Friday 24 July 2020

బ్రాహ్మణ - సంతర్పణ

తమను బహిష్కరించిన సంఘమును, తానే బహిష్కరించినవాడిలా, భీమన్న నాటి నుంచి ఊరి బాలలతో ఆటలు మాని, వివిధ గ్రంథాలను చదువుతూ పెరిగి పెద్దవాడయ్యారు.

          తల్లి ప్రథమపూజ్యురాలు. తల్లి మీద నిందలు మొపితే ఎంతటి వారికైనా భరింపతరమా?ఎంతో ఆత్మాభిమానం కలిగిన భీమన్న ఊరుకుంటారా?పరమేశ్వరుని వరమునందుకున్న తర్వాత భీమన్న చేసిన మొదటి పని తన తల్లిపై మోపిన అపవాదునుతొలగించి,అందరికళ్ళు తెరిపించడం. ఒకనాడు వేములవాడలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో సంతర్పణ జరుగుతోంది. ఆ ఇంటి యజమాని అందరినీ ఆహ్వానించాడు, కానీ భీమన్నను మాత్రం ఆహ్వానించలేదు. భీమన్న పిలవకపోయినా సంతర్పణకు వెళ్ళారు. నేరుగా లోపలికి వెళ్ళి కూర్చొని,తనకు కూడా భోజనం వడ్డించమని అడిగారు. అక్కడి వారంతా భీమన్నను బయటకి పంపివేసి, నీవు లోనికి రావద్దని చెబుతూ తలుపులు వేసేశారు. బాలభీమన్న“భీమేశ్వరుని తనయుడనైన నన్ను విస్మరించి మీరు ఈ పూటభోజనం చేయలేరు”అని చెప్పి బయట అరుగుపై కూర్చొన్నారు.లోపల జరుగుతున్న తంతు అంతటినీ గమనిస్తూ వడ్డన ప్రారంభమయ్యేంత వరకు ప్రశాంతంగా ఉన్నారు. వడ్డన పూర్తీ అయిన వెంటనే ఈ క్రింది పద్యంచెప్పారు.  

    ఉ. “గొప్పలు సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచునీ 
          ద్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్కమాఱమీ 
          యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్ 
          బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్”

భావము:తాము (సత్బ్రాహ్మణులమని)గొప్పలు చెప్పుకుంటూ, నన్ను భోజనమునకు రావద్దని ఈ బ్రాహ్మణులందరూ తిట్టారు. కావున ఒకసారి మీ అప్పడాలన్నీ కప్పలుగా,అన్నము అంతా సున్నముగా మారి, పప్పు,కూరలు,పులుసు, పచ్చడులు చిన్నచిన్న రాళ్ళుగా అవ్వుగాక!
          తక్షణమే వడ్డింపబడిన అన్నమంతా సున్నముగా మారింది. అప్పడాలన్నీ కప్పలై బెకబెక మంటూ గెంతుతూ, అటూ ఇటూ వెళ్తున్నాయి.పప్పు, పులుసు, పచ్చడి అన్ని చిన్నచిన్న రాళ్ళుగా మారిపోయాయి. ఈ వింత మార్పును చూసి భోజనపంక్తికి కూర్చున్న బాపలందరూ చాలా కలవరపడ్డారు. సంతర్పణ చేయిస్తున్న ఇంటి యజమాని అందరినీ  చూసి కలవరపడవద్దని చెప్పి,మళ్ళీ వడ్డించడానికి క్రొత్త విస్తరులను వేయించాడు. తీరా  అన్నపురాశి వద్దకు వెళ్ళి చూసేసరికిఅక్కడ కూడా అన్నమంతా సున్నంగా మారిపోయి ఉంది. గంపలోని అప్పడాలేమో కప్పలయ్యి బయటకు ఎగురుతూ గెంతులేస్తున్నాయి. మిగితా వంటలన్నీరాళ్ళుగా మారిపోయి ఉన్నాయి. ఆ ఇంటి యజమానికి ఎందుకిలా జరిగింది? ఏమి చేయాలి? అనిదిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అంతలో అక్కడి వారిలో భీమన్న చెప్పిన పద్యం విన్న ఒక బ్రాహ్మణుడు,ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి ఆరుబయట కుర్చుని భీమన్ననే ఇవన్నీ ఇలా మారాలని పద్యం చెప్పాడనీ, ఇదంతాఆ భీమన పలుకులమూలంగానే జరిగిందనీచెప్పాడు. అప్పుడు తెలిసింది ఆ యజమానికి “నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేర”ని చెప్పిన భీమన్న మాటలకర్థం. 
        అతను వెంటనేభోజనానికి వచ్చిన బ్రహ్మణులందరినీభీమకవి వద్దకు పిలుచుకొని వెళ్ళి,వాటినితిరిగి భోజనపదార్థాలుగా మార్చమని అడిగాడు. అలా చేసినట్లయితే భోజనానికి రానిస్తామనిచెప్పారు. వారికి భీమకవి అంతరార్థం ఇంకా అర్థం కాలేదు. భీమకవి“మీరందరూ గొప్పజాతి వారే కదా! మరి మీరే మార్చుకొవచ్చుగా. నేను మీ అంతటి వాన్ని కాదు కదా! నా వలన ఏమవుతుంది? చెప్పండి?“ అని అడిగాడు.ఆ బ్రహ్మణుల కన్నులు తెరచుకున్నాయి. వెంటనే వారు "భీమన్నా! మేముతప్పుగా ప్రవర్తించాము. నువ్వు మహానుభావుడివి. నిన్ను భోజనానికి రానివ్వకుండడం మా అందరి అపరాధము. మమ్మల్ని అనుగ్రహించి యథాప్రకారము వాటిని భోజనసముదాయముగా మార్చండి. అంతేకాకమీరు కూడా మాతో పాటి భోజనానికి కూర్చొని మమ్ము కృతార్థులను చేయండి. ఇప్పటి నుంచిమీతోగౌరవాభిమానాలతో నడుచుకుంటాము” అని నమస్కరిస్తూ వేడుకున్నారు. భీమకవి తిరిగి ఇంకో పద్యం చెప్పారు.


