Friday 24 July 2020

రాజ కళింగ గంగు-భీమకవి

భీమకవి ఎంత ఉదారగుణము కలవారో, అంతే కోపం కలవారు కూడా. ఈయన   స్వాభిమానం దెబ్బతినేలా ప్రవర్తించినా, ఈయన పట్ల అపరాధము చేసినా, సంకల్పానికి, దారికి అడ్డుతగిలినా, ఎంతటి వారినైనా సనకసనందనాది మునులను తలపించేలా ఆగ్రహము చెంది శాపముతో దండిస్తారు. కానీ తాము చేసిన అపరాధానికి క్షమించమని వేడుకున్న వెంటనే శాంతస్వరూపుడై తన శాపాన్ని తనే పటాపంచలు చేస్తారు. నిగ్రహానుగ్రహశక్తులు రెండు ఈయన సొంతము. అందుకే భీమకవిని అందరు నిగ్రహానుగ్రహ సమర్థుడని పిలుస్తారు. ఇదే విషయాన్ని మలకపల్లి పెదశేషయ్య గారు “ఉద్దండకవి వేములవాడ భీమకవి చరిత్ర”లో  ఇలా వివరించారు.

          సీ       తిట్టినతిట్టు మొత్తిన పిడ్గుకై వడి
                   నతి భయంకరముగా నడచి కొట్టు
                   కరుణించి దీవింపఁ గైలాసపతి మెచ్చి
                   యిచ్చిన వరముగా నెసక మెసగు
                   శాపంబు వెట్టిన సద్యోవినిర్భిన్న
                   భక్ష్యభాండమురీతి బయలఁబడును
                   క్రమ్మఱించిన శాప కాండంబు లెల్లను
                   వడిఁబటా పంచలై యడగిపోవు
                   నిగ్రహానుగ్రహ విలాస నియతమాన
                   మానసోల్లాసవర్తి సంపత్ప్రపూర్తి
                   ఘనుడు వేములవాడ భీమన కవీంద్ర
                   చరిత మానందదాయియై వరలుఁగాత

భావము: తిట్టిన తిట్టు, గట్టిగా కొట్టే పిడుగు కన్నా వేగముగా చాలా భయంకరముగా వచ్చి తాకుతుంది. అదే కరుణించి దీవించినపుడు, స్వయానా కైలాసపతైన ఆ పరమేశ్వరుడే ప్రసన్నుడై ఇచ్చిన విధంగా వరాలను గుప్పిస్తారు.
శాపము పెట్టిన తక్షణం వికటించిన ఆహారములాగా తీవ్రప్రభావము చూపిస్తూ బయటపడుతుంది. వెనక్కి తీసుకున్నపుడు, శాపమంతా సమూలంగా, వేగంగా పటాపంచలై నశించిపోతాయి.నిరంతరము నిగ్రహ,అనుగ్రహములతో లీలలను చూపుతూ, ఎల్లపుడూ ఆనందమైన మనసుతో ప్రకాశించేవాడు. సంపదలు ఒసగేవాడు. గొప్పవాడు అయిన వేములవాడ భీమకవీంద్రుని చరిత్ర అందరికీ ఆనందమును ప్రసాదిస్తూ ప్రకాశించును గాక!

        తన రాజ్యానికి వచ్చిన భీమకవిని రాజకళింగగంగు సగౌరవంగా ఆహ్వానించకపోగా,గర్వంతో భిక్షగాడికి వలెమళ్ళీ రమ్మని భటునితో కబురంపాడు.భీమకవి ఆగ్రహానికిగురై రాజకళింగగంగు, రాజ్యమునుకోల్పోయి, నీడలేక, పూట గడవక భిక్షగాడిగా మారాడు. ఊరూరు తిరుగుతూ, భీమకవికే ఎదుటపడి ఒకపూటకు భోజనం పెట్టమని అడిగే పరిస్థితి తెచ్చుకున్నాడు.పశ్చాత్తాపము చెంది, తన తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. తన తప్పును సరిదిద్దుకొనే అవకాశమును ఇవ్వమని కోరాడు. భీమకవితాను ఇచ్చిన శాపమును ఉపసంహరించుకొని, అతని రాజ్యమును తిరిగి పొందేలా అనుగ్రహించారు.
        రాజసందర్శనాలను చేస్తూ కవిత్వమును చెబుతున్న భీమకవి ఒకనాడు సెజ్జనగరం వెళ్ళారు. కళింగగంగురాజు సెజ్జనగరాన్ని పాలిస్తునాడు.భీమకవి కళింగగంగు ఆస్థానానికి వెళ్ళి అక్కడి భటులతో “తమరిని కలవడానికి భీమకవి వచ్చారని కళింగగంగురాజుతో  చెప్పమని” కబురు పంపారు. కళింగగంగునుంచి ఎటువంటి సమాధానం రాక పోగా మరుసటి రోజున కలుద్దామని ఆ రోజుకు వెనుదిరిగివెళ్ళారు. మరుసటి రోజు ఆక్కడి భటుడితో  ఈ క్రింది విధంగా కళింగ గంగుకు రాయభారమును పంపారు.

