆ పిల్లవాణ్ణి తెచ్చి ఆ కుక్క స్తనానికి పెట్టగానే ఆ పిల్లవాడు తల్లిపాలలాగే కడుపునిండా పాలు త్రాగెను. ఇలానే కాలము గడుస్తుండగా ఆ పిల్లవాడికి 6,7 నెలలు నిండాయి. రోజూ స్వామి కొరకు వచ్చే జనులు ఆ పిల్లవానికి అప్పుడే పిండిన ఆవుపాలు తీసుకురావడం, ఆ పిల్లవాడు సంపూర్ణ ఆహారంతో పాటు స్వామివారి ఆశీర్వాదబలంతో దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. ఒకరోజు సంజమ్మ ”స్వామీ ఈ పిల్లవానికి ఏమి పేరుతో పిలవాలో మీరే సెలవీయమ”ని అడుగగా, స్వామివారు “పక్కీరప్ప” అని పేరు పెట్టారు.  
భీమలింగేశ్వరస్వామి ఎన్నో స్థలాలలో కూర్చొని(ధ్యానము, తపస్సు చేసి) లేచి వచ్చినారు. తరువాత గడేకల్లు గ్రామమునకు వచ్చి తన స్థిరనివాసము కొరకు చేరుకున్నారు. ఒకరోజు స్వామివారిని దర్శించడానికి వచ్చిన ఊరిపెద్దలు, ప్రజలందరి ఎదుట నేను ఈ లోకానికి వచ్చిన కార్యము ముగిసినది. ఇక మీ అందరికీ నా నిజదర్శనము కలుగదు. వచ్చే ఆషాడశుద్ధ దశమినాటికి జీవసమాధిలో ప్రవేశించుటకు నా తండ్రి పరమేశ్వరుని నుండి అజ్ఞ వచ్చినది. అందువలన మీరందరూ నా సమాధికి కావలసిన బండలు, ఇతర సరంజామాను సిద్ధం చేయాల్సిఉందని చెప్పగా అందరూ ఒక్క క్షణం శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారు. తేరుకొని “మీ పట్ల ఏమైనా అపచారము జరిగినదా స్వామీ! మా తప్పు ఉంటే క్షమించండి. మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాము.” అని పాదాలపై వాలారు.
స్వామివారు “మీరు ఏ అపరాధమూ చేయలేదు. నేను ఈ కలిలోకంలో ఉండుటకు వీలు లేదు. మీరు నిర్మించిన ఈ సమాధిలో ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీ కోరికలను తీర్చుతూ, మీకు కష్టనష్టాలను రాకుండా కాపాడుతాను. ఎవరు నన్ను మిన్నగా తలచుకుంటారో వారు అంత సుఖసంతోషాలతో తులతూగుతారు. నేను ఈశ్వరాంశసంభూతుడను. నాకు మరణమనేది లేదు. సూర్యచంద్రాదులు ఉన్నంతవరకూ ఇప్పుడు ఎట్లా మీ ఎదుట ఉన్నానో,  అలానే మీ భక్తి శ్రద్ధలను బట్టి సమాధిలో ఉన్నా మీ దగ్గరే ఉంటాను.” అని సమాధానపరచి ఇంక 5 నెలలలో మీరు నా సమాధికి కావలసిన పై మందిరానికి కావలసిన సరంజామాను భక్తి శ్రద్ధలతో తయారు చేసుకోండని” చెప్పి ధ్యానమగ్నుడైనారు.
                                   
ఇది అంతా విని సంజమ్మ స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ ఉన్నవారు ఆమె ముఖం మీద నీల్లు చల్లగా కళ్ళు తెరచి “స్వామీ మీరు సమాధిస్థితి పొందినచో నేను ఎలా ఉండగలను. ఎవరికి సేవచేసుకోను” అని చెప్పి బాధపడగా స్వామివారు ”నీవు బాధ పడవద్దు. నేను సమాధి స్థితి పొందిననూ, ఎక్కడికీ పోను. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకొనెదను. మీరు పిలిచిన వెంటనే పలికెదను. నీవు పెంచిన కొడుకు (పక్కీరప్ప)కు పెళ్ళి చేసి వానికి కావలసినవి అన్ని సమకూర్చిన తర్వాత దేహమును విడిచెదవు. నీ సమాధి నా సమాధి కన్నా ముందు భాగంలో ఉండి, నా కొరకు వచ్చే భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకుంటారు. నా కీర్తి ఉన్నంతవరకు నీ కీర్తి ఉంటుంది.. నీవు దిగులు పెట్టుకోక నన్ను సమాధిలోకి వెళ్ళనివ్వు.” అని చెప్పెను. “స్వామీ పక్కీరప్ప ఏ రీతిగా బ్రతుకగలడు. వానికి ఏ ఆధారమూ లేదు. ఎలా బ్రతుకు కొనసాగించును.” అని సంజమ్మ స్వామిని అడగ్గా స్వామి “ పక్కీరప్ప గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఇంటి ముందు నిలిచి భీమలింగేశ్వరుని పూజారి వచ్చినాడు. అని నాపేరు చెప్పిన వానికి కావలసినంత సంపద లభించును. పక్కీరప్ప అతని సంతతియే మా జీవసమాధి పూజాదులు నిర్వహిస్తారు. వేరే ఎవ్వరికీ అర్హత ఉండదు.” అని సంజమ్మతో చెప్పెను.
సంజమ్మ “పక్కీరప్పను నేను సాధారణంగా పెంచాను. మీరా బ్రాహ్మణోత్తములు. పక్కీరప్పకు వేదమంత్రాలూ, పూజా పూజాపద్దతులు తెలియవు కదా. ఎలా?” అని సందేహించగా, స్వామివారు “నేను పరమేశ్వరుని వలె నిరాడంబరుడను. నేను ఏ మతానికీ, ఏ కులానికీ చెందినవాడను కాదు. గొప్పవంశము వారమని కొందరు నీచ కులస్థులని హీనముగా చూడ్డం నేను సహించను. మానవులందరూ ఒకే జాతి, ఒకే కులము అని భావిస్తాను. అందరికీ అన్నపానీయాలు, ఆకలి దప్పులు సమానమే. అందువలన భక్తికొద్ది, ప్రేమకొద్ది ఎవరు ఏది నైవేద్యముగా ఇచ్చినా నేను స్వీకరిస్తాను. మీరు ఏది ఇష్టంగా స్వీకఇస్తారో అదే నాకు నైవేద్యంగా సమర్పించవచ్చు. మీరు చేసినదే పూజ. పలికినదే నాకు మంత్రము అగును. నేను సర్వసామాన్యున్ని కాను. ద్రాక్షారామ భీమేశ్వరుని వర పుత్రుడిని. వేములవాడ భీమలింగేశ్వరుడను. నన్ను భక్తిప్రపత్తులతో కొలిచినవారి భక్తికి మెచ్చి నేను నా సమాధి నుండే పలుకుతాను. కాపాడుతాను. నా మాటలు ఖచ్చితమైనవి. పొల్లుపోవు” అని మాటిచ్చి సంజమ్మ సందేహాలను తీర్చారు. ఊరిలోని పెద్దమనుషులు స్వామివారి సమాధిపనిలో నిమగ్నమయ్యారు. అందరూ వారివారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించసాగారు. స్వామి సమాధిలోనికి పోయిన మనకు దిక్కెవరనుకుంటూ, అందరూ స్వామివారు ఏమి వాక్కు చెబుతారో, ఏమి సందేశము ఇస్తారో అని ఎక్కువ సమయం స్వామివారి దగ్గరే గడిపేవారు. స్వామివారు ఆధ్యాత్మిక సంగతులను చెబుతూ, వారిలో భక్తిభావములను పెంపొందించేవారు. రోజులు దగ్గర పడేకొద్దీ ఊరిలోని వారు గుంపులు గుంపులుగా వచ్చి స్వామివారి ఉపదేశాలను వినేవారు. సమాధి పనులు అన్నీపూర్తీ అయ్యక ఊరిపెద్దలు స్వామితో “ ఇంకా ఏమి చేయమందురు” అని అడగగా స్వామి వారితో “విభూది పండ్లు, రుద్రాక్షమాలలూ, బిల్వపత్రి, ఇంకా సుగంధద్ర్వ్యాలూ, ఆవు పంచితమును తెప్పించి” తరువాత మఠాధిపతులను(లింగాయతులను) పిలిచి వారితో ”అఖండ అభిషేకము చేయించి, సమాధిలో బిల్వపత్ర ఆకులను పరిచి, విభూధి, రుద్రాక్షమాలలను తెచ్చి సంజమ్మకు ఇవ్వండని చెప్పెను. స్వామి సంజమ్మను పిలిచి సమాధి కుడిభాగమున వేపచెట్టు వద్ద ఆవునుగ్గులతో ఒక దాలిని (నుగ్గులను గుంపుగా పేర్చడం) నిప్పు పెట్టమని చెప్పెను.
                స్వామి సమాధిలోనికి వెళుతున్నారని అది చూడడానికి ఊరి జనం, చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. స్వామి ధ్యాననిమగ్నుడై ఉన్నారు. స్వామి ఒంటినిండా విభూధి రేకులతో మెడలో రుద్రాక్షమాలలు ధరించి, కుడిచేతిలో జపమాలను, ఎడమచేతిలో దండమునుపట్టుకొని ధ్యాననిమగ్నుడై చూచుటకు అపరరుద్రుని వలె తేజోవంతముగా కనిపించుచున్నాడు. అందరూ స్వామివారిని తదేక దీక్షతో చేతులు జోడించి నిల్చున్నారు. ఆషాడ శుద్ధ దశమినాడు శుభఘడియలలో స్వామివారు “ సంజీవా! జ్యోతిని ప్రజ్వలింపచేసి సమాధి ముందు భాగమున పెట్టుము. దాలిలోని కాల్చిన  భస్మమును ఒక కుందలో తీసుకునిరమ్మని ఆనతిచ్చెను. సంజీవమ్మ స్వామి చెప్పినది తూచ తప్పకుండా భక్తిశ్రద్ధలతో చేసినది. అప్పుడు స్వామి కన్నులు తెరచి గంభీరస్వరంతో ఇప్పుడు ప్రజ్యలింపచేసిన జ్యోతిని రేయింబవళ్ళు వెలుగుతూ ఉండేలా చూచుకొనవలెను. నేను సమాధిస్థితి పొందిన తర్వాత సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజా కార్యక్రమాలనూ, నిత్యనైవేద్యములను జరుపవలెను. వీటికి ఏలోటు రానీయకుండా చుసుకొనమని చెప్పి, సంజీవమ్మ తెచ్చిన భస్మమును తన అంగాంగాలకు రాసుకొని, మిగిలిన భస్మమును “సంజీవా దీనిని ఎప్పుడూ నా జీవసమాధి ఎదుట పెట్టవలెను. ఎందుకనగా ఇది నా అంగాంగాలకు రాయబడినది కనుక ”అంగారు” అని దీనిని పిలుస్తారు. ఇంకా భస్మము గురించి ఇలా చెప్పారు. భస్మము ఎప్పటికీ రూపాంతరము చెందనిది. శాశ్వతమైనది. శాశ్వితమైనది అని చెప్పబడేది పరమేశ్వరునికి చెందినది. పరమేశ్వరునికి ప్రియమైనది. అందువలననే ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా భస్మమును శరీరానికి రాసుకుని ఉంటాడు. నా భక్తులు ఏ బాధతో వచ్చినా, ఎక్కడ బాధ కల్గినదో అక్కడ అంగారు రాసుకుని, నన్ను స్మరించుకుంటూ, నొసటన బొట్టు పెట్టుకొని చిటికెడు నోటిలోనికి వేసుకొనిన వారి బాధలు వెంటనే ఉపశమనం కలుగును.” అని చెప్పారు.


