Saturday 25 July 2020

5. శ్రీ భీమలింగేశ్వరస్వామి మెండి గొడపై స్వారి చేయడం


                ఇలా స్వామి వారి గురించి ఆ నోటా ఈ నోటా ప్రజలు చెప్పుకొనుచుండగా గడేకల్లుకు ఈశాన్యమున 10 మైళ్ళదూరాన చిప్పగిరి అను గ్రామము ఉంది. ఆ గ్రామములో పీరుజాతివారు కొన్ని తాంత్రిక విద్యలయందు ప్రసిద్ధి. స్వామి వారి పేరుప్రఖ్యాతులు విన్న వీరు, అసూయతో ఈతను చాలా ప్రసిద్ధి చెందుచున్నాడు, కావున ఇతనిని ఎలాగైనా భంగపరచి, అడ్డుతొలగించుకోవలెనని లేనిచో తమ కీర్తి తగ్గిపోవుననీ భయపడి కుతంత్రము పన్నిరి. అది ఏమనగా వీరు ఒక మల్లెపూలవస్త్రమును పుష్పములతో తయారుచేసి అందులోని ప్రతి మల్లెపువ్వులో తము నేర్చిన యావత్తు తంత్రవిద్యను కల్పించి, ఈ మహాత్ముని సన్నిధానమునకు రావడానికి గాను ఒక పెద్దపులిని వాహనముగా, అధిరోహనము చేసి పల్లెంలో తాము తయారు చేసిన మంత్రపూరితమైన వస్త్రాన్ని ఉంచుకొని, అంగరంగవైభవంగా మేళతాళాలు సూర్యచంద్ర సురిటీలూ, నగారాలతో గడేకల్లు బయలు దేరారు.
వీరు మార్గమధ్యమున ఉండగానే, స్వామి తన దివ్యదృష్టితో గమనించి, సంజీవమ్మను పిలిచి “సంజీవి! చిప్పగిరిగ్రామము నుండి నన్ను సత్కరించడానికి పీరుజాతివారు వస్తున్నారు. వారికోసం పొలం వెనుకపడి ఉన్న సద్దచొప్పను తీసుకు వచ్చి ఉంచమని” చెప్పి, గ్రామస్థులు కొద్ది మంది చూస్తుండగా స్వామివారు ఒక మొండిగోడపై కూర్చొని వాయువేగమున పీరుజాతివారికి ఎదురేగి గ్రామానికి ఆహ్వానించారట.

        అంతలో సంజీవమ్మ సద్దచొప్పను కుప్పగా వేసి ఉంచెనట. అప్పుడు పీరు జాతివారు, స్వామి మీ కోసము పూలవస్త్రమును తెచ్చామన్నారు. మీరు దీనిని ధరించవలెనని కోరినారు. మరియు ఒక జాడీ సారాయి తెచ్చి పుచ్చుకోగలరా అని అడిగారు. అప్పుడు స్వామి వారు ఆ సారాయి మొత్తమూ తాగినారట. స్వామి మత్తులో ఉన్నరని తలచి, ఒక మణుగు సీసమును బాగా కాంచి దీనిని కూడా త్రాగగలరా? అని స్వామివారి నోటి యందు పోయడానికి ప్రయత్నించారట. స్వామివారు సరే అని నోరు తెరిచారట. అక్కడి గ్రామస్థులు “స్వామీ! ఆ సీసమ్మును త్రాగవద్దని” ప్రార్థించారట. అప్పుడు స్వామివారు వారిని భయపడవద్దని చెప్పి ఆ సీసమంతయూ త్రాగారు. మంచి భోజనము చేసిన వారివలె త్రేపుచూ సీసమును యావత్తూ పీరుజాతివారు చూస్తుండగానే, మూత్రస్థానము నుంచి విడిచెనట. ఆ సీసము ముందు ఎలాగున్నది అలాగే ఉండటం చూసి తమ పాచికలు పారనందుకు కలత చెంది, చివరి ప్రయత్నంగా తమతో తెచ్చిన మంత్రపూరితమైన పూలవస్త్రమును స్వామివారిపై కప్పినారట. అప్పుడు స్వామివారు సంజమ్మను కుప్పగా పోసిన సద్దచొప్పను అంటించమని చెప్పారు. స్వామివారు ఆ వస్త్రముతో పాటు మంటలో  కుర్చూన్న వెంటనే ఆ మంట యందు ఛిటపటమని శబ్ధం చేస్తూ అనేకములుగా ధ్వనించుచుండగా, ఆ వస్త్రముతో పాటి వారితంత్రవిద్యలు యావత్తూ భస్మీకృతమయ్యెను. పీరుజాతివారి శక్తిహీనులై, విద్యలన్నీ కోల్పోయినవారై, ఈ మహాత్ముని సామర్థ్యమును తెలుసుకుని, మంటలో కుర్చొని ఉన్న స్వామికి సాష్టాంగ నమస్కారమును చేసి క్షమించమని ప్రాధేయపడ్డారు.”

పీరుజాతివారు తమ తప్పుని తెలుసుకుని మహాత్మా! మేము చేసిన అపరాధములను మన్నింపుము. మీరూ కూడా మాలాగా మంత్రవిద్యవల్లనే మహిమలు చూపుతున్నారని భావించి, మిమ్ము భంగపరచదలచితిమి. పొట్టకూటి కోసము చేసే విద్యలు మీ ముందు సాగవని తెలిసింది. మేము మూఢులము. మమ్ము కాపాడండి” అని స్వామి వారిని ప్రార్థించిరి. అప్పుడు ఆ  మహాత్ముడు మంటల నుండీ బయటకు వచ్చి, వారి యందు దయతో, క్షమించి, వారి జీవనోపాధి కొరకు కొంత విద్యను ప్రసాదించి పంపి వేశారట. వారు భక్తితో రెండు నగారాలను(నేటికీ దేవాలయములో ఉన్నవి) ఒక గుర్రమును కానుకగా సమర్పించుకున్నారు. ఈ నగారాలు నేటికీ స్వామివారి దేవాలయములో కనిపిస్తాయి. ఈ మహాత్మ్యమును గాంచిన గ్రామప్రజలందరూ, భీమలింగేశ్వరస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించసాగారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...