                 “వేములవాడయందు ఘన విశృత కీర్తిఁ జెలంగ నందఱున్
                   భీమకవీంద్రుఁడంచు నను బెద్దగ నన్నుతిఁ జేయ సజ్జన
                   స్తోమము లెల్ల సంతసిల్ల దుర్జను లెల్లను భీతి నొందఁగా
                   బ్రేమను దక్షవాటి పుర భీమకృపాపరి లబ్ధ తేజుఁడన్

భావము:  వేములవాడలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన వాడిని (లోకప్రసిద్దుడను)  అందరూ నను చూసి  భీమకవీంద్రుడని గొప్పగా పొగుడుతారు. సజ్జనసమూహము నను చూసి సంతోషించగా,దుర్జనులంతా భయపడుతారు. దక్ష పురవాసి అయిన భీమేశ్వరుని ప్రేమ,కృప కలిగి  వెలుగొందుతున్న వాడను.

                   చెప్పెదనింపుగాఁగవిత శ్రేష్ఠవచః పరిగమ్య మానమై
                   యొప్పఁగ మంచి చెడ్డగను నోగును బాగగునట్లుగా మఱిన్
                   గొప్పనుఁగొద్దిగాఁదవిలి కొద్ది పదార్థము గొప్ప సేయ నా
                   కెప్పుడు శక్తిఁగల్గు జగదీశ్వర నానుడులాలకింపుమా

భావము: కవిత చెబుతాను వినసొంపుగా,మిక్కిలి గొప్పగా (సాటిలేని విధంగా), బాధలన్నీ మరపించేలాధారాళంగా,  మంచిగాను(అనుగ్రహం)చెడ్డగానూ(దండన), దోషాలన్నీ బాగయ్యేలాఇంకా గొప్పను కొద్దిగా, కొద్దిని గొప్పగా చేసేలా  అద్భుతంగా అన్ని కాలాలయందు అప్పటికప్పుడుకవిత్వమును చెప్పగల శక్తి కలదు నాకు. నా కవిత్వమును  ఆలకించుమా!.
        కళింగగంగు “అయ్యా! నీవు మహానుభావుడవు అని తెలుసు! కానీ నీవు తగిన సమయాన రాలేదు. నేను రాజకార్యములతో కొంచెం కూడా తీరిక లేకుండా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి ఈ సందడి తీరిన తర్వాత ఒకసారి వచ్చి కనపడండి. అప్పుడు మిమ్ములను సత్కరిస్తాను.” అని కబురు పంపాడు. సహజంగా రాజులు గర్వగ్రంథులు. లక్ష్మి యొక్క సన్నని నీలిపొరలు రాజుల కళ్ళకు కప్పి ఉంటాయి. ఆ నీలిపొరలుచిన్న పెద్ద తారతమ్యాలు కనపడనీయవు. భీమకవికి భిక్షమేస్తున్నట్లు సత్కారం కోసం ఇంకో రోజున రావాలా?
        “కవీంద్రుడను.రాజసందర్శనార్థం వచ్చాను. నాకు ఎదురేగి సాదరముగా ఆహ్వానించకకుండా ఇది అనుచిత సమయం కాదు. సందడి తీరిన తర్వాత రమ్మంటాడా? సరస్వతీ కటాక్షమున్న కవులన్న ఎంతటి నిర్లక్ష్యభావం” అనిఅతని గర్వానికి కారణమైన అతని సిరిసంపదలు కోల్పోయేలా, శాపం పెడుతూ ఈ పద్యమును భటులతో రాజుకి అందించమని ఇచ్చిఅక్కడి నుంచి వెళ్ళిపోయారు.