                గంభీరస్వరంతో పలికి “నేను ద్రాక్షారామభీమేశ్వరుని కుమారుడను భీమలింగేశ్వరుడను నా మాటలు పొల్లుపోవు. నేను సమాధిలోకి వెళ్ళిన  10 ఘడియలకు పైన మూత చేయుము. మరలా 6 మాసములకు మూత తొలగించిచూడుము” అని చెప్పి సమాధిలోనికి పోయెను. ప్రజలందరూ “జై భీమలింగా! జై భీమలింగా!” అంటూ విజయధ్వనులు చేస్తూ అక్కడే ఉండిరి. తరువాత 10 ఘడియలకు  స్వామివారి సమాధి మీద మూతవేసి పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వాటితో  అభిషేకము చేసి, విభూధితో సమాధికి బొట్లు పెట్టి, బిల్వపత్రి, పువ్వులతోనూ అలంకరించి మఠాధిపతులు పూజలు చేసారు.

 లెక్కకు మిక్కుటముగా టెంకాయలు కొట్టి, హారతులిచ్చారు. స్వామివారి సమాధి ఘట్టమును చూడడానికి వచ్చిన వారందరూ అక్కడే ఉండి 5 రోజులు రేయింబవళ్ళు అఖండభజనలు జరిపించారు. ఐదురోజులుగా అఖండభజనకు వచ్చిన వారికి షడ్రసోపేతముగా భోజనాదులను ఏర్పాటు చేసారు. ఆషాఢఫూర్ణిమ రోజునాటికి అందరూ స్వామి కార్యాన్ని ఘనంగా విజయవంతంగా జరిపించినందుకు ఒకప్రక్క సంతోషముతో, మరోప్రక్క స్వామివారు ఇక మనకు కనపడరు అన్న దిగులుతో వారివారి ఇండ్లకు వెళ్ళిపోయారు.

 ఆ తర్వాత ఆ ఊరి పెద్దలందరూ సంజమ్మ, పక్కీరప్పలతో “మీకు కాలసినవన్నీ ఊరి ప్రజలే చూసుకుంటారు. మీరు స్వామివారి ధూపదీప నైవేద్యాలకు లోటురాకుండా చూసుకుంటూ సేవ చేసుకొండని చెప్పి” నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తర్వాతి కాలములో దేవాలయమును నిర్మించడం జరిగింది.

