Saturday 25 July 2020

12. ఎమ్మిగనూరుపట్టణంలోఅటకారు వాడు భంగపడుట


స్వామివారి జాతరకు ముందు అనగా జాతర 2 నెలలు ఉండగానే పూజార్లు స్వామివారి విగ్రహమును పల్లకీలో ఉంచుకొని, స్వామి భక్తులు ఏ ఏ గ్రామాలలో ఉన్నారో ఆ గ్రామాలకు జాతర ఖర్చుకు గానూ (పట్టీ) సంపాధన కొరకు పోయేవారు. పూర్వము దాదాపు 180 సంవత్సరాల క్రిందట స్వామివారి పూజార్లు ఎమ్మిగనూరు అను పట్టణమునకు సంచారమునకు పోయి ఉండిరి. ఆ పట్టణంలో అటకారు వాళ్ళు విశేషముగా ఉండేవారు. వారిలో ఒకడు మాత్రము విద్య యందు చాలా నిపుణుడై ఉండెను. అతని పేరు చెప్పు వారు ఎవరూ లేనందున ఆ పేరు వ్రాయలేదు. అతడు తన క్షుద్రవిద్యాగర్వంతో, భాజాభజంత్రీలతో ఊరేగుతున్న స్వామీవారిని చూచి, పల్లకీ మోసేవాండ్లకు, భజంత్రీ చేయువారికి నోటమాట రాకుండేలా, చేతులు కదలకుండా క్షుద్రవిద్య చేసినాడు. అప్పుడు స్వామివారి పల్లకీ ప్రధానవీధిలో ఆగిపోయింది. అపుడు పూజారి, మేలగాళ్ళను చూసి మేళము వాయించమని గర్జించెను. మేళగాల్లు నోటిమాటరాక, కాల్లూ చేతులూ కదల్చలేక, కన్నీరు విడువసాగిరి. పల్లకీ మోసేవాళ్ళను కదలమనగా, వాళ్ళు కూడా కదలలేక, మాట్లాడలేక, దిక్కుతోచని స్థితిలో బాధ పడుతూ స్వామిని ప్రార్థించిరి. అప్పుడు పూజారి ఈ క్రింది విధముగా చేయునట్లు స్వామి బుద్ధిపుట్టించాడు. వెంటనే ఆ పూజారిపల్లకీని, భజంత్ర్రీ వాళ్ళను అక్కడనే వదిలేసి, సమీపాన ఉన్న బావిలో స్నానము చేసి పల్లకీ వద్దకు వచ్చి, పల్లకీలో ఉన్న విబూధి(అంగారు)ను కొంచెము తీసుకొని, వారందరి మీదా చల్లి స్వామివారి బెత్తముతో పల్లకీ మోసేవారిని, మేళగాళ్ళను తట్టినాడు, వెంటనే వారికి ఆ క్షుద్రప్రయోగం నాశనమై చలనము వచ్చింది. ఇదిలా ఉండగా క్షుద్రవిద్య ప్రయోగము చేసిన ఆ అటకారువాడికి ఇంట్లో కడుపునొప్పి, కడుపుబ్బరముతో ఆయాసపడుతూ పొర్లుచుండెను. ఇది తెలిసి  ఆ పట్టణంలో మిగిలిన విద్యావంతులైన అటకారు వారు వచ్చి, తమ శక్తిమేర ప్రయత్నించి చూసారు, కానీ ఫలితము కనపడలేదు. అపుడు వారు జరిగిన విషయమును తెలుసుకొని, ఇది ఆ భీమలింగేశ్వరిని మహిమ వల్ల జరిగిందని ఇతడు ఇట్లే ఉన్న ఎడల ప్రాణము నిలుచుట కష్టము, మనచేత ఏమి కాదు. కావున ఇతనిని ఆ స్వామివారి ముందుకు తీసుకు పోదాము రండని ఆ అటకారు వాడిని మోసుకొని, బజారులో పోవుచున్న పల్లకీకి అడ్డుగా వేసారు., పూజారి ఏమిటని విచారించగా వారు స్వామికి నమస్కారము చేసి , ఈ పడి ఉన్న దుర్మార్గుడు చేసిన క్రూరకృత్యములు యావత్తూ, ఒక్కటీ దాచక విన్నవించారు స్వామివారి పూజారి “నేను ఏమి చేయగలను. నాచేత ఏమవుతుంది. నేను మీలా విద్యావంతున్ని కాదు. నా చేత ఏమీ కాదని  చెప్పగా” వాల్లందరూ నోటమాట రాక నిర్వీణులై నిల్చున్నారు.
భీమలింగేశ్వరుడి వైభవము చూసి, గర్వముతో ఇట్టి విద్యలు ప్రయోగిస్తున్నప్పుడు మహసాద్వి, మహ భక్తురాలైన ఆ అటకాడి భార్య తనభర్తతో “మీరు విద్యావంతులు, మానవులకు చేసినట్లు స్వామివారిపై క్షుద్రప్రయోగములు చెసినా అది సాగక, స్వామి వారి కోపానికి గురికావాల్సి ఉంటుందని” హెచ్చరించినా లెక్కచేయక తిరిగి ఆమెను కోపగించుకున్నాడు.  మరోసారి అమె తన భర్తకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ “ ఆ స్వామి నీకేమి అపకారము చేసినాడు. నీవు పని కట్టుకొని ఈ విధంగా చేస్తున్నావు”అని అడగ్గా,  ఈ పట్టణంలో ఎవరు వచ్చినా, నా అనుమతి లేనిదే బసచేయరు, నా అనుమతి లేకుండా పల్లకిలో ఉరేగిస్తూ, ఇక్కడే బస చేస్తారా, వీళ్ళకి బుద్ధి చెప్పాలి?” అని భార్యను చెంపదెబ్బ కొట్టాడు. ఆమె ఇక బదులు చెప్పక, చింతిస్తూ, స్వామి ఈ మూర్ఖుడిని ఇక నీవె రక్షించాలి అని ప్రార్థించెను.
ఆమె పతిమీద భక్తి కలిగినది అగుటవలన  తన మాంగళ్యానికి ఏటువంటి అపదరాబోతుందో అని భయపడుతూ, స్వామివారి పల్లకి వద్దకు వచ్చి స్వామిని అనేక విధములుగా ప్రార్థించింది. ఇది చూసిన స్వామి పూజారి “ అమ్మా మేము ఏం అపరాధము చేసామని ఈ విధంగా చేశాడు” అనెను.  ఆమె జరిగినదంతా వారికి చెప్పి తన భర్తను క్షమించమని, తనకు పతిభిక్ష పెట్టమని,  స్వామిని కోరుతున్నపుడు, పల్లకీలో స్వామివారి విగ్రహముపైన ఉన్న పత్రి పుష్పములు దేవుని కుడిభాగమున రాలెను. ఇది గమనించినవారు  స్వామివారు ఈమె భక్తికి మెచ్చారు అని తలచిరి. స్వామి వారి పూజారి కూడా జరిగినదానిలో ఈమె తప్పు ఏమీ లేదు.

