Tuesday 4 August 2020

భవసాగరమును దాటించే లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రము

హరి సర్వాంతర్యామి ఎక్కడ చూసినా ఆయన జాడే... రూపమైనా ఆయనదే... నరుడూ ఆయనే... సింహమూ ఆయనే... నారసింహమూ ఆయనే... తనను తాను నిరూపించుకోవడం మనకే కాదు భగవంతుడికీ ఉంటుంది... ప్రహ్లాదవరదుడిగా స్తంభం నుంచి ఆవిర్భవించినా... ఆదిశంకరులను రక్షించేందుకు అరణ్యంలో సింహగర్జనలు చేసినా అది సర్వకాలసర్వావస్థల్లోనూ తానున్నానని చాటిచెప్పేందుకే... తరచిచూస్తే... నృసింహావతారం మనకు ఎన్నో విషయాలు బోధపరుస్తుంది. ఆయన ఎంత ప్రచండమో... అంత ప్రసన్నం... ఎంత ఉగ్రమో... అంత సమగ్రం... ఎంత అద్భుతమో... అంత ఆహ్లాదం... హృదయాంతరాళాల్లో నుంచి మమ దేహి కరావలంబం అని పిలిస్తే చాలు ఆయనవచ్చి వాలిపోతాడు... ఎంతటి క్లిష్టసమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాడు.


కరావలంబమ్అంటే చేయూత అని అర్థం. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించేవారిని ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే ఏదో విధంగా శిక్షించి, ధర్మోద్ధరణ చేస్తాడు దేవదేవుడు. అలాగే తనను నమ్మి సంపూర్ణ విశ్వాసంతో జీవితం గడిపేవారిని కరావలంబాన్ని ఇచ్చి రక్షించి తీరతాడు. విషయాన్ని నిరూపించేదే జగద్గురు ఆదిశంకరాచార్య రచించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. లక్ష్మీ సహితుడైన నరసింహస్వామిని నీ చేయూతతో గట్టెక్కించమని ఆర్తితో ప్రార్థించే భక్తుడి హృదయం స్తోత్రంలో ఆవిష్కృతమవుతుంది. అసలీ స్తోత్ర ఆవిర్భావ సందర్భం భక్తుడిపై భగవంతుడికి ఉండే వాత్సల్యాన్ని ప్రకటిస్తుంది. శంకరభగవత్పాదులు శిష్యులతో కలిసి దేశసంచారం చేస్తూ శ్రీశైలానికి వచ్చారు. కాపాలిక సంప్రదాయం విస్తృతంగా ఉన్న రోజులవి. ఉగ్రదేవతోపాసన, మనుషులను బలి ఇవ్వడంలాంటి అనాచారాలు అందులో ఉండేవి. రోజు ఆదిశంకరులు ఒంటరిగా ఉన్న సమయంలో మూర్ఖపు ఆలోచనతో ఉన్న కాపాలికుడు ఆయనను చంపాలనుకున్నాడు. కాపాలికుడు కత్తి ఎత్తగానే ఎక్కడో ఉన్న శంకరుల శిష్యుడైన పద్మపాదుడికి గురువు ఏదో ఆపదలో ఉన్నట్లు అనిపించి నృసింహ మంత్రాన్ని జపించాడు. లోగానే భగవానుడు నృసింహుని రూపంలో వచ్చి కాపాలికుడిని సంహరించాడు. అలా నృసింహస్వామి ప్రత్యక్షమైన సమయంలో ఆదిశంకరులు చేసిన స్తోత్రమే నృసింహ కరావలంబ స్తోత్రంగా చెబుతారు. స్తోత్రమంటే గొప్పగా స్తుతించడం. వీటిలో వర్ణనలుంటాయి. కరావలంబ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో స్వామి లీలావిశేషాల వర్ణనతో పాటు గొప్ప ఆధ్యాత్మిక చింతనా ధోరణి కూడా కనిపిస్తుంది.పునరపి జననం, పునరపి మరణం... కాబట్టి చావు పుట్టుకల చక్రంలో పడి కొట్టుకోక మోక్షం కోసం ప్రయత్నించమనే సందేశం కనిపిస్తుంది.


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే

భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 1 ‖

పాలసముద్రంలో నివసించే స్వామీ! చక్రధరుడా! ఆదిశేషుడి పడగలపై ఉండే రత్నకాంతులతో ప్రకాశించే దివ్యదేహుడా! యోగులకు ప్రభువైనవాడా! శాశ్వతుడా! సంసారసాగరాన్ని దాటించే నావలాంటి వాడా! లక్ష్మీదేవితో కూడిన నరసింహమూర్తీ నాకు చేయూతనివ్వు!

