Friday 24 July 2020

రణతిక్కన పై చెప్పిన అద్భుత చాటువులు


        రణతిక్కన రణనిహతుడైనపుడు అతని గుణగణాలను, అతని శౌర్యపరాక్రమములను వర్ణిస్తూ చెప్పిన అద్భుతపద్యాలు.


        చ      పదటునవాజిరాహుతుల పై దుమికించుచుఁదిక్కఁడార్చినన్
                బెదిరిపరిభ్రమించికడుఁ బిమ్మట వీరులు భీత చిత్తులై
                యదె! యదె! వాలువాల్మెఱుఁగులల్లదె! యల్లదెయాతడంచనఁ
                గొదుకకయాజిసే సెరిపుకోటుల కందఱకన్ని రూపులై


        భావము: శత్రుసైనిక సముదాయాల్ని భయభ్రాంతులను చేసి “ అదిగో అదే తిక్కన కత్తి తళతళలు, అదే వెలుగు, అదిగో అతను ఇక్కడ ఇక్కడ అని ప్రతి యోధుడూ అనుకొనేలా అందరికీ అన్ని రూపాలుగా కనిపించే వేగంతో రణతిక్కన యుద్ధం చేశాడు. ప్రాణాలకు తెగించిన ఆ మహాశూరుని ముందు ఏవరూ నిలువలేక పోయారు.

  

        ఉ      చిక్కక మన్మసిద్ధివిభుచేమును గొన్న రుణంబుదీర్చె మా
                తిక్కనమంత్రిసోమశిల దేవరసాక్షిగఁ బెన్న సాక్షిగా
                నెక్కినవాజిసాక్షిగ మహిన్నుతికెక్కినకీర్తి సాక్షిగా
                స్రుక్కక మారుకొన్న రణశూరులు సాక్షిగఁ గొండ సాక్షిగన్


భావము: సోమశిల దేవుని సాక్షిగా, ప్రవహించే పెన్నానది సాక్షిగా, ఎక్కిన గుర్రము సాక్షిగా, ఈ భువిలో పేరుకెక్కిన కీర్తి సాక్షిగా, భయపడి వెనుదిరగక పోరాడిన యుద్ధవీరుల సాక్షిగా, ఆ కొండ సాక్షిగా, మన రణతిక్కన మన్మసిద్ధిరాజు రుణమును తీర్చుకున్నాడు.


        సీ      రణరంగమున మోహరంబులఁబొడగని
                        ప్రాణంబువాసిన వందగజమ!
                విజయాధిపునిదాడి వెనుకొని తగులంగ
                        దెసదప్పి పాఱిన దిగ్గజంబ!
                చేరఁజాలక తిర్గి చేమడ మళ్లించి
                        మంచానకందనీ మదగజంబ!
                పెనుతుల్లిచెఱ్వులోఁ బిరుదులన్నియుఱొంపిఁ
                        గ్రుంగంగఁద్రొక్కిన కుంజరంబ!
                నేడు మొదలుగాఁగ నెల్లూరుపురములోఁ
                బొగడుతనము సేయు మగలతలలు
                వూరిఁగఱచితిక్క! భూతమైసోకుము
                యూరివారిసోఁకుఁ గారుసేసి.


భావము: యుద్ధరంగములోశత్రువ్యూహాలకు అందక ప్రాణాలొడ్డిన మహాయోధుడా. విజయాధిపతిని సైతం వెంబడించి వెళ్ళి దిక్కు తప్పి వచ్చిన దిగ్గజమా (భూమిని ఎనిమిది దిక్కులలో మొసే ఏనుగులకు దిగ్గజము అని పేరు)

ఎక్కడా (ప్రాణాలకై) చేయిచాచి  అర్థించక  పోరాడిన మదగజమా, పెనుతుల్లి చెరువులో నీ బిరుదులన్నిటినీ వేసి అనగదొక్కిన మహాగజమా, నేటి నుంచి నెల్లూరులో నిను పొగడేవారిని, ఈ ఊరి వారిని వదలబొకు తిక్కనా!! భూతమై ఈ  వూరి వారిని పట్టు!!


