Friday 24 July 2020

శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి (భీమకవి)

ధర్న సంస్తాపనాయ సంభవామి యుగే యుగే||

            నిరాకారుడయిన పరమాత్మ సాకారుడై అనేక అవతారములెత్తిన కర్మభూమి మన భారతదేశము. ధర్మసంస్తాపనార్థం అవసరమైన ప్రతిసారీ తానే ఈ భూమిపై అవతరిస్తానని గీతలో చెప్పిన విధంగా భగవంతుడు జనులకు దిశానిర్దేశం చేసి, సన్మార్గంలో, భక్తిమార్గంలో నడిపించడానికి ఎందరో యోగులు, ఋషులు, అవధూతలు, గురువుల రూపంలో అవతరించిన వేదభూమి మన భారతదేశము.
          అటువంటి అవతారపురుషులలో అనంతపురము జిల్లా, విడపనకల్లు మండలము నందు గడేకల్లు గ్రామాన వెలసిన శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అగ్రగణ్యులు. సాక్షాత్తు వేదాలకు మూలమైన పరమేశ్వరుని అంశతోతూర్పు గోదావరి జిల్లాలోని వేములవాడలో జన్మించినవారు, అఖిలలోకపాలకాను సుశక్తి సంపన్నులు“శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి”.
నిత్యబ్రహ్మచారిగా ఈయనతన జీవితం తొలిదశలోకవీశ్వరునిగా “శ్రీ వేములవాడ భీమకవిగా” ప్రాశస్త్యం గడించారు. మలిదశలో దైవాంశసంభూతులుగా భక్తకోటి ఆరాధ్య దైవంగా గడేకల్లున “శ్రీభీమలింగేశ్వరస్వామి”గా నిలిచారు.
భీమకవిగా, ద్రాక్షారామ భీమేశ్వరుడి వరప్రసాదంగా అమోఘకవితా శక్తిని కలిగితన పదవాక్కుతోటి అక్షరాలను రెక్కలుగా మార్చివిశ్వవిహారం చేసిన కవియోగి. వాగ్బణమువాక్ఛాతుర్యము కలిగినతన అమోఘవాక్కులతో పాదాశ్రితులకుఆరాధకులకు ఆశీర్వచనాలనువరాలను గుప్పించే నిత్యశుభకరుడుఅఖిలైశ్వర్యప్రదాయకుడు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి.ఉద్దండ కవితావాగ్ధురీణుడైఎందరో ప్రభువులనురాజ్యాధినేతలను తన మృదుమధురపద పద్యపరిమళాలతో రంజింపచేస్తూవారికి కొండంత అండగా నిలిచినిరంతర సత్యాన్వేషణ విచక్షణుడైపరిపాలనాదక్షతలో వారికి మార్గోపదేశం చేసిన రాజగురువుపరిపాలక ప్రావీణదర్శుడు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి.
          

“ఆగతానాగతవేదియు సత్యాన్వేశణ విచక్షనుండును,ఉద్ధండకవితావాగ్ధురీనుండును సకలభూప సభాంతరాళ భీమవాక్య పరిగుంబ్య మాన గుణుండును, సకలదేశవిద్వత్సభా సంమోదశాస్త్రార్థసార కౌశలుండునూ, ఉదారస్వభావుండును, నిగ్రహానుగ్రహసుశక్తిసంపన్నుండును, నిఖిలైశ్వర్యప్రధానాశీర్వాదామోఘవాక్భవుండును, నిరంతర జపతప స్వాధ్యాయ కర్మానుష్ఠాన చరితుండును, నిష్టాగరిష్టుండును, నిర్మల పరిపూర్ణ మానసోదారుండును, నిఖిలాంధ్రదేశ సంచారిత సద్యశోధురంధరుండును, నగు వేములవాడ భీమనామాత్యకవిశేఖరుండు సఖలాంధ్ర జనహృదయాంతరాళంబులనిత్య మంగలప్రదుండగుచు నిరంతర సౌఖ్యప్రధాయియగుచు నితరేతరసమాకర్ష్యమాన సౌఖ్యసంగనితోత్తుంగ సంతతానందవివర్ధమానుండగుచు నిఖిలసంపత్కరుండగుచు, నిర్ణిద్రమాన శోభాకరుండగుచు నిరంతరంబ్రకాశించుచుండునుగాక”



భీమకవిని అందరు నిగ్రహానుగ్రహ సమర్థుడని పిలుస్తారు. ఇదే విషయాన్ని మలకపల్లి పెదశేషయ్య గారు “ఉద్దండకవి వేములవాడ భీమకవి చరిత్ర”లో  ఇలా వివరించారు.

          సీ       తిట్టినతిట్టు మొత్తిన పిడ్గు కై వడి
                           నతి భయంకరముగా నడచి కొట్టు
                   కరుణించి దీవింపఁ గైలాసపతి మెచ్చి
                           యిచ్చిన వరముగా నెసక మెసగు
                   శాపంబు వెట్టిన సద్యోవినిర్భిన్న
                           భక్ష్యభాండమురీతి బయలఁబడును
                   క్రమ్మఱించిన శాప కాండంబు లెల్లను
                           వడిఁబటా పంచలై యడగిపోవు
                   నిగ్రహానుగ్రహ విలాస నియతమాన
                           మానసోల్లాసవర్తి సంపత్ప్రపూర్తి
                   ఘనుడు వేములవాడ భీమన కవీంద్ర
                   చరిత మానందదాయియై వరలుఁగాత

భావము: తిట్టిన తిట్టు, గట్టిగా కొట్టే పిడుగు కన్నా వేగముగా చాలా భయంకరముగా వచ్చి తాకుతుంది. అదే కరుణించి దీవించినపుడు, స్వయానా కైలాసపతైన ఆ పరమేశ్వరుడే ప్రసన్నుడై ఇచ్చిన విధంగా వరాలను గుప్పిస్తారు. శాపము పెట్టిన తక్షణం వికటించిన ఆహారములాగా తీవ్రప్రభావము చూపిస్తూ బయటపడుతుంది. ఉపసంహరించినపుడు, శాపప్రభావమంతా సమూలంగా, వేగంగా పటాపంచలై నశించిపోతుంది.నిరంతరము నిగ్రహ, అనుగ్రహములతో తనలీలలను చూపుతూ, ఎల్లపుడూ ఆనందమైనదాయకమైన మనసుతో ప్రకాశించేవాడు. సంపదలోసగేవాడు. గొప్పవాడు అయిన వేములవాడ భీమకవీంద్రుని చరిత్ర అందరికీ ఆనందమును ప్రసాదిస్తూ ప్రకాశించును గాక!





ఇంతటి గొప్ప మహోన్నతశక్తిభూషణుడు, మహోజ్వలచరితుడి చాటుపద్యాల తేటతెలుగు తీయదనాన్ని నలుగురికీ అందచేయాలని ఆకాంక్షిస్తూ...శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం,, 2017




No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...