Monday 12 October 2020

లలితశతకం...శ్రీ నారుమంచి అనంత కృష్ణగారు


1

శ్రీ కరమగు నీదు| శ్రీ చక్ర రూపాన 

నియమ నిష్ఠ లందు నిన్ను నమ్మి

తొల్లి పుణ్య ఫలము! వెల్లి విరియగను 

లలిత పదముల మది లలిత గొలుతు

2

చిరు పదముల గూర్ప గురుతర భావముల్ 

సాహసమ్ము గాదె సాయపడవే

 నీదు ముద్దు పట్టి నేననంతుడనంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

3

జ్ఞాని నని తలువను| జ్ఞానమ్ములేదుగా 

భక్తి నంచు పల్లె భక్తి లేదు

 నీవే దిక్కు తల్లి! కావు మటంచును 

లలిత పదముల మది లలిత గొలుతు

4

కన్ను జూడ వలయు కదలక నీ నుండి

పల్కు లన్ని నీదు| పరముగాను 

మనసునందు నిన్ను మరువక ధ్యానించి 

లలిత పదముల మది లలిత గొలుతు

5

 తన మన యని లేక తన మనమందున 

ఎవడు గొల్చు నిన్ను ఎరుక గల్గి 

వాడే ధన్యు డౌను! వాదమ్ము లేదంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

6

సదమల మది గొల్వ, సద్యఃప్రసాదినీ 

నాకు భయం లెల్ల నాశమాయె

అభయ మిచ్చి బ్రోవ! అవని నీవేయంచు 

లలిత పదముల మది! లలిత గొలుతు

7

దివిని దేవతలకు| భువిని మానవులకు

ఎవనికైన నీవె యీయ వలయు 

కామ్య మెల్ల దీర్చు, కామాక్షి నీవంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

8

ధనము గల్గ వచ్చు, దాస జనముగల్గ

వచ్చు, భూమి నేల1 వచ్చు కాని 

దైవ బలము లేక, దైన్యమంచును సదా 

లలిత పదముల మది! లలిత గొలుతు

9

అడగ లేదనకయె అడిగిన దమరును 

అడగకయె కొలువను! అన్ని యమరు 

అడుగడుగున చూడ అమ్మయేగలదని 

లలిత పదముల మది లలిత గొలుతు

10

మనసె మూలముగద! మానవునకు ముక్తు 

డైన తాను బద్దు| డైన గాని 

మాయ పారదోలు, మాత నీ వంచును 

లలిత పదముల మది లలిత గొలుతు

11

నీదు తోడు గల్గ నీ రేని కదలిక 

తనకు నీవు లేక యునికి లేదు

శవము శివము గాగ శక్తి నీ వేయంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

12

మట్టి నీవు జూడఁ మరి నీరు నీరూపు 

అనల మీవెయరయ! ననిల మీవు 

ఆకసమ్ము నీవు, అంతయు నీవంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

13

నీట మునుగ చేప! నిష్ఠ నిల్వ బకము 

గాలి తిన్న పాము! కాదు జపము 

భావ శూన్యమైన, ఫలము లేదంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

14

అక్షరమ్ము లన్నిలక్షణమ్ముగ గూర్చి 

అక్షరమ్ము వేడి లక్ష మార్లు 

దీక్ష బూని నిన్ను సాక్షిగ భావించి 

లలిత పదముల మది లలిత గొలుతు

15

మడులు తడుల నెరుగు మర్యాద లెరుగనే 

మంత్ర తంత్ర మెరుగు యంత్ర మెరుగ 

ఆర్తి తోడ బిల్వ, నాదు కొందు వటంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

