Friday 24 July 2020

రణతిక్కన- భీమకవి


భీమకవి కరుణాకటాక్షాలను పొందిన వారిలో రణతిక్కన, మైలమభీముడు ముఖ్యులు. వీరిరువురూ మైలమాంబ కుమారులు. ఈ ఇరువురు నెల్లూరు ప్రభువైన మనుమసిద్ధిరాజు వద్ద మంత్రులుగానూ, దండనాథులుగా ఉండి, అతి పరాక్రమవంతులుగా పేరుప్రఖ్యాతులు  తెచ్చుకున్నారు.
          ఒకసారి మనుమసిద్ధిభూపాలునికి, ఎఱ్ఱగడ్డపాడును పాలించే కాటమరాజుకు ఘోర యుద్ధము జరిగింది. అపుడు రణతిక్కన మనుమసిద్ధి భూపాలుని సైన్యమును నడిపిస్తూ ఎంతో పొరాడినా, చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఇరువురికి పాడిపశువుల విషయంలో యుద్ధము జరిగింది. ఎఱ్ఱగడ్డపాడులో పశువులను మేపుకోవడానికి తగిన గడ్డిభూములు లేనందున కాటమరాజు తన పశువులను మనుమసిద్ధి రాజ్యంలో మేపుకోడానికి అనుమతి తీసుకొని, అందుకుగాను నెలసరి కప్పమును చెల్లించునట్లుగా అంగీకారము చేసుకున్నాడు.
        కొంత కాలము తర్వాత ఒకరోజు కాటమరాజుకు చెందిన ఒకదూడ మంద నుంచీ తప్పిపోయింది. కాటమరాజు ఎంత వెతికిననూ దొరకకపోవడంతో మనుమసిద్దే ఆ దూడను అపహరించి ఉంటాడని అనుమానించాడు.తన దూడను తనకు అప్పజెప్పేవరకూ కప్పమును చెల్లించనని పట్టుపట్టాడు. మనుమసిద్ధికి దూడ విషయము తెలియకపోవడంతో తమ పశువులలో అటువంటి దూడ కలవలేదని,మొదట తనకు కప్పమును చెల్లించమని బదులిచ్చాడు. కాటమరాజు నమ్మలేదు. మనుమసిద్ధిరాజుతో మాటామాటా పెరిగి చివరకు యుద్ధానికి కాలుదువ్వాడు. రెండు రాజ్యాలమధ్య పంచలింగాలపాడులో యుద్ధము జరిగింది. ఈ యుద్ధానికి మనుమసిద్ధుని సైన్యాధిపతైన రణతిక్కన అల్పసైన్యముతో వెళ్ళాడు. రణతిక్కన ఎంతో శౌర్యపరాక్రమాలతో పోరాడిననూ శత్రుసైన్యము ఎంతటికి తరుగకుంది, కానీ  తన సైన్యము మాత్రం చిందరవందర అయిపోయింది. ఇక లాభం లేదనిపించింది. సైన్యమును ఏకీకృతపరచుకుని, అధనపుసైన్యమును జతపరచుకుని రేపటి రోజున యుద్ధానికి రావడము మంచిదని భావించి, యుద్ధమును నిలిపివేసి మధ్యాహ్నభోజన సమయానికే రణతిక్కన ఇంటికి తిరిగివచ్చాడు.
        ఇది తెలియకనో, మరి నచ్చకనో అతనిలో పౌరుషమును నింపదలచి తల్లి పోలమ, భార్య చెన్నమ రణతిక్కనను సూటిపోటి మాటలతో అవమానించారు. బంధువులవ్వడం వలన భీమకవి అపుడప్పుడు వీరింటికి వచ్చేవారు. ఈ సంఘటన జరుగునాడు భీమకవి రణతిక్కన ఇంటిలోనే ఉన్నారు. రణతిక్కన యుద్ధభూమి నుంచి రాగానే స్నానానికి నీటిని సిద్ధము చేయమని తన భార్య చెన్నమను అడిగాడు. ఆమె ఆడువారి స్నానానికి  చేయుఏర్పాట్లను చేసి, నులక మంచమును అడ్డుగా పెట్టి, నీటి బిందేలతో పాటి పసుపు గిన్నెను కూడా ఉంచి, రణతిక్కనను ఇక మీరు స్నానానికి వెళ్ళండి. అన్నిటినీ సిద్ధముగా చేసి పెట్టానని చెప్పింది. అని చెప్పింది. ఆ ఏర్పాట్లను చూసి అతను “ఇదేమిటే ఆడువారి స్నానానికి చేసే వసతులు చేసావు ఎందుకు?” అని అడుగాడు. ఆమె అందుకుసమాధానంగా  “నీ తల్లి ఆడది, నీ భార్యనైన నేను ఆడద్దాన్ని. యుద్ధము నుంచి పారిపోయివచ్చిన నువ్వు కూడా ఆడదానివే కాక మగవాడివి ఎలా అవుతావు? నేటి నుంచి ముగ్గురమూ ఆడవారమైతిమి.అందుకే అలా చేసాను” అని చెప్పింది.
చెన్నమ సమాధానాన్ని విన్న భీమకవి  క్రింది పద్యమును చెప్పారు.
                వగఱకు వెన్నిచ్చినచో
                  నగరేనిను మగతనంపు నాయకులెందున్
                  ముగురాడు వారలైతిరి
                  వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్
భావము:
“శత్రువుకు వెన్నుచూపి వచ్చిన నిను చూసి మగతనము ఉన్న నాయకులందరూ నవ్వుకోరా? ఇప్పుడు ఈ ఇంట ముగ్గురు ఆడవాళ్ళు అయ్యారు. అక్కడ(యుద్ధరంగాన) లేని పౌరుషము, బాధ స్నానమాడే చోట ఎందుకు?”
        భార్యకు, తల్లి కూడా తోడై భోజనము చేసేటపుడు రణతిక్కనకు విరిగిన పాలు పోసింది. రణతిక్కన “ఇదేమిటమ్మా. విరిగిన పాలు పోసావు?” అని అడుగగా ఆ వీరమాత “నాయనా! నువ్వు యుద్ధానికి పోయిన చోటనే పశువులు కూడా మేతకు పోయాయి. నువ్వు విరిగి వచ్చిన విధంగానే మన పశువులు కూడా విరిగి వచ్చాయి. వాటి పాలు కూడా విరిగాయి. నేనేమి చేసేది చెప్పు” అని ధీటుగా బదులిచ్చింది.