                 వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగ గంగు తా
                   సామము మాని కోపమున సందడిఁదీఱిన రమ్ము పొమ్మనెన్
                   మోమునుఁజూడ దోషమిక ముప్పది రెండు దినంబు లావలన్
                   జామున కర్ధమందతని సంపద శత్రుల పాలుగావుతన్

భావము:వేములవాడ భీమకవి వేగిరపాటు (తొందర) చూసిన తర్వాత కూడా కళింగ గంగు కనీసం ఉభయకుశల ప్రశ్నలు వేయకుండా, కోపముతో ఇప్పుడు వెళ్ళి సందడి తీరిన తర్వాత రమ్మన్నాడు. మోము చూడని తప్పుకు(నను ఆలకించని తప్పుకు) ముప్పది రెండు దినాల తర్వాతి వేకువజాములోపు అతని సంపద (రాజ్యం) శత్రువుల పాలు గాక తప్పదు.

        భీమకవి శాపమును తప్పించడానికి ఎవరికి సాధ్యం? శాపము పెట్టిన మరుసటి రోజే వంగదేశాన్ని పాలించు విక్రమదేవుడను రాజు నలబై వేల కాలినడక సైన్యమును, మూడు వందల ఏనుగుల బలమును, నాలుగు వందల తొంబై ఐదు గుర్రాల సైన్యమును, నాలుగు వందల శతఘ్నులను(వందమందిని చంపగల యోధులను) సమకూర్చుకొని, సెజ్జనగరముపై దాడిచేసి కోటను ముట్టడించాడు.
        కళింగగంగు తన పూర్తీ సైన్యముతో ఎదుర్కొని విక్రమదేవునితో యుద్ధము చేసాడు. దాదాపు ఇరవై ఎనిమిది రోజులపాటు ఘోరయుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో కళింగ గంగు సైన్యము ప్రాణాలొడ్డి పోరాడారు. విక్రమదేవుని సైన్యములో సగభాగము కళింగగంగు సైన్యముచే నాశనము అయ్యింది. ఇరవైతొమ్మిదవ రోజున జరిగి యుద్ధంలో అనుకోని విధంగా విక్రమదేవుని సైన్యం విజృంభించి పోరాడింది.  కళింగగంగు విక్రమదేవునికి దొరకిపోయాడు. రాజు శత్రువుల చేతికి దొరికేసరికి మిగిలిన సైన్యము నాలుగు దిక్కులా పలాయనమయ్యింది. విక్రమదేవుడు ఇక యుద్ధాన్ని ఆపివేసి, కళింగగంగును బంధించి తన శిబిరానికి తీసుకు వెళ్ళాడు. మిగిలిన సైన్యం తమ రాజును విడిపించుకోవడానికి వచ్చే అవకాశము ఉన్నందున కళింగనగరములోకి ప్రవేశించే వరకు శత్రువులను ఎదుర్కొనేవిధంగా సైన్యాన్ని  అప్రమత్తపరచి జాగ్రత్తపడ్డాడు. మరుసటి రోజున సెజ్జనగరం ప్రవేశించి, కళింగగంగును కారాగారంలో బంధించి, పట్టము కట్టుకున్నాడు.
        “రవి చంద్రులు గతి తప్పిన లవలేశము తప్పబోవు నా వచనంబుల్” అన్న భీమకవి మాటలు వ్యర్థము కావు కదా? ఖచ్చితంగా 32 రోజుల తర్వాత తెల్లవారే లోపు కళింగ గంగు రాజ్యబ్రష్టుడైయ్యాడు.
        విక్రమదేవుడు కళింగగంగు రాజ్యపాలనా పద్దతులు  చక్కగా ఉండడంతో, అక్కడి ప్రజల మర్యాదలు బాగా నచ్చడంతో అదే అధికారవర్గముతో కొంతకాలము రాజ్యమును పాలించాడు.