16

చెరకు విల్లు ఋతువు చెలికాడు తుమ్మెద 

నూలు అంబులైదు। గాలి రధము 

జగము మరుడు గెల్వ! జనని చూపెబలము 

లలిత పదముల మది లలిత గొలుతు

17

పూజ, సేవ, దాన! పుణ్యకార్యములను 

ఇతర విధుల నిన్ను! యింత గొల్చు 

పథము వేరు గాని ఫలమొక్కటంచును 

లలిత పదముల మది లలిత గొలుతు

18

పాతకమ్ము చేయ| పరగనేనే పెద్ద

దాని పరి హరింప దక్ష నీవు 

నిన్నె నమ్మియుంటి! నీయిష్ట మికనంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

19

సోహమంచు తల్చి శోధించు నొకడు దా 

సోహమంచు జేర చూచు నొకడు 

భిన్న మార్గం నున్నదొక్కటని నే 

లలిత పదముల మది లలిత గొలుతు

20

నాక నరక ప్రాప్తి నాకు కల్గును చూడ 

పాప పుణ్య శేష ఫలము చేత 

శేష హీనమైన/ చెందు మోక్షమనగ

లలిత పదముల మది లలిత గొలుతు

21

గృహ బలంపు లేమి। గ్రహ గతులను బాధ 

లంటవమ్మ పదము| లంటువారి 

నిప్పుదగుల దూది! నిలువ నట్లుంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

22

పాల జూడ వెన్న బయట కానగ రాదు 

తరచి తరచి తీయ, తనకు దొరకు 

జీవు లందు దాగి! నీవే యున్నట్లుంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

23

ఈశ శక్తి వీవు, ఈప్సి తార్థము లిమ్ము 

మాయ తెరలు తీసి మమ్ము బ్రోవు 

సర్వ మంగళయని సర్వసాక్షిణియంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

24

సర్వసౌఖ్య దాత్రి సర్వాంగ సుందరి 

కామితమ్ము లిచ్చు ప్రేమ మీర 

నమ్మి కొల్చుటొకటె నాధర్మమంచును 

లలిత పదముల మది లలిత గొలుతు

25

ఆయువైన గాని ఆలు బిడ్డలు గాని

సర్వభోగ సౌఖ్య, సంపదలును 

ఆదియిదియన నేల అన్ని యిమ్మంచును 

లలిత పదముల మది లలిత గొలుతు

26

నన్ను నేను తెలియ! నిన్ను గొల్చెదనమ్మ 

ఎన్న నీవె గాదె! ఎందు చూడ 

స్థూలమందు చూడ సూక్ష్మమీ వంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

27

వనజ భవుని రాణి, వనమాలి దేవేరి 

సేవలందు కొనెడి దేవ దేవి 

ఆది శక్తి వీవు! అభయ మిమ్మంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

28

లోని చూపు తెలియ॥ లోక మంత తెలియు

బాహ్య దృష్టి యున్న! ఫలము లేదు 

ఆత్మ చింతనమ్మె అక్షయ పథమంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

29

జలము నందు గాని/ యిల శూన్యమందైన 

జడము నీవు చూడఁ చలము నీవు 

వెదకి చూడ నీవె! విశ్వమంతయునంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