        అక్కడే ఉన్న భీమకవి ఇది విని
                “ అసదృశముగ నరివీరుల
                  మసిపుచ్చక విఱిగివచ్చు మగ పందక్రియఁ
                  గసవున్ మేయగ బోయిన
                  పసులుఁ విఱిగినవి తిక్క! పాలున్ విఱిగెన్

భావము: తిక్కనా! రణరంగములో శత్రువులని మట్టికరిపించలేక పిరికిపందలాగా విరిగి వచ్చావు. పసరము(గడ్డి) మేయడానికి అక్కడకు వెళ్ళిన పశువుల కూడా నీవలె విరిగివచ్చాయి. వాటి పాలుకూడా విరిగాయి.
అని చెప్పారు. చివరకు తన తల్లి కూడా అలా అవమానించేసరికి తిక్కన వీరావేశుడై, భోజనమును వదలి, ఉన్నఫలంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. రణరంగానికిపోయి అసహాయశూరుడై కాటమరాజుతో చాలాసేపు ఒంటరిపోరాటము చేశాడు. కానీ చివరకు  కాటమరాజు ఖడ్గానికి ఆహుతై వీరస్వర్గమును పొందాడు.
        రణతిక్కన మరణవార్తను విని అతనితల్లి పొలమాంబ, భార్య చెన్నమాంబ చాలా దుఃఖించారు. అత్త, కోడలిని భీమకవి పాదాలపై వాలి ఆయన అనుగ్రహమును పొందు. నీ భర్తను తిరిగి పునర్జీవితున్ని చేయగలడని సూచించింది. అత్త మాటననుసరించి  చెన్నమాంబభీమకవికి నమస్కరించి, ఆయన పాదాలపైవాలి శోఖిస్తుండగా, పాదాశ్రితులైన వారిపై కరుణ కురిపించే భీమకవిఆమెపై కణికరము చూపి “ధీర్ఘ సుమంగళీభవా” అని దీవించారు. అందుకామె “మహానుభావా! నీవాక్యము వ్యర్థము కారాదు. నా భర్తను బ్రతికేలా చేయవా”మని అడిగింది.
 భీమకవి ఈ క్రింది పద్యమును చెప్పారు.