        సీ      ధైర్యంబు నీ మేనఁ దగిలి యుండుటఁ జేసి
                         చలియించి, మంధరాచలము తిరిగె
                గాంభీర్యమెల్ల నీకడన యుండుటఁ జేసి
                        కాకుత్థ్సుచే  వార్ధి కట్టువడియె
                జయలక్ష్మి నీయురస్థ్సలిని యుండుటఁ జేసి
                        హరి పోయి బలి దాన మడుగుకొనియెఁ
                ఆకారమెల్ల నీయంద యుండుటఁ జేసి
                        మరుడు చిచ్చునఁ బడి మడిసి చనియెఁ

        గీ      దిక్క దండనాధ! దేవేంద్రపురికి నీ
                పరుగు టెఱిఁగి నగము తిరుగు టుడుగు
                నబ్ధి కట్టువిడుచు నచ్యుతుకొద మాను
                మరుఁడు మఱలఁ గలుగు మగలరాజ!


భావము: తన ధైర్యసాహసాలను నీ దగ్గర ఉంచి మంధరాపర్వతుడు సాగరమధనానికి వెళ్ళాడు. ఉవ్వెత్తున ఎగసే అలలతో ఎగసిపడే సముద్రుడు తన గాంభీర్యమంతటినీ నీ చేతుల్లో పెట్టి కాకుత్థ్సుడికి కట్టుబడిపోయింది. తన జయలక్ష్మిని నీ వద్దకు చేర్చి విష్ణుమూర్తి బలి చక్రవర్తి వద్దకు బలిదానముకై వెళ్ళాడు. తన రూపాన్ని నీకిచ్చివేసి ఆ మన్మధుడు శివుని కంటి మంటకు కాలి చనిపోయాడు. ఓ తిక్కన మంత్రి! దేవేంద్రపురి వైవు నీ పరుగు తెలిసి, ఇక ఈ భువిలో ధైర్యసాహసాలకు, గాంభీర్యానికి, విజయలక్ష్మికి, అందానికి సరైన ఆశ్రయము లేదని తలచి మంధరాపర్వతుడు పరిభ్రమను ఆపివేసాడు. సముద్రుడు కట్టువిడిచి ఉప్పెనలా ఎగసి పడ్డాడు. విష్ణువు (బలిదానమపుడు భీకరరూపం దాల్చిన విష్ణువు) చిన్నగా తగ్గిపోయాడు. మన్మధుడు తన రూపాన్ని సంతరించుకొని జీవము పొందాడు. పైన చెప్పిన వారందరికీ రణతిక్కన ఎంతో ప్రీతిపాత్రుడు అని భావము.


        సీ      నందినిఁ బుత్తెంచె నిందు శేఖరుఁడునీ
                        వన్న!! యేతెము తారాద్రికడకు
                గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
                        వగసిద్ధతిక్క! కైవల్యమునకు
                హంసను బుత్తెంచె నజుఁడు నీకడకును
                        భయకులమిత్ర! రా బ్రహ్మ సభకు
                ఐరావతమునంపె నమరేంద్రుఁడిప్పుడు
                        దివమునకేతెమ్ము తిక్కయోధ!

        గీ      యనుచు వేఱువేఱ యర్థితోఁ బిలువంగ
                వారు వీరుఁగూడి వచ్చి వచ్చి
                దివ్యయోగియైన తిక్కనామాత్యుడు
                సూర్యమండలంబు సొచ్చిచనియే.


భావము : రణతిక్కన వీరమరణం పొందిన తర్వాత పరమేశ్వరుడు తన వాహనమైన నందిని పంపి కైలాసమునకు ఆహ్వానించాడు. శ్రీ మహావిష్ణువు గరుడుని పంపి వైకుంఠమునకు రమ్మని, కైవల్యమును ప్రసాదిస్తానని ఆహ్వానించాడు. హంసను పంపి బ్రహ్మదేవుడు మిత్రమా!  బ్రహ్మసభకు రమ్మని ఆహ్వానించాడు. ఇక ఇప్పుడు ఇంద్రదేవుడు తన ఐరావతమును పంపి తిక్కనయోధున్ని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. హరిహర బ్రహ్మాదిదేవతలే తమ లోకాలకు రమ్మని తమ తమ వాహనాలను పంపిస్తే దివ్యయోగి అయిన ఆ తిక్కనామాత్యుడు అవేవీ ఆశించక సూర్యమండలాన్ని ఛేదించుకొని అపునరావృత్తలోకాలకు వెళ్ళిపోయాడు.


        ఉ      వెన్నెలలేని రాత్రియు రవిప్రభ లేనిదివంబు నీరులే 
                కున్న సరోవరంబుఁగ నొప్పగు దీపము లేని యిల్లు నై
                విన్నదనంబునొందె మనవిక్రమసింహపురంబు చూడఁగాఁ
                బున్నమచంద్రుఁ బోలుమన పోలమతిక్కడు లేమినక్కటా!