7. గడేకల్లు గ్రామములో సచ్చిన ఎనుమును బ్రతికించడం


గడేకల్లు గ్రామము నందు శివాచార మతస్థులు(లింగాయతులు), “దివాణము వారు” అను వారు చాలా దైవభక్తి కలవారు. వీరి ఇంట్లో ఎప్పటికి పాడి తప్పక ఉండును. ఈ ఇంట ఒక పుణ్యాత్మురాలు “దివాణం బసమ్మ” అను ఆమె ఉండేది. స్వామివారు ఆ గ్రామానికి వచ్చినప్పటి నుండీ రోజూ ఎనుము పాలు ఇచ్చుచుండెను.
ఒక దినం స్వామివారు పాల కొరకు వచ్చేలోపు ఎనుము పాలు పిండాలని చూడగా ఎనుము పాలు ఇవ్వకపోయినది. తర్వాత స్వామి వచ్చి పాలు త్రాగడానికి ఇవ్వమని అడుగగా ఆమె స్వామీ ఈ దినమున ఎనుముకు ఏమయ్యిందో పాలు ఇవ్వలేదు. స్వామివారు ఎందుకు ఇవ్వలేదు అని బసమ్మను అడుగగా “ ఆమె ఎందుకో దానికి ఏం పొయ్యే కాలము దాపురించిందో ఏమో?. ఇవ్వలేదు” అని చెప్పింది. అందుకు స్వామి వారు “నీ ఎనుముకు పొయ్యే కాలము వచ్చిందా? పోనీలెమ్మని” వెళ్ళిపోయెను.
స్వామి వెళ్ళిపోగానే గాటికి కట్టిన ఆ ఎనుము తనంతట తానే పడి చనిపోయింది. అంతటా ఆమె ఇది ఏమి అన్యాయమూ, ఈ స్వామి నీ ఎనుము పోనీలెమ్మని వెళ్ళిపోయిన వెంటనే ఎనుము సచ్చి పడిందని స్వామివారి కోసము వెతక సాగింది. ఎక్కడ చూసినా ఆయన కనపడక పోవడంతో ఆ సచ్చిన ఎనుమును గారె వాడికి ఇచ్చివేసింది. అప్పుడు సాయంత్రము అవ్వడంతో ఆ గారెవాడు ఆ ఎనుమును ఏమి చెయడానికి వీలులేక ఒక చోట భద్రంగా ఉంచినాడు. మరుసటి రోజున వాడు దానిని కోసి భాగముల ప్రకారము కుప్పలు వేయగా, అదే సమయమున అదే ఇంటికి పోయి పాలు ఇవ్వమని అడుగగా ఆమె నిన్నటిరోజున స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం చెప్పింది. స్వామి వారు ఆమెను ఎనుమును చూపించమని, బ్రతికిస్తానని చెప్పినా, ఇప్పటికే గారెవాడు దానిని కోసి కుప్పలుగా వేసి ఉంటాడు. ఇక లాభం లేదని లోపలికి వెళ్ళిపోయింది.
స్వామివారు గారెవాడి ఇంటి వద్దకు వెళ్ళి చూడగా అప్పటికే వాడు కుప్పలుగా కోసి భాగములు వేసి ఉండడం చూసి ఆ కుప్పలనూ, దాని చర్మం, కొమ్ములూ, గిట్టలనూ ఒక చోట వేయించి స్వామివారు తన బెత్తముతో స్పృశించగానే ఎనుము యధాప్రకారము లేచి వచ్చింది. ఆమె ఆ ఎనుమును చూసి గారె వాడిని విచారించగా “ జరిగిన వృత్తాంతమునంతా చెప్పాడు.

నాటినుండీ ఆ ఇంటి వారు కూడా స్వామివారికి భక్తులై నడుచుకొనేవారు. 

స్వామి వారి మహిమలను గడేకల్లు గ్రామస్థులే కాక, చుట్టుప్రక్కల ప్రాంతముల వారు, బళ్ళారి, గుంతకల్లు, వాటి చుట్టూ ఉన్న పల్లెలు, బెల్డోణ, ఏరూరు, పెంచులపాడు, విడపనకల్లు,, కడదరపెంచి, గుమ్మనూరు, తోరణగల్లు మొదలైన ప్రాంతాలలో చెప్పుకొవడంతో, స్వామివారిని చూసెందుకు తండోపతండాలుగా వచ్చెవారు. తన వద్దకు వచ్చిన ప్రతి భక్తునకు, భక్తురాలికి, చిరునవ్వుతో సమస్యలని పరిష్కరించేవారు. అలా స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు స్వామి వారిని ఇలవేల్పుగా కొల్చుకునెవారు.


అయితే కొందరు పెద్దలు ఈ సంఘటన చాబాల గ్రామములో సంజమ్మ ఇంటజరిగిందని, స్వామి వారి మహిమ చూసిన సంజమ్మ సంసారబంధములను వదులుకొని గురుసేవ నిమిత్తo స్వామివారిని అనుసరించిందని, ఎన్నో పరీక్షల అనంతరం స్వామి వారు సంజమ్మ శిష్యురాలిగా అంగీకరించారని మరో కథనము.





6. తంబరహళ్ళి కరణం గారికి సంతాన భాగ్యమును కలుగచేయుట



రాయచూర్ జిల్లాలో “తంబరహళ్ళి” అను గ్రామము కలదు. ఆ గ్రామమునకు కరణముగా ఉండిన బ్రాహ్మణ వంశస్థులు వీరప్ప అను అతనికి సంతానము లేకపోయెను. వీరప్ప ఎన్నో విధాలుగా దైవకార్యాలు చేసిననూ, దేవతలను ప్రార్థించిననూ సంతానము కలుగలేదు. వారు ఇక తమకు సంతానం కలిగే భాగ్యమే లేదా అని బాధపడేవారు. అపుడు భీమలింగేశ్వరస్వామి వారి మహిమల గురించి అక్కడక్కడా  చెప్పుకొనడం విని వారు గడేకల్లుకు వచ్చారు. స్వామివారితో తమ ఆవేదన చెప్పి సంతానము కోసం వేడుకున్నారు. అంతటా స్వామి వారిని ఆశీర్వదిస్తూ సంతానప్రాప్తి తప్పక కలుగును (సంతాన సిద్ధి ప్రాప్తిరస్తూ) అని దీవించి, తన వద్ద ఉన్న ఒక అరటిపండును తీసి కరణం భార్యకు ఇచ్చారు. భార్యాభర్తలిరువురూ స్వామి వారికి పాదాభివందనము చేసి వెళ్ళిపోయారు. తరువాత కొంతకాలానికి వీరప్ప భార్య గర్భమును ధరించినది. నవమాసాలు నిండిన తర్వాత ఒక పుత్రుడిని ప్రసవించింది. స్వామి అనుగ్రహము వలననే సంతానము కలిగినందుకు ఆ అబ్బాయికి స్వామివారి పేరైన “భీమలింగ” అని నామకరణము గావించారు. తమ కోరిక నిరవేరినదని తమ యోగ్యతకు తగిన విధంగా సత్పురుషులకు దానధర్మాలు చేసి చాలా ఆనందముగా ఉండేవారు.  

5. శ్రీ భీమలింగేశ్వరస్వామి మెండి గొడపై స్వారి చేయడం


                ఇలా స్వామి వారి గురించి ఆ నోటా ఈ నోటా ప్రజలు చెప్పుకొనుచుండగా గడేకల్లుకు ఈశాన్యమున 10 మైళ్ళదూరాన చిప్పగిరి అను గ్రామము ఉంది. ఆ గ్రామములో పీరుజాతివారు కొన్ని తాంత్రిక విద్యలయందు ప్రసిద్ధి. స్వామి వారి పేరుప్రఖ్యాతులు విన్న వీరు, అసూయతో ఈతను చాలా ప్రసిద్ధి చెందుచున్నాడు, కావున ఇతనిని ఎలాగైనా భంగపరచి, అడ్డుతొలగించుకోవలెనని లేనిచో తమ కీర్తి తగ్గిపోవుననీ భయపడి కుతంత్రము పన్నిరి. అది ఏమనగా వీరు ఒక మల్లెపూలవస్త్రమును పుష్పములతో తయారుచేసి అందులోని ప్రతి మల్లెపువ్వులో తము నేర్చిన యావత్తు తంత్రవిద్యను కల్పించి, ఈ మహాత్ముని సన్నిధానమునకు రావడానికి గాను ఒక పెద్దపులిని వాహనముగా, అధిరోహనము చేసి పల్లెంలో తాము తయారు చేసిన మంత్రపూరితమైన వస్త్రాన్ని ఉంచుకొని, అంగరంగవైభవంగా మేళతాళాలు సూర్యచంద్ర సురిటీలూ, నగారాలతో గడేకల్లు బయలు దేరారు.
వీరు మార్గమధ్యమున ఉండగానే, స్వామి తన దివ్యదృష్టితో గమనించి, సంజీవమ్మను పిలిచి “సంజీవి! చిప్పగిరిగ్రామము నుండి నన్ను సత్కరించడానికి పీరుజాతివారు వస్తున్నారు. వారికోసం పొలం వెనుకపడి ఉన్న సద్దచొప్పను తీసుకు వచ్చి ఉంచమని” చెప్పి, గ్రామస్థులు కొద్ది మంది చూస్తుండగా స్వామివారు ఒక మొండిగోడపై కూర్చొని వాయువేగమున పీరుజాతివారికి ఎదురేగి గ్రామానికి ఆహ్వానించారట.

