Saturday 25 July 2020

10.గడేకల్లులో స్వామి వారి దేవాలయం నిర్మించేటప్పుడు ప్రత్యక్షమై మహిమను చూపిన విధానము


స్వామివారి ఆలయమును బళ్ళారి నివాసులైన జొన్నగడ్ల పాపయ్య అనునతడు కట్టించుటకు గాను, బళ్ళారియందే స్వామి ఆలయమునకు కావలసిన రాతిదూలములు, స్తంభములు, బండలు మొదలైన యావత్తు సామానులు తయారు చేయించారు, వాటిని అచ్చటి నుండి, గడియాద్రిపురము (గడేకల్లు)నకు తెచ్చుటకు గాను,బళ్ళారిలోనే బాడుగ బండ్లవారిని  పిలిపించి, ఈ సామానులు చూపిన వెంటనే బాడుగ వారందరూ, ఇంత పెద్ద సామానును బండ్లు ఎత్తినచో, బండ్లు నిలబడలేవు. ఈ కష్టము మాకు అక్కర లేదంటూ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. ఈ స్థితిని చూచి, పాపయ్య వారందరికీ ఎంత బాడుగ అడిగితే అంత ఇస్తానని ఎంత చెప్పినా కూడా ఎవరూ వినలేదు. కారణమేమని విచారించగా హగిరి వంక వద్ద దారి సరీగా ఉండదని, అక్కడ 6 ఎద్దులు కట్టినా ఈడ్చలేవని, ఇబ్బందులు పడాల్సివస్తుండని చెప్పి బండ్లవాళ్ళువెళ్ళిపోయారు.
ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఈ భక్తుడు చాలా చింతించి, స్వామిని అనేకవిధములుగా ధ్యానిస్తూ, తన ఇంటికి వచ్చి స్నానము చేసి, సంధ్యవార్చునపుడు దివ్యస్వరూపముతో ఒక యోగి దర్శనమిచ్చి “ఒరే, నీవు చింతించనక్కర్లేదు. బండ్లవాళ్ళకు, బండ్లకు ఏమైనా నష్టము కలిగినట్లయితే వాటిని సరిచేయిస్తానని, ఒకవేళ ఎద్దులు ఈడ్చలేకపోయిన ఆ బండ్ల్లను అక్కడే వదిలి వెనుతిరిగి రమ్మని, ఒక బండికి నాలుగు వంతులు కట్టిస్తానని వారితో చెప్పమన్నారు. అప్పుడు వారు బండ్లు కడతారు. బండ్లకు నష్టము కలుగకుండా, ఎద్దులు కష్టపడకుండా, సామాను అంతా నా స్థలమునకు చేరును. నువ్వు చింతించవద్దని” చెప్పి అదృశ్యమయ్యాడు. భీమలింగేశ్వరుని అనుగ్రహానికి సంతోషించి, తక్షణము భోజనము చేసి,, బండ్లవాళ్ళను పిలిపించి వారితో స్వామి చెప్పిన విధంగా భాషించాడు. కానీ ఆ బండ్లవాండ్లు అనుమానము ప్రకటించగా, పాపయ్య “ప్రమానపూర్వకముగా ఎటువంటి నష్టము కలిగినా నేనే భరిస్తాను. ఇది ఆ భీమలింగేశ్వరునిమీద ఆన. అని పలికాడు.
బండ్లవాళ్ళు అతని భక్తివిశ్వాసములను చూసి, సమ్మతించారు. కానీ వారిలో ఒకడు హగిరి వంక వద్ద దాటునపుడు ఎద్దులు పోలేకపోతే ఎలాగని సందేహము తెలిపెను. అపుడా భక్తుడు అపూర్వవిశ్వాసముతో “ అలా ఆటంకమైతే ఈ వస్తువులన్నీ అక్కదే వదిలివేసి రమ్మని చెప్పారు. వారందరూ ఆ దేవుని మహిమ ఎట్టిదో ఏమో! మనమెందుకు వాదింపవలెనని, బండ్లకు  సామాను ఎత్తించుకొని బయలుదేరారు. బండ్లన్నీ హగిరి వరకు నిరాటంకంగా ప్రయాణించాయి. బండ్లను హగిరి వద్ద ఆపి, కాడి పెట్టించాలని ఆలోచిస్తుందగా అంతలో బండ్లన్నిటిలో ముందున్న బండి ఎద్దులు తమంతట తామే, మనిషిలేకనే హగిరి వంక వద్ద తోవ తప్పకుండా, ఆయాసపడకుండా దాటాయి. ఇది చూసిన బండ్ల వాళ్ళు ఆశ్చర్యమానసమగ్నులై, ఇది దేవుని మహిమనే కానీ వేరొకటి కాదు. ఇంతబరువైన బండ్లు ఇంత సునాయాసంగా వంకదాటడం చాలా విడ్డూరమనుకుంటూ బండ్లనన్నిటినీ హగిరి వంకను దాటించారు. తరువాత రోడ్డుమార్గమున జోళిదరాశి అను గ్రామము వద్దకు రాగానే ఒక బండికి మాత్రము యేరుకోలు పటపటమని శబ్దమయ్యింది.
అప్పుడు బండి తోలువాడు కొంచెము అంతుకొని ఉన్న ఇరుసును చూచి ఇది విరుగుట నిశ్చయము, విరిగిన తరువాత ఎద్దులపై పడుతుందని తలచి, బండి విడిచినాడు.  మిగితా వారందరూ వచ్చి చూసి ఏమి చేయాలని చింతించునంతలో ఒక తెల్లనిగుర్రంపై కుర్చోని ఒక సాధువు వాళ్ళ వద్దకు వచ్చారు. తెల్లటి వెంట్రుకలతో, తెల్లటి గడ్డముతో ఉన్న ఆ సాధువు “నాయనా మీది ఏ గ్రామము? వీటిని ఏ గ్రామానికి తీసుకెళ్తున్నారు? ఏ దేవుని ఆలయము కట్టడం కోసం?” అని విచారించగా, వాళ్ళు  ఈ సామాను గడియాద్రిపురమున శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి ఆలయనిర్మాణము కోసం తీసుకు వెళ్తున్నామని చెప్పగా, మరి బండ్లను ఇక్కడ ఎందుకు ఆపారు అని ప్రశ్నించారు. ఈ బండి యేరుకోలు కొద్దిగా విరిగిందని ఆ సాధువుకు చూపించారు. ఆ సాధువు దానిని చూసి, ఇది ఏమాత్రమూ విరిగిపోదు. దీనికి ఒక కొయ్యవేసిబిగించినయెడల దీనికి భయము లేదని చెప్పగా, దీనికి తగువైన కర్రను ఎక్కడ తేవాలని వాళ్ళు ఆలోచిస్తుండగా, ఆ సాధువు తన చేతిలో ఉన్న చండ్రాయుధమును వాళ్ళ చేతికి ఇచ్చి దగ్గర ఉన్న కొండవద్ద ఉన్న వేపకొమ్మను కోసుకు రమ్మని చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఒక వేపకొమ్మను తీసుకురాగా, దానిని యేరుకోలుకు వేసి బిగించారు. వాళ్ళు కదిలిన వెంటనే, సాధువు అదృశ్యమయ్యారు.
అప్పుడు ఆ బండ్లవారందరూ అయ్యో! స్వామి మనకు దర్శనమిచ్చుటకే ఈ విధంగా జరిగినదేమో అని స్వామిని తలచుకుంటూ, ఎటువంటి ఆటంకములూ లేకుండా గడేకల్లు స్వామి అలయము చేరారు.
అంతలోనే బెళ్డోణ గ్రామము నుండి కొంతమంది భక్తులతోకూడి స్వామివారి పూజారి గడేకల్లు ఆలయము వద్దకు వచ్చారు. ఆ బండ్ల వాళ్ళు, ఈ పూజారిని చూసి, ఈయనే మాకు జోలిదరాశి వద్ద దర్శనమిచ్చి, అదృశ్యమయ్యారు. ఇపుడు ఇక్కడ దర్శనమిచ్చారని అతని పాదాలకు నమస్కరించి “మీరు జొలిదరాశి వద్ద సహాయము చేయకుంటే ఎంతో ఇబ్బంది పడేవారము స్వామి”. అనగా అపుడు ఆ పూజారి “నేను బెళ్డోణ గ్రామము వెళ్ళి మూడు రోజులయ్యింది. ఇప్పుడే రావడము. కావాలంటే నాతో పాటు వచ్చిన వీరిని విచారించండని” చెప్పెను.


