Friday 24 July 2020

మహిమలు

చెరువు భీమకవికి మార్గమివ్వడం:
        భీమకవి ఒకనాడు ద్రాక్షారామమునకు 10 మైళ్ళ దూరాన ఉన్న ఒక ఊరునకు వెళ్తున్నపుడు మధ్యలో ఒక చెరువును దాటాల్సి వచ్చింది. ప్రక్క నుంచి వెళ్ళడానికి దారి ఉన్నా కూడా, అది బురదతో నిండి నడవడానికి వీలులేకుండా ఉంది. భీమకవి కొంత సమయము ఏం చేద్దామా అన్నట్లు వేచి చూసారు. ఒకవైపు పొద్దెక్కిపోతోంది. ఇక లాభం లేదని భీమకవి “నాకు మార్గమేర్పడు గాక” అనే సరికి చెఱువు రెండు పాయలై మార్గమును ఇచ్చింది. గట్టున ఉన్న వారంతా ఈ సంఘటనను చూసి ఆశ్చర్యముతో తిలకిస్తూ, భీమకవి దైవాంశసంభూతుడుడని ఇతనికి సాధ్యం కానిది ఏదీ లేదని పొగడసాగారు.

పౌర్ణమిని అమావాస్య చేసి చూపిన ఘట్టం:
        భీమకవి ఒకనాడు దేవాలయమంటపంలో కూర్చొనుండగా ఒకతను ఈ వేళ తిథి యేమని అడిగాడు. భీమకవి వెంటనే తన మహిమ చూపదలచాడో ఏమో అమావాస్య అని సమాధానమిచ్చారు. అక్కడున్న మిగితా బ్రాహ్మణులంతా “మహా  గొప్పవాడివయ్యా నువ్వు? ఈ రోజు అమావాస్యనా? ఈ రోజు పౌర్ణమి కదూ. ఆ విషయం కూడా మరచితివా? “ అని నవ్వుతూ అన్నారు. ఆ రోజు పౌర్ణమే. అయితే భీమకవి మాటకి తిరుగులేదు కదా? ఆయన “ఈ రోజు అమావాస్యనే. రాత్రి వేళ చంద్రుడు ఉదయించడు. లోకమంతా చీకటితో నిండిపోతుంది. అప్పటి దాకా ఇక్కడే ఆగి చూడండి.” అని చెప్పి తన తండ్రిని మనసులో తలచుకున్నారు. ఎలా అమావాస్య అవుతుందో అదీ చూద్దామని వారంతా ఇండ్లకు వెళ్ళకుండా రాత్రి దాకా అక్కడే ఉన్నారు. రాత్రి ఏడు గంటలు దాటింది. కానీ చంద్రుడు ఉదయించలేదు. అంతా చీకటిగాతో నిండిపోయింది. అక్కడి వారంతా భీమకవి మహిమాన్వితుడని తెలుసుకొని “మహాత్మా! మీరు స్వయానా భీమేశ్వరుని స్వరూపము. ఆయన అంశతో పుట్టిన మీ మహిమ అసాధారణమయినది. ఇక అనుగ్రహించి ఎప్పటిలాగే వెన్నెలను తెప్పించండని” అడిగారు. భీమకవి మరొకసారి తన తండ్రి భీమేశ్వరుని తలచుకొనెను. వెంటనే చంద్రుడుదయించి లోకమంతా పిండి ఆరబోసినవిధంగా వెన్నెలతో నిండిపోయింది. ఆనాటి నుంచి అక్కడివారంతా “సూర్యచంద్రులే గతి తప్పుదురేమో గానీ భీమకవి మాట మాత్రం తప్పదు” అని నమ్మేవారు.  
       
        భీమకవిది వైద్యశాస్త్రములో కూడా అందెవేసిన చేయి. అస్వస్థత కలిగినపుడు చాలా మంది ఈయనను ఆశ్రయించేవారు. ఒకసారి భీమకవి వైద్యము చేస్తున్నపుడు, ఔషధము తయారుచేయడానికి పేరాముదపాకులు కావాల్సివచ్చింది. అక్కడ అందుబాటులో ఉన్న ఒకతన్ని పేరాముదపాకులు కోసుకురమ్మని పంపారు. పేరాముదపుచెట్టున్న ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, అతని అనుమతి అడిగాడు. అతను ఆకులు కోసుకోవడానికి ఏమాత్రమూ ఒప్పుకోలేదు. వైద్యానికని చెప్పినా అంగీకరించలేదు. ఇక వేరే చోటెక్కడా అతను పేరాముదపాకు చెట్టు కనపడనందున, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాపడిదొడ్లోనే అతనికి తెలియకుండా ఆకులు కోసుకొనే ప్రయత్నం చేసాడు. అది చూసిన బ్రాహ్మణుడు, అతన్ని దారుణంగా కర్రతో మోదడం మొదలెట్టాడు. ఇది చూసిన వారు ఈ విషయం భీమకవికి చెప్పడంతో నేరుగా అక్కడకు వెళ్ళారు. వైద్యం కోసం సహాయమడిగితే దారుణంగా కొట్టినందుకు గాను అతన్ని సత్తువ లేకుండా పడిపొమ్మని శపించి,  పారాముదపాకులను కోసుకొని వెళ్ళిపోయారు.

        తాను ఈ ఊరిలో ఉంటే తన విద్యామాహత్యము వెల్లడికాదని,మన ఇంట ఉన్న సంజీవని మొక్క ప్రాణమును కాపాడునదే అయిననూ, నలుగురికి ఉపయోగపడకపోతే దానికి తగిన న్యాయము చేయకుండా నిర్లక్ష్యము వహించినట్లేనని,అలానే తన విద్య ఈ ఊరికే పరిమితం కారాదని, నా తండ్రి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఈ విద్యామహత్వము లోకానికి వెళ్ళడిచేసి పరిపూర్ణ న్యాయం చేయాలని తలిచాడు. వరమిచ్చునపుడు భీమేశ్వరుని మాటను ప్రకారం, తన తల్లి ఆశీర్వాదమును తీసుకొని,నానా రాజులను సందర్శించనారంభించారు.తన ఉద్దండ కవిత్వంతో ఆనాటి చక్రవర్తులను రంజింపచేసి వారిని మెప్పించారు. వారిచే ఘనసత్కారాలను, సన్మానాలను, కనకాభిషేకాలను పొందారు. ఎక్కడికెళ్ళినాఎదురన్నది లేక అప్రతిహత వచనుడై విరాజిలారు. తన రాజ సందర్శనాల్నితొలుత చొక్కభూపతితో మొదలు పెట్టారు. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...