        అంతలో సంజీవమ్మ సద్దచొప్పను కుప్పగా వేసి ఉంచెనట. అప్పుడు పీరు జాతివారు, స్వామి మీ కోసము పూలవస్త్రమును తెచ్చామన్నారు. మీరు దీనిని ధరించవలెనని కోరినారు. మరియు ఒక జాడీ సారాయి తెచ్చి పుచ్చుకోగలరా అని అడిగారు. అప్పుడు స్వామి వారు ఆ సారాయి మొత్తమూ తాగినారట. స్వామి మత్తులో ఉన్నరని తలచి, ఒక మణుగు సీసమును బాగా కాంచి దీనిని కూడా త్రాగగలరా? అని స్వామివారి నోటి యందు పోయడానికి ప్రయత్నించారట. స్వామివారు సరే అని నోరు తెరిచారట. అక్కడి గ్రామస్థులు “స్వామీ! ఆ సీసమ్మును త్రాగవద్దని” ప్రార్థించారట. అప్పుడు స్వామివారు వారిని భయపడవద్దని చెప్పి ఆ సీసమంతయూ త్రాగారు. మంచి భోజనము చేసిన వారివలె త్రేపుచూ సీసమును యావత్తూ పీరుజాతివారు చూస్తుండగానే, మూత్రస్థానము నుంచి విడిచెనట. ఆ సీసము ముందు ఎలాగున్నది అలాగే ఉండటం చూసి తమ పాచికలు పారనందుకు కలత చెంది, చివరి ప్రయత్నంగా తమతో తెచ్చిన మంత్రపూరితమైన పూలవస్త్రమును స్వామివారిపై కప్పినారట. అప్పుడు స్వామివారు సంజమ్మను కుప్పగా పోసిన సద్దచొప్పను అంటించమని చెప్పారు. స్వామివారు ఆ వస్త్రముతో పాటు మంటలో  కుర్చూన్న వెంటనే ఆ మంట యందు ఛిటపటమని శబ్ధం చేస్తూ అనేకములుగా ధ్వనించుచుండగా, ఆ వస్త్రముతో పాటి వారితంత్రవిద్యలు యావత్తూ భస్మీకృతమయ్యెను. పీరుజాతివారి శక్తిహీనులై, విద్యలన్నీ కోల్పోయినవారై, ఈ మహాత్ముని సామర్థ్యమును తెలుసుకుని, మంటలో కుర్చొని ఉన్న స్వామికి సాష్టాంగ నమస్కారమును చేసి క్షమించమని ప్రాధేయపడ్డారు.”

పీరుజాతివారు తమ తప్పుని తెలుసుకుని మహాత్మా! మేము చేసిన అపరాధములను మన్నింపుము. మీరూ కూడా మాలాగా మంత్రవిద్యవల్లనే మహిమలు చూపుతున్నారని భావించి, మిమ్ము భంగపరచదలచితిమి. పొట్టకూటి కోసము చేసే విద్యలు మీ ముందు సాగవని తెలిసింది. మేము మూఢులము. మమ్ము కాపాడండి” అని స్వామి వారిని ప్రార్థించిరి. అప్పుడు ఆ  మహాత్ముడు మంటల నుండీ బయటకు వచ్చి, వారి యందు దయతో, క్షమించి, వారి జీవనోపాధి కొరకు కొంత విద్యను ప్రసాదించి పంపి వేశారట. వారు భక్తితో రెండు నగారాలను(నేటికీ దేవాలయములో ఉన్నవి) ఒక గుర్రమును కానుకగా సమర్పించుకున్నారు. ఈ నగారాలు నేటికీ స్వామివారి దేవాలయములో కనిపిస్తాయి. ఈ మహాత్మ్యమును గాంచిన గ్రామప్రజలందరూ, భీమలింగేశ్వరస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించసాగారు.

4. చాబాల గ్రామం – సంజీవమ్మ శిష్యరికం + స్వామివారు గడేకల్లు చేరుట


స్వామివారు ఊరూరు తిరుగుతూ, తనకిష్టమైన చోట ఒకటి రెండు రోజులు ఉంటూ వేరే పల్లెలకు వెళ్తూ ఉండెను. అలా అనంతపురము జిల్లాలోని చాబాలా అను గ్రామమునకు వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. పెద్దలు చెప్పిన కథనం ప్రకారం స్వామివారు ఒకరోజు కొన్ని మాంసపుముక్కలను తీసుకొని లింగాయతులు నివసించు వీధిలోని ఒక ఇంటిలో విసిరేశాడట. ఇది చూసిన వీధిలోని వారు “ఎవరో పిచ్చివాడు మాంసపుముక్కలను జంగమవారింట్లో  వేశాడట“ అని చెప్పుకుంటుండగా, ఆ ఇంట్లోని వారు ఇల్లంతా వెతికారట. అశ్చర్యంగా వారికి మాంసపుముక్కలకు బదులు నాలుగు “సిద్దోటము” పండ్లు దొరికాయట. ఆ పండ్లు ఘుమఘుమలాడే వాసనతో ఆ ప్రదేశమంతా వ్యాపించెనట. ఆ ఇంటివారు ఆ పండ్లను ఇంటి బయటికి తెచ్చి అందరికీ చూపుతూ, మీరంతా మంసపుముక్కలంటున్నారు, కానీ విసిరినది ఈ పండ్లను చూడమనిరి. అపుడు వీధిలోనివారు ”అయ్యా! ముసలాయన విసిరినపుడు మేము కళ్ళారా చూసాము. అవి మాంసపు ముక్కలు.కానీ అవి “సిద్దోట పండ్లుగా ఎలా మారాయో ఏమో ఏం మహిమ చేసినాడో “ అని ఆశ్చర్యంగా చెప్పుకోసాగారు.
స్వామి వారు భక్తులు అడిగినదానికి సలహాలిస్తూ, అనారోగ్యాన్ని తనచేతి స్పర్శతో నయము చేస్తుండెను. ఎన్నో రోజుల నుండీ నయం కాని ధీర్గవ్యాధులు సైతము స్వామివారి కరస్పర్శతో నయమయ్యేవి. కొంతమంది “మాకు సంతానము లేదు స్వామి. ఎన్ని చోట్ల తిరిగినా కలుగలేదు” అని అడిగే వారు. అపుడు స్వామి “మీకు సంతానము కలుగుతుంది“ అని ఆశీర్వదించి పంపేవారు. స్వామి పలికిన పలుకులు పొల్లుపోకుండా జరుగుతుండడం చూసిన గ్రామస్థులు స్వామివారి గొప్పతనమును కీర్తిస్తూ, ఎక్కడకూ వెళ్ళనీయక తమ గ్రామముననే ఉంచుకొనిరి. ఆ ఊరిలో అందరూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారిదాకా స్వామివారితో, వారివారి బాధలను చెప్పుకుంటూ, ఉపశమనము పొందుతూ, స్వామి వారినే దేవునిగా భావిస్తూ, పాలూపండ్లూ తెచ్చిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలకు గ్రహబాధలు, ఇతర వ్యాధులు కల్గినపుడు స్వామి దగ్గరకు తీసుకు వెళితే, స్వామి వారిని తాకిన వెంటనే ఆ పిల్లలు సంతోషంగా నవ్వుతూ తిరిగి వెళ్ళేవారు.
                  గురువు త్రిమూర్తి స్వరూపుడు. నిరాకారుడైన భగవంతుడు సాకారుడై సద్గురువు రూపంలో భూమిపై అవతరిస్తాడు. తల్లిదండ్రులు తనువునిస్తారు. పెంచి పోషిస్తారు. కానీ ప్రారబ్ధాన్ని తప్పించలేరు. కానీ సద్గురువుల అనుగ్రహానికి పాత్రులైనవారు ఈ కష్టనష్టాలను అధిగమించగలరు. కల్పవృక్షమూ, కామదేనువూ కోరినవి మాత్రమే ఇవ్వగలవు. గురువు వాటితో పాటి ముక్తిని కూడా ఇవ్వగలడు. గురువు లేకుండా మోక్షం కలుగదు. గురువు మూలంగానే సదనద్వివేకము, భక్తి వైరాగ్యాలు, జ్ఞానము, వాటిద్వారా మోక్షము సిద్ధిస్తుంది. అట్టి సద్గురువును సేవించిన ఆదర్శశిష్యురాలు సంజీవమ్మ. ఈమె దృఢమైనభక్తి, అచంచలవిశ్వాసములతో త్రికరణశుద్ధిగా శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామిని సేవించింది. పూజించింది. సూర్యచంద్రులున్నంత కాలం, స్వామి పేరు నిలుచున్నంతకాలం చిరస్థాయిగా నిలిచి పూజలందుకొనేలా వరము పొందింది.

