Friday 24 July 2020

చోడగంగు- భీమకవి

నన్నెచోడగంగు చోళదేవుని పినతండ్రి కొడుకు. చోళదేవుడు కావేరీనదీ తీరన ఒక గ్రామాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవాడు. నన్నెచోడగంగు చోళదేవుని వద్ద మంత్రిగా, దండినాధునిగా పనిచేస్తూ అతనికి కుడిభుజముమై మెలిగేవాడు. నన్నెచోడగంగు  కార్యదీక్ష, రాజభక్తి, పరాక్రమములకు మెచ్చి అతనికి చోళదేవుడు తిరుచినాపల్లెను ఇచ్చి అక్కడ ఒక కోటను కట్టించాడు. ఇంకా ఈ ఇరువురూ కూడా మంచి కవిత్వము చెప్పగలిగేవారు. భీమకవి ఒకనాడు చోడగంగును దర్శించి అతని పరాక్రమమును చూసి,మెచ్చుకుంటూ ఈ పద్యములని చెప్పారు.

        చ      అని మొన జోడగంగుడు మురారి బకారినరుండు మాద్రిజుం
                డనఘన చక్రతోమర శరాసనకుంతము లల్కఁబూనివ్రే
                యను వడిడాయనేయఁ బొడువన్ గళమస్తరవత్సమర్మముల్
                తునియవె? నుగ్గుఁగావె? యెదదూరవె? నాటవె? వైరివీరులన్

భావము: చోడగంగు యుద్ధవ్యూహంలో శ్రీకృష్ణుడు, విలువిద్యలో అర్జునుడివలె  భయంకరమైనవాడు, ధీటైన గొప్ప ఆయుధాలు గల శరాసనకుంతము(ఒరలాగా బాణములుంచే చోటు) కోపము వహించి, బాణము వదిలిన ఆ వేగానికే(శౌర్యానికి) దుర్జనులు తల,కుత్తుక,అణువణువు ఖండింపబడవా? నుసికావా? శత్రువుల గుండెల్లో దూరిపోవా? గుచ్చుకుపోవా?

                భోజుడు మంకు; ధర్మజుడు బొంకు; శచీపతి రంకు; కల్వపూ
                రాజుకళంకు; దైవధరాజము డొంకు; పయోధి యింకు; నర
                భోజభవుండు పంకు; ఫణిభూషణదేవుడు సంకు; పద్మినీ
                రాజ హితుండు క్రుంకు; సరిరారు గుణంబుల నీకు ధారుణిన్

భావము: పరాక్రమవంతుడైన భోజరాజు మొండి పట్టుదల కలవాడు కావున నిను పోల్చుటకు అతడు సరిరాడని, ధర్మరాజు కురుక్షేత్రసంగ్రామమున “అశ్వర్ధామ హతః కుంజరః” అని అసత్యమాడి ధర్మము తప్పిన వాడగుటచే ధర్మరాజు కూడానిను పోల్చుటకు తగడని, శచీపతిఇంద్రుడు అహల్యాజారుడగుటచే నీకు సరిరాడని, కలువలరాజు అయిన చంద్రుడు కళంకము(మచ్చ) కలవాడు కావున అందమందు నీకు సాటిరాడని, మేరుపర్వతుడు క్రుంగి ఉండుటచే ధైర్యమున నీకు సరిరాడని. సముద్రపునీటికి ఇంకిపోయే గుణం కలిగినది కావున గంభీరమున నీకు సాటి రాడని,బ్రహ్మదేవుడికి బంకించే గుణము ఉండుటచేత విద్యలో నీకు తీసికట్ట అని, శంకరుడు బికిరమడుగు కొనుటచే ఇవ్వడమే కానీ యాచించడమేరుగని నిన్ను పరమేశునితో పోల్చలేనని, సూర్యుడు అస్తమించేగుణము కలిగిన వాడగుటచే తేజము నందు పోల్చడానికి సరిరాడని. గుణములందుఈ భువిలో ఎవ్వరూ నీకు(చోడగంగుకు)  సరిరారు.(అనగా చోడగంగు గుణములందు పరిపూర్ణుడు. ఏలోపం లేని వాడు అని అర్థము.
        ఈ పద్యములను స్వయంగా విని రసభావములు బాగా తెలిసినవాడు, కవిత్వము చెప్పగలవాడు అయిన చోడగంగు, భీమకవికి వేయినూటపదహారు గద్యాణములిచ్చి సత్కరించి, కనకాభిషేకము చేశాడు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...