30

సురలు జయము కోరి! చేరి జన్నము చేయ 

వారి శక్తులన్నీ చేరి నంత 

ఉద్భవించి బట్టి యుద్ధండ శక్తిని

 లలిత పదముల మది| లలిత గొలుతు

31

నిన్ను గొల్చు వేళ నిస్సీమ మహిమరో

పాప పుణ్య పంక్తి! పాటి రాదు

శరణ మంచు తల్లి! సర్వానవద్యను 

లలిత పదముల మది లలిత గొలుతు

32

స్వస్వరూప జ్ఞాన సాధనమ్మెక్కటే 

నిత్య సత్య సుఖం నీకు నిచ్చు

 చింతార్థ దాత్రి చిచ్ఛక్తి రూపను 

లలిత పదముల మది లలిత కొలుతు

33

చాలు తెలియ వలయు చాలదు కాలమ్ము 

బాట చూడ రాచ బాట గాదు

హంస శక్తి బొంది| హంస నేనెరుగంగ 

లలిత పదముల మది లలిత గొలుతు

34

హరుని జ్ఞాన దృష్టి హరియించకర్మలు 

దగ్ధకాములగుచుఁ దనరగాను 

అమృత ధృక్కులందు, అమ్మమోక్ష మిడగ

లలిత పదముల మది లలిత గొలుతు

35

అర్థ శబ్ద మన! అవ్యక్త మనగను 

సకల నిష్కలమన! సగుణ మనగ 

భావమేది గాని భావనాగమ్యగా

లలిత పదముల మది! లలిత గొలుతు

36

దేశ కాల వస్తు! రాశి భిన్నత లేక 

వృద్ధిక్షయము లేని శుద్ధ మూర్తి 

పూర్ణ భక్తి నిన్ను పూర్ణాఖ్య రూపాన 

లలిత పదముల మది లలిత గొలుతు

37

ఎంత ప్రేమ నీకు, చింతల దీర్పంగ 

ఇష్ట పూర్తి స్తవము, నిచ్చి నావు 

నిశ్చలతను గొల్వ నిక్కము ఫలమంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

38

ఆర్తు లనగ జ్ఞాను। లర్ధార్థి జిజ్ఞాసు 

లనగ నెట్టి భక్త! జనుల కైన 

సౌఖ్య మిచ్చు భక్త! సౌభాగ్య దాయినిన్ 

లలిత పదముల మది లలిత గొలుతు

39

చిన్ని పాపనమ్మ! నన్నిట్లు శోధింప 

తాళ లేను తల్లి! తెలియవమ్మ 

చిక్కు ముడుల విప్పు చక్కని తల్లిరో 

లలిత పదముల మది లలిత గొలుతు

40

భిన్న వర్ణజాల! మున్న మంత్రములన్ని 

వర్ణ రూప శక్తి! వనగ, కోరి 

మంత్ర సిద్ధి సర్వ మంత్ర స్వరూపిణిన్

లలిత పదముల మది లలిత గొలుతు

41

మట్టి ముద్ద నుండి పుట్టె బొమ్మలన్ని 

తీరు తెన్ను లెంచు పేరు మారు 

నామ రూపముడిగి నా తల్లి కన్పట్ట 

లలిత పదముల మది లలిత గొలుతు

42

నీమమున, మనమున! నీ మను మననమ్ము 

మానని నిజ భక్తి మార్గ రతుని 

అనునయమున బహుశః యమున బ్రోతువటంచు

లలిత పదముల మది లలిత గొలుతు

43

నేనెరిగిన దెంత నేనెరుగగలేను 

ఎరుగ మిగిలిన నింత యెరుగ నేను

తెరుపు మరుపు వాడ! తరియించు తెరవుకై

లలిత పదముల మది లలిత గొలుతు

44

వినుతి సేతు నమ్మ వినుత శీలాయంచు

విన్నదనము బాప చెన్ను మీర

కన్న తల్లి గాక, గాతురింకెవరని 

లలిత పదముల మది| లలిత గొలుతు

45

వేన వేల పేర్లు, వేడుకొనగనిన్ను 

వేదనుడిగి తాను, సేవ దీర 

మంత్ర భావనమ్ము మంగళ కరమంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

46

భర్త భస్మమైన, భరియింప జాలక 

నిన్ను వేడి ఉన్న, ఖిన్న మతిని 

కాపు కాచి నట్టి కామ సంజీవినీ 

లలిత పదముల మది లలిత గొలుతు

47

కండ్ల గంతలుంచ! కన్పట్ట కున్నను 

గాడి నందు తిరుగు। గాను గెద్దు

తత్వ దృష్టి లేని తపము పగిది యంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