                చాబాల గ్రామంలో బెస్తకులానికి చెందిన సంజీవమ్మ అను ఆమె ఉండేది. ఆమెకు పరమేశ్వరుడంటే అపారమైన భక్తి. ఊరి వారందరూ స్వామివారి మహిమను కీర్తించడం విని ఆమె ఆ మహానుభావుని ఒకసారి చూడడానికి స్వామి వద్దకు వెళ్ళింది. స్వామి వద్దకు వచ్చిన భక్తులు తమతమ సమస్యలను ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటుండగా, ఆమె స్వామితో మాట్లాడ్డమాలస్యమయ్యింది. ఈ సమయమంతా స్వామివారి దివ్యతేజస్సును చూస్తూ నోరు మెదపక నిలబడింది. చివరికి స్వామివారి దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేసి ఏమీ మాట్లాడక నిలబడి ఉండెను. అప్పుడు స్వామి సంజీవమ్మను చూసి “నీవు మనసులో ఆందోళన పడుతున్నావు. ఏమీ ఫర్వాలేదు. నిదానముగా ఉండమనెను. స్వామివారి వాక్కులు వేదవాక్కులుగా తోచి, సంజీవమ్మ ఒక పక్కగా నిలబడి ఉండెను. అపుడు భార్యాభర్తలు నెల పిల్లవాన్ని ఎత్తుకువచ్చి స్వామివారి పాదాల చెంత పరుండబెట్టి, స్వామీ మీ వరంతో పుట్టిన ఈ బిడ్దకు మీరే  నామకరణముచేసి ఆశీర్వదించమని వేడుకొనారు. స్వామి ఆ బాలునికి భీమన్న అని నామకరణం చేసి ఆశీర్వదించి వారిని పంపారు. ఇదంతా చూస్తూ నిలబడిన సంజీవమ్మను, స్వామి పిలిచి ఏమి కావలెనమ్మా? అని ప్రశ్నించారు.  అపుడామె “స్వామీ! మీ దర్శనభాగ్యము కలిగినది. ఇంక నాకేమి కావలెను. మిమ్మల్ని చూస్తూంటే సక్షాత్తు ఆ పరమేశ్వరున్ని చూసినంత ఆనందము కలిగినది. పోయి వచ్చెద”నని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన సంజమ్మకు ఏ దేవుని పటము చూసినా స్వామి రూపమే గోచరించేది. ఒకరోజు సంజీవమ్మకు స్వప్నములో పరమేశ్వరుడు కనిపించి కొద్ది సేపటికి స్వామి రూపముగా కనిపించాడట. అప్పటి నుంచి ఆమె పరధ్యానంగా ఉంది. ఇది చూసిన కొడుకులు “అమ్మా! కొద్ది రోజులనుంచి నీవు పరధ్యానముగా ఉంటున్నావు. పిలిచినా పలుకవు. గట్టిగా పిలిస్తే ‘ఆ’ అంటావు. కారణమేమిటని అడిగారు. అప్పుడు ఆమె భర్త “ మీ అమ్మకు ఊరిలో స్వామివారిని దర్శించినప్పట్నుంచి పరమేశ్వరుని రూపము కనిపిస్తోందట” అని చెప్పి స్వప్నములోని వృత్తాంతమును కూడా చెప్పాడు. అప్పుడు సంజీవమ్మ “ అవును నాయనా! ఈ సంసారమూ, బంధములూ ఏవీ మనసుకు రావట్లేదు. వేదాంత ధోరణితో మనసంతా నిండిపోయింది. ఏపని చేయడానికీ మనసు అంగీకరించట్లేద”ని చెప్పి పరధ్యానములో మునిగింది.

ఇలా కొంతకాలము తర్వాత స్వామివారు చాబాల నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలిసిన సంజమ్మ చాలా బాధతో నాకు భర్తా, కొడుకులూ కోడల్లతో “ నాకు ఈ సంసారబంధములు వద్దు. ఇన్నేళ్ల నా పూజలు పలితంగా సాక్షాత్తు సకలలోకాలకూ తండ్రి అయిన పరమేశ్వరుడే నాకు దర్శనభాగ్యమిచ్చారు. ఈ మిగిలిన జీవితం ఆ భీమలింగేశ్వరుని సేవతో తరించాలనుకుంటున్నాను. ఆ మహానుభావునికి శిష్యురాలిగా, నేను కూడా ఆయన వెంట వెళ్తానని” చెప్పింది. ఇక ఆమె భర్త కూడా సంజమ్మ మనము ఎంత చెప్పినా వినదని స్వామి దగ్గరకు పిలుచుకు వచ్చి జరిగిన విషయమంతా స్వామివారికి చెప్పారు. స్వామివారు సంజీవమ్మతో “అమ్మా! పిల్లలను,కోడల్లనూ భర్తను వదిలి రావడము నీకు క్షేమము కాదు. మేము ఒక చోట స్థిరముగా నివసించే వారము కాదు. మా గమ్యస్థానమును చేరుదాకా మా ప్రయాణము ఆగదు. మా మాట విని నీవు భర్త పిల్లలతో ఉండమ్మ” అని చెప్పి వారించారు. అయినా సంజీవమ్మ మాట వినకపోవడంతో ఇక చివరకు చేసేదేమీ లేక ఆమె భర్త పిల్లలూ స్వామివారి దగ్గరకు వచ్చి “స్వామీ మా అమ్మ ఎవరు చెప్పినా వినదు. మీ శిష్యురాలుగా ఉండడానికి నిశ్చయించుకున్నది. దయచేసి మీ శిష్యురాలుగా స్వీకరించండి. ఎక్కడ ఉన్నా ఆమె సంతోషము, క్షేమమే మాకు ముఖ్యము” అని చెప్పారు. స్వామివారు కొంతసేపు ఆలోచించి “ఈమె నా శిష్యురాలుగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కీర్తించబడుతుంది. మీరు కూడా పిల్లా పాపలతో ఉన్నతస్థాయికి ఎదిగి మీ కుటుంబము వృద్ది చెందుతుంది” అని వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ తరువాత స్వామి వారు శిష్యురాలిగా సంజమ్మకు ఎన్నో పరీక్షలు పెట్టాడు. తిండి తిప్పలు పట్టించుకోకుండా, కొండలూ, గుట్టలూ ఎక్కుతూ దిగుతూ, ముళ్ళదారులూ దాటుకుంటూ పరుగులు తీసాడు. సంజమ్మ అన్నిటికీ తట్టుకొని స్వామివారిని అనుసరించింది.
స్వామివారు గడేకల్లు చేరుట