భావము: పున్నమి చంద్రుడిని పోలిన పోలమతిక్కడు లేకపోవడం వల్ల మన విక్రమసింహపురము(నెల్లూరు పట్టణము) వెన్నెలలేని రాత్రిలాగా, రవిప్రభ(సూర్యకాంతి) లేని దినంలాగా, నీరు లేని సరోవరంలాగా, దీపం లేని ఇల్లు లాగా వెలవెల బోయింది.


        క      గుణముల నిధానమగు మన
                రణతిక్కన తాఁగళేబరంబును శిరమున్
                గణక మెయిఁ గలయఁ బ్రదుకునుఁ 
                బ్రణుతాఖిల వైరి మకుట భాసిత పదుడై


భావము: గుణములకు నిలయమైన (మంచి గుణాలు కలిగిన) మన రణతిక్కన (ఇంత త్వరగా మరణించకూడదు) తన మొండెమును, శిరస్సును దగ్గర చేసి కలిపిన శరీరము(తల మోండెము) ఒక్కటై బ్రతుకుతాడు. ఈ లోకములో అఖిలశత్రుగణాలచే గొప్పగా కీర్తింపబడుతూ వర్ధిల్లుతాడు.


                 ఏమి తపంబుఁజేసి పరమేశ్వరునేమిటఁ బూజసేసిరో
                   రాముని తల్లియుఁ బరశురాముని తల్లియు భీముతల్లియుఁ
                   గాముని కన్న తల్లియును గంజదళాక్షుననుంగుఁ దల్లియున్
                   శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కనఁగన్న తల్లియున్


భావము: ఎంత తపస్సు చేసి పరమేశ్వరుని ఏవిధంగ పూజించారో శ్రీరాముని తల్లి కౌసల్య, పరశురాముని తల్లి రేణుక, భీముని కన్న తల్లి కుంతి, మన్మధుని లక్ష్మి, శ్రీకృష్ణుని తల్లి దేవకి, శివుని శూలమంటి ప్రతాపమును(ధైర్యసాహసములు) సిద్ధించుకున్న  (సిద్ధయ) తిక్కనను కన్న తల్లి పోలమాంబ, ఎంత పుణ్యాత్ములో అంతటి గొప్పవారిని కన్నారు.  


                 శ్రీలలరారశత్రువులఁ జెండితివార్యులు మంత్రివర్యులా
                   ర్వేలఘనుల్ నుతించిరలవేర్పు దొరల్ ముదమంది మెచ్చిరో
                   లాలిత శౌర్యధైర్య జయలక్ష్మి ప్రియంబున నిన్వరించెనీ
                   లీలలుహెచ్చెఁ దిక్కని కళేబరమా యిక నిల్చియాడుమా


భావము: పూజ్యుడవు, మంత్రివర్యుడవై రాజ్యము సిరిసంపదలతో  అలరారేలా (శత్రువుల పాలుకాకుండా) శత్రువులను చెండాడావు. అర్వేలఘనులెందలెందరో నిను ఏమని స్తుతించారో, నీ కార్యసిద్ధికి రాజులు సంతోషించి ఎంతగా కొనియాడారో, శౌర్యధైర్య జయలక్ష్మిని (పరాక్రమము, ధైర్యము, విజయములకు అధిపతి అయిన అష్టలక్ష్మిని) సైతం ప్రసన్నము చేసుకున్నావు. నీవు సాధించాలిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఓ తిక్కన కళేబరమా! ఇక లేచి కదలిరా!     



నెల్లూరు వర్ణణ : నెల్లూరు పట్టణాన్ని వర్ణిస్తూ భీమకవి చెప్పిన పద్యాలు

                సీ             పాలించు నేవీట బ్రహ్మాదివంద్యుండు
                                                లీల మూలస్థాన లింగగురుడు
                                దీపించు నేవీట దేవాలయంబులు
                                                ధావళ్య నవసుధా ధౌతములుగఁ
                                బ్రవహించు నేవీట బ్రహ్మాండ కర్పరం
                                                బొరసి మిన్నులు ముట్టనున్న పెన్న
                                చెలువందు నేవీట జిరకాలజీవన
                                                స్వర్ణాల చెఱ్వు సంపూర్ణమగుచుఁ
                గీ             బ్రజలకును నున్కి సకల సంపదలకున్కి
                                భోగములవీడు సురపతివురికి నీడు
                                నమ్మికలటెంకి వైరులఁ జిమ్ముకొంకి
                                భాగ్యనికరంబు నెల్లూరు పట్టణంబు