 

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి

సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |

లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 2 ‖

బ్రహ్మేంద్రరుద్రులు, వాయుదేవుడు, సూర్యుడులాంటి దేవతలంతా నీ పాదాలకు నమస్కరిస్తుంటే దేవతల కిరీటాల కాంతితో నీ పాదపద్మాలు ప్రకాశిస్తుంటాయి. స్వామీ నీవు లక్ష్మీదేవి యొక్క అందమైన కుచపద్మములందు విహరించు రాజహంసవు. ప్రభూ! నాకు చేయూతనిమ్ము.

 

సంసారదావదహనాకరభీకరోరు-

జ్వాలావళీభిరభిదగ్ధతనూరుహస్య |

త్వత్పాదపద్మసరసీరుహమాస్తకస్య

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 3 ‖

శరణాగతవత్సలా! సంసారమనెడి కార్చిర్చు, కలత కలిగించే భయంకరమైన జ్వాలలు నలువైపులా నన్ను చుట్టిముట్టి దహించి వేయుచున్నాయి. బాధలను భరించలేక నీ పాదపద్మములను శరణుజొచ్చితిని. ఓ లక్ష్మీనరసింహా నాకు చేయూతనివ్వు.

 

సంసారజాలపతి తస్య జగన్నివాస

సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |

ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 4 ‖

జగన్నాయకా! సంసారమనే వలలో పడి ఉన్నాను.గాలమునకు చిక్కిన చేపవలే విషయసముదాయమునకు చిక్కి ఉన్నాను. నా గుండెభాగములు కంపించుచున్నవి. శ్రీలక్ష్మీనరసింహమూర్తీ! నాకు చేయూతనొసగుము.

 

సంసారకూమపతిఘోరమగాధమూలం

సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |

దీనస్య దేవ కృపయా పదమాగతస్య

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 5 ‖

ఓపక్షివాహనా! సంసారకూపమనెడి లోతైన పాడుబడిన బావిలో పడి ఉన్నాను. ఎన్నో దుఃఖములనెడి విషసర్పములు నన్ను చుట్టుముట్టి కాటువేయుచున్నవి. నీకు దాసుడనై, కారుణ్యమూర్తివగు నిన్ను శరనువేడితిని. శ్రీలక్ష్మీనరసింహమూర్తీ! నాకు చేయూతనొసగుము.

 

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర

దంష్ట్రాగ్రకోటిపరిదష్టవిశిష్టమూర్తేః |

నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 7 ‖

హే గరుడవాహనా... క్షీరాబ్ది శయనా.. శౌరీ! సంసారమనే ఘోరవిషపుకోరలు గల సర్పమునకు చిక్కి తల్లడిల్లుతున్నాను.  దాని కాటుతో శరీరమంతా విషం వ్యాపించి ఉంది. స్వామీ! అలాంటి నాకు చేయూతనిచ్చి రక్షించు.

 

సంసారవృక్షబీజమనంతకర్మ

శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |

ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 8 ‖

లక్ష్మీనరసింహస్వామీ! సంసారమొక వృక్షము. ఇది పాపములనెడి విత్తనముల నుండి మొలకెత్తినది.అంతము లేని కర్మలే దీని శాఖలు. ఇంద్రియములే దీని ఆకులు.కానుములే దీని పూవులు.దుఃఖమే దీని ఫలము. స్వామీ నేనీ చెట్టునెక్కి పడిపోవుచున్నాను. నాకు చేయూతనిచ్చి కాపాడుము.

 

సంసారసాగరవిశాలకరాళకాళ

నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |

వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 9 ‖

ఓశంఖచక్రధారీ! సంసారమనెడి సముద్రమునందు అంతులేని కోరికలనే భయంకమైన మొసళ్ళు నన్ను మ్రింగజూచుచున్నవి. మమతానురాగ తరంగములు నన్ని మ్రుంచివేయుచున్నవి. స్వామి! ఊపిరాడకున్నది. బాధ నేను భరింపజాలను. శ్రీలక్ష్మీనరసింహమూర్తీ! నాకు చేయూతనిచ్చి కాపాడుము.

