Friday 24 July 2020

భేతాళ భట్టు-భీమకవి


కేరళదేశానికి చెందిన భేతాళభట్టు అనే ఒక మాయగాడు ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకోని డబ్బు సంపాదించేవాడు. అలా ఊరూరూ తిరుగుతూ ద్రాక్షారామము, వేములవాడ ప్రాంతాలకు వచ్చాడు. ఇతడు సంసారుల ఇండ్లలో పోయిన పదార్థాలను తెప్పించుట, సంజనమువేసి శకునము చెప్పుట, పిశాచములను వదిలించుట, పద్మము వేసి ఇతరులచే చేయబడిన ప్రయోగములను మాన్పించుట, మొదలయిన భూతవైద్యమంత్రాలు తెలిసినవాడని చెప్పుకుంటూ ప్రజలను మోసంచేసేవాడు.హస్తలాఘవవిద్యలో(కనపడకుండా చేతి కదలికలతో మాయాజాలము చేయుట) ఆరితేరినవాడు.
        భీమకవికి ద్రాక్షారామములో విఠలదేవుడను పినతండ్రి కుమారుడొకడుండేవాడు. ఇతనుతరచూ అనారోగ్యం పాలయ్యేవాడు. ఇతని తల్లిదండ్రులు భీమకవిని ఆశ్రయించకుండా, మూర్ఖత్వముతో భూతవైద్యులను సంప్రదించేవారు. వాళ్ళు పిశాచము పట్టిందని. దయ్యము, పట్టిందని చెప్పి, వాళ్ళనుమరీ కృంగదీసేవారు. ఒకే కుమరుడవ్వడం వలన ఇతనిని ఎక్కడకీ పంపక, విద్యాబుద్ధులు కూడా చెప్పించక ప్రాపంచికజ్ఞానశూన్యుడను చేసారు. విధివశము వలన ఒకసారి పూర్తీ జ్వరం వచ్చి కదలేకపడిపోయాడు. అతని దేహమంతా విపరీతమైన నొప్పులు ఆవహించాయి. అప్పటికే భేతాళభట్టు వేములవాడ భీమకవి ఏమన్నా అది జరుగుతుందని, అనారోగ్యంతో కష్టాల్లో ఉన్నవారు భీమకవిని ఆశ్రయిస్తారని,ఆ నోటా ఈ నోటా విన్నాడు, కానీభీమకవిని ఎన్నడూ చూడలేదు.భీమకవికి ఇక్కడ ప్రాబల్యము తగ్గితే తనకు డబ్బు గడించడం తేలికవుతుందని,ఈ ప్రాంతంలో ఎవరింట భూతవైద్యానికి ఒప్పుకున్నా అది వేములవాడ భీమకవి చేసిన ప్రయోగము వలన సోకినదని చెప్పేవాడు. విఠలదేవుడను వాడికి అనారోగ్యము కలిగిందని విని, అతని ఇంటి వైపుకు వెళ్ళి  “పిశాచాలను వదిలిస్తాను” అని గట్టిగా అరవసాగాడు. అది విన్న ఆ కుటుంబము అతనిని ఆశ్రయించింది. ఆ భూతవైద్యుడు వారి ఇంటచేరి పద్మమేసి, జపము చేయుటకై కుర్ఛున్నాడు. ఆ పద్మమునకు నాలుగు వైపులా దీపములుంచాడు. కనులు మూసి జపము చేస్తున్నట్లు నటించి తన చంకలో దాచుకున్న వికృతాకారము గల ఒక బొమ్మను తన హస్తలాఘవముచే బయటకుతీసి ఆ పద్మములో ఎవ్వరికీ కనపడకుండా నిలబెట్టి “ఆ వచ్చితివా? నీవెవ్వరవు ఎందుకు విఠలదేవుడను సోకితివి?” అని ప్రశ్నలడిగి, సమాధానమును కూడా తానే మారుకంఠంతో పిశాచముపలికిన విధంగా “నేను పిశాచమును. వేములవాడ భీమకవి ప్రయోగమంత్రము వలన వచ్చి సోకాను” అని పలికాడు వీరు భీమకవి బంధువులని తెలియక. అది విన్నవారందరూ భీమకవి ప్రయోగము చేశాడా అని వణికిపోయారు.
        భేతాళభట్టునకు మహామంత్రాలేమీ రాకున్నాతనకు తెలిసిన ఒకే మంత్రాన్ని పదేపదే ఉచ్చరిస్తూ, హస్తలాఘవవిద్యతో చేతులూపుతూ ఆదే బొమ్మను తిరిగి తన చేతులతో మాయం చేసి పిశాచము వదిలిందని చెప్పి వారి నుండి ధనమును గ్రహించి ఇంకో వీధికి వెళ్ళిపోయాడు. ఒకతల్లిపిల్లలకు ఇంత వైరమా! భీమకవిలాంటి మహానుభావుడు ఇలా చేయునా? ఆయనే ఇలా చేస్తే ఈ లోకములో సన్మార్గులేవ్వరుంటారు? అని నలుగురూ అనుకుంటుండగా భీమేశ్వరవరప్రసాది అయిన భీమకవి దైవయోగము వలన ఆనాటి సాయంత్రానికే ద్రాక్షారామము చేరారు. జరిగిన విషయం విని భీమకవి మిగుల ఆశ్చర్యపడి భేతాళుడి వద్దకు వెళ్ళి “నేను నా పినతల్లి కుమారుని మీద ప్రయోగమొనరించానని చెప్పావట కదా? ఏది నా ఎదుట పద్మము వేసి పిశచమును ఒకసారి రప్పించుము” అని అడిగాడు. అతను భీమకవి తనను ఎటుల ఒనర్చునోనని భయపడి, ఒక్క నిమిషము ఇప్పుడే వచ్చెదనని లోపలికివెళ్లి,దొడ్డి దారిలోపారిపోయాడు. భీమకవి విఠలదేవుడినిపరీక్షించి“ఈ భూతవైద్యుడి హడావిడికి భయపడ్డం వలన జ్వరము ఇంకా ఎక్కువయ్యింది” అని చెప్పి, వైద్యశాస్త్రములో కూడా భీమకవికి హస్తమున్నందున తన నోటి మాటకు పని చెప్పకుండా ఒక ఔషదమిప్పించి అతని రోగమును మరుసటిరోజుకంతా మటుమాయము చేసారు. ఆ తరువాత అక్కడి వారితో “అనారోగ్యం కలిగినపుడు వైద్యుడిని ఆశ్రయించాలి లేదా భగవంతున్ని నిష్కల్మషమైన మనసుతో వేడుకోవలెను కానీ, ఇలా కల్లబొల్లి కబుర్లు చెప్పే భూతవైదులను సంప్రదించి, వారి తప్పుడు మాటలను నమ్మవద్దని, ఒకవేళ నేను ఈసమయానికి ఇక్కడకు రాకపోయుంటే మీ మూర్ఖత్వము వలన నేను నింద మోయాల్సివచ్చేదని  చెబుతూ ఈ పద్యాలను రచించారు.

