Friday 24 July 2020

కోమటి గురునాధుడు - భీమకవి



                
భీమకవి రాజమహేంద్రవరం వెళ్ళినపుడు తానే స్వయంగా భోజనము వండుకోవాలని తలచారు. అందుకు కావలసిన బియ్యం, పప్పుదినుసులు మొదలైన వంటసామాగ్రిని కొనడానికి కోమటి గురునాధుని అంగడికి వెళ్ళారు. ఈ కోమటి ఎవరైనా కొత్తవారు, వేరే ఊరి వారు, తన కొట్టుకు వస్తే అందరికీ అమ్మే ధర కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్మి లాభము గడిస్తాడు. అతను భీమకవి పేరు వినడమే కానీ, ఎన్నడూ చూడలేదు. అందువల్లభీమకవి అతని అంగడికి వచ్చినపుడు,కొత్తవారిలా భావించాడు,తనకు  ఈ రోజు భళే బేరము దొరికిందని సంతోషపడి,అందరికీ అమ్మే ధర కంటే మూడు రెట్లు అధికధర చెప్పాడు. భీమకవి “ఇదేమిటయ్యా! అందరికీ ఇచ్చే ధర కన్నా ఎక్కువ చెబుతున్నావు” అని ప్రశ్నిస్తే, అతను“వచ్చిన వారిని బట్టి, వారి అవసరాలను బట్టి ధరలు నాకు ఇష్టమైన ధరచెబుతాను. ఇష్టమైతే కొను. లేదంటే వెళ్ళిపో. నువ్వు కొనకపోతే నాకు వచ్చే నష్టమేమి లేదు.” తలబిరుసుసమాధానము చెప్పాడు. భీమకవి కోపంతో ఈ క్రింది పద్యమును చెప్పారు.

                 గొనకొనిమర్త్యలోకమునఁ గోమటిపుట్టగఁ దోడఁ బుట్టె  బొం
                   కునుఁగపటంబులాలనయుఁగుత్సితబుద్ధియు రిక్త భక్తియుఁ
                   జనిమిరిమాటలున్ పరధనంబును గ్రక్కుననొక్కఁ జూచుటల్
                   కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటుదనంబును మూర్ఖవాదముల్

                 కోమటి కొక్కటిచ్చి పదిఁ గొన్నను దోషములేద; యింటికిన్
                   సేమమెఱింగి చిచ్చిడినఁ జెందదు పాపము; వానినెప్పుడే
                   నేమరుపాటునన్ మఱియు నేమి యొనర్చిన లేదు దోసమా
                   భీముని లింగమాన; కవిభీముని పల్కులు నమ్మియుండుఁడీ

భావము:అబద్ధములాడడం(బొంకు), మోసముచేయడం(కపటము), అత్యాశ(లాలస), నీచపుటాలోచనలు(కుత్సితబుద్ధి), గౌరవాభిమానాలులేకపొవడము(రక్తిభక్తి), కల్లబొల్లి మాటలు చెప్పడం (చనిమిరి మాటలు), పరులధనమును నొక్కే అవకాశము కోసము చూచుట (పరధనంబును గ్రక్కునన నొక్కజూచుట), కొని అమ్మడములో మొహమాటమును వదిలి మూర్ఖంగా వాదించడం వంటి లక్షణాలతో పుట్టిన ఏ కోమటి దగ్గరైనా పది కొని ఒకదానికి మాత్రమే చెల్లించినా తప్పులేదు. వారికెటువంటి హాని కలుగకుండా,వారి ఇంటికి చిచ్చుపెట్టినా ఏ పాపమూ కలుగదు. అతని ఏమరపాటును అవకాశముగా తీసుకొని ఏమి చేసినా(మోసము చేసినా)తప్పులేదనిభీమేశ్వరునిని మీద ప్రమాణముచేసి ప్రకటిస్తున్నాను. భీమకవి మాటలను విశ్వసించండి.

                 రామునమోఘ బాణమును రాజశిఖామణి కంటిమంటయుఁ
                  
దామరచూలి వ్రాతయును దారక విద్విషు ఘోరశక్తియున్
                  
భీముగదావిజృంభణము వెన్నుని చక్రము వజ్రి వజ్రమున్
                  
వేములవాడ భీమకవి భీషణ వాక్యము రిత్తవోవునే

భావము: తిరుగులేని రామబాణం, శివుని మూడోకంటి మంట, బ్రహ్మ తలరాత, తారకాసురున్ని వధించిన సుబ్రహ్మణ్యేశ్వరుని “శక్తి” అస్త్రము, భీముని గదాఘాతము, విష్ణుమూర్తి చక్రము, ఇంద్రుని వజ్రాయుధం ఎలా తిరుగులేనివోశ్రీ వేములవాడ భీమకవి భీషణ వాక్యము కూడా అంతే తిరుగులేనిది.

          అక్కడే ఉన్న మరొక కవి, భీమకవి మాటలు వినగానే, మిక్కిలి సంతోషముతో, ఇన్నాళ్ళూ ఆ కోమటిపై ఎంతో కోపమున్నా,అణుచుకొని ఉన్నవాడు,ధైర్యము తెచ్చుకుని, ఒక కోమటికి వ్యతిరేఖంగా ఈ పద్యమును చెప్పాడు.

                వేములవాడ భీమ! భళిరే! కవి సన్నుత! పద్యమందు నీ
                వేమని చెప్పినాడ వొక యించుక కోమటి పక్షపాతివై
                కోమటి కొక్కటిచ్చి పదిఁగొన్నను దోసములేదటందురా?
                కోమటి కొక్కటీక పదిగొన్నను దోసము లేదు లేశమున్

భావము:  వేములవాడ భీమా! భళారే! చాలా చక్కగా చెప్పారు. పద్యములో నీ వేమని చెప్పావు. ఈ కోమటి వైపు ఇంకా ఒక ఇంచు పక్షపాతము చూపి, ఒక్కటికి చెల్లించి పది కొన్నా దోసము లేదంటిరి? కానీ ఈ కోమటి దగ్గర పది కొని, ఒక్కటికి కూడా చెల్లించకున్నాఏమాత్రమూ దోసము లేదనినేనంటాను.
        ఆ కోమటికి “భీమకవి” అన్న పేరువినగానే వణుకు పుట్టింది. కళింగగంగును ఒనరించిన తీరు గుర్తుకువచ్చిందతనికి. అంతేకాకభీమకవికి, ఇంకోక కవి తోడవ్వడంతో   వీరిరువురి పలుకులు తనకే ముప్పు కల్గించునోనని భయపడి, బదులుచెప్పకుండాపాదాలపై వాలి “మహానుభావా! నన్ను మన్నించండి. ధనవ్యామోహముతోఇన్నాళ్ళూ ఇలా చేస్తూ వచ్చాను. తమరెవరో తెలియక మీపట్ల కూడా అదే తప్పుచేశాను. ఇకపై ఎవరిని మోసగించకుండా నిజాయితీగా బ్రతుకుతాను. నా అపరాధముకు మన్నించి తమరి యవతజ్ఞతను ఉపసంహరించుకొమ్మని” వేడుకున్నాడు. భీమకవి శాంతించి తన మాటలను ఉపసంహరించుకున్నారు. ఆ కోమటి భీమకవికి కావాల్సిన అన్ని పదార్థాలను ఉచితంగా ఇవ్వబొగా, భీమకవి మాత్రం డబ్బు చెల్లించే తీసుకువెళ్ళారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...