Saturday 25 July 2020

11. ధ్వజస్తంభమును నిలిపెట్టప్పుడు జరిగిన అద్భుతమహిమ


       

       స్వామివారి ఆలయమునకు ముందు భాగమున గొప్పశిలతో నిర్మింపబడిన ఒక ధ్వజస్తంభమును నిలిపినారు. దీనిని నిలబెట్టుటకు ఆ రోజుల్లో యంత్రములేవీ లేవు. జనసహాయముతో నిలబెట్ట వలెనని ఈ గ్రామమునకు చుట్టూ ఉన్న పల్లెలనుంచి పిలిపించిరి. ఎంతో మంది నాలుగు రోజులు శ్రమించినా కూడా ద్వజస్తంభము లేవలేదు. ఐదవరోజున ఈ ద్వజస్తంభము చేసిన సంత్రాసు, స్వామివారిని ఈ విధముగా వేడుకునెను.” స్వామీ! నాకు చేతనైనంత వరకూ కష్టపడి పనిచేసి, ధ్వజస్తంభమును చేసితిని. దానిని ఎన్ని విధములుగా ప్రయత్నించిననూ లేవలేదు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన వారందరూ ఈ గ్రామమున ఎన్ని రోజులుండగలరు? ధ్వజస్తంభము గతి ఏమిటని స్వామిని వేడుకుంటూ, చింతిస్తుండగా, అతనికి నిద్దుర వచ్చినట్లు కాగా, అతడు ఆలయప్రాంగణంలోనే పడుకున్నాడు. వెంటనే ఆ పడుకున్న సంత్రాసుకి స్వామి స్వప్నములో కనిపించి “ఒరే సంత్రాసు, నీవు చింతించనక్కర్లేదు. ఇప్పుడు వెళ్ళి, అక్కడ ఎవరుంటే వారితో పట్టించుము. ధ్వజస్తంభము తప్పక నిలుస్తుంది.” అని ఒక సాధువు వేషములో కలలో సాక్షాత్కరించాడు. సంత్రాసుకు వెంటనే మెలకువ వచ్చింది.


అతడు స్వప్నం ప్రకారము ధ్వజస్తంభము ఉన్న చోటకు వెళ్ళి అక్కడున్న స్త్రీ, పురుషులను పట్టమని కోరాడు. అయితే అక్కడున్న వారు నవ్వి వందలమంది నాలుగు రోజులుగా ప్రయత్నము చేసినా ఇంత కూడా లేవని ఈ ద్వజ స్తంభము ఈ కొద్దిమంది చేత లేవడం అసంభవము. నీకు పిచ్చిగానీ పట్టిందా అని పరిహాసము చేసారు. అప్పుడు ఆ సంత్రాసు “ అయ్యా! ఇక్కడ ఉన్న యావత్తు స్త్రీపురుషులందరూ కలిసి ప్రయత్నించండి. ఈ సారి ఈ స్తంభము లేవకపోతే ఇక్కడే నా ప్రాణములను అర్పిస్తానని వారితో చెప్పాడు. అపుడు అక్కడున్నవారు అతని మాటప్రకారము ప్రయత్నించారు. ఆశ్చర్యకరంగా ఆ ధ్వజస్తంభము లేచి, సరిగ్గా స్థలములో కూర్చొనింది. ఆ సమయానికి పక్కగ్రామమువారు కొంతమంది, ఈ గ్రామము వారు భోజనానికి వెళ్ళి ఉన్నారు. ఆ గ్రామములోని కొందరు పెద్దలు ఈ వార్త విని, చాలా సంభ్రమాశ్చర్యాలకులోనై, సంత్రాసును విచారించగా అతను తనకు స్వప్నమైన విషయమంతా చెప్పగా, అందరూ దేవున్ని అనేకవిధములుగా ప్రార్థించి, పూజా పురస్కారాదులాచరించి, గ్రామస్తులందరూ వారివారి ఇండ్లకు వెళ్ళిరి. ఈ ఘన చరిత్రను కలిగిన ధ్వజస్తంభము నేటికీ దేవాలయము ముందర ఉన్నది.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...