Saturday 25 July 2020

3. శ్రీభీమలింగేశ్వరస్వామి బెల్డోణ చెరుట – అక్కడ చూపిన మహిమలు

స్వామి వారు బెల్డోణ చెరుట – అక్కడ చూపిన మహిమలు

స్వామివారు నాటి కందనవోలు నేటి కర్నూలు పట్టణంలో, తుంగభద్ర నదీతీరాన కోంత కాలం తపస్సును గావించారని, ఇదే జిల్లాకి చెందిన ఆలూరు పట్టణం, రామదుర్గం గ్రామాలలో కూడా కొంతకాలము తపస్సు గావించారని, తపస్సు గావించిన స్థలంలోనే స్వామివారికి ఆలయం కూడా నిర్మించారని చారిత్రక అధారాలు చెబుతున్నాయి. స్వామివారికి సంజీవమ్మ శిష్యురాలు అవకముందు, గడేకల్లు (గడియాద్రిపురము) చేరకముందు  బెల్డోణ గ్రామములో చాలా కాలము ఉన్నారు. పెద్దల నుంచి చెప్పబడుతూ వచ్చిన కథనం ప్రకారం స్వామి వారు బెల్డోణ గ్రామమును దర్శించినపుడు మొఘలాయిలు (సూమారు క్రీ.శ 1690-1700 ప్రాంతంలో) ఏలుతున్న రోజులవి.

ఆ గ్రామంలో  తిరుగుతూ ఎవరైనా పిలిచి అన్నము పెడితే తినేవారు. లేదంటే తినకుండానే ఉండేవారు. ఒకరోజు  ఈ ఊరికి భూస్వాములుగా ఉన్న మారాతి వెంకప్ప ఇంటికి వెళ్ళారు. ఇంటి ఎదురుగా నిలబడి “అమ్మా నాకు ఆకలిగా ఉంది. అన్నం పెట్టవా? ” అని స్వామి వారు అడిగితే, అప్పుడు మారాతి వెంకప్ప భార్య “ఇంట్లో అన్నము లేద”ని అబద్దము చెప్పింది, ఇది తెలిసిన స్వామివారు ఆమె మాట పట్టించుకోకుండా ఆ ఇంటి ముందే నిలబడ్డారు. ఆమె భర్త మారాతి వెంకప్ప పొలము నుండి వచ్చాడు. ఆమె భర్తతో ఈ ముసలాయన అన్నం లేదన్నా పట్టించుకోకుండా పొద్దున్నుంచి ఇలానే నిలబడి ఉన్నాడని చెప్పింది. అతను తన భుజముపై ఉన్న చాలుకోలు తీసి “ఇక్కడి నుంచి వెళ్తావాలేదా”  అంటూ స్వామి శరీరమంతటా వాతలు పడేలాకొట్టాడు. స్వామి మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయారు.
స్వామి వారు అలా వెళ్ళారో లేదో వెంటనే ఆ మారాతి వెంకప్ప ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్ని వాతలు అతని శరీరము మీదపడి ఎర్రగా కందిపోయాయి, అతనికి భరించరాని నొప్పి అవ్వడంతో వైద్యున్ని సంప్రదించి మందులు వాడాడు. అయిన ఫలితం కానరాకపోగా అతనికి మంటలు పదిరెట్లు ఎక్కువయ్యాయి.

చివరకు ఆ ముసలాయనను వెతికి పిలుచుకురమ్మని మనుషులను పంపారు. కానీ స్వామివారు ఎక్కడా కనపడలేదు.  ఇక ఈ బాధను ఓర్చుకోవడం చేతకాక ఒక పిడిబాకుతో రొమ్ముకు గుద్దుకొని ప్రాణము తీసుకుందామని చేయి పైకి ఎత్తగా  వెంటనే స్వామి \వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అతన్ని ఆపారు. స్వామి వారి స్పర్శతో అతని శరీరము అంతా చల్లగా మారి యధాస్థితిని పొందింది. మారాతి వెంకప్ప స్వామివారికి సాష్టాంగ నమస్కారము చేసి “ఆసామిని అయ్యి ఉండి కూడా ఆకలి అంటూ వచ్చిన మీకు ఆన్నం పెట్టకపోగా దారుణంగా కొట్టాను. అందుకు నన్ను క్షమించండి” అని వేడుకున్నారు. ఆ రోజు నుంచి వారే స్వామివారి భోజనాదులు చూసుకొనేవారు. స్వామి వెంకన్న కుటుంబంతోనే ఉంటూ వారి ఇంట్లో పశువులను కాసేవారు. అప్పటి నుండి పశువులు పాలు బాగా ఇస్తూ, వారి పాడిపంటలు బాగా వృద్ధి చెందాయి.

