Friday 24 July 2020

జన్నమాంబ - భీమకవి


             
జన్నమాంబ ఉదంతము కూడా ఇలాంటిదే. భీమకవి రాజసందర్శనార్థం వెళ్తూ ఒక గ్రామమును చేరారు. ఇంటి ముందు నిలుచున్న జన్నమాంబ అనే వితంతువును చూసి భీమకవి “అమ్మా!భోజనము చేసి పెట్టవా?” అని అడిగారు. అందుకామె “నాయనా నా కంఠమ్మీద ఉన్న వ్రణము(గడ్డ)ఎన్నో రోజుల నుంచి నన్ను బాధ పెడుతోంది.నాకు ఓపిక లేదు.” అంది. బహుశా ఆమెకు వ్రణవిముక్తి కల్గించడానికే ఆమె ఇంటికి వచ్చినట్లు భీమకవి“ఆ వ్రణమును నేను పోగొట్టెదను. వండి పెడతావా?” అని అడిగారు.“వ్రణమును పోగొట్టిన ఎందుకు చేసి పెట్టను. భోజనము చేసి పెడితే పాపము రాదుకదా!” అలానే అని బదులిచ్చింది.
భీమకవి ఆమె వ్రణమును పోగొడుతూ ఈ పద్యమును చెప్పారు.

        క      ఘనరోగంబుల బలమా
                కనుగొనగా జన్నమాంబ కర్మపు ఫలమా!
                నినుఁ బ్రార్థించెద వినుమా
                మునుకొని యో గండమాల మునగకుఁ జనుమా

భావము: కనుగొనగా జన్నమాంబ కర్మల ఫలితంగా అంటిన భయంకర రోగపు బలమా!  ఓ గండమాలా(వ్రణమా)! నా ప్రార్థన విని వెళ్ళి మునగ చెట్టును పట్టుకో!

        వెంటనే ఆ వ్రణము జన్నమాంబ కంఠమును వదిలి ఇంటి ఎదురుగా ఉన్న మునగ చెట్టును చేరింది. బాధానివృత్తిని పొంది మహదానందంతో భీమకవికి వండి పెట్టింది.
        వెళ్ళిన పని ముగించుకొని తిరిగి వస్తూ, భీమకవి ఆమెను పరీక్షించదలచి మళ్ళీ ఆమెఇంటి ముంగిటికి వెళ్ళి “అమ్మా ఈ ఒక్క పూటకు భోజనము చేసిపెట్టవా?” అని అడిగారు. జన్నమాంబచేసిన ఉపకారమును మరచినదై, మిట్టమధ్యాహ్నమున భోజనానికి వచ్చిన అర్థికి సహాయం చేయకుండా, “నాకు ఇదేపనా నయనా! ఇంకేం పని లేదా? నేను వండి పెట్టను. ఇంకొకరి ఇంటికి వెళ్ళి అడుగు” కఠినస్వరంతో సమాధానం చెప్పింది.

చేసిన సహాయమును మరచినదైన జన్నమాంబకు బుద్ధి చెబుతూ తిరిగి వ్రణమును ఆమె కంఠమును ఆవహించమని చెబుతూ చెప్పిన పద్యములు

        ఆవె    మున్ను జన్నమాంబ మునుకొని యుంటివి
                యేను బొమ్మటన్న యీవుజన్న
                ముండ యేరుగడచి ముదిపెండ్లికతసేసె
                మునగగండమాల ముండఁబట్టు

భావము: ఓ గండమాలా! మొదట జన్నమాంబను పట్టి పీడిస్తుంటివి. నేను పొమ్మన్న తర్వాత నువ్వు మునగచెట్టుకు అంటుకున్నావు. కష్టాలు తొలగినతర్వాత ఈ విధవ ” ఏరు దాటించేదాకా నిన్నే పెళ్లి చేసుకుంటానని, తీరా గండం గడిచిన తరువాత – ముసలాడివి నిన్నెవరు చేసుకుంటారు?” అన్న శాస్త్రం ప్రకారం చేసిన ఉపకారము మరచిపోయిప్రవర్తిస్తోంది. కావున ఈ విధవను మళ్ళీ ఆవహించు.

        ఆవె    ఏను భీమకవిని యిదె నిన్ను ప్ర్రార్థింతు
                మునుపు నీవువచ్చి ముండఁబట్టి
                మునగకొండయయ్యె మునుపటిరీతిని
                మునగ గండమాల ముండఁబట్టు

భావము: ఓ మునగ గండమాలా! నేను భీమకవిని ఇదే నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు శీఘ్రంగా వచ్చి మునుపటిలాగా లాగా విధవను చేరుము.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...