 

సంసారసాగరనిమజ్జనముహ్యమానం

దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |

ప్రహ్లాదఖేదపరిహారపరావతార

 లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 10 ‖

భక్తజనరక్షకా! సముద్రమనే సంసారములోపడి మునిగిపోవుచున్న అజ్ఞానిని. కరుణానిధీ! దీనుని కృపగాంచుము. భక్తప్రహ్లదుని దుఃఖమును పోగొట్టుట్టకోరకే నరహరిగా అవతరించిన తండ్రీ! శ్రీలక్ష్మీనరసింహమూర్తీ! నాకు చేయూతనిచ్చి కాపాడుము.

 

సంసారఘోరగహనే చరతో మురారే

మాహోగ్రభీకరమృగప్రచురార్దితస్య |

ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య

లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్ ‖ 11 ‖

హే దీనజన రక్షకా! సంసారమనే ఘోరారణ్యమున సంచరించుచున్నాను. కోరికలనేడి క్రూరమృగములు నన్ను తరుముతూ పీడించుచున్నవి. మాత్సర్యమనే మండుటెండ నన్ను మలమలమాడుస్తోంది. మురారీ దుఃఖాల నుంచి చేయూతనిచ్చి కాపాడుము.

 

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంతి

కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |

ఏకాకినం పరవశం చకితం దయాళో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ‖ 12 ‖

ఓలక్ష్మీనరసింహా! బహుళ సంసారపాశములకు చిక్కియున్న నన్ను మిక్కిలి బెదిరించుచూ, యమభటులు మెడకు ఉరిపోసి లాగుతున్నప్పుడు ఏకాకినై, పరాధీనుడనై భీతి చెందుతున్నాడను. అప్పుడు నాకు చేయూతనొసంగి నన్ను కాపాడుము.

 

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో

యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |

బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ‖ 13 ‖

ఓలక్ష్మీనరసింహా! నీవు లక్ష్మిపతివి. కమలనాభుడవు. సురాధిపుడవు. సర్వాంతర్యామివి. జ్ఞస్వరూపుడవు. జ్ఞమును పాలించువాడవు. పరబ్రహ్మవు. కేశవుడవు. దీనజనరక్షకుడవు. వాసుదేవుడవు. శ్రీలక్ష్మీనరసింహమూర్తీ! నాకు చేయూతనొసగుము.

 

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-

మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |

వామేతరేణ వరదాభయపద్మచిహ్నం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ‖ 14 ‖

లక్ష్మీనరసింహ దేవా! నీవు చతుర్భుజుడవు. ఒకచేత చక్రమును, మరొకచేత శంఖమును ధరించి, మూడవచేత మా తల్లి లక్ష్మిదేవిని ఆశ్లేషించి, కుడిచేత నాకు చేయూతనిచ్చి రక్షింపుము తండ్రీ! (స్వామి కుడిచేయి వరద-అభయ-పద్మ-చిహ్నములు కలది).

అంధస్య మే హృతవివేకమహాధనస్య

చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |

మోహాంధకారకుహరే వినిపాతితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ‖ 15 ‖

 లక్ష్మీనరసింహ! నేను గ్రుడ్డివాడుని(ఆత్మజ్ఞానము తెలియనివాడిని).ఇంద్రియములనెడి బలము గల దొంగలు నా వివేకధనమును దోచుకొని నన్ను జ్ఞానమనెడి చీకట్లుగల లోతైన బావిలోకి తోసేశారు. ఇప్పుడు నీవే రక్ష  స్వామీ! నాకు చేయూతనిచ్చి రక్షించు.


ప్రహ్లాదనారదపరాశరపుండరీక-

వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |

భక్తానురక్తపరిపాలనపారిజాత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ‖ 16 ‖

స్వామీ! నీవు నారదుడు, ఫ్రహ్లాదుడు,పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు భాగవతోత్తముల హృదయాలలో నివసించువాడవు. నీయందు అనురాగము గల భక్తులను కల్పవృక్షము వలే కోరికలనొసంగి కాపాదుదవు. శ్రీలక్ష్మీనరసింహమూర్తీ! నాకు చేయూతనిచ్చి కాపాడుము.


లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన

స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |

యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-

స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ‖ 17 ‖

శ్రీలక్ష్మీనరసింహస్వామి యొక్క పాదపద్మముల తేనియను ఆస్వాదించు శంకరాచార్యులు శుభకర స్తోత్రములను లోకమున రచియించెను. హరి యందు భక్తి గలవారు స్తొత్రమును చదివి అఖండరూపమైన స్వామి పాదపద్మములను పొందుదురు గాక.


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...