ఒకసారి ఎప్పటిలాగే మొఘలాయిలు బెల్డోణ గ్రామమును ముట్టడించారు. ప్రజలనుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిని చూడగామే మారతి వెంకన్న తన ఇంటికి తలుపులు వేసుకున్నాడు. ఇది గమనించిన మొఘలాయిలు వెంకన్న ఇంటి తలుపులు బలంగా తట్టారు. వెంకన్న తలుపులు తీయలేదు. బలవంతంగా తలుపులు తీయడానికి ప్రయత్నించారు. అదీ జరగకపోవడంతో వారు మొండిపట్టుదలతో ఎన్ని రోజులని ఇలా తలుపులు వేసుకొని లోపలే ఉంటారో చూద్దాం అని ఆ ఇంటి బయటే డేరాలు వేసి మనుషులను కాపలా ఉంచారు.

                నాలుగైదు రోజుల తర్వాత వెంకన్నఇంట్లో నీరు అయిపోయాయి. ఒక వైపు ఇంట్లోని పశువులు, పసిపిల్లలు త్రాగడానికి నీరులేక ఇబ్బంది పడ్డారు. తలుపులు తీసి మొఘలాయిల చేతిలో ప్రాణాలు విడువడం కన్నా మేమే ప్రాణాలు తీసుకొనుట మంచిదని ఆలోచిస్తున్న సమయానికి స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. స్వామి వెంకన్నను మిద్దెపైకెక్కి అల్లెండ్ల(ధోనె) నుంచి నీరు పోకుండా వాటికి అడ్డంగా ఉంచి ఒకచోట రంధ్రం పెట్టమని చెప్పారు. అతను అలానే చేసాడు. అతను ఇంట్లోనికి రాగానే అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆ ఒక్క ఇంటిపై మాత్రమే అద్భుతమైన వర్షం కురిపించారు. రంధ్రం గుండా ఇంటిలోపలికి వచ్చిన నీటిని వారు కడవలలోనూ, బిందెలలోనూ, ఎద్దుల తొట్టెలలోనూ నింపుకున్నాక  వర్షం ఆగిపోయింది. మిగిలిన నీరంతా ఇంటివాకిలి నుంచి బయటకు ప్రవహించ సాగింది. ఆ నీరు మొఘలాయిల డేరాల క్రిందకు చేరింది. వర్షం పడిన జాడల్లేవు.  కానీ నీరు మాత్రం పారుతోంది. వారికి ఏమయిందో అర్థం కాలేదు. ఆ నీటివెంటనే నడుచుకుంటూ వెళ్ళారు. వెంకన్న ఇంటి నుంచి వస్తున్న నీటిని చూసి “ఈ ఒక్క ఇంటిపై వర్షం కురవడమా?” అని ఆశ్చర్యపోయారు. ఊరి వారిని విచారించి భీమలింగేశ్వరుడనే ఒక ముసలితాత వారి ఇంట్లో నివసిస్తున్నారని, వెంకన్న కుటుంబం ఆ మాహానుభావుని  భక్తులని, వారి లీలల వల్లనే వెంకన్న ఇంటిపై మాత్రమే వర్షం కురిసిందనివారు తెలుసుకున్నారు. మొఘలాయిలు కూడా స్వామివారిని చూడదలచి వెంకన్న ఇంటి వద్దకు వెళ్ళి “అయ్యా! మిమ్మల్ని తాకే అంత శక్తి మాకు లేదు. మీరు నీటి కోసమైనా బయటకు రాకపోతారా అనుకున్నాము. స్నయానా ఆ భీమలింగుడే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలిసింది. ఇంకా మీకు హాని కల్గించాలని తలిస్తే ఆ మహానుభావుని ఆగ్రహానికి గురి అవ్వాల్సిస్తుంది. ఇక తలుపులు తీయండి” అన్నారు. స్వామి వారు తలుపులు తీయమని చెప్పడంతో వెంకన్న తలుపులు తీసాడు.
మొఘలాయిలు “మహాత్మా వీరు మీ భక్తులని తెలియక వీరిని ఇబ్బంది పెట్టాము. మీ గురించి, మీ మహిమను గురించి విని మీ దర్శనము చేసుకోవాలని వచ్చాము.” అని చెప్పి స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయారు.
