Friday 24 July 2020

మైలమ భీముడు- భీమకవి




      రణతిక్కన సొదరుడు మైలమభీముడు. ఇతను కూడా మహాశూరుడు, భీమకవి అనుగ్రహమును కలిగినవాడు. ఈ మైలమభీమునికి యుద్ధము నందు విజయమే తప్ప పరాజయమెన్నడూ కలుగకుండే విధంగా వేములవాడ భీమకవి వరమిచ్చారు. ఆ వరము వలన ఎప్పుడూ ఈ మైలమభీమునికి పరాజయమను మాటే లేకుండెను. యుద్ధములో శత్రువులను ఓడించగల సామర్థ్యము అబ్బింది. భీమకవి ఇతని శౌర్యపరాక్రమమును గురించి ఎన్నో అద్భుతపద్యాలతో వివరించారు. వాటిలో కొన్ని మాత్రమే  దొరికాయి.

                చ            గరళపు ముద్ద లోహ మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్
                                హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోఱలు పట్టకార్లు ది
                                క్కరటి శిరంబు దాయి లయకారుడు కమ్మరి - వైరివీర సం
                                హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్

భావము
లయకారకుడైన శివుడే స్వయాన కమ్మరియై, తన కంఠాన దాచుకున్న
 కాలకూటవిషమునే (గరళపుముద్ద) ఇనుపలోహముగా మార్చి, దద్దిల్లుతూ కోట్లకొలదిగా రాలే పిడుగులను సమ్మెటలుగా(దభీదభీమని మోదే సుత్తులు) వాడి, తన కనుమంటలనే కొలిమిగా చేసి, తన మెడలో ధరించిన సర్పరాజు వాసుకి యొక్క కోరలనే పట్టుకార్లుగా చేసి, ఎనిమిది దిక్కులా భూమిని మోస్తూ ఉన్న అష్టదిగ్గజాలలో (ఎనిమిది ఏనుగులు) ఒక ఏనుగును తలదాయిగామార్చి, శత్రుసంహారములో, గుణాలలో రాముడంతటివాడైన మైలమ భీముని ఖడ్గమును సృష్టించాడు.  
 
                అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! భీమకవి వర్ణించిన  మైలమభీముని ఖడ్గం ఎంత శక్తివంతమైనదోశత్రువులపాలిట ఎలా మృత్యుసమానమైనదో ధ్వనించే పద్యమిది. తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! భీషణవాక్కు వేములవాడ భీమకవిది.
                 మైలమభీమన చాలా పరాక్రమశాలిసాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు "పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి" అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు.



           
ఈ మైలమభీముని కీర్తి గురించి పొగుడుతూ భీమకవి చెప్పిన ఇంకో పద్యం ఇది.

                             నేరుపు బ్రహ్మఁ జేరె నిజనిర్మల తేజము సూర్యుఁ జేరెఁ నా
                                కారము కాముఁ జేరెఁ నధికంబగు లక్ష్మియనంతుఁ జేరె గం
                                భీరత వార్థిఁ జేరెఁ గల పెంపు కులాద్రుల జేరెఁ గీర్తి దా
                                నూరట లేక త్రిమ్మరుచు నున్నది మైలమ భీముఁడీల్గినన్

భావము: మైలమ భీముని మరణము తర్వాత అతని నైపుణ్యం బ్రహ్మను చేరింది. అతని తేజస్సు సూర్యుణ్ణి చేరింది. రూపము మన్మధుణ్ణి చేరింది. అతని సంపద (లక్ష్మి) విష్ణువును చేరింది. గాంభీర్యము సముద్రాన్ని చేరింది. ఔన్నత్యము కులపర్వతాలను చేరింది. కానీ మరణము వలన అతని కీర్తి మాత్రం ఎక్కడ చేరాలో తోచక ఈ లోకంలోనే తిరుగుతున్నదట. అనగా నేర్పు మొదలగు గుణాలలో అతనికి సమానులుగా చెప్పదగిన బ్రహ్మాదులున్నారు. కానీ అతని మరణం తర్వాత కీర్తికి ఆశ్రయం లభించలేదంటే అతనితో సమానకీర్తి గల మరొక ఆశ్రయమేదీ ప్రపంచములో లేదని అతడు అసమాన కీర్తిశాలి అని భావము. 