        ఇదిలా ఉండగా అతనికి వంగరాష్ట్రములో ప్రజల మధ్య కక్షలేర్పడ్డం వలన సామాన్యప్రజలకు అలజడి కలుగుతోందని కబురువచ్చింది.విక్రమదేవుడు, సిరియాళుడనే  దండినాథుడిని తన రాజప్రథినిధిగా నియమించి, శాంతి సంస్థాపన చేయడానికి వంగ రాష్ట్రమునికి వెళ్ళాడు. సిరియాళుడు ఎంతో చక్కగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. కొన్ని రోజులకు కళింగ గంగుపైజాలి కలిగికారాగారము నుంచి తన ఆస్థానముకు రప్పించి “నిన్ను చెర నుంచి విముక్తున్ని చేస్తున్నాను. ఈ దేశమును వదిలి ఎక్కడికైనా దూరముగా వెళ్ళి బ్రతుకు.మళ్ళీ ఈ దేశముకు తిరిగి వస్తే నీ ప్రాణాలు దక్కవు జాగ్రత్తా.” అని మందలించి పంపాడు.
        కళింగగంగు నానా దేశాలు తిరుగుతూ కూటికి, గుడ్డకు నోచుకోని పేదవాడయ్యాడు. సుఖాలకు బాగా అలవాటుపడిన వాడగుటచే కూలి పని చేయలేక బిచ్చమెత్తుకుంటూ జీవితం గడిపాడు. ఇతర రాజ్యాలలో తననెవరూ చూసి ఎరుగరు కాబట్టి తనకు ఎటువంటి స్వాభిమానము అడ్డురాలేదు. వంట చేసుకొనే ఓపిక సత్తువలేక అన్నమో, గంజో యాచించుకొని పొట్ట నింపుకుంటూ కాలము గడిపాడు. కళింగగంగు భార్యలు ముగ్గురూ సిరియాళుడి వద్ద ఊడిగము చేసుకుంటూ గడిపారు. 
        కళింగగంగు, భీమకవిని క్షమించమని అడిగి ఈ కష్టాలనుంచి బయటపడాలని  తపించాడు. శాపవిమోచనముకై ప్రార్థించి, తన తప్పును సరిదిద్దుకొనే అవకాశము కోసం ఎదురుచూసాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక కళింగగంగు ఊరూరు తిరుగుతూ పెద్దాపురం చేరాడు. ఒకనాటి రాత్రి భీమకవి బంధువుల ఇంట్లో భోజనంచేసి వీధి అరుగుపై చేయి కడుక్కోవడానికి వచ్చారు. అపుడు రాత్రి నాలుగు ఘడియల సమయం. కళింగగంగుతిండి కోసం ఇల్లిల్లూ తిరుగుతూ భీమకవి ఉన్న ఇంటి వైపుకు వచ్చాడు. వస్తుండగా మార్గమధ్యంలో జొన్నలు పాతరనేయుటకై త్రవ్వబడిన ఒక పాత గోతిలో పడ్డాడు. వెంటనే అయ్యో ఒక కాలిదివిటీ కూడా లేకపొయేనే! ” అని గట్టిగా అరిచాడు. భీమకవి ఆ చీకటిలో అతని వైపుకు చూసి బిచ్చమెత్తుకొనువాడికి కాలిదివిటీ ఎక్కడినుండి వస్తుంది. బిచ్చగాడే అయితే కాలిదివిటీ ఎందుకు గుర్తొచ్చింది. ఇతడిట్లు అన డానికి ఏదో బలమైన కారణమేఉంటుందని గ్రహించి, “ఎవరు నువ్వు? దివిటీ కావాలంటున్నావు?” అని అడిగాడు. కళింగగంగు “అయ్యా! నేను వేములవాడ భీమకవి చేసిన బికారిని. పూర్వము అష్టైశ్వర్యములను అనుభవించి ఉండటం వల్ల అప్రయత్నంగా దివిటీ అయినాలేదే అన్నాను. నా దర్శనార్థం సాక్షాత్తు  భీమేశ్వరుని వరపుత్రుడగు భీమకవి వచ్చారు.కనీసం ఆ మహానుభావుని దర్శనం కూడా  చేసుకోలేదు.అందుకు తగిన ఫలితాన్ని ఇలా అనుభవిస్తున్నాను. అయ్యా! తమరెవరో మహానుభావుడిలా ఉన్నారు. ఈ ఒక్కపూటకు  నాకు భోజనము పెట్టించండి. ఆకలితో కడుపు దహించుకు పోతోంది. ” అని ధీనస్వరంతో అడిగాడు.
        భీమకవికి మహారాజును ఈ పరిస్థితిలో చూడగానేఎంతో జాలి కలిగింది. ఇక ఇతన్ని ఈ అవస్థలో చూడకూడదని తలచి,తిరిగితన రాజ్యాన్ని పొందేలా ఆశీర్వదిస్తూ, ఈ క్రింది పద్యమును చెప్పారు.

