Friday 24 July 2020

భీమకవి నృసింహపురాణము రచన



తెలుంగరాయుల ఆస్థానములో ఉన్నపుడు భీమకవి నృసింహపురాణమును రచించారు. తెలుంగరాయడికి వేట అంటే ఎంతో ఇష్టం. ఓ సారి వేటకు వెళుతూ తన వేటను వీక్షించడానికి భీమకవిని తనతో రమ్మని కోరాడు. భీమకవి రాజు మనవి కాదనకుండా, వెళ్ళడానికి సిద్ధమయ్యారు. తనతో పాటి ఇంకొందరు భటులను కూడా తీసుకొని బయలుదేరారు. భీమకవి, తెలుంగరాయడు తమతమ అశ్వాలపై ప్రక్కప్రక్కనే వెళ్ళసాగారు. సాయంత్రమయ్యే సరికి వారు సింహశరభశార్దూలవృక్షవరాహసారంగాది మృగసంకులంబయిన ఘోరడవిని చేరారు. మనుషుల సవ్వడి వింటే మృగాలు ఎక్కడ పారిపోతాయోనని తనతో వచ్చిన భటులనందరినీ అన్ని దిక్కులకు చెదిరిపొమ్మని ఆదేశించాడు. భీమకవిని మాత్రం తనతో ఉండమని కోరగా, ఇరువురూ ఒకే చోట ఉంటూ ముందుకు కదిలారు. తెలుంగరాయుడికి పొదల్లోకి పారిపోతూ ఒక వరాహము కనపడింది. ఆ వరాహాన్ని చూడగానే భీమకవితో ఎలాగయినా ఈ వరాహాన్ని పట్టాలి అని చెబుతూ చప్పిడిచేయకుండా వెనుక నుండి దానివైపుకు  అడుగులేయబోయాడు. భీమకవి అతన్ని ఆపి “వరాహమును మాటు నుండి కొట్టడం పౌరుషలక్షణము కాదు. నవ్యసాచిఖాండవదహన సమయాన వరుసబాణములను సంధించి మేఘునిచే వర్షం కురిపించిన అర్జునినిలా, వరాహమునకు ఎదురేగి ప్రతిభను ప్రదర్శించి పట్టుకున్నవాడే ప్రజ్ఞావంతుడు. అలా చేయగలవా? లేదా నన్ను చేసి చూపమంటావా?” అని అడిగారు. తెలుంగరాయడు “కవీశ్వరా! మీకు కవిత్వంలోనే కాక వేటలో కూడా ఉద్దండసామర్థ్యమున్నవాడిలా మాట్లాడుతున్నారే. మీకా సామర్థ్యముంటే చేయ”మని అడిగాడు. భీమకవి “తెలుంగాదీశా! నా శక్తిసామర్థ్యాలు నీ ఊహలకందనివి. నేను వాక్పరాక్రమమున్న మహాకవిని కావున నా నోటి మాట(ఒక పద్యము) చాలు ఆ వరాహమును ఆపి తీసుకురావడానికి. మేము అలా బంధించి తీసుకువచ్చి ఆ వరాహమును మీ ముందు వదులుతాము. మీరు మీ పరాక్రమమును చూపి, బాణములను వదిలి, ఆ వరాహమును పట్టుకొని భుజబలపరాక్రమశాలివగు రాజువని నిరూపించుకొమ్మని” చెప్పి ఈ క్రింది పద్యాన్ని చెప్పారు.

              కడక ధనంజయుండు మును ఖాండవమున్ దహించు వేళ నే
                ర్పడ శరజాల నిద్ధమయి వర్షములొఁ జొఱ జాలనట్టులీ
                యడవిన సందుగాన కిట నాగు వరాహమ! నాదు వాక్కునఁ
                బొడువదు ప్రొద్దుకూడ నిను భూపతి కర్పణ సేతునియ్యెడన్