మైలమభీముని పరాక్రమమును గురించి కొనియాడుతూ భీమకవి ఎన్నో అద్భుతపద్యాలను రచించాడు. వాటిలో కొన్ని 
ఈ మైలమభీముని కీర్తి గురించి పొగుడుతూ భీమకవి చెప్పిన ఇంకో మహాద్భుతమైన పద్యం. ఈ పద్యములో మనిషి లేకున్నా చివరకు మిగిలేదేంటో చక్కగా చెప్పారు.
   
                మైలమభీముడు చనిపోయినపుడు భీమకవి రచించిన పద్యాలలో ఈ క్రింది “విలాపగీతం” (elegy) తెలుగు సాహిత్యంలో అట్టి గీతాలలో మొట్టమొదటిదే కాదు; సాటి లేనిది కూడా. ఆ గీతంలోని రసగుళిక ఈ క్రింద ఇవ్వబడింది.

                ఉ             యాచక ఖేచరుండు సుగుణాంబుధి మైలమభీమఁ డీల్గినన్
                                జూచి వరించె రంభ; యెడఁజొచ్చెఁదిలోత్తమ; దారినిద్దఱన్
                                ద్రోచె ఘృతాచి ముగ్గుఱకు దొద్దడి కయ్యముపుట్టెనంతలో
                                నాఁచుకుపోయె ముక్తిసతి నవ్విరి యద్దశఁ జూచినిర్జరుల్
                                నోచినవారిసొమ్ములవి నోమనివారికి వచ్చునేధరన్
                               
                                బీరపుఁబొత్తముఁగట్టుకొనిపోయె పువ్వులు వేడుకైనఁ
                                గడివోయిన వాళ్ముడువంగవచ్చునే ఎంతదఱిగిన మి
                                రియాలుంజొన్నలసరిపోవే కొఱ్ఱెవ్వఁడింటికంబమునేసెఁ
                                నోచినవారిసొమ్ములవి నోమనివారికి వచ్చునేధరన్
                               
                                పిడుగు చిట్లినభంగిఁ జీలుగు వెఱిగినమాలెకుఁగంబంబు
                                గాదు చెఱువువిడిచి కాలువ బొగడంజనునే ఎదిరికి
                                న్మడచు వాడు, తనకుదగరంబు సఱచు టెంతటి భరంబు

 భావము: పేదవారికి ఇలవేలుపు, మంచి గుణాలలో సముద్రము వంటి విశాలమైనవాడు. అయిన మైలమ భీముడు మరణించిన తర్వాత పరలోకాన మైలమ భీముడిని చూచి రంభ ఆశపడింది. అతని మనసులో స్థానము కోసము వచ్చింది తిలోత్తమ. దారిలో ఇద్దరినీ త్రోసి నాకు అంటూ వచ్చింది ఘృతాచి. ముగ్గురికి మధ్య పెద్ద గొడవ మొదలయింది. అంతలో ముక్తిసతి వచ్చి వారి గొడవను ఆపివేసెను. ఆ సంఘటనను చూసిన దేవతలందరూ నవ్వుకొనారు. ఎన్నో నోములు నోయగా వచ్చే సంపద మైలమ భీముడు. నోములు నోయని వారికి ఎలా వరించును?

                చ            అహితులఁ దాఁకి పోరు నెడ నంబుధికల్గిననాటిరాము గో
                                గ్రహణమునాటి పార్థు గదఁగాఁ గౌరవునేసిననాటి భీమునా
                                గ్రహ మెసగంబురత్రయముఁగాల్చిననాటిలలాటలోచనున్
                                మహి నుపమింపఁగాఁ దగునె మైలమభీముని భీమవిక్రమున్

భావము: శత్రువులతో యుద్ధములో సముద్రున్ని దాటి లంక చేరిన రఘురాముడు, గోగ్రహనము నాటి అర్జునుడు, గదా విజృంభణ చేసిన నాటి భీముడు, కోపగించినపుడు మూడోకంటి మంటతో (మన్మధున్ని)కాల్చిన నాటి పరమేశ్వరుడు ఇలా మైలమభీముడి పరాక్రమమును  ఎవరితో పోల్చిచూసినా తక్కువే.

