Friday 24 July 2020

గణపతిదేవుడు-వాసుదేవభట్టారకుడు -భీమకవి


భీమకవి దురుసుగా ప్రవర్తించేవారిని, కవులను తక్కువ చేసి చూసే వారిని వదిలేవారు కాదు. వారిని ఓడించి, గర్వభంగము చేసి చూపేవారు.
        గణపతిదేవుని ఆస్థానమున ఉన్నపుడు భీమకవి కొన్ని పద్యాలను రచించి వినిపించారు.భీమకవి గణపతి దేవుని వద్ద ఉన్నపుడు వ్యాకరణశాస్త్రములో ఆరితేరిన వాసుదేవభట్టారకుడనే బ్రాహ్మణుడు రాజదర్శనార్థం వచ్చాడు. గణపతిదేవుడికన్నా తొలుత భీమకవిని సత్కరించాడు. వాసుదేవభట్టారకుడిని అతని పాండిత్యప్రకర్శమును విన్న తర్వాతసత్కరించాడు. కానీ భీమకవి కన్నా తనను తక్కువగా సత్కరించాడని భావించి, మనసులో “ఔరా కాలమహిమ కాకపోతే! కల్లబొల్లి మాటలతో కవిత్వమల్లే వారిని సత్కరించినట్లు సకల విద్యాపరిపూర్ణుడైన పండితున్నిసత్కరించట్లేదు. ఎలాగైనా నా నైపుణ్యం చూపించి కవీశ్వరుని కన్నా శాస్త్రపండితులనే విశేషముగా సత్కరించేలా చేస్తాను. నేను కూడా కొద్దిపాటి కవిత్వము చెప్పగలను కదా! నా కవిత్వమును ఉపయోగించి కవుల కన్నా గొప్పగా వినిపించెదనని”ఈ క్రింది పద్యమును చెప్పాడు  వాసుదేవభట్టరకుడు.

        సీ      అవగతశబ్ద శాస్త్రచయులైన మహాత్ములు పండితోత్తముల్
                భువనతలంబునం దధిక పూజ్యులు; వారటులుండఁ గూటికై
                నవనవకల్పనావిధి చణత్వముదోఁపనబద్ధమాడు నీ
                కవులిల దాన పాత్రులయి గౌరవమందుట చూవెచిత్రముల్

భావము: వ్యాకరణశాస్త్రము నందు పరిపూర్ణజ్ఞానం కలిగిన మహాత్ములు, గొప్పపండితులు ఈ భూలోకములో గొప్పగా పూజింపదగినవారు. వారిని వదిలేసి, పొట్టకూటికై క్రొత్త క్రొత్త కల్పనలు చేస్తూ పొగుడ్తలతో పిండి, అబద్ధమాడే కవులు ఈ లోకములో అధికంగాదానపాత్రులై, గౌరవమును పొందుతున్నారుఎంత విచిత్రమో చూడండీ!

వెంటనే భీమకవి అందుకొని

              కవికమలాసనుండు; త్రిజగత్పతియైనపినాక పాణియున్
                కవియె తలంపగాఁ గవులు కారె పరాశర బాదరాయణుల్
                కవికృతపుస్తకగ్రహణగర్వితులల్పులె? పూజలందగాఁ
                గవులట! దానపాత్రులట కారట! యిట్టి విపోచిత్రముల్!

భావము:
        కవియే బ్రహ్మదేవుడు(బ్రహ్మ తన ఊహాశక్తిని పదునుపెట్టి మన తలరాతలు వ్రాస్తాడు. అలాగే కవి కూడా తన కల్పనాశక్తిని రంగరించి సత్కావ్యాలను వ్రాస్తాడు కావున కవి బ్రహ్మ దేవునితో సమానము). ఆలోచిస్తే కవియే ముల్లోకపాలకుడు, త్రిశూలధారి అయినపరమేశ్వరుడు కూడా(లయకారకుడైన పరమేశ్వరుడు ఈ జగన్నాటకములో మనలను ఆడించి నడిపిస్తాడు. కవి కూడా తన కావ్యాలలోని పాత్రలను ఆడించి ముందుకు నడిపిస్తాడుకావున కవి పరమేశ్వరునితో సమానము) అంతటి గొప్పరైన కవులచేత రచింపబడిన పుస్తకాలను గ్రహించి, కవులను ఆదరించి సంతోషపడేవారు అల్పలా? అలాంటి కవులు పూజలందుటకు, దానపాత్రులగుటకు అర్హులు కారా? యాచకులు,సన్యాసులూ అయినంత మాత్రాన కవులు కవులు కాకుండాపోతారా? నిష్ప్రయోజకులవుతారా?ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉంది!

        అందుకు వాసుదేవబట్టారకుడు ఏదోవిధంగా భీమకవిని ఓడించాలని “ఓ భీమన్న కవీ! నీవు నిజముగా మహాకపీశ్వరుడవు. మీ కవిత్వం విన్న తర్వాత నేను కూడా ఇంత సులభంగా పద్యము చెప్పగలిగాను” అన్నాడు. భీమకవి “ఇదేమిటి వ్యాకరణవేత్తలకు ’పీ’కీ ‘వీ’కీబేధము తెలియలేదు” అన్నారు. వాసుదేవుడు “కొంచెము శబ్దశాస్త్రవిషయమును నీతో మాట్లాడాలని ఇలా అన్నాను. “పవయోరభేదః” అనే వ్యాకరణ సూత్రము ప్రకారం ‘వ’ బదులు ‘ప’, “ప” బదులు “వ” పలికినా తప్పులేదు. అందువలన ఇలా అన్నాను” అని చెప్పాడు. భీమకవి “ అయ్యో పాసుదేవభట్టూ! నాకాసూత్రము సమయానికి గుర్తుకురాక మిమ్మల్ని తప్పుబట్టాను.” అన్నారు. భీమకవి తనను పాసుదేవభట్టారకుడని అని పిలిచేసరికి కోపంగా “ఎందుకలా పిలిచారని అడిగాడు” ప్రశ్నించాడు. భీమకవి ”ఇప్పుడే కదా వాసుదేవా! “పవయోరభేదః” అను సూత్రమును అనుసరించి ‘ప’ బదులు ‘వ’ పలికిననూ తప్పు కాదని అందుకే పాసుదేవా అని పిలిచాను” అని సమాధానమిచ్చే సరికివాసుదేవబట్టారకుని నోటమాట రాలేదు. తన సూత్రం తనకే అల్లేసే సరికి భీమకవితో వాదించడం వల్ల పరువు పోవడం తప్ప,తనకి వచ్చేదేమీ లేదనిగ్రహించి సభలో గమ్మున ఉండిపోయాడు. ఇలా అసమాన ప్రతిభాశక్తిసంపన్నుడై, సమస్తశాస్త్రాలు తెలినవాడైన భీమకవికి ఎక్కడా,ఎందునా తిరుగులేకుండెను. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...