Friday 24 July 2020

కులోత్తుంగ చోడదేవుడు-భీమకవి



రాజరాజనరేంద్రుడు తన కుమారునకు తన మామ రాజేంద్రచోళుని పేరు పెట్టాడు. నరేంద్రుని తర్వాత రాజ్యబాధ్యతలను రాజేంద్రచోళుడే తీసుకున్నాడు. ఈ రాజేంద్రచోళుడిని కులోత్తుంగ చోడదేవుడు అని కూడా పిలుస్తారు.
        కులోత్తుంగ చోడదేవుడు భీమకవి తన వద్ద ఉంటే తనకు ఎటువంటి లోటు కలుగదని, ఏ యుద్ధంలోనైనా తనకే విజయం వరిస్తుందని ఆయనను తన ఆస్థానమునకు పిలిపించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో చూసుకున్నాడు. ఆయనచే కావ్యాలను వ్రాయింపచేస్తూ, అందుకు గొప్పగా సత్కరిస్తూ, గౌరవాభిమానాలతో నడుచుకున్నాడు. అతడొకప్పుడు ఉత్తరదేశమునకు దండెత్తివెళ్ళాల్సి వచ్చినపుడు భీమకవీంద్రుని తనతో రమ్మని కోరాడు. భీమకవి తన వద్ద ఉన్నప్పుడు కులోత్తుంగునకు ప్రతి యుద్ధంలో గెలిచాడు. ఏ యుద్ధంలోనూ పరాజయమును ఎదురుకాలేదు. అప్పట్లో ప్రజలు వేములవాడ భీమకవి తన వద్ద ఉన్నందునే, అతను ఎక్కడికెళ్ళినా విజయమే వరించేదని చెప్పుకునేవారు.
        ఇది విన్న కొందరు శత్రురాజులు భీమకవి కులోత్తుంగునకే పరిమితము కాదు కదా! ఎవరు పూజించినా, గౌరవించినా అనుగ్రహిస్తాడు కదా! కావున ఆమహానుభావున్ని మన రాజ్యానికి ఎందుకు ఆహ్వానించకూడదని భావించేవారు. కానీ కులోత్తుంగుని శిభిరంలో ఉన్న భీమకవిని దర్శించి తమ రాజ్యమునకు పిలిచే ధైర్యము ఏ ఒక్కరికి కూడా లేదు. ఒకరోజు భీమకవి చల్లని గాలి కోసం తమ స్కంధావారము విడిచి కొంతదూరము బయటకు వెళ్ళారు. ఆదే సమయానికి సింధూదేశాన్ని పారిపాలించు ధారావర్షుడను రాజు అక్కడే ఉండడం వలన భీమకవిని దర్శించి సగౌరవంగా సత్కరించి “భీమకవీంద్రా! మా రాజ్యమున కొద్ది కాలము ఉండి మమ్ములను అనుగ్రహించండి” అని కోరారు. భీమకవికి అందరూ సమానమే కదా! కావున అలాగే అని ఆతని రాజ్యమైన చక్రకోటానికి వెళ్ళారు.
          ఈ సంగతి తెలియని కులోత్తుంగునకు భీమకవి కనపడకపోవడముతో దుఃఖితుడై చాలాచోట్ల వెతికాడు. కొంతకాలానికి భీమకవిని ధారావర్షుడు పిలుచుకు పోయాడని తెలిసింది. భీమకవిని పంపమని వర్తమానము పంపినా ధారావర్షుడు లెక్కచేయలేదు. భీమకవి కోసం ప్రచండసైన్యసమేతుడై కులొత్తుంగుడు, ధారావర్షునిపై ఘోరయుద్ధమే చేశాడు. అయితే ఈ విషయము తెలుసుకుని భీమకవి యుద్ధము జరుగుతున్న చోటుకు వెళ్ళి యుద్ధాన్ని ఆపివేసి, వారిరువురి మధ్య సంధి చేసారు.
        ఆ తర్వాతి కాలంలో ఒకసారి కుంతలదేశమును పరిపాలించే విక్రమాదిత్యుడు కులోత్తుంగునిపై దండెత్తి వచ్చాడు. ఇరువురి మధ్య చాలా ఘోరయుద్ధం జరిగింది. తన సైన్యం కన్నా విక్రమాదిత్యుని సైన్యము చాలా అధికంగా ఉన్నందున కులోత్తుంగునికి ఓటమి భయము పట్టుకుంది. పది రోజులుగా సంగ్రామం జరుగుతోంది. 11వ రోజున కులోత్తుంగుడు కాలినడకన భీమకవి వద్దకు వచ్చి నమస్కరించి “నన్ను యుద్ధములో విక్రమాదిత్యుని మీద విజయము పొందునట్లు ఆశీర్వదించి అనుగ్రహించమని” కోరాడు. తనను అర్థించిన వారి పట్ల కాదనే స్వభావములేని భీమకవి అనుగ్రహమును కురిపించి “కులోత్తుంగదేవా! నేడు తప్పక నీకు యుద్ధమున విజయము సిద్ధిస్తుంది.ఇక ధైర్యంగా కదనరంగానికి పొమ్ము.” అని దీవించి పంపారు. అదే రోజే యుద్ధంలో విక్రమాదిత్యుడిపై కులోత్తుంగుడు అతిపరాక్రమమును ప్రదర్శించాడు. విక్రమాదిత్యుడు ఓడిపోయి తన రాజ్యానికి పారిపోయాడు.(భీమకవి ఆశీర్వాదము ఊరికే పోతుందా? ద్రాక్షారామ భీమేశ్వరునివరప్రసాది అయిన భీమకవి మాట తప్పక జరిగి తీరాల్సిందే కానీ మరో విధంగా ఎలా జరుగుతుంది.)

        అయితే బిల్హణుడిచే రచింపబడి విక్రమాదిత్యునికి అంకితము చేయబడ్డ  విక్రమాంకదేవ చరిత్రలోనూ, విక్రమాదిత్యుని శాసనములలోనూ ఈ యుద్ధములో విక్రమాదిత్యుడే గెలిచాడని వ్రాసారు. కానీ కులోత్తుంగుని శాసనాలలో కులోత్తుంగుడు విజయము పొందాడని వ్రాసారు. “కళింగపట్టుపారాణి” అనే ద్రవిడకావ్యములో కులోత్తుంగుడే గెలిచినట్లువ్రాయబడి ఉంది. విక్రమాదిత్యుడు ఓడిపోయినాఅతని జీవితము గురించి బిల్హణుడిచే వ్రాయించుకుంటున్న   విక్రమాంకదేవచరిత్రలో తానే గెలిచినట్లుగా వ్రాయించుకొని ఉండవచ్చును. విక్రమాంకదేవ చరిత్రను చూసి, కళింగ పట్టు పారాణి అను పుస్తకమును చూడకుండా, చరిత్రకారులు దక్షిణాపథ ప్రాచీన చరిత్రము నందు విక్రమాదిత్యునికే విజయము సిద్ధించిందని వ్రాసారు. కానీ అది నిజము కాదు.


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...