Friday 24 July 2020

తెలుంగరాయుడు- భీమకవి


పెద్దాపురాన్ని పాలించేతెలుంగరాయుడను రాజునకుఎప్పటి నుంచో భీమకవిని తన రాజ్యమునకు పిలిపించుకోవాలని ఎంతో ఆశఉండేది. ఉద్దండకవి, మహానుభావుడు అయిన భీమకవి తన రాజ్యమున ఉంటే ఎల్లప్పుడూ విజయైశ్వర్యములతో తన రాజ్యము తులతూగుతుందని భావించేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి భీమకవి పెద్దాపురం వెళ్ళారు.తానే స్వయంగా తెలుంగరాయుడి ఆస్థానమునకు వెళ్ళి కస్తూరి,పచ్చకర్పూరము జవ్వది సుగంధవస్తువులను బహుమతిగా ఇచ్చి తన అనుగ్రహమును పొందమని చెబుతూ ఈ క్రింది పద్యమును చెప్పారు.

                ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామభీమేశ నం 
                   దనుడన్ దివ్యవిషామృతప్రకట నానా కావ్యధుర్యుండ భీ 
                   మన నా నామమెరుంగ జెప్పితిఁదెలుంగాధీశ! కస్తూరికా ఘన 
                   సారాది సుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.        

భావము:గొప్పవాణ్ణి, వేములవాడ వంశస్థుడను,  ద్రాక్షారామభీమేశ్వరుని కుమారున్ని, విషము, అమృతం రెంటిని అమోఘమైన నాపలుకుల్లోకురిపించగలవాడను,ఎన్నోఉద్దండ కావ్యాలనురాసినవాడను.భీమననాపేరు. తెలుసుకుంటావని చెప్తున్నాను.కస్తూరి, పచ్చకర్పూరం మొదలగు సుగంధద్రవ్యాలను త్వరగా ఇచ్చి బుజ్జగించరా!   

     ఇలాంటి అవకాశము కోసమే ఎదురుచూస్తున్న తెలుంగరాయుడు భీమకవేస్వయంగా రావడంతో పట్టలేని ఆనందంతో వెంటనే చందనం, కస్తూరి,జవ్వ, పునుగు, పచ్చకర్పూరం మొదలగు సుగంధ వస్తువులను బహుమతిగాఇచ్చి అత్యంతభక్తితో భీమకవిని  పూజించాడు. అంతే కాక విశేషమైనద్రవ్యమును  బహుమతిగా ఇచ్చిసత్కరించాడు. 
        భీమకవికి యజ్ఞయాగాలంటే చాలా ఇష్టము. తన తండ్రి ద్రాక్షారామ భీమేశ్వరున్ని సంతోషపెట్టడానికి, లోకకళ్యాణార్థంయజ్ఞయాగాలను జరిపించేవారు. రాజసత్కారములందు ఇవ్వబడిన ద్రవ్యమునంతటినీ, యజ్ఞయాగాలను జరిపించాడానికే ఖర్చుచేసేవారు. అంతేకాక రాజులచే ఇవ్వబడిన చందనం, జవ్వ, పునుగు, కస్తూరి, పచ్చకర్పూరంలాంటి సుగంధవస్తువులనుయజ్ఞయాగాలకువినియోగించేవారు. ఆ కాలంనాటి వారు భీమకవిని గురించి "కవిరాక్షసుని యింట ఘనమైన యజ్ఞంబు జరుగు.పోదము రందు జాగదేల?" అంటూ గొప్పగా తమ సీస పద్యాలలో వ్రాశారు. భీమకవిని కవిరాక్షసుడు అని పిలువడానికి ఇంకో కారణము ఉంది. భీమకవి సంస్కృతంలో“కవిరాక్షసీయం” అనే ద్వ్యర్థి కావ్యాన్ని వ్రాసారు. ఆ కావ్యములో చివరి శ్లోకంలో తాను కవిరాక్షసుడనని చెప్పుకున్నారు. అందువలన భీమకవిని కవిరాక్షసుడు అని పిలిచేవారు. ఎందరో రాజులు చక్రవర్తులు ఈయన కవిత్వమునకు ముగ్ధులై ధనమును బహుమతిగా ఇచ్చి సత్కరించేవారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...