ఆ బండ్ల వాళ్ళు “మాకు ఈ సాధువే కనిపించినది. తెల్లని గుర్రంపై చేతిలో చంద్రాయుధముతో కన్పించారు.” అని చెప్పగా, వారందరూ చంద్రాయుధము స్వామివారి జీవసమాధిపై ఉండును. ఈ పూజారి చేతిలో ఉండదు, అని స్వామివారి సమాధిపై ఉన్న చండ్రాయుధమును చూసారు. ఆ చంద్రాయుధముపై చెట్టు కొట్టిన రసము కూడా ఉండింది. అది పరీక్షించి అందరూ ఆశ్చర్యపడి, ఇదంతా స్వామి ప్రత్యక్షముగా నడిపిన కార్యము, లేకున్న ఈ చంద్రాయుధమునకు రోజూ విబూధి పూజ చేస్తారు. ఈ చెట్టు  కొట్టిన ఆనవాలు ఎలా వస్తుంది. అంతా స్వామి మహిమ అనుకున్నారు. ఆ బండి వాళ్ళందరూ స్వామి ఆలయానికి సంబంధించిన సామాను అంతా దింపివేసి, ఆనందమైన మనసుతో బళ్ళారికి ప్రయాణమయ్యారు. అక్కడ పాపయ్యను కలిసి జరిగిన వృత్తాంతమంతా చెప్పి మాకు బాడుగ అవసరం లేదు. మేము స్వామి కృపకు పాతృలమయ్యామని పలికారు. అపుడు ఆ పాపయ్య స్వామి వారి మహత్యము తెలుసు కావుననే నేను అంత నమ్మకంతో ఈ కార్యమునకు ఉపక్రమించాను. మీరు డబ్బు వద్దంటే నాకు ఫలితం ఉండదు అని బలవంతముగా వారికి బాడుగలు ఇచ్చి పంపాడు.


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...