                 వేయి గజంబులుండఁబది వేల తురంగములుండఁ నాజిలో
                   రాయలగెల్చి సెజ్జనగరంబునఁ బట్టముఁ గట్టుకోవడిన్
                   రాయకళింగ గంగు! కవిరాజభయంకరమూర్తిఁజూడగా
                   బోయిన మీనమాసమునఁ బున్నమవోయిన షష్ఠినాఁటికిన్

భావము: రాజ కళింగగంగు! మహా రాజులకు సైతం వణుకు పుట్టించగల కవి అయిన నేను, భవిష్యత్తును చూస్తూ పోతేవెయ్యి ఏనుగులు, పదివేల గుర్రములు నీ చెంత ఉన్నాయి. త్వరగా యుద్ధంలో రాయలను గెలిచి, మీన మాసములో పున్నము తర్వాత వచ్చే షష్ఠి రోజుకంతాసెజ్జనగరమున పట్టము కట్టుకో.
        కళింగగంగు అమితానందభక్తి పరవశుడై, భీమకవికి సాష్టాంగ ప్రణామము చేసాడు. జరిగిన తప్పుకు మన్నించమని వేడుకొని నిలబడ్డాడు.కళింగగంగును భీమకవి లోనికి పిలుచుకు వెళ్ళిభోజనము పెట్టించారు. మరుసటి రోజున కళింగగంగునకు పెద్దాపురము నుంచి సెజ్జనగరము వెళ్ళుటకు దారి బత్తెము ఖర్ఛులకు సరిపడా డబ్బు ఇచ్చి పంపారు.  కళింగగంగు ఆవస్థను బట్టి రూపము మారిపోవడం వలన సెజ్జనగరంలో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అతని తలంతా పెరిగిపోయిన జుట్టుతో,దుమ్ముధూలితో జడలుగా కట్టుకుపోయింది. గడ్డము, మీసాలు బాగా పెరిగిపోగా, బక్కచిక్కిపొయి ముడతలుపడ్డ శరీరముతో  ఉన్న కళింగగంగును మహా రాజుగా, మకుటధారిగా చూసిన జనం ఇప్పుడెలా గుర్తు పట్టగలరు.
        చాలా రోజులుగా పగటివేషగాళ్ళు కొందరు సెజ్జనగరానికి వచ్చి ప్రభువు విక్రమదేవుని సందర్శించి, వీధుల్లో పగటివేషాలను వేస్తూ, వారి నైపుణ్యంతో పట్టణప్రజను ఆనందడోళికల్లో ముంచెత్తుతున్నారు. రాజకళింగగంగు సెజ్జనగరము చేరునప్పటికి సిరియాళుడు ఆ నగరమును పాలించుటలేదు. సిరియాళుడు వైరాగ్యము కలగడంతో, రాజ్యమును వదిలితపోవనాలకు వెళ్ళిపోయాడు. విక్రమదేవుడికి, సిరియాళుడి తర్వాత సరైన పరిపాలనాదక్షుడు దొరకలేదు. వంగదేశము పాలించుటకు తన పెద్దకుమారుడైన ఆనందదేవుని నియమించి సెజ్జనగరానికి తిరిగివచ్చాడు.
        విక్రమదేవుడికి పగటివేషాలన్నా, వీధినాటకాలన్నా చాలా ఇష్టము. అందువల్ల ఆ పగటివేషగాళ్ళకు కావలసినంత డబ్బిచ్చి వారిచే బ్రాహ్మణ, సన్యాసి, వేశ్యాది వేషములను వేయిస్తూ సంతోషముగా కాలము గడిపేవాడు. ఒకనాడు వారిని తన వేషము వేసి వినోదింపచేయమని ఆదేశించాడు.