              గుణముల నిధానమగు మన
                రణతిక్కన తాఁగళేబరంబును శిరమున్
                గణక మెయిఁ గలయఁ బ్రదుకునుఁ
                బ్రణుతాఖిల వైరి మకుట భాసిత పదుడై

భావము: గుణములకు నిలయమైన (సద్గుణ సంపన్నుడైన) మన రణతిక్కన (ఇంత త్వరగా మరణించకూడదు) తన మొండెమును, శిరస్సును దగ్గర చేసి కలిపిన శరీరము(తల మోండెము)ఒక్కటై బ్రతుకుతాడు. ఈ లోకములోఅఖిల శత్రుగణాలచే గొప్పగా కీర్తింపబడుతూ వర్ధిల్లుతాడు.
రణతిక్కన మృతదేహాన్ని రణరంగము నుండి తీసుకురప్పించారు. అతని తల, మొండెమును దగ్గర చేర్చి కలిపి ఈ క్రింది పద్యాలను చెప్పారు.

                 ఏమి తపంబుఁజేసి పరమేశ్వరునేమిటఁ బూజసేసిరో
                   రాముని తల్లియుఁ బరశురాముని తల్లియు భీముతల్లియుఁ
                   గాముని కన్న తల్లియును గంజదళాక్షుననుంగుఁ దల్లియున్
                   శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కనఁగన్న తల్లియున్

భావము: శ్రీరాముని తల్లి, పరశురాముని తల్లి, భీమున్ని కన్న తల్లి, మన్మధున్ని కన్న తల్లి, శ్రీకృష్ణున్ని కన్న తల్లి, శివుని శూలమంటి ప్రతాపమును(ధైర్యసాహసములు) సిద్ధించుకున్న  (సిద్ధయ) తిక్కనను కన్న తల్లి, ఎంత తపస్సు చేసి పరమేశ్వరుని ఏమని పూజించారో అంతటి గొప్పవారిని కన్నారు.  

                 శ్రీలలరారశత్రువులఁ జెండితివార్యులు మంత్రివర్యులా
                   ర్వేలఘనుల్ నుతించిరలవేర్పు దొరల్ ముదమంది మెచ్చిరో
                   లాలిత శౌర్యధైర్య జయలక్ష్మి ప్రియంబున నిన్వరించెనీ
                   లీలలుహెచ్చెఁ దిక్కని కళేబరమా యిక నిల్చియాడుమా

భావము: పూజ్యుడవు, మంత్రివర్యుడవై రాజ్యముసిరిసంపదలతో  అలరారేలా (శత్రువుల పాలుకాకుండా) శత్రువులను చెండాడావు. ఘనులెందలెందరో నిను ఏమని స్తుతించారో, నీ కార్యసిద్ధికి రాజులు సంతోషించి ఎంతగా కొనియాడారో, శౌర్యధైర్య జయలక్ష్మిని (పరాక్రమము, ధైర్యము, విజయములకు అధిపతి అయిన అష్టలక్ష్మిని) సైతం ప్రసన్నము చేసుకున్నావు. నీవు సాధించాలిన కార్యాలు ఇంకాచాలా ఉన్నాయి. ఓ తిక్కన కళేబరమా! ఇక లేచి కదలిరా!     

