Friday 24 July 2020

గోపరాజు రామప్రధానుడు - భీమకవి


గోపరాజు రామప్రధానుడనే నియోగిబ్రాహ్మణుడు భీమకవి కాలానికి చెందినవాడు. ఇతడు గజపతి వంశానికి చెందిన కాకతీయరాజైన గణపతిదేవుడి ఆస్థానమంత్రిగా ఉండేవాడు. ఇతను తన స్వశాఖీయులైన బ్రాహ్మణులపై చాలా అభిమానమును కలిగినవాడు. నియోగిబ్రాహ్మణులకు ఉపాధి కల్గించడానికి ఎందుకూ ఉపయోగము లేకుండా కంసాలుల ఆధీనములో ఉన్న భూములను ఇప్పించాడు. కృష్ణానదీతీరాన ఉన్న భూములను కూడాగణపతిదేవుని నుంచి గ్రహించి ఉపాధి లేని బ్రాహ్మణులందరికీ ఇప్పించాడు. వారికి మంచి మంచి సదుపాయాలను కల్పించాడు. వేములవాడ భీమకవి ఇతని వద్దకు వెళ్ళి అతను చేయు పనులకానందించి ఇలా పొగిడారు.

సీ      వీడెపోదుష్టారి వీర మంత్రి కఠోర
                భూధరంబులకు దంభోళిధార
        వీడెపో కవిరాజు గాఢదారిద్ర్యాంధ
                కారంబులడఁగించు కమలహితుడు
        వీడెపో బహునీతి విద్యానిరూఢిచే
                సురగురుగెల్చిన శుభకరుండు
        వీడెపో చతురబ్ధి వేష్టితావనిఁ గల్గు
                బహుమంత్రికుల సార్వభౌమమూర్తి
        ఈతడే సర్వదేవతా ప్రీతికరుడు
        ఈతడే గోవరాట్కుల శీతభానుఁ
        డని కవీంద్రులు పొగడంగ నతిశయిల్లె
        మంత్రి జంభారి రామయామాత్యశౌరి

సీ      తనకీర్తి యాచంద్ర తారార్కముగ మంత్రి
                కులులకు గరిణీకములనొసంగి
        నతిథిసంతర్పణమను దినంబునొనర్చి
                ఖ్యాతిగాహరిహర ప్రీతిఁజేసె
        వర్ణాశ్రమాచార నిర్ణయంబులనెల్ల
                వేదోక్తరీతిగా వెలయఁజేసె
        ఘనవిప్రవందిమాగధకవీంద్రులనెల్ల
                నగ్రహారములిచ్చి యాదరించె
        నతడు శ్రీగోపరాజా న్వయాబ్ధిచంద్రుఁ
        డవఁగ విలసిల్లెఁ దనపాటిఘనులువొగడ
        మంత్రి దేవేంద్రుఁడనఁగ స్వతంత్రలీల
        మంత్రి కులహేళి రామయా మాత్యమౌళి
       