భావము: ఈ అడవిన పొదలందు దాగబోయిన ఓ వరాహమా! పూర్వము ఖాండవవనము అగ్నికి ఆహుతి అవుతున్న వేళ అర్జునుడు సంధించిన బాణాలచే ఆపబడి, కరిగి వర్షించిన మేఘములాగా,  నీవు నా మాటవిని ఆగిపో! నా మాటకు పొడిచే పొద్దు కూడా పొడువదు. ఈ వేళ  నిను మహారాజుకు బహుమతి చేయబోతున్నాను. 
        వెంటనే ఆ వరాహము ఎక్కడకు పోకుండా పరుగులు మాని ఆగిపోయింది. భీమకవి ఆ వరాహమును తీసుకువచ్చి తెలుంగరాయుడి ఎదుట వదిలివేసి, ఇక మీ నైపుణ్యంతో పట్టమన్నారు. తెలుంగరాయుడు కూడా తాను నేర్చిన విద్యనుపయోగించి తన నైపుణ్యమును నిరూపించదలచి ప్రయత్నము చేసాడు. వరాహమును అతడు తన శరపరంపరను నలుదిక్కులా వదిలి ఎక్కడకూ పోనీయకుండా  బంధించి పట్టుకొని భీమకవి వద్దకు తీసుకొచ్చి చూపించాడు.   
        భీమకవి అతని పరాక్రమమునకు సంతసించి “నువ్వు భూవరేణ్యుడవు. నేను కవివరేన్యుడను. మన మైత్రి ఎప్పటికీ చెదిరిపోదు. ఇక వేటాడ్డం చాలు ఇంటికి వెళ్దాం పదా. వేట నెపంతో వన్యప్రాణులను చంపకూడదు. అందులోనూ వరాహము విష్ణువు అవతారము. రాజులకు వేట ధర్మమే అయినా అది వన్యమృగాలు ఎక్కువయ్యి అడవులను వదిలి పంటచేలను నాశనము చేయునపుడు, జనవాసానికి ఆటంకం కల్గించినపుడు వాటి సంఖ్యను తగ్గించడం కోసం వేటాడ్డం క్షత్రియధర్మము. నిష్కారణముగా వన్యప్రాణులను బంధించి చంపుట అధర్మము. స్వేచ్ఛగా విహరించు ఈ వరాహమును బంధించి దాని స్వేచ్ఛకు ఆటంకమును కల్గించాము. దానిని వెంటనే విడిచి పెట్టు. ఈ కళంకము అంటకుండా వరాహపురాణమును రచించి నీకు అంకితము చేస్తాను. ఆ వరాహపురాణానికే నృసింహపురాణమని నామకరణము చేస్తాను” అని చెప్పారు. ఆ రాజు కూడా వరాహమును వదిలిపెట్టి ఆనాటి నుండి వినోదం కోసము జంతువేటాను మానేసాడు. ఆ తరువాత భీమకవి నృసింహపురాణము పేరిట వరాహ పురాణమును రచించి తెలుంగరాయునికి అంకితమిచ్చారు. భీమకవికి నృసింహపురాణము రచించుటకు ఎక్కువ కాలము పట్టలేదు కాని, ఆ నృసింహపురాణమును తెలుంగరాయునికి చదివి వినిపించుటకు ఒక సంవత్సరానికి తక్కువ సమయం పట్టలేదు. ఇందుకు కారణం భీమకవిపై, ఆయన కవిత్వముపై  తెలుంగరాయుడికి ఉన్న ఆభిమానం మక్కువ అలాంటిది. భీమకవి ఒక్కొక్క పద్యానికి మిక్కిలి విశ్లేషణాత్మకంగా భావాన్ని వివరించగా, రాజు కూడా ప్రతి పద్యాన్ని పదేపదే చదివి ఆనందపడ్డాడు. అలా వరాహావతారమైన విష్ణుమూర్తి చరితమైన ఆ కావ్యమును విని తరించాడు.
        వరాహమును బంధించిన కళంకం అంటకుండా, తాము బంధించిన వరాహము పరిస్థితిని చందమామతో పోలుస్తూ నృసింహపురాణములో క్రింది పద్యముతో వివరించారు.

                 సురచిరపానపాత్రమున సుందరియొక్క తే కేలనిండు చం
                   దురుడు ప్రకంపి తాంగములతోఁ దిలకించెఁ దదానంబుజ
                   స్ఫురిత వికాస వైభవము సొంపులడంకువ మ్రుచ్చిలింపఁ జె
                   చ్చెరఁ జనుదెంచి కట్టువడి చేడ్పడి భీతివడంకు చాడ్పునన్

భావము: ఆ సుందరి చేతిలో ఉన్న మిక్కిలి రమణీయమైన పానపాత్రము (లోటా లేదా పాత్ర)లో చంద్రుడు అత్యంతగా ప్రకాశిస్తున్నాడు. చంద్రుని అందాలన్నీయూ ఆ సుందరి ముఖవైఖరులచే దొంగలింపబడినట్లుగా ఆమె చేతిలో (ఉన్న పాత్రలో) కట్టుబడపొయి భయముతో వణుకుతూ ఉన్నట్లుండెను.
        ఈ పద్యము చదివిన తెలుంగరాయుడు “ భళిరే! మహాత్మా! మీ కవితా వైచిత్యము వలన చంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు కూడా కట్టుబడిపోతారు. కొద్ది పదార్థమును గొప్పదిగాను, గొప్ప పదార్థమును కొద్దిగాను చేసే శక్తి మీవంటి కవీశ్వరునికి గాక ఇంకెవరికి సాధ్యమవుతుంది? మహా తపస్సు చేసి అష్టసిద్ధులు పొందిన సంయమీంద్రులు కూడా భీమకవీంద్రునికి సాటి రాగలరా? “ అని మిక్కిలి ప్రశంసించగా భీమకవి అష్టసిద్ధులు అంటే ఏమిటో రాజుకు ఈ క్రింది శ్లోకమును చెప్పారు.
                “అధిమా మహిమా చైవ గరిమా లఘిమా తధా
                ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వంపశత్వం చాష్ట సిద్ధియః”

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...