Friday 24 July 2020

చీదమార్యుడు-భీమకవి


          ద్రాక్షారామానికి ఏడెనిమిది మైళ్ళ దూరాన కోరుమిల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని  రాజరాజనరేంద్రుడు చీదమార్యుడను రాజు శాసనపూర్వకముగా ఇచ్చాడు. ఆ శాసనమును భీమకవి రచించారని అక్కడివారు చెబుతారు. భీమకవి ద్రాక్షారామమున ఉన్నప్పుడు  చీదమార్యుణ్ణి కలుస్తూ ఉండేవారు. ఒకనాడు వీరిద్దరూ గోదావరీస్నానమాచరించడానికి  వెళ్ళారు. కోరుమిల్లి సముద్రమునకు దగ్గరగా ఉండడం వలన గోదావరినదిలోనికి  సముద్రపుపోటు తగిలి వేసవి కాలంలో నీరు ఉప్పగా అవుతుంది. భీమకవి ఆచమనము చేయునప్పుడు నీరు మరింత ఉప్పగా ఉన్నందున అతి కష్టంగా మింగారు. చీదమార్యుడు ఇది చూసి ఏమైందని అడిగితే భీమకవి “నీరు కుత్తుకకు దిగనందున కష్టంగా మింగుతున్నాను” అని చెప్పారు. అందుకు సమాధానంగా చీదమార్యుడు “కవీంద్రా! మీరేమంటే అది జరుగుతుంది కదా! మీ చేతిలో ఉన్న పని చేయకుండా ఇంత కష్టపడ్డం దేనికి? ఈ నీటిని ఉప్పదనమును మాన్పించి చప్పబరచకపోతిరా?” అని అడిగాడు. భీమకవి “ఎలాగో నా ఆచమనము అయిపోయిందిలే. ఇంకా నీవు చేయాల్సి ఉంది కదా. నీ కోసము ఆ పని చేస్తాను” అని చెప్పి ఈ పద్యం చెప్పారు.       

        చ      సుమహితవార్థి కౌఁగిటను జుట్టి నినున్ రహినింప నాతనిఁ
                గమన ధృతిఁ బెనంగి మెయిఁ గట్టుక వచ్చితివీవు గౌతమీ
                రమణిరొ! వీడు సానరుని రమ్యతరంబుగఁ జీదమార్యుఁడా
                చమనముఁ జేయఁ బోవు నిఁక సాగవు మాయెదుటన్ వినోదముల్

భావము: ఓ గౌతమీ! మంచివాడు, గొప్పవాడైన సముద్రుడు  నిను తన భాహువులతో చుట్టేసి తనలో కలుపుకోగా, నీవు సంతోషంగా అతనిని చేరి తనువును వదులుటకు (సముద్రంలో కలవడానికి) వచ్చావు. చీదమార్యుడు ఎంతో గొప్పగా ఆచమనము చేయబోతున్నాడు. సముద్రున్ని వదలి ఉండుమా! మా ఎదుట మీ ఆటలు ఇక సాగవు.

అని చెప్పగానే సముద్రపునీరు గోదావరి నీటిలోకి వచ్చి కలవకుండా అక్కడే ఆగిపోగా,   నీరంతా ఉప్పదనమును వదిలి చప్పగా మారిపోయింది. ఆచమనము చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవునపుడు భీమకవితో చీదమార్యుడు “మహానుభావా! వేసవిలో నీరు ఉప్పగా మారకుండా చేసి మా గ్రామానికి ఇక ఎన్నడూ నీటిఎద్దడి లేకుండా చేయండి” అని ప్రార్థించగా భీమకవి ఈ పద్యమును చెప్పారు.

        ఉ      ఎప్పుడు నిన్ను భీమకవి యిట్టులొనర్చెనొ నాఁటి నుండి నీ
                యుప్పఁదనంబుమాని యిట నొప్పుగఁ దియ్యఁదనంబునొందు మా
                యొప్పులకుప్ప గౌతమి! మహోజ్జ్వల భక్తుడు చీదమార్యుడున్
                దప్పక నిన్ను నెల్లపుడుఁ దద్దయుభక్తిని బూజసేసెడున్

భావము: మా సుగుణసంపన్న రాశి! ఓ గౌతమీ(గోదావరీ) ఎప్పుడు నిను భీమకవి ఇలా చేసాడో ఆనాటి నుండి ఉప్పదనము మాని ఇక్కడ తీయదనమును పొందుము! మహా భక్తుడైన చీదమార్యుడు ఎల్లప్పుడూ నిన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

        నాటి నుంచి నేటికి కూడా సముద్రపుపోటు కోరుమిల్లి గ్రామము పొలిమేర దాటిరాక అక్కడే 

నిలిచిపోయింది. ఇప్పటికి కూడా కోరుమిల్లి గ్రామము వద్ద గోదావరీ నీరు చప్పగానే ఉంది. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...