          మ.     "ఘనుడౌ వేములవాడ వంశజుడు ద్రాక్షారామ భీమేశనం 
                   దనుఁడీ భీమన యంచు గుర్తెఱింగి, నిందల్ మానినన్ గౌరవం 
                   బుననీ విప్రులుఁజూచిరందువలనఁబూర్వస్థితిన్ జెంది భో 
                   జన వస్తు ప్రకరంబులన్నియు యథాస్వస్థంబు లౌగావుతాన్"

భావం:ఈ బ్రాహ్మణులందరూ, గొప్పవాడు, వేములవాడ వంశస్థుడు, ద్రాక్షారామ భీమేశ్వరుని తనయుడీ భీమన అని తెలుసుకొని, నిందించడం మాని,ననుగౌరవంతో చూసారు. అందువలన ఈ భోజన, వస్తుసముదాయమంతా కూడా మునుపటి రూపుపొంది వాటిపూర్వస్థానానికి వచ్చును గాక!

          వెంటనే మునుపటిలా అన్నపురాశి ప్రకాశించింది. కప్పలన్నీ తిరిగి అప్పడాలుగా మారిపోయాయి. చిన్నచిన్న రాళ్ళన్నీ తిరిగి పప్పు, పులుసు, పచ్చడులుగా మారిపోయాయి. విస్తరులన్నీ తిరిగి భోజనంతో నిండిపోయాయి. ఇది చూసిన ఆ బాపలంతా భీమకవి మహత్యానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. వెంటనే భీమకవిని తమతోపాటి భోజనానికి తీసుకుపోయి భోజనవరుసలో అగ్రస్థానాన కుర్చోబెట్టి గౌరవించారు. ఊరివారంతా ఈ భీమన్నద్రాక్షారామభీమేశ్వరుని వరపుత్రుడని తెలుసుకొని మసలుకున్నారు. ఇన్ని రోజులు నిందలు మోపి, వెలివేసి బాధ పెట్టినందుకుతమను మన్నించాల్సిందిగా మాచెమ్మను వేడుకున్నారు. నాటి నుంచి వారిపట్ల గౌరవాభిమానాలతో నడుచుకున్నారు.

       
నాటినుండి భీమన్న అద్భుతమైన కవిత్వము చెబుతూ“వేములవాడ భీమకవి”గా లోకప్రసిద్ధుడయారు. భీమకవికి కవిత్వము అమోఘముగా హిమాలయాల నుండి ప్రవహించే భగీరతుడిలా(గంగానదిలా) ప్రవహించేది. శబ్ధార్థములు ఊట బావులవలే పెనవైచికొని ఈ మహాకవి కంఠసీమ నుండి వెడలసాగెను. నాటి నుండి భీమకవికి కవిత్వమే జీవితమైనది. ఎట్టి కవిత్వమైనా చెప్పగలిగే వారు. అందరూ ఉద్దండకవి అని పిలిచేవారు. తాను రాజ సభలకు వెళ్ళినపుడు తాను ద్రాక్షారామభీమేశుని పుత్రుడనని చెప్పేవారు, అంతేకాదు పరమేశ్వరుని స్వభావాన్ని పునికి పుచ్చుకున్నారు. ఎలాగంటేభీమకవి పరమేశ్వరునిలా మహాకోపి. ఎవరైనా తన పట్ల తప్పుగా ప్రవర్తించినా, అవమానపరచినా, తన సంకల్పానికి అడ్డుపడినామహాకోపి అయ్యి శాపం పెట్టేవారు. కానీక్షమించంమని అడిగితే చాలు అంతటి ఆవేశంలోనూ కరుణాహృదయుడై, తన తండ్రిని మించిన తనయుడైశాపవిమోచనం కల్గించేవారు. అంతే కాక అప్పటి నుంచి వారిపై ఎల్లవేళలా అనుగహము కలిగి ఉండేవారు. శాపాన్ని పెట్టడమే కాక, తన శాపాన్ని సమూలంగా పటాపంచలు చేయగల శక్తి కూడా కలిగి ఉండడం వలన ఈయననుఅందరూ శాపానుగ్రహ(శాప+అనుగ్రహ) సమర్థుడని కీర్తించేవారు. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...