చాబాల నుంచి మొదలైన కాలినడక పుణ్యప్రదమైన గడేకల్లు చేరి చౌడమ్మ కొండకు కొంతదూరంగా ఉన్న చెరువు గుంట వద్ద దాకా సాగింది. అక్కడ నివాసస్థలమును ఏర్పరచుకొని ఉండెను. సంజమ్మ స్వామివారి భోజనానికి కావలసిన వంటపదార్థాల కోసం గ్రామానికి వస్తూ పోయేది. ఇది గమనించిన ఊరివారు సంజమ్మను ఎవరు మీరని ఎక్కడినుంచి వచ్చారని విచారించారు. సంజమ్మ “ద్రాక్షారామ భీమేశ్వరుని వరప్రసాది వేములవాడ భీమలింగేశ్వరుడు ఈ ఊరి చివరనున్న చెరువు గుంత వద్ద విడిది చేసారు. నేను ఆయన శిష్యురాలిని. స్వామిసేవ నిమిత్తమై నేనూ ఇక్కడే ఉంటున్నానన్నది. అప్పటికే స్వామి మహిమలను, ఆ నోటా ఈ నోటా విన్న గ్రామప్రజలు, స్వామి తమ వూరికి వచ్చారని విని, వారిని చూడానికి వచ్చారు. స్వామితో మీకేమైనా కావలసినచో సమకూర్చెదము అని చెప్పారు. స్వామివారు తన దర్శనానికి వచ్చేవారికి భగవంతుని ఓన్నత్యాన్నీ, భగవంతున్ని ఎలా ఆరాధించాలో, ఎలా బ్రతకాలో చెప్పేవారు. పిల్లలకు, పెద్దలకు జ్వరాలు వచ్చినా స్వామిని అశ్రయించేవారు. ఆయన మాటలను తూచాతప్పకుండా పాటించేవారు.
గడేకల్లులో స్వామివారు చౌడేశ్వరి కొండపై ధ్యానం చేసిన చోటు


3. శ్రీభీమలింగేశ్వరస్వామి బెల్డోణ చెరుట – అక్కడ చూపిన మహిమలు

స్వామి వారు బెల్డోణ చెరుట – అక్కడ చూపిన మహిమలు

స్వామివారు నాటి కందనవోలు నేటి కర్నూలు పట్టణంలో, తుంగభద్ర నదీతీరాన కోంత కాలం తపస్సును గావించారని, ఇదే జిల్లాకి చెందిన ఆలూరు పట్టణం, రామదుర్గం గ్రామాలలో కూడా కొంతకాలము తపస్సు గావించారని, తపస్సు గావించిన స్థలంలోనే స్వామివారికి ఆలయం కూడా నిర్మించారని చారిత్రక అధారాలు చెబుతున్నాయి. స్వామివారికి సంజీవమ్మ శిష్యురాలు అవకముందు, గడేకల్లు (గడియాద్రిపురము) చేరకముందు  బెల్డోణ గ్రామములో చాలా కాలము ఉన్నారు. పెద్దల నుంచి చెప్పబడుతూ వచ్చిన కథనం ప్రకారం స్వామి వారు బెల్డోణ గ్రామమును దర్శించినపుడు మొఘలాయిలు (సూమారు క్రీ.శ 1690-1700 ప్రాంతంలో) ఏలుతున్న రోజులవి.

ఆ గ్రామంలో  తిరుగుతూ ఎవరైనా పిలిచి అన్నము పెడితే తినేవారు. లేదంటే తినకుండానే ఉండేవారు. ఒకరోజు  ఈ ఊరికి భూస్వాములుగా ఉన్న మారాతి వెంకప్ప ఇంటికి వెళ్ళారు. ఇంటి ఎదురుగా నిలబడి “అమ్మా నాకు ఆకలిగా ఉంది. అన్నం పెట్టవా? ” అని స్వామి వారు అడిగితే, అప్పుడు మారాతి వెంకప్ప భార్య “ఇంట్లో అన్నము లేద”ని అబద్దము చెప్పింది, ఇది తెలిసిన స్వామివారు ఆమె మాట పట్టించుకోకుండా ఆ ఇంటి ముందే నిలబడ్డారు. ఆమె భర్త మారాతి వెంకప్ప పొలము నుండి వచ్చాడు. ఆమె భర్తతో ఈ ముసలాయన అన్నం లేదన్నా పట్టించుకోకుండా పొద్దున్నుంచి ఇలానే నిలబడి ఉన్నాడని చెప్పింది. అతను తన భుజముపై ఉన్న చాలుకోలు తీసి “ఇక్కడి నుంచి వెళ్తావాలేదా”  అంటూ స్వామి శరీరమంతటా వాతలు పడేలాకొట్టాడు. స్వామి మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయారు.
స్వామి వారు అలా వెళ్ళారో లేదో వెంటనే ఆ మారాతి వెంకప్ప ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్ని వాతలు అతని శరీరము మీదపడి ఎర్రగా కందిపోయాయి, అతనికి భరించరాని నొప్పి అవ్వడంతో వైద్యున్ని సంప్రదించి మందులు వాడాడు. అయిన ఫలితం కానరాకపోగా అతనికి మంటలు పదిరెట్లు ఎక్కువయ్యాయి.

చివరకు ఆ ముసలాయనను వెతికి పిలుచుకురమ్మని మనుషులను పంపారు. కానీ స్వామివారు ఎక్కడా కనపడలేదు.  ఇక ఈ బాధను ఓర్చుకోవడం చేతకాక ఒక పిడిబాకుతో రొమ్ముకు గుద్దుకొని ప్రాణము తీసుకుందామని చేయి పైకి ఎత్తగా  వెంటనే స్వామి \వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అతన్ని ఆపారు. స్వామి వారి స్పర్శతో అతని శరీరము అంతా చల్లగా మారి యధాస్థితిని పొందింది. మారాతి వెంకప్ప స్వామివారికి సాష్టాంగ నమస్కారము చేసి “ఆసామిని అయ్యి ఉండి కూడా ఆకలి అంటూ వచ్చిన మీకు ఆన్నం పెట్టకపోగా దారుణంగా కొట్టాను. అందుకు నన్ను క్షమించండి” అని వేడుకున్నారు. ఆ రోజు నుంచి వారే స్వామివారి భోజనాదులు చూసుకొనేవారు. స్వామి వెంకన్న కుటుంబంతోనే ఉంటూ వారి ఇంట్లో పశువులను కాసేవారు. అప్పటి నుండి పశువులు పాలు బాగా ఇస్తూ, వారి పాడిపంటలు బాగా వృద్ధి చెందాయి.

ఒకసారి ఎప్పటిలాగే మొఘలాయిలు బెల్డోణ గ్రామమును ముట్టడించారు. ప్రజలనుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిని చూడగామే మారతి వెంకన్న తన ఇంటికి తలుపులు వేసుకున్నాడు. ఇది గమనించిన మొఘలాయిలు వెంకన్న ఇంటి తలుపులు బలంగా తట్టారు. వెంకన్న తలుపులు తీయలేదు. బలవంతంగా తలుపులు తీయడానికి ప్రయత్నించారు. అదీ జరగకపోవడంతో వారు మొండిపట్టుదలతో ఎన్ని రోజులని ఇలా తలుపులు వేసుకొని లోపలే ఉంటారో చూద్దాం అని ఆ ఇంటి బయటే డేరాలు వేసి మనుషులను కాపలా ఉంచారు.

