Friday 24 July 2020

జన్మ వృత్తాంతము



జన్మ వృత్తాంతము

                తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామమునకు 12 కిలోమీటర్ల దూరాన వేములవాడ అనే గ్రామము ఉంది. గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడుండెను. ఎంతకాలానికీ ఇతనికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇతను ఐదుగురిని  పెళ్ళాడాడు. శివభక్తిపరాయణుడై యజ్ఞయాగాలను చేస్తూ, ఎన్నో విధాలుగా పరమేశ్వరున్ని ఆరాధించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. అయినా పుత్రలేమి బాధ మాత్రం తప్పలేదు ఇతనికి. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటిరాత్రి పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి నీ మరణం తర్వాత నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీకు పుణ్యలోకసిద్ధి కలుగుతుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి దిగులు మానేసి, సంతోషంగా కాలం గడిపి  మరణించాడు. ఇతని ఐదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. అమాయకురాలు. నిష్కల్మషమైన మనసు కలది, భర్తలాగా పరమేశ్వరుని మీద అపారమైన భక్తి కలది.


                భర్త మరణము తర్వాత ఒంటరి జీవితము అనుభవిస్తున్న మాచెమ్మ తన సవతులతో పాటి ఒకనాడు భీమేశ్వరున్ని దర్శించడానికి ద్రాక్షారామము వెళ్ళింది. దక్షారామములో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న రోజులవి. అశేషభక్తకోటి అంతా గోదావరీ స్నానము చేసి భీమేశ్వరుని దివ్యసుందరమూర్తిని దర్శించి, తమతమ కోరికలను విన్నవించుకోసాగారు. పుత్రులు లేనివారు సంతానం కోరుతూ పూజలు చేయించసాగారు. మాచెమ్మ కూడా గోదావరీ స్నానమాచరించి భీమేశ్వరున్ని దర్శించింది. నిర్మలమైన మనసుతో తనకూ ఒక సుపుత్రుడను అనుగ్రహించమని ప్రార్థించింది. అది విని  తనతో పాటి వచ్చిన యువతులందరు  ఫక్కున నవ్వి హేళన చేశారు, కానీ తాను మాత్రం సంతానానికి మీరొక్కరేనా అర్హులు. నేను అర్హురాలిని కానా? దయాసాగరుడైన భీమేశ్వరుడు అందరినీ సమానముగానే చూస్తాడు గానీ, ఒకరింట సున్నమును, మరొకరింట వెన్నను పెట్టడు గదామీ అందరికీ పుత్రుడను అనుగ్రహించి నాకు మాత్రం అనుగ్రహించకపోడు కదా!” అని బదులిచ్చి  వెళ్ళిపోయింది.


            అలా కోరిన యువతులందరికీ భీమేశ్వరుడు సంతానప్రాప్తి కల్గించాడో లేదో కానీ, సోమనాథామాత్యుని స్వప్నాన్ని నిజంచేస్తూ మాచెమ్మకు ఒక సుపుత్రుడిని అనుగ్రహించాడు. ఒకనాడు మాచెమ్మ నిదురలో ఉన్నప్పుడు మిరమిట్లు గొలిపే మహాజ్యోతి ఒకటి తన  కడుపున ప్రవేశించినట్లు ఆమెకు స్పర్శ కలిగింది. ఆమె అది స్వప్నస్థితిగానే భావించింది. గర్భవతి అయ్యే దాకా ఆమెకు విషయం అర్థం కాలేదు. భీమేశ్వరుని కరుణాకటాక్షాల వలన గర్భవతి అయిన మాచెమ్మకు నవమాసాలు నిండాయి. 11 శతాబ్ధమున, ప్రభవనామ సంవసత్సరము, శ్రావణశుక్లపంచమి రోజు శుక్రవారమునాడు, ఒక శుభముహూర్తాన  కుమారునికి జన్మనిచ్చింది. ఆమె బాలుడి వైపు చూసినపుడు ఒక మహాజ్యోతిశ్చక్రము పరివేష్టమై చుట్టి హఠాత్తుగా మాయమైపోయింది. పసిబాలుని తలపై జటాభారము, గంగాజలము, చంద్రరేఖ కనిపించినట్లయ్యింది ఆమెకు. ఆపిల్లవాని కంఠము నుండి ఒక చిన్న నాగు తన్ను బుస్సుమంటూ తాకవచ్చినట్లనిపించింది. కనులను నులుముకొని చూసేసరికి అవేవియూ కానరాక నవ్వుతున్న పిల్లవాడు మాత్రమే కనపడ్డాడు.   భ్రమ ఏమిటో ఆమెకు ఏమీ అర్థం కాలేదు.


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...