రాజు ఆదేశము ప్రకారమే వారి నాయకుడు విక్రమదేవుని వేషమును వేయగా తక్కినవారు సభాపతుల వేషమును వేసి అందరినీ అలరించారు. ఇంకో రోజు కళింగగంగు వేషమును వేసుకురావలసినదిగా, అలా చేసి తనను అలరించినట్లయితే విశేషద్రవ్యమును బహుమతిగా ఇచ్చెదనని ప్రకటించాడు. ఆ వేషగాళ్ళు కళింగగంగు రాజసము,అతని ఠీవిని గురించి వినడమే కానీ,ఎన్నడూచూసి ఎరుగరు. అందుకు వారి నాయకుడు “ మహారాజా! మాకు ఒక నెల రోజులు గడువు ఇవ్వండి. అభ్యాసము చేసి చక్కగా కళింగ గంగు వేషమును వేసి అలరింపచేస్తాము” అని ప్రార్థించాడు. విక్రమదేవుడు కూడా అందుకు సరే అన్నాడు. అంతేకాక వారికి నెల రోజులకు వసతినీ, సరిపడా కావలసిన వంటపదార్థాలను ఇచ్చాడు. ఆ వేషగాళ్ళందరు కళింగగంగు వేషానికిసాధన మొదలుపెట్టారు. కానీ వారిలో ఒక్కరిలో కూడా ఆ రాజఠీవి కనపడలేదు. విక్రమదేవుడు ఇచ్చిన గడువు దగ్గరపడుతోంది, కానీ వారికి ఆ వేషం వేయగల సమర్థుడు మాత్రం దొరకనేలేదు. వారి ధైర్యము కూడా రోజు రోజుకు  తగ్గిపోతోంది. చివరకు వేషము వేసే వాడికి వేయి గద్యాణములు బహుమతిగా ఇస్తామని చాటింపు కూడా వేయించారు. ఈ చాటింపు అప్పుడే సెజ్జనగరములో అడుగుపెట్టిన కళింగగంగు చెవినపడింది. ఆ వేషగాళ్ళ నివాసస్థలానికి వెళ్ళాడు. వారితో “ఈ వేషమునునేను వేయగలను.కళింగగంగును చూసిన వాడిని. అంతేకాక నేను ఆ రాజు పోలికలు కలిగినవాడిని. మా ఊరి వారంతా నేనుఅచ్చం కళింగగంగులా ఉంటానని చెబుతారు. ఆ ద్రవ్యమేదో నాకు ఇప్పించండి. ఆ వేషమును నేను వేస్తానని” వారినిఒప్పించాడు. ఈ వేషమును వారు ఎందుకువేయాల్సివచ్చిందో అడిగి తెలుసుకున్నాడు. విక్రమదేవునిపై ఎత్తువేయడానికి తగిన అదను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వేషగాళ్ళు కళింగగంగుకు భోజనవసతులను కల్పించారు. వారము రోజులలోనే బక్కచిక్కిన అతని దేహము పుష్ఠిగా అయ్యింది. వేషమునువేసే రోజుకంతా మునుపటి తేజస్సును పొందాడు. కోటలోనే ఉన్న కళింగగంగు దుస్తులను, ఆభరణాలను, ఆయుధాలను, గుర్రాన్ని రాజుగారికి కబురు పంపి తెప్పించుకున్నాడు. విపరీతముగా పెరిగిపోయిన గడ్డాన్ని తీసివేయించడానికిమంగలిని పిలిచించుకున్నాడు. ఆ మంగలితో కళింగగంగుకు మునుపు ఎలా క్షవరము చేసేవాడివోతనకు కూడా అలానే చేయమని చెప్పాడు.అర్ధక్షవరముఅవ్వగానే ఇతనుస్వయాన తన రాజు కళింగగంగేనని గుర్తుపట్టాడు. తమ రాజుపట్ల అభిమానమున్న వాడు కావున “మహారాజా నేటికి తమరి దర్శన భాగ్యము కలిగినది” అని సంతోషముతో బదులిచ్చాడు. కళింగ గంగు అతనిని ఈ విషయమునుఎక్కడా ప్రస్తావించకుండా, మనసులోనే ఉంచుకొని,  జరగబోయేది చూడమనిఆదేశించాడు. స్నానాదికాల తర్వాత వస్త్రాధ్యాలంకారములు ధరించి, తన వజ్రాయుధమును తీసుకొని తానుపూర్వము ఎక్కే గుర్రమును అధిరోహించి వీధిలోకి