      పొడమిమంత్రముల్చదివి భూతములన్ వదలింతుమంచు నా
        డాడను మోసగాండ్రు మృషలాడి ధనంబు గడింపజూతు రీ
        పాడుగుణంపు మానిసులఁ బాపుల చెంతకుఁ జేరనీక పం
        డ్లూడగ దౌడ వ్రేసినను నొందరు పాపమొకింతయేనియున్

భావము: లేని మంత్రములను సృష్టించి చదివి భూతములను వదిలిస్తానంటూ వచ్చి మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తారు. ఈ పాడు గుణమును కలిగిన మనుషులను,పాపులను దగ్గరకు చేరనీకుండా పండ్లూడబీకి దౌడ వేసినా ఒక్కింత కూడా పాపము కలుగదు.

      చచ్చినవాడు భూతమయి శాతకఠోరకుఠార వేదనో
        పచ్చలితప్రతీవ్రగతి బాధలుఁబెట్టునటంచుఁబామరుల్
        పిచ్చితలంపులన్ దవిలి భీతిలుచుండెదరీ ధరాస్థలిఁ
        జచ్చినవాని కెక్కడిదిశక్తి? వివేకము నందుడీజనుల్

భావము: ఈ లోకంలో మూర్ఖులు, మరణించిన వాడు భూతముగా మారి, పగబట్టి తీవ్రంగా బాధలు పెడుతున్నాడట అంటూ పిచ్చి ఆలోచనలతో, కొద్దిగా భయపడుతారు కానీ చచ్చిన వాడికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?జనాలు వివేకము పొందరే?

     కవిమాన్యుండు శపించెనేని యదియే గాఢప్రయోగంబుగా
        భువి నెవ్వారిని నాశనంబు సలుపుఁ బుణ్యాత్ములౌ సజ్జనుల్
        కవిసత్కార మొనర్చి సంపదలు భోగంబుల్ సౌఖ్యసంతానముల్
        దవులన్ బొందుట దక్షవాటిక విరాట్తత్వంబై చాటించెడున్

భావము: ఈ కవీమాన్యుడు శపించాడంటే, అదిఎవరినైనా తీవ్రప్రయోగముమైనాశనము చేస్తుందని(అంటారు). సజ్జనులు నను సత్కరించి, ఆరాధించి పుణ్యాత్ములవుతారు. సంపదలు,సుఖసంతోషాలు, సంతానాలకు అర్హులౌతూపొందడము నాలోని ద్రాక్షారామభీమేశ్వరుని గుణాన్నిచాటిచెప్తాయి.

      అని మొనఁ గూలిపోమఱల నాయువొసంగితిఁ దిక్కమంత్రికిఁ
        గనికరమొప్ప సంపదల గంగునికిచ్చితిఁ దొల్లి కోపముఁ
        బెనఁగొని పోతరక్కసునిఁ బెట్టితి శాపముఁ జచ్చునట్లుగా
        ఘనుడను వేములవాడ కవికాంతుఁడ భీమవరప్రసాదుడన్

భావము: ఘనుడను, వేములవాడన భాసిల్లే కవీశ్వరుడను, భీమేశ్వరవరప్రసాదుడనైన నేను యుద్ధములో చనిపోయిన తిక్కనమంత్రిని మరలా బ్రతికించి ఆయువును ప్రసాదించాను. కళింగ గంగుపై తొలుత కోపించినా, తర్వాత కరుణ కురిపించి, అతనికి సంపదలను ఇచ్చాను. పోతురాక్షసున్ని మరణించే విధంగా శపించాను.

      మానుగబంధుకోటి నభిమానమునఁ దిలకింతుంగాని లో
        నూనిన కోపావేశమున నొప్పి శపింపగ విఠ్ఠలయ్యకున్
        బూని ప్రయోగమున్ సలుపఁబూనితినం చపనిందఁజెందగా
        లేనని సప్రమాణముగ లేఖినిముట్టి వచింతు మాటికిన్

భావము:విఠ్ఠలయ్యను ఆవహించేలా మంత్రప్రయోగము చేయబోయానంటూ అపనింద కలుగగా, బంధుకోటి నిజమైన అభిమానమును చూస్తానే కానీ, మనసులో కోపావేశాలను దాచుకొని, నొచ్చుకొని తిట్టలేదనీ, ప్రమాణపూర్వకముగా వ్రాసే కలమును తాకి మరలా మరలా చెబుతున్నాను.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...