అంతలో పడిఉన్న అటకారు వాడు మెల్లగా కల్లుతెరచి చూడసాగాడు. అక్కడున్న వారు స్వామి అనుగ్రహముతో ఇతనికి మెలకువ వచ్చింది. ఇక స్వామివారి పూజారి అనుగ్రహించాలని కోరారు. పల్లకీలోని అంగారును కొంచెము తీసుకొని అటకారువాడి నోట్లో వేసి, బొట్టు పెట్టి స్వామివారి బెత్తమును తీసుకొని మూడు సార్లు తట్టాడు.  ఆ అటకారువాడు వెంటనే లేచి కూర్చొని తన బాధలన్నీ తొలగుట తెలుసుకొని, స్వామివారి పూజారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు చేసి స్వామిని క్షమించమని వేడుకున్నాడు. స్వామివారి పల్లకీని తన ఇంటికి ఆహ్వానించి, ప్రత్యేకపూజలు చేయించాడు.

స్వామివారి మహిమలను తెలుసుకొని, జాతరకు ఖర్చులకు తాను కూడా కొంత సొమ్మును కానుకగా సమర్పించుకొని, స్వామి పల్లకీ మోస్తూ, తాను కూడా స్వామితో పాటు అ పట్టణంలో తిరిగి గడేకల్లు చేరే వరకు వెంటనే ఉండి, ఆలయములో ఆరాధన జరిపి, తన పట్టణానికి వెళ్ళాడు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...