                సీ             ధీరుఁడై యేలెఁ దిరుకాళ దేవుండు
                                                తిక్కనాయకుఁ డేలెఁ దేజమెసఁగ
                                మన్మసిద్ధనయేలె మహిమతో దీపించి
                                                దాదినాగనయేలె ధర్మరీతి
                                మనుగొండుగోపాల మనుజాధి పతి యేలె
                                                స్వర్ణ దేవుండతి ప్రభగనేలె
                                గోపినాథుండేలె గుణపయోరాశియై
                                                రమణతో శ్రీరంగరమణుఁడేలె
                గీ             తిక్కనయు మఱియిక కొన్నిదినము లేలె
                                నేలెమీతండ్రి మర్యాదలెల్లఁ గలుగఁ
                                గడక నీవేలి తందఱకంటె మించి
                                శరధిగంభీర! సంగమక్ష్మాతలేంద్ర!
                సీ             ఏపట్టణంబున నెన్నంగమున్నూట
                                                యఱువది దేవాలయంబులుండ
                                ఏపట్టణంబున రూపింపనన్నియు
                                                నీరేడు బావులింపారుచుండు
                                ఏ పట్టణంబుననెల్ల మానవులుఁ బ్ర
                                                శస్తిఁగాంచిరి నెఱజాణలనఁగ
                                ఏపట్టణంబుననే కాలమును చెన్ను
                                                కాల్వలచేత ముక్కాఱుఁబండు
                గీ             శివునికృపఁబుట్టె వేమాల శెట్టి బావి
                                పరగజగమెల్ల నెఱుఁగనేపట్టణమున
                                నట్టి పట్టణమిలను సౌఖ్యములకునికి
                        పట్టనందగు నెల్లూరు పట్టణంబు

                సీ             చరియించితినిగాని జగముమూలస్థాన
                                                పరమేశ్వరునివంటి భక్తవరదు
                                వివారించితినిగాని వివిధభూములు వల్లి
                                                కొంటనాధునివంటి కూర్చువేల్పు
                                పరికించితిని గాని బహు దేశము లనంత
                                                పద్మనాభుని వంటి దివ్యమూర్తి
                                వీక్షించితిని గాని విశ్వమంతయుఁ బెన్న
                                                నదివంటి దివ్యపుణ్యస్రవంతి
                గీ             అరిగితినిగాని దేశ దేశాంతరముల
                                వేదగిరివంటి పావనోర్వీధరంబు
                                గాన నిన్ని విశేషముల్గలిగి ధరఁబ్ర
                                సిద్ధికెక్కెఁద్రి విక్రమ సింహపురము

నెల్లూరు పట్టణానికి విక్రమ సింహపురము అను పేరు కలదు.
       
                సీ             ఆపట్టణంబున సమరంగఁ దూర్పున
                                                మాకందచందన మహితవనము
                                ఆ నగరంబున కటుదక్షిణంబునఁ
                                                జెలువారు వేమాల సెట్టిబావి
                                ఆ యూరి పడమట నంభోజరాజివేఁ
                                                బ్రాకటంబైన తటాకమమరు
                                నొప్పారు నవ్వీటి కుత్తరదిశయందు
                                                మున్నీటి కనయైన పెన్నఁదనరు
                గీ             కలిమి నారాజధాని మార్గంబదెన్న
                                బహుళగంధర్వ సింధూర బంధురంబు
                                రతనపుం బొమ్మలప్పురి రమణులనఁగ
                                వినుతికెక్కెను నెల్లూరి విభవమహిమ.

                శా           మల్లెల్ మొల్లలు సేమమా? శుభములామాకందముల్ జాజులున్
                                మొల్లంబారక యుండునా? సుదతులున్ మోదంబువాటింతురా?
                                విల్లుం గోలలు వెన్కకుఁ మఱలునా? వేమాలనూయున్నదా?
                                నెల్లూరఁ బేదసోమ వీధిన కదా నీరాక జై  హితృ కా

భీమకవి మైలమ భీముని శౌర్యపరాక్రమములను గురించి ఎన్నో అద్భుతపద్యాలతో వివరించారు. వాటిలో కొన్ని మాత్రమే  దొరికాయి.


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...