        ఈ రామప్రధానుడు భీమకవిని ఎంతగానో ఆదరించి, ఆయన వద్ద శిష్యుడిగా ఉండి, కవిత్వము చెప్పడము అలవర్చుకున్నాడు. భీమకవి శిష్యులందరిలో గోపరాజు రామప్రధానుడు ఎంతో రసవంతంగా కావిత్వమును చెప్పగలిగారు.
        ఒకనాడు భీమకవి రామప్రధానునితో “నువ్వు గొప్ప ఉద్యోగంలో ఉన్నావు. ఈ ప్రాంతంలో ఎంతో మంది వృత్తిహీనులై ఉన్నారు. వారందరికీ ఉపాధి కల్పించమని”చెప్పారు. రామప్రధానుడు భీమకవికి అలానేచేస్తానని మాటిచ్చాడు.
ఇది జరిగిన కొంత కాలానికి ఒకరోజు రామప్రధానుడు పన్నుల వసూలుకై పల్లకినెక్కి సముచితపరివారముతో వెళ్ళాడు. ఇతని కుమార్తె చాలా పేదరాలు. ఆమె భర్త ఆస్థినంతా దుర్వ్యయాలకు ఖర్చుపెట్టి నాశనము చేశాడు. కుటుంబం నడవక తాను వైదికవృత్తి నవలంభించి పొట్ట నింపుకొనేది. ఆమె ఆనాడు అదే దారిలో వెళ్తూ, తన తండ్రి పల్లకిలో వస్తుండడం చూసి, తన దుస్థితిని చూస్తే తండ్రి ఎక్కడ బాధ పడతాడోనని, కనపడకుండా, చెట్టుమాటున దాక్కుంది. అది గమనించిన రామప్రధానుడు చాలా బాధపడ్డాడు.అందరికీ ఉపాధి కల్పించమని భీమకవి ఎందుకు చెప్పారో అతనికి తన కూతురి దుస్థితిని చూసిన తర్వాత అర్థమయ్యింది. అప్పటిలో ఇలాంటి దురావస్థ బ్రాహ్మణుకులంలో ఎక్కువగా  ఉండేది. ఇక ఏమాత్రం ఆలస్యము చేయకుండా, నియోగిబ్రాహ్మణుల కష్టాలను అతి త్వరగా తొలగించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు.
        ఆ తరువాత శాలివాహనశకమున రక్తాక్షినామ సంవత్సరభాద్రపద బహుళ అమావాస్య, సోమవారము నాడు, సూర్యగ్రహణ కాలమునందు గణపతిదేవుని నుంచి 90 వేల పణ్యారముల భూమిని తన ఇష్టము వచ్చినట్లూ దానం చేయడానికి అధికారము తీసుకోని, నియోగి బ్రాహ్మణులకు భూదానములు చేశాడు.
        ఈ సంఘటన తర్వాత వైదికులలో మూర్ఖబ్రాహ్మణులు కొందరు అధికారదానము పరిగ్రహించాడని రామప్రధానున్ని విమర్శిలు చేశారు.ఆ మాటలు భీమకవి చెవినపడ్డాయి. ఆ మూర్ఖబ్రాహ్మణులనుద్దేశించి క్రింది పద్యాలను రచించి వారికితగిన సమాధానము చెప్పారు.

      మానఘనుండు;బ్రహ్మకులమండనమూర్తి; పరోపకారి; దు
        ర్దానదురానముల్ గొనడు; తప్పడుస్వామిహితోపకారముల్
        దీనులఁబోచుబాంధవవిధేయుడు డస్సియు వేడబోడు తా
        నూనిన వేడ్కతోడను నియోగికిచ్చిన దానమల్పమే!

భావము: గోపరాజు రామప్రధాముడు గొప్పస్వభావము కలవాడు; బ్రాహ్మణకులానికి మకుటము(భూషణము) వంటివాడు; పరోపకారి; ఆడినమాటా, చేసిన దానం (పంచదానాలు) వెనక్కితీసుకోడు; ఎల్లవేళలా తన అధికారి మంచినికోరుతూ, రాజకార్యాలలో అతనికి సహాయపడ్డంమరువనివాడు; పేదవారిని తన బంధువులవలె, స్నేహితునివలె అవసరాలందు  ఆదుకొనేవాడు; విధేయుడు; ఒకరిని యాచించడు. తనను వేడుకొనిన వెంటనే నియోగిబ్రాహ్మణులకు దానము చేసాడు. అది చిన్న విషయమా? గుర్తించడగినది కాదా?

      వ్రాయుట చిత్రమా! వికృత వైదికమా! నిజదార రక్షణో 
        పాయముకై  నియోగి యిల బార్ధివ సేవ యొనర్చినంతనే
        పాయునె వంశ శీలములు? పాయకయెప్పుడు చిత్రగుప్తుడున్ 
        వ్రాయడె యెల్ల లోకముల వారలు సేసిన పుణ్యపాపముల్

భావము: అనామతునిగాదాచబడి, ఎందుకూ నోచుకోని సంపదను కాపాడి,సద్వినియోగము చేయదలచి నియోగి బ్రాహ్మణులసేవకై(ఉపాధి కై)ఇచ్చినంత మాత్రానకులగౌరవము చెడిపోవునా?అతడు కీర్తి హీనుడగునా? ఇలా వ్రాయుట భావ్యమా?వికృతమైనపనిగా వేదాలలో చెప్పబడిందా(లేదు)ఎవరుగుర్తించకపోయినా ఎల్లలోకముల వారు చేసిన పాపపుణ్యాలు వ్రాసే చిత్రగుప్తుడు మాత్రము అతని పుణ్యకార్యాలను గుర్తించి ఎప్పటికీ చెరిగిపోకుండా వ్రాయును. 

        “చిత్రగుప్తుడు మాత్రము అతని పుణ్యకార్యాలను గుర్తించి ఎప్పటికీ చెరిగిపోకుండా వ్రాయును” అన్నమాటలతో అతని పుణ్యకార్యాల ఫలితాన్ని చెరిగిపోకుండా,శాశ్వితముగా నిలిచేలా అనుగ్రహించారు. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...