గ్రామంలోని ప్రజలతో ఒక రోజు సాయంసంధ్యవేళ భక్తికి ఉన్న శక్తిని వివరిస్తూ…చివర్లో భక్తులారా ఇక ఇక్కడి నుంచి వెళ్ళే సమయం అసన్నమైనది అని చెప్పగా..భక్తులకు ఏమియును అర్థం కాలెదు…అప్పుడు భక్తులు ఏమిటి స్వామి అని ప్రశ్నించగా ఇక్కడే మేము శాశ్వతముగా ఉండుటకు వీలులేదు, ఇది మా స్థానం కాదు అని చెబుతూ… మేము తపస్సు గావించిన స్థలంలో మా పళ్ళతో తోమిన వేపపుల్లను నాటుతాం అది ఎక్కడైతే చిగిరిస్తుందో అక్కడ మేము జీవసమాధి పొందాలని సంకల్పించాం అని చెప్పగానె అక్కడ ఉన్న ఆశేశ భక్త వాహిని ఒక్కసారిగా మూగబోయింది, ఓం నమో శ్రీ భీమలింగేశ్వరాయ నమః, జై భీమలింగ, ద్రక్షారామ భీమేశ్వర వరపుత్ర పాహిమాం అంటూ భక్తులప్రార్థనలు, అర్థనాదాలు మిన్నంటాయి. అప్పుడు స్వామివారు ఒక్క నిమిషం మేము చెప్పెది విన్నండి. ఇదిగో నా పాదుకలు, ఈ పాదుకలు ఉన్నచోట నేను ఉంటానని, నన్ను నమ్మి కొలిచినవారి కష్టాలను తీరుస్తానని అభయమిచ్చి” వెళ్ళారు. తరువాత మారాతి వంశస్థులు ఆ పాదుకలను సమాధి చేసి స్వామివారికి ఒక ఆలయం కట్టించి నిత్యధూపదీపనైవేద్యాలతో పూజలను జరిపించేవారు. అప్పట్లో స్వామివారు బస చేసిన మారాతి వెంకన్న వంశంవారు దేవాలయబాధ్యతను నిర్వహించేవారు, పూజారులుగా వ్యవహరించేవారు. కొన్ని సంవత్సరాల తరువాత స్వామి వారు గడియాద్రిపురం (నేటి గడేకల్లు)ల్లో జీవసమాధి నోందారు అని విన్న బెల్డోణ గ్రామ ప్రజలు, అందరూ కలిసి స్వామి వారి దర్శనార్థం గడేకల్లుకు బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన బెల్డోణ గ్రామవాసులకు స్వామి పుజారులుగా ఉన్న బెస్తవారు సాధర స్వాగతం పలికారు. గడేకల్లు గ్రామంలో జీవసమాధినోందిన వృత్తాంత్తాన్ని స్వామివారి పూజారులు బెల్డోణ వాసులకు వివరించారు. స్వామి వారి జీవసమాధి వృత్తాంత్తాన్ని విన్న బెల్డోణ గ్రామవాసులు…మా గ్రామంలో కూడ మీరే స్వామివారికి పూజారులుగా వ్యవహరించాలి అని విన్నవించుకోగా… స్వామివారి పూజారులు అంగీకరిస్తూ…మేము ఏదైతే ఆహరంగా భుజిస్తామో అదే స్వామి వారికి నైవేధ్యం పెడుతాం, బ్రహ్మణుల మాధిరిగా అర్చకత్వం చేయలేము,  అని చెప్పగా…అయ్యా మీరు సాక్షాత్ భీమలింగేశ్వరుడి అంశం అయిన ఫక్కీరప్ప వారసులు, మీరు పెట్టిందే నైవేధ్యం, మీరు చెప్పిందే మంత్రం, ఇందులో ఏటువంటి అనుమానం అక్కర్లేదు, పైగా మా గ్రామంలో తొలి పంటను మీకు సమర్పించుకున్నాకే మేము పంటను వాడుకుంటాం, అంతేగాకా మీకు మా గ్రామంలో పొలాన్ని కూడ ఇస్తాము, ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మా గురువులుగా గౌరవిస్తాం, మీ జీవనభుక్తి మా భాధ్యత అని బెల్డోణ గ్రామప్రజలు స్వామివారి పూజారులకు తెలిపిరి. వీటన్నింటికి స్వామివారి పూజారులు అంగీకరించి, దశలవారిగా బెల్డోణ గ్రామంలో స్వామివారికి పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


స్వామివారు భీమేశ్వరుడి అంశతో పుట్టడం వల్ల సోమవారము ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. బెల్డోణ గ్రామంలో ప్రతి ఏడాది చైత్రమాసములో పౌర్ణమిరోజున స్వామివారి రథోత్సవము ఎంతో వైభవంగా జరుగుతుంది. అంతేగాక స్వామి జన్మదినమైన శ్రావణ శుక్ల పంచమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...