Thursday 6 August 2020

శ్రీ యోగానంద గురునరసింహ స్వామి (Shi Yogananda Guru Narasimha Swami) క్షేత్రం సాలిగామ, కర్ణాటక

హిరణ్య స్థంభ సంభూత ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లదార్తి ముషే జ్వాలానారసింహాయ మంగళమ్

భక్తుని మాటను నిజం చేయడానికి తనను తాను ఒక స్తంభంలో ఫ్రకటించుకున్న నరసింహస్వామి భక్తుల కోర్కెలు తీర్చడం కోసం ఎన్నో క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. అలా నరసింహస్వామి గురువుగా కొలువైన క్షేత్రం  ఉడిపికి 25 కి.మీ. దూరంలోని సాలిగ్రామాలోని గురునరసింహ క్షేత్రం. 

పద్మపురాణం ప్రకారం

నారదమహర్షి ఈ క్షేత్ర ప్రాంతానికి వచ్చిన సమయంలో భయంకరమైన ఉరుములు మెరుపులతో భూమి కంపించింది. ఆ సమయంలో అక్కడి మునులు,రుషులు నారదమహర్షిని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశవాణి “ఈ ప్రాంతంలో బ్రహ్మరుద్రాది దేవతలు అర్చించిన శంఖ చక్రములను ధరించి శంఖ, చక్ర తీర్థముల మధ్య ఆశ్వర్థ వృక్షం వద్ద నరసింహస్వామి మూర్తి ఉన్నదని నారదమహర్షి ఈ క్షేత్రంలో విగ్రహప్రతిష్ట చేయాలని” పలికింది. నారద మహర్షి నరసింహ స్వామివారి విగ్రహాన్ని వెతికి తీయించి స్వామి వారి ఆనతి ప్రకారం ఈ ప్రాంతంలో విగ్రహప్రతిష్ట గావించారు.

స్కాందపురాణం ప్రకారం

కదంబవంశానికి చెందిన మయూరవర్మ కుమారుడైన లోకాదిత్య తన సైన్యంతోపాటి భట్టాచార్యుల నాయకత్వంలోని బ్రాహ్మణులతో ఈ ప్రాంతానికి వచ్చారు. రాజు రాజ్యంసుభిక్షంగా ఉండాలని లోకాదిత్యుడు ఈ బ్రాహ్మణులతో ఎన్నో యాగాలను చేయించారు.  

భట్టాచార్యులవారు ఈ ప్రాంతంలో ఏనుగులు, సింహాలు జంతువులు సహజ వైరం మరచి జీవించడం గమనించి ఈ ప్రదేశానికి నిర్వైర్యప్రదేశం గా నామకరణం చేసారు.

భట్టాచార్యునికి 10 చేతులతో వినాయకుడు కలలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలోని యోగా నరసింహుని విగ్రహాన్ని పునఃప్రతిష్ట కావించమని చెప్పారు. అలా ఆయన నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట చేసారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టతో పాటు నిర్వైర్యప్రదేశం అను పేరుకు గుర్తుగా మహాగణపతిని కూడా ప్రతిష్టించారు.    

ఈ బ్రాహ్మణులు ఇక్కడ నరసింహస్వామిని గురువుగా పూజిస్తుండడంతో క్షేత్రం పేరు గురునారసింహక్షేత్రంగా సుప్రసిద్ధమయ్యింది.ఇక్కడ స్వామివారి విగ్రహం సాలగ్రామ స్వాయంభూ విగ్రహం.

ఈ క్షేత్రంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీ గురు అన్నదాయినీ మంటపంలో అన్నదానము జరుపబడుతుంది.  


 


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...