        వెంటనే వేర్పడి ఉన్న రణతిక్కన తల, మొండెము రెండూ అతుక్కోనిపునర్జీవుడై లేచివచ్చి భీమకవికి నమస్కరించాడు. అమితముగా వరాలను కురిపించే తన తండ్రి బోళాశంకరునిలా భీమకవి “నువ్వు సాధించాల్సినది చాలా ఉంది” అన్న అమోఘమైనమాటతో అతనిని ధీర్ఘాయుర్దాయనంతునిగా చేసారు. నాటి నుంచి ఈ రణతిక్కనను సిద్ధతిక్కన అని పిలిచేవారు.ఈ రణతిక్కన దాదాపు 70 ఏళ్ళు మనుమసిద్ధి ఆస్థానమున తన సేవలు అందించాడు.
        నెల్లూరు పట్టణానికి సమీపంలో పుట్టపురాయి అనే గ్రామము ఉంది. ఆ గ్రామానికి తూర్పు భాగాన పీనాకినీనదీ తీరాన తిక్కనపాడు అను పేరుతో ఒక గ్రామమే ఉంది. ఆ గ్రామాన ఒక పెద్ద రాతిపై గుర్రము మీద ఎక్కిన రౌతుగల విగ్రహమొక్కటి చెక్కబడి ఉంది. ఆ విగ్రహము ఇప్పటికీ ఎంతో చక్కగా ఉంది. అక్కడివారు ఈ విగ్రహము రణతిక్కనదని చెబుతారు. ఈ విషయమును చెన్నపట్టణములో ప్రాచ్యులిఖిత పుస్తకభాండాగారము నందు చారిత్రక సంపుటలో వ్రాసి ఉన్నారు.

Ø  రణతిక్కనపై భీమకవి చాటుధార: 
        రణతిక్కన రణనిహతుడైనపుడు అతని గుణగణాలను, అతని శౌర్యపరాక్రమములను వర్ణిస్తూ చెప్పిన అద్భుతపద్యాలు.

        చ      పదటునవాజిరాహుతుల పై దుమికించుచుఁదిక్కఁడార్చినన్
                బెదిరిపరిభ్రమించికడుఁ బిమ్మట వీరులు భీత చిత్తులై
                యదె! యదె! వాలువాల్మెఱుఁగులల్లదె! యల్లదెయాతడంచనఁ
                గొదుకకయాజిసే సెరిపుకోటుల కందఱకన్ని రూపులై

        ఉ      చిక్కక మన్మసిద్ధివిభుచేమును గొన్న రుణంబుదీర్చె మా
                తిక్కనమంత్రిసోమశిల దేవరసాక్షిగఁ బెన్న సాక్షిగా
                నెక్కినవాజిసాక్షిగ మహిన్నుతికెక్కినకీర్తి సాక్షిగా
                స్రుక్కక మారుకొన్న రణశూరులు సాక్షిగఁ గొండ సాక్షిగన్