                ఉ             పన్ని తురంగమంబునకుఁ బక్కెర వెట్టినవార్త చారుచే
                                విన్న భయంబునంగలఁగి వేసటనాటనె చక్రగోట్టముల్
                                మన్నియపట్టణంబులును మక్కెన వేంగి కళింగ లాదిగా
                                నిన్నియు నొక్కపెట్టెగసె నేఱువభీమనృపాలుధాటికిన్

భావము: ఏరువభీముడు అమ్ములో ఖడ్గమును ధరించి గుర్రమెక్కెనన్న వార్తను గూడాచారులచే విన్న వెంటనే భయమును కలిగి శత్రురాజుల ఆయుధములు సైతము గురి తప్పుతాయి. కోటలు, ప్రభువులు, రాజ్యములు, చక్రగోట్టము, వేంగి కళింగాది సామ్రాజ్యాలన్నీ ఏరువ భీముని పరాక్రమము ఎదుట నిలబడలేవు.

                క             అరినరు లేఱువభీమని
                                పొరువున మనలేరు చిచ్చుపొంతను వెన్నై
                                తెరువునఁ బైసరై జూదరి
                                సిరియై రేన్చెట్టుక్రింద జిల్లెడుచెట్టై

భావము : ఏరువ భీముని పొరుగు రాజ్యాలలో శత్రురాజులేవ్వరూ బ్రతికి బట్టకట్టలేరు. నిప్పు పక్కనున్న వెన్నలాగా, జూదరి సంపదలాగా, రేని చెట్టు క్రింద జిల్లేడు చెట్టులాగా ఉనికిని కోల్పోతారు.

                ఉ             ఆలములో నరాతులకు హమ్మని మార్కోనవచ్చు నే మహా
                                కాళికి శూలికిన్ బ్రళయకాలపుగాలికి రాఘవేంద్రుబా
                                ణాళికిఁ బక్షి నాయకునఖాళికి మత్తగజేంద్రవైరిదం
                                ష్ట్రాళికి దావపావకశిఖాళికి మైలమభీమువాలికిన్

భావము: మహాకాళి అయిన పార్వతికి, శూలాన్ని కలిగిన పరమేశ్వరునికి, ప్రళయకాలమున వీచే ప్రచండ వాయుదేవునికి, శ్రీరాముని బాణాల ధాటికి, గరుస్మంతుని దాడికి, పదునైన దంతాల మదపుటేనుగు దాడికి, కుమారస్వామి శక్తికి ఏవిధంగా అయితే ఎదురు నిల్వలేరో అలాగే యుద్ధములో మైలమభీముని శూరత్వము ముందు శత్రువులు కూడా ఎదురొడ్డి పోరాడలేరు.

                మ           తెరలంబాఱి నభంబు దాఁకినఁ బయోధిం జొచినన్ శైలగ
                                హర్వముల్ దూఱినఁ జిక్కభీముడునృపవ్రాతంబుఁ బోనిచ్చునే
                                గరుడండై చని పట్టు మింటితుద నుగ్రగ్రాహమై చొచ్చి సా
                                గరమధ్యుంబునమ్రింగుఁ బట్టుకొను సింగంబైగుహాంతరంబునన్

భావముశత్రురాజులు పారిపోయి మేఘాలలో దాగినా, సముద్రంలోకి వెళ్ళి దాగినా, పర్వతాలు, గుహలలో దూరినా, మైలమభీముడు వదలకుండా గరుస్మంతుడై ఆకాశమంచులదాకా వెళ్ళిపడతాడు. భయంకర మొసలి వలె వెళ్ళి సముద్రమధ్యంలో ఎక్కడ ఉన్నా పట్టి మ్రింగుతాడు. గుహాంతరాలలో ఎక్కడ దాగినా సింహమై వెళ్ళి పట్టుకుంటాడు.