                నాలుగైదు రోజుల తర్వాత వెంకన్నఇంట్లో నీరు అయిపోయాయి. ఒక వైపు ఇంట్లోని పశువులు, పసిపిల్లలు త్రాగడానికి నీరులేక ఇబ్బంది పడ్డారు. తలుపులు తీసి మొఘలాయిల చేతిలో ప్రాణాలు విడువడం కన్నా మేమే ప్రాణాలు తీసుకొనుట మంచిదని ఆలోచిస్తున్న సమయానికి స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. స్వామి వెంకన్నను మిద్దెపైకెక్కి అల్లెండ్ల(ధోనె) నుంచి నీరు పోకుండా వాటికి అడ్డంగా ఉంచి ఒకచోట రంధ్రం పెట్టమని చెప్పారు. అతను అలానే చేసాడు. అతను ఇంట్లోనికి రాగానే అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆ ఒక్క ఇంటిపై మాత్రమే అద్భుతమైన వర్షం కురిపించారు. రంధ్రం గుండా ఇంటిలోపలికి వచ్చిన నీటిని వారు కడవలలోనూ, బిందెలలోనూ, ఎద్దుల తొట్టెలలోనూ నింపుకున్నాక  వర్షం ఆగిపోయింది. మిగిలిన నీరంతా ఇంటివాకిలి నుంచి బయటకు ప్రవహించ సాగింది. ఆ నీరు మొఘలాయిల డేరాల క్రిందకు చేరింది. వర్షం పడిన జాడల్లేవు.  కానీ నీరు మాత్రం పారుతోంది. వారికి ఏమయిందో అర్థం కాలేదు. ఆ నీటివెంటనే నడుచుకుంటూ వెళ్ళారు. వెంకన్న ఇంటి నుంచి వస్తున్న నీటిని చూసి “ఈ ఒక్క ఇంటిపై వర్షం కురవడమా?” అని ఆశ్చర్యపోయారు. ఊరి వారిని విచారించి భీమలింగేశ్వరుడనే ఒక ముసలితాత వారి ఇంట్లో నివసిస్తున్నారని, వెంకన్న కుటుంబం ఆ మాహానుభావుని  భక్తులని, వారి లీలల వల్లనే వెంకన్న ఇంటిపై మాత్రమే వర్షం కురిసిందనివారు తెలుసుకున్నారు. మొఘలాయిలు కూడా స్వామివారిని చూడదలచి వెంకన్న ఇంటి వద్దకు వెళ్ళి “అయ్యా! మిమ్మల్ని తాకే అంత శక్తి మాకు లేదు. మీరు నీటి కోసమైనా బయటకు రాకపోతారా అనుకున్నాము. స్నయానా ఆ భీమలింగుడే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలిసింది. ఇంకా మీకు హాని కల్గించాలని తలిస్తే ఆ మహానుభావుని ఆగ్రహానికి గురి అవ్వాల్సిస్తుంది. ఇక తలుపులు తీయండి” అన్నారు. స్వామి వారు తలుపులు తీయమని చెప్పడంతో వెంకన్న తలుపులు తీసాడు.
మొఘలాయిలు “మహాత్మా వీరు మీ భక్తులని తెలియక వీరిని ఇబ్బంది పెట్టాము. మీ గురించి, మీ మహిమను గురించి విని మీ దర్శనము చేసుకోవాలని వచ్చాము.” అని చెప్పి స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయారు.
గ్రామంలోని ప్రజలతో ఒక రోజు సాయంసంధ్యవేళ భక్తికి ఉన్న శక్తిని వివరిస్తూ…చివర్లో భక్తులారా ఇక ఇక్కడి నుంచి వెళ్ళే సమయం అసన్నమైనది అని చెప్పగా..భక్తులకు ఏమియును అర్థం కాలెదు…అప్పుడు భక్తులు ఏమిటి స్వామి అని ప్రశ్నించగా ఇక్కడే మేము శాశ్వతముగా ఉండుటకు వీలులేదు, ఇది మా స్థానం కాదు అని చెబుతూ… మేము తపస్సు గావించిన స్థలంలో మా పళ్ళతో తోమిన వేపపుల్లను నాటుతాం అది ఎక్కడైతే చిగిరిస్తుందో అక్కడ మేము జీవసమాధి పొందాలని సంకల్పించాం అని చెప్పగానె అక్కడ ఉన్న ఆశేశ భక్త వాహిని ఒక్కసారిగా మూగబోయింది, ఓం నమో శ్రీ భీమలింగేశ్వరాయ నమః, జై భీమలింగ, ద్రక్షారామ భీమేశ్వర వరపుత్ర పాహిమాం అంటూ భక్తులప్రార్థనలు, అర్థనాదాలు మిన్నంటాయి. అప్పుడు స్వామివారు ఒక్క నిమిషం మేము చెప్పెది విన్నండి. ఇదిగో నా పాదుకలు, ఈ పాదుకలు ఉన్నచోట నేను ఉంటానని, నన్ను నమ్మి కొలిచినవారి కష్టాలను తీరుస్తానని అభయమిచ్చి” వెళ్ళారు. తరువాత మారాతి వంశస్థులు ఆ పాదుకలను సమాధి చేసి స్వామివారికి ఒక ఆలయం కట్టించి నిత్యధూపదీపనైవేద్యాలతో పూజలను జరిపించేవారు. అప్పట్లో స్వామివారు బస చేసిన మారాతి వెంకన్న వంశంవారు దేవాలయబాధ్యతను నిర్వహించేవారు, పూజారులుగా వ్యవహరించేవారు. కొన్ని సంవత్సరాల తరువాత స్వామి వారు గడియాద్రిపురం (నేటి గడేకల్లు)ల్లో జీవసమాధి నోందారు అని విన్న బెల్డోణ గ్రామ ప్రజలు, అందరూ కలిసి స్వామి వారి దర్శనార్థం గడేకల్లుకు బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన బెల్డోణ గ్రామవాసులకు స్వామి పుజారులుగా ఉన్న బెస్తవారు సాధర స్వాగతం పలికారు. గడేకల్లు గ్రామంలో జీవసమాధినోందిన వృత్తాంత్తాన్ని స్వామివారి పూజారులు బెల్డోణ వాసులకు వివరించారు. స్వామి వారి జీవసమాధి వృత్తాంత్తాన్ని విన్న బెల్డోణ గ్రామవాసులు…మా గ్రామంలో కూడ మీరే స్వామివారికి పూజారులుగా వ్యవహరించాలి అని విన్నవించుకోగా… స్వామివారి పూజారులు అంగీకరిస్తూ…మేము ఏదైతే ఆహరంగా భుజిస్తామో అదే స్వామి వారికి నైవేధ్యం పెడుతాం, బ్రహ్మణుల మాధిరిగా అర్చకత్వం చేయలేము,  అని చెప్పగా…అయ్యా మీరు సాక్షాత్ భీమలింగేశ్వరుడి అంశం అయిన ఫక్కీరప్ప వారసులు, మీరు పెట్టిందే నైవేధ్యం, మీరు చెప్పిందే మంత్రం, ఇందులో ఏటువంటి అనుమానం అక్కర్లేదు, పైగా మా గ్రామంలో తొలి పంటను మీకు సమర్పించుకున్నాకే మేము పంటను వాడుకుంటాం, అంతేగాకా మీకు మా గ్రామంలో పొలాన్ని కూడ ఇస్తాము, ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మా గురువులుగా గౌరవిస్తాం, మీ జీవనభుక్తి మా భాధ్యత అని బెల్డోణ గ్రామప్రజలు స్వామివారి పూజారులకు తెలిపిరి. వీటన్నింటికి స్వామివారి పూజారులు అంగీకరించి, దశలవారిగా బెల్డోణ గ్రామంలో స్వామివారికి పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


స్వామివారు భీమేశ్వరుడి అంశతో పుట్టడం వల్ల సోమవారము ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. బెల్డోణ గ్రామంలో ప్రతి ఏడాది చైత్రమాసములో పౌర్ణమిరోజున స్వామివారి రథోత్సవము ఎంతో వైభవంగా జరుగుతుంది. అంతేగాక స్వామి జన్మదినమైన శ్రావణ శుక్ల పంచమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.