        సీ      రణరంగమున మోహరంబులఁబొడగని
                        ప్రాణంబువాసిన వందగజమ!
                విజయాధిపునిదాడి వెనుకొని తాగులంగ
                        దెసదప్పి పాఱిన దిగ్గజంబ!
                చేరఁజాలకతిర్గిచే మడమళ్లించి
                        మంచానకందని మదగజంబ!
                పెనుతుల్లిచెఱ్వులోఁ బిరుదులన్నియుఱొంపిఁ
                        గ్రుంగంగఁద్రొక్కిన కుంజరంబ!
                నేడు మొదలుగాఁగ నెల్లూరుపురములోఁ
                బొగడుతనము సేయు మగలతలలు
                వూరిఁగఱచితిక్క! భూతమైసోకుము
                యూరివారిసోఁకుఁ గారుసేసి.
        సీ      ధైర్యంబు నేమేనఁదగిలి యుండుటఁజేసి
                        చలియించి, మంధరాచలము తిరిగె
                గాంభీర్యమెల్లనీ కడనయుండుట చేసి
                        కాకుత్థ్సుచే  వార్థికట్టువడియె
                జయలక్ష్మి నీయురస్థలిని యుందుట జేసి
                        హరిపోయి బలిదాన మడుగుకొనియె
                ఆకారమెల్లనీ యందయుండుటఁజేసి
                        మరుడు చిచ్చునఁబడి మడిసిచనియెఁ
        గీ      దిక్క దండనాధ! దేవేంద్రపురికినీ
                వరుగుటెఱిఁగి నగము తిరుగుటుడుగు
                నబ్ధికట్టువిడుచు నచ్యుతుకొదమాను
                మరుఁడు మఱలఁగలుగు మగలరాజ!

        సీ      నందినిఁ బుత్తెంచె నిందు శేఖరుఁడునీ
                        వన్న!! యేతెము తారాద్రికడకు
                గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
                        వగసిద్ధతిక్క! కైవల్యమునకు
                హంసను బుత్తెంచె నజుఁడు నీకడకును
                        భయకులమిత్ర! రాబ్రహ్మ సభకు
                ఐరావతమునంపె నమరేంద్రుఁడిప్పుడు
                        దివమునకేతెమ్ము తిక్కయోధ!
        గీ      యనుచు వేఱువేఱ యర్థితోఁ బిలునంగ
                వారు వీరుఁగూడి వచ్చి వచ్చి
                దివ్యయోగియైన తిక్కనామాత్యుడు
                సూర్యమండలంబు సొచ్చిచనియే.

        ఉ      వెన్నెలలేని రాత్రియు రవిప్రభ లేనిదివంబు నీరులే
                కున్న సరోవరంబుఁగ నొప్పగు దీపము లేని యిల్లు నై
                విన్నదనంబునొందె మనవిక్రమసింహపురంబు చూడఁగాఁ
                బున్నమచంద్రుఁ బోలుమన పోలమతిక్కడు లేమినక్కటా!

                 ఏమి తపంబుఁజేసి పరమేశ్వరునేమిటఁ బూజసేసిరో
                   రాముని తల్లియుఁ బరశురాముని తల్లియు భీముతల్లియుఁ
                   గాముని కన్న తల్లియును గంజదళాక్షుననుంగుఁ దల్లియున్
                   శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కనఁగన్న తల్లియున్

                 శ్రీలలరారశత్రువులఁ జెండితివార్యులు మంత్రివర్యులా
                   ర్వేలఘనుల్ నుతించిరలవేర్పు దొరల్ ముదమంది మెచ్చిరో
                   లాలిత శౌర్యధైర్య జయలక్ష్మి ప్రియంబున నిన్వరించెనీ

                   లీలలుహెచ్చెఁ దిక్కని కళేబరమా యిక నిల్చియాడుమా

నెల్లూరు వర్ణణ : నెల్లూరు పట్టణాన్ని వర్ణిస్తూ భీమకవి చెప్పిన పద్యాలు

        సీ      పాలించు నేవీట బ్రహ్మాదివంద్యుండు
                        లీల మూలస్థాన లింగగురుడు
                దీపించు నేవీట దేవాలయంబులు
                        ధావళ్య నవసుధా ధౌతములుగఁ             
                బ్రవహించు నేవీట బ్రహ్మాండ కర్పరం
                        బొరసి మిన్నులు ముట్టనున్న పెన్న
                చెలువందు నేవీట జిరకాలజీవన
                        స్వర్ణాల చెఱ్వు సంపూర్ణమగుచుఁ
        గీ      బ్రజలకును నున్కి సకల సంపదలకున్కి
                భోగములవీడు సురపతివురికి నీడు
                నమ్మికలటెంకి వైరులఁజిమ్ముకొంకి
                భాగ్యనికరంబు నెల్లూరు పట్టణంబు