                క             ఆలమునఁ జిక్కభీముడు
                                వా లతివేగమునఁ బెఱికి నడితుదగవియఁ
                                బ్రేలిపడఁ బడుగు నేసెను?
                                ఏలేరును గసిమి భైరవేశుం డెఱుఁగన్

                భావము: యుద్ధములో చిక్కభీముడి ఖడ్గధార ప్రచండవేగానికి శత్రుసైన్యము అంతా నుగ్గునుగ్గయి అంతమొందుతుంది. ఆ ఖడ్గధార విస్ఫోటనంతో వారిని అశక్తుల్నిచేసి కృశింపచేస్తాడు. ఏలేరునేలె మైలమ భీముని పరాక్రమము భైరవునికి బాగా తెలుసు.

                ఉ             వీరగుణప్రతాపగుణవిశ్రుత! మైలమ భీమ నీయశం
                                బారభమానితారకరహారవిలాసము నీనికేతనం
                                బారభమానతారకరహారవిలాసము నీభుజార్గళం
                                బారభమానతారకరహారవిలాసము చిత్ర మిద్ధరన్

                ఉ             భండనభీమ నీయెదుర బాఱక నిల్చినశాత్రవుల్ బృహ
                                న్మండలపుండరీకపుర నివాసులు నోర్చినన్ బృహ
                                న్మండలపుండరీకపురనాకనివాసులు చచ్చినన్ బృహ
                                న్మండలపుండరీకపురనాకనివాసులు చిత్ర మిద్ధరన్        

భావము: మైలమభీమా! ఈ లోకంలో ఆశ్చర్యకర విషయమేమంటే నీ ఎదుట పారిపోక నిల్చిన శత్రురాజులు, నీ చేత ఓడింపబడిన రాజులు, నీ చేత యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రాజులూ అందరూ నేరుగా ఈ మహావిశ్వంలో విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠపుర నివాసమును పొందుతున్నారు.               

                చ            విదితగురుప్రతాపగుణవిశ్రుత మైలమభీమభూప నీ
                               పదిలపుఖడ్గదారఁ దెగి పాఱినవీరుడు గోపురంబుపై
                               విదితసువర్ణరత్నమయవేదిక మీదను నిల్చి కాంచు నౌ
                               పదిపదు లగ్నిహోత్రులను బన్నిరుసూర్యుల నూఱుచంద్రులన్

భావము: శౌర్యగుణాలను కలిగినవాడిగా పేరు మోసిన మైలమభీమరాజా, నీ పదిలమైన నీ ఖడ్గదారకు తెగి మరణించిన వీరుడు గోపురముపై బంగారుమణి మయమైన వేదిక (తలశం) మీద నిల్చి వంద అగ్నిహోత్రులను (ప్రాతస్సాయంకాలములయందుఁ జేసెడి హోమము), పన్నెండు సూర్యులను, నూరు చంద్రులను చూసే భాగ్యమును పొందుతున్నారు.

                చ            ఆసమునఁ గాసికానగరమం దసువుల్ త్యజియించినంతనే
                               యసదృశ మైనకన్నుగల దచ్చట మైలమభీమభూప నీ
                               యసిఁ దెగిపడ్డవైరులకు నంబకముల్ పదినూఱులయ్యె నీ
                               యసికిని వారణాసికిని నంతర మెంత దలంచి చూచినన్

భావము: కాశీ నగరములో ప్రాణాలు విడిచినంతనే సాటిలేని(మనో) నేత్రము కలుగును. మైలమ భీమా నీ ఖడ్గానికి తెగిపడ్డ శత్రురాజులకు వెయ్యి(మనో) నేత్రమ్ములు కలుగుము. ఎంత చూసినా నీ ఖడ్గానికి, వారణాసికి చాలా అంతరము కలదు.

                ఉ             ఏఱువ భీమ! నీ పగతు ఱెక్కని కొండలు చంచలాత్ములై
                                దూఱనియట్టి ఘోరవనదుర్గములున్ వనితావియోగులై
                                పాఱనిత్రోవలుం దిననిపండ్లును నాఁకటఁగూర లుప్పగా
                                నేఱనికఱ్ఱలుం గలవె యీలవణాంబుధి వేష్టితావనిన్?



No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...