1. గడేకల్లు శ్రీ భీమలింగేశ్వరస్వామి

This image has an empty alt attribute; its file name is image.png
11వ శతాబ్దంప్రభవనామ సంవత్సరంశ్రావణ మాసంశుక్ల పంచమిశుక్రవారము నాడు తూర్పుగోదావరి జిల్లాలో వేములవాడ అనే గ్రామానశ్రీ సోమనాథమాత్యుడుశ్రీమతి మాచమ్మ దంపతులకు ద్రాక్షరామ భీమేశ్వరుడి అంశతో పుట్టిన బాలుడుతాను పుట్టకమునుపే తండ్రిని పోగొట్టుకునితల్లినేతండ్రిగాగురువుగాప్రత్యక్షదైవంగా భావించిఅతి పిన్నవయసులోనే సకలవిద్యలను అవపోసన పట్టిన భీమన్నతదనంతర కాలంలో వేములవాడ భీమకవిగా విశ్వఖ్యాతిని పోందారు. వీటికి సంబందించిన విషయాన్ని మనం  చదివాం.

ఒకసారి వేములవాడ గ్రామంలోని బ్రహ్మణుల ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు తనకు భొజనం వడ్డించకుండా అవమాన పరిచినప్పుడువారికిబుద్ధి చెప్పడానికి అన్నం అంత సున్నం అవ్వనిఅప్పడాలు కప్పలుగా మారని” చెప్పిన మాటలతో మొదలైన భీమకవి మహత్యాల ప్రస్థానం భీమలింగేశ్వరుడిగా నేటికి అప్రతితహితంగా కోనసాగుతుంది.


తండ్రిలేని వాడని ఊరంతా ఎగతాళి చెస్తున్నా ఏనాడు భీమన్న భాదపడలేదు కాని నా తండ్రి మరణాంతరం పుట్టినందుకే కదా నా తల్లిని ఊరి నుంచి వెలేసారుశివభక్తురాలైన తన తల్లికి ఏందుకు ఈ అవమానం అని మధనపడి తన తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నేను నా తండ్రి మరణాంతరం పుట్టినవాడిని అని అందరూ ఏగతాళి చెస్తున్నారుశివ భక్తురాలైన నీవే దీనికి సమాధానం చెప్పాలి” అని తల్లిని ప్రాధేయపడగా అప్పుడు మాచమ్మభీమన్నతో ఇలా చెప్పెను భీమన్నా దీనికి సమాధనం ఆ దక్షారామ భీమేశ్వరుడు మాత్రమే చెప్పగలడువెళ్ళి అడుగు అని ” చెప్పిన వెంటనె దక్షారామమునకు వెళ్ళి భీమేశ్వరుడిని ప్రార్థించిప్రసన్నం చేసుకునితన జన్మవృత్తాంత్తాన్నిఆవశ్యకతను తెలుసుకుని మరలా వేములవాడకు వెళ్ళితన తల్లి పాదాలకు నమస్కరించిజరిగినదంతా చెప్పితన జన్మ ఆవశ్యకతను తల్లికి వివరించిఒప్పించిభీమకవిగా సూమారు 400 సంవత్సరాలు(11వ శతాబ్దం – 14వ శతాబ్దం) రాజమహేంద్రవరంనెల్లూరుపావులూరుతిరుచునాపల్లికావేరీతీర నగరముచోళరాజ్యముసామర్లకోట, , కళింగకాకతీయరాజ్యముకొండపల్లిపంచపాడుయర్రగడ్డపాడుహేలాపురంవేలూరుపెద వేంగిపట్టణంపిఠాపురంసెజ్జ నగరంవంగదేశంకోరుమిల్లిగుడిమెట్టభీమవరం ఇలా వేములవాడ భీమకవిగా దేశాటం చెస్తూవివిధ రాజ్యాలు తిరుగుతూప్రజాపరిపాలనఆధ్యాత్మిక చైతన్యం పట్ల ప్రభువులకుప్రజలకు అవగాహన కల్పిస్తూకవిగా భూతభవిష్యత్వర్తమాన కాలదులను ఆక్షరాలలో బందించితెలుగుసంస్కృత భాషలకు పట్టం కట్టిరచనలో తనకు ఏవరు సాటిరారని నిరూపించి,  జగత్ ఖ్యాతిని పోందికవిరాక్షసుడిగా బిరుదాంకితుడైన తరువాత తన జన్మ ఆవశ్యకతప్రకారముభీమలింగేశ్వరుడిగా అవతరించి సూమారు 300 సంవత్సరాలు (15వ శతాబ్దం-17వ శతాబ్దం) ఈ భూ మండలంపై నడియాడి చివరగా అనంతపురం జిల్లాగడేకల్లు గ్రామంలో జీవసమాధి అయ్యారు.



 వేములవాడ భీమకవి పేరిట వ్రాసిన పుస్తకాల్లో కేవలం కవిగా మాత్రమేఅందునా కోన్ని అంశాలనే పరిగణనలోనికి తీసుకున్నారు. వేములవాడ భీమకవి ద్వితియార్థంలో శ్రీ భీమలింగేశ్వరస్వామిగా అవతరించడంతో పాటు దేశాటంలో భాగంగా పలుప్రాంతాలలో తన మహిమలను చూపిస్తూభక్తుల కోరికలను నెరవెరుస్తూనమ్మి కొలిచిన వారి పాలిట కొంగుబంగారమై నిత్యపూజలను అందుకుంటున్నారు….

పలు ప్రాంతాలలో కొంత కాలము నివసిస్తూ భక్తులలో తన ఆధ్యాత్మికబోధనలతో, జ్ఞానబోధనలతో, మూఢనమ్మకాల పట్ల స్వామివారు గట్టిగా వ్యతిరేకించి, ఇవ్వన్నీ కేవలం మానవకల్పితాలు అని చెబుతూ, ఇక్కడ పుట్టుక-చావు మధ్యలో అంతా మిథ్య అంటూ వాస్తవికతను వివరిస్తూ భక్తులలో చైతన్యాన్ని తీసుకొచ్చేవారు. స్వామి వారు కుర్చున్న ప్రాంతంలోనే లింగాణ్ణి ప్రతిష్టించి, ఈ లింగాన్ని పూజించండి, సర్వకాల, సర్వావస్థలందు నేను ఈ లింగము నందునె కోలువై ఉంటాను అని చెప్పి ముందుకుసాగెవారు.




అనంతపురము జిల్లా పెదపప్పూరు ప్రాంతాన అశ్వర్థభీమలింగేశ్వరస్వామి దేవాలయప్రాంతమున, కర్నూలు పట్టణంలో తుంగబద్ర నదీతీరాన భీమలింగేశ్వరస్వామి చాలా కాలము తపస్సు చేసినట్లు, పూర్వము ఇక్కడ స్వామి వారికి దేవాలయాలున్నట్లు, తదనంతరకాలంలో కాలగర్భంలో కలిసిపోయినట్లు చారిత్రక ఆధారలను బట్టి తెలుస్తుంది.

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...