Friday 24 July 2020

రాజేంద్రచోళుడు-భీమకవి


ఒకసారి భీమకవి రాజేంద్రచోళుని దర్శనార్థము అతని సంస్థానానికి వెళ్ళారు. ద్వారపాలకుడు భీమకవి లోనికి పోనీయలేదు. “మహారాజు గారు శత్రురాజ్యలతో యుద్ధసన్నాహపు పనులలో నిమగ్నమయ్యున్నాడు. ఇపుడు ఎవరితో మాట్లాడేస్థితిలో లేరు. ఇంకోరోజు రండి” అని అడ్డుపడ్డాడు. భీమకవి “మీ మహారాజు పరతంత్రుడై ఉన్నాకానీ నన్ను నిరోధించడు. నన్ను వెళ్ళనియ్యి” అని శాంతంగా అడిగారు. అయినా కూడా ఆ భటుడు వినలేదు. తన మాటను ధిక్కరించినందుకు భీమకవి కోపితుడై “నేను ఎంత చెప్పిననూ నా గురించి తెలుసుకోలేక నిరోధిస్తున్నావు. నీకు ఆపాదమస్తకము మంటలు బయలుదేరునుగాకా!” అని పలికి వెళ్ళిపోయారు. మాట అన్నంతనే అతనికి శరీరమంతా మంటలు మొదలయ్యాయి. అతనికి ఏం చేయాలో తోచలేదు. అంత బాధలోనూ భీమకవిని వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ కనపడకపోవడంతో రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. రాజు “అయ్యో! ఆయన్ను నిరోధించి ఎంత పని చేసావు. ఆ మహానుభావుడు మన రాజ్యానికి రావడమే మన భాగ్యం. ఆ మహానుభావుడిని ఆపి ఎంత అపచారము చేసావు. ఇక ఆయన తప్ప మరెవరూ నీకు బాధ నుంచి విముక్తి కలిగించలేరు. అన్నిటినీ ప్రక్కన ఉంచి తొలుత భీమకవి ఎటు పోయారో, ఆయన ఎక్కడున్నారో తక్షణం వెతుకుదాం పదా“ అని తానూ భటులతో నలుదిక్కులా వెతకడం మొదలుపెట్టాడు. భీమకవి ఆ ఊరిలోనే ఒక బ్రాహ్మణుని ఇంట బసచేసి ఉన్నాడని తెలియడంతో వారు అక్కడకు వెళ్ళారు. రాజు తన భటుడు చేసిన తప్పుకు అతన్ని క్షమించి, బాధా విముక్తున్ని చేయమని  ప్రార్థించాడు. దయాహృదయుడైన భీమకవి తన మాటలను ఉపసంహరించుకున్నారు.  భటుడు కూడా బాధ నుంచి విముక్తుడై తన్ను క్షమించమని వేడుకున్నాడు. ఆ తరువాత భీమకవిని తన సభకు పిలుచుకుపోయి ఘనంగా సత్కరించాడు. “మహాత్మా! ఈ భవనమునకు ఒక కొబ్బరిచెట్టు దారికి అడ్డముగా ఉన్నది. దానిని నరకడను తప్ప వేరొక దారి కనిపించుట లేదు, అలా చేయడము ఇష్టము లేదు.మీరు మీ మహిమను చూపి దానిని దారి నుంచీ ప్రక్కకు జరిగి దారి ఇచ్చునట్లు చేయవా?” అని అడిగాడు. భీమకవి కొబ్బరిచెట్టును దారి నుంచి తప్పుకొమ్మని ఒకపద్యము చెప్పగానే, అది ఉన్న చోటి నుంచి ప్రక్కకు జరిగింది. అందరూ భీమకవి మహిమను చూసి ఎంతో ఆశ్చర్యచికితులయ్యారు.



No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...