వెళ్ళాడు. వేషగాళ్ళందరూ వాళ్లకు తగిన మంత్రి, సామంతాది వేషాలను వేశారు. గుర్రం కూడా తన యజమాని కళింగగంగును గుర్తుపట్టి మిక్కిలి ఉత్సాహముతో కదంతొక్కింది. చూసినవారందరూ అచ్చం కళింగగంగురాజులానేఉన్నాడే అని ఆశ్యర్యపడ్డారే, కానీఒక్కరు కూడా అతడు కళింగగంగురాజేనని ఊహించలేకపోయారు. రాజకళింగగంగు తిన్నగా కోటలోకి ప్రవేశించి, విక్రమదేవుని ఎదుటకు వెళ్ళి,గుర్ర్రంనుంచి దిగి నిలబడ్డాడు. విక్రమదేవుడు కూడా అందరిలాగే అచ్చం రాజకళింగగంగులానే ఉన్నాడని అతన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు.కళింగగంగు “మహారాజా! తమరు అనుమతిస్తే కళింగగంగు రాజఠీవిని, గాంభీర్యాన్ని ప్రదర్శించి చూపిస్తాను” అని చెప్పాడు. విక్రమదేవుడు మిక్కిలి ఉత్సాహముతో, అలానే త్వరగా చేసి చూపించమని అడిగాడు. కళింగగంగు నిండు సభలో తన గుర్రాన్ని ఆవైపు నుంచి ఈ వైపుకు, ఈ వైపు నుంచి ఆ వైపుకు దుమికిస్తూ, మధ్యమధ్యలో తన వజ్రాయుధమును తీసి ఝుళిపిస్తూ, విక్రమదేవుని దగ్గరగాపోయి రెప్పపాటిలో తన ఆయుధంతో విక్రమదేవునితల నరికేసాడు. వేషగాళ్ళందరూ తమకు ఏ శిక్ష పడుతుందో ఏమోనని భయపడగా, కళింగగంగు అక్కడివారందరినీ ఉద్దేశించి “నేను వేషగాడిని కాదు. మీ కళింగగంగురాజును. భీమకవిని కలిసి, ఆయన్నుంచి శాపవిమోచనము పొందివచ్చాను.ఆయన ఆదేశానుగ్రహాల వలన ఈవిధంగామన శత్రువును తుదముట్టించి మన రాజ్యమును చేజిక్కించుకోగలిగాను. ఇక అందరూ అప్రమత్తులై జరుగాల్సిన పనుల చూడమని ఆదేశించాడు.విక్రమదేవుని దహన సంస్కారాలను జరిపించాడు. ఈలోపు విక్రమదేవుని అనుచరగణము,అతని సైన్యము ఏకమై, కళింగగంగుపై యుద్ధానికి సిద్ధపడ్డారు. విక్రమదేవుని సైన్యంపోగా,భీమకవి భవిష్యత్తు చూసి చెప్పిన ప్రకారముగానే 1000 ఏనుగులు 10,000 గుర్రలసైన్యము కళింగగంగు పక్షాన నిలిచింది. ఈ సారి భీమకవి ఆశీర్వాదబలము ఉన్నందునకళింగగంగు తిరుగులేని విజయముతో షష్ఠిలోపు పట్టాభిషేకము చేసుకొని సింహాసనము అధిష్టించాడు.
పట్టాభిషేకము తర్వాత తనకు సహాయం చేసిన వేషగాళ్ళను, మంగలిని తగిన పారతోషికము ఇచ్చి సంతోషపెట్టాడు. భీమకవిని తానే స్వయంగా వెళ్ళి తన ఆస్థానమునకు సభక్తియుక్తంగా పిలుచుకువచ్చి పూజించాడు. తగిన విధంగా సత్కరించాడు. నాటి నుండి భీమకవి కొంత కాలము అతని ఆస్థానమునే ఉండి, రాజ్యపాలనలో సహాయపడుతూ కళింగగంగును అనుగ్రహించారు. ప్రజలు కూడా తమ సమస్యలకు పరిష్కారములము పొందుతూ మిక్కిలి భక్తియుక్తులతో మెలిగేవారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...