        సీ      ధీరుఁడై యేలెఁ దిరుకాళదేవుండు
                        తిక్కనాయకుఁడేలెఁ దేజమెసఁగ
                మన్మసిద్ధనయేలె మహిమతో దీపించి
                        దాదినాగనయేలె ధర్మరీతి
                మనుగొండుగోపాల మనుజాధి పతి యేలె
                        స్వర్ణ దేవుండతి ప్రభగనేలె
                గోపినాథుండేలె గుణపయోరాశియై
                        రమణతో శ్రీరంగరమణుఁడేలె
        గీ      తిక్కనయు మఱియిక కొన్నిదినములేలె
                నేలెమీతండ్రి మర్యాదలెల్లఁ గలుగఁ
                గడక నీవేలి తందఱకంటె మించి
                శరధిగంభీర! సంగమక్ష్మాతలేంద్ర!
        సీ      ఏపట్టణంబున నెన్నంగమున్నూట
                        యఱువది దేవాలయంబులుండ
                ఏపట్టణంబున రూపింపనన్నియు
                        నీరేడు బావులింపారుచుండు
                ఏ పట్టణంబుననెల్ల మానవులుఁ బ్ర
                        శస్తిఁగాంచిరి నెఱజాణలనఁగ
                ఏపట్టణంబుననే కాలమును చెన్ను
                        కాల్వలచేత ముక్కాఱుఁబండు
        గీ      శివునికృపఁబుట్టె వేమాల శెట్టి బావి
                పరగజగమెల్ల నెఱుఁగనేపట్టణమున
                నట్టి పట్టణమిలను సౌఖ్యములకునికి
                పట్టనందగు నెల్లూరు పట్టణంబు

        సీ      చరియించితినిగాని జగముమూలస్థాన
                        పరమేశ్వరునివంటి భక్తవరదు
                వివారించితినిగాని వివిధభూములు వల్లి
                        కొంటనాధునివంటి కూర్చువేల్పు
                పరికించితినిగాని బహుదేశములనంత
                        పద్మనాభునివంటి దివ్యమూర్తి
                వీక్షించితిని గాని విశ్వమంతయుఁ బెన్న
                        నదివంటి దివ్యపుణ్యస్రవంతి
        గీ      అరిగితినిగాని దేశదేశాంతరముల
                వేదగిరివంటి పావనోర్వీధరంబు
                గాన నిన్ని విశేషముల్గలిగి ధరఁబ్ర
                సిద్ధికెక్కెఁద్రి విక్రమసింహపురము

నెల్లూరు పట్టణానికి విక్రమ సింహపురము అను పేరు కలదు.
       
        సీ      ఆపట్టణంబున సమరంగఁ దూర్పున
                        మాకందచందన మహితవనము
                ఆ నగరంబున కటుదక్షిణంబునఁ
                        జెలువారు వేమాల సెట్టిబావి
                ఆ యూరి పడమట నంభోజరాజివేఁ
                        బ్రాకటంబైన తటాకమమరు
                నొప్పారు నవ్వీటి కుత్తరదిశయందు
                        మున్నీటి కనయైన పెన్నఁదనరు
        గీ      కలిమి నారాజధాని మార్గంబదెన్న
                బహుళగంధర్వ సింధూర బంధురంబు
                రతనపుం బొమ్మలప్పురి రమణులనఁగ
                వినుతికెక్కెను నెల్లూరి విభవమహిమ.

        శా      మల్లెల్ మొల్లలు సేమమా? శుభములామాకందముల్ జాజులున్
                మొల్లంబారక యుండునా? సుదతులున్ మోదంబువాటింతురా?
                విల్లుం గోలలు వెస్కకుఁ మఱలునా? వేమాలనూయున్నదా?
                నెల్లూరఁ బేదసోమ వీధిన కదా నీరాక జై  హితృ కా 


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...