48

కర్మ నిష్ఠ చేత కలుగు స్వర్గ సుఖము

జ్ఞాన నిష్ఠ చేత నందు ముక్తి 

భోగ మోక్ష ప్రాప్తి పొందంగ కోరినే 

లలిత పదముల మది| లలిత గొలుతు

49

శుద్ధ స్ఫటిక మందు! చూచినటులగాక 

చెంత నన్ను వస్తు: వింత కాంతి 

నిర్గుణాత్మ వన్న! నిజమునే నరయంగ 

లలిత పదముల మది| లలిత గొలుతు

50

ఆపదాదు లందు, నభిచార మందును 

భూత భయము లందు, పోరులందు 

రక్షణమ్ము నీవె రక్షాకరీ యంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

51

కాళి రూపు తోడఁ కామేశు దరిజేర 

నల్ల పిల్ల యన్న నల్ల లేక

గౌర వర్ణ మొంది। గౌరివైతి వటంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

52

చేయు వాడ నేను! చేకొనునది నీవు

చేత నీదు పూజ చేర్చిజూడ 

త్రిపుటి యంచు నొప్ప త్రిపుర సుందరిన్ 

లలిత పదముల మది లలిత గొలుతు

53

సాధకుండ నేను! సాధన నీసేవ

సాధ్య మన్న మోక్ష సాధనమ్మె 

సాక్షిగ నిను నిల్పి సాధింప కడదాక 

లలిత పదముల మది లలిత గొలుతు

54

శివుని ముఖము చూచి చిరు నవ్వు నవ్వగా 

మీ నగవుల కాంతి! మేను దాల్చ 

మా గణపతి వెలసె మా భాగ్య మనగనే 

లలిత పదముల మది లలిత గొలుతు

55

కారణమ్ము లేని కరుణ నీరూపు 

కోరి కొల్చు వారి కొంగు పసిడి

చేరి మ్రొక్కి లిడుదు! చేయివీడకు మంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

56

ప్రాపు కోరి నీదు| పదాబ్జములు బట్ట 

నట్టి దిట్టి దనక, నెట్టిదైన 

తక్షణమ్మె నాకు! రక్ష దొరకునని

లలిత పదముల మది లలిత గొలుతు

57

పుట్టినంత గాదు! పోషింప బడవలెన్ 

ఎగుడు దిగుడు లేక సుగమ గతిని

 చంటి పాప నమ్మ కంటకాపాడగా

 లలిత పదముల మది లలిత గొలుతు

58

కలకలములు కనక కలవరము పడక

చెలిమి మొలగ వలయు, నిలను జనులు

విలువలు వదలక నిలుప గలుగు నిను 

లలిత పదముల మది లలిత గొలుతు

59

పొందెనెన్ని జన్మ లొందెన్ని మున్ముందు 

తెలియ సాధ్యపడదు తెలియ వమ్మ

ఉన్న జన్మమందె యున్నత గతినొంద 

లలిత పదముల మది లలిత గొలుతు

60

మాయ యని తెలియును, మానడు మోహంబు 

దారయని సుతుడని ధనమటంచు 

మాయ నెల్లను మటు మాయము సేయగా 

లలిత పదముల మది లలిత గొలుతు

61

పిచ్చి వాడి ననుచు, మెచ్చినా నొచ్చినా 

నేను బాధపడను! నిజము నిజము 

మరపెరుగక నిన్ను, మదినిల్పి భక్తితో 

లలిత పదముల మది| లలిత గొలుతు

62

దుఃఖ జలధి దాటి సుఖమంద వలెనన్న 

గతివి నీవు గాని యితర మేల 

బావి యుండ నెండ మావు లెందుకనినే 

లలిత పదముల మది లలిత గొలుతు

63

మాటి మాటికి మన సాటి పరుగు దీయు 

నిలువ లేద దేల, నిలకడగను 

త్రాట గట్టి నిలుప దాటక నీనుండి 

లలిత పదముల మది లలిత గొలుతు

64

పూజ చేయు టెట్లు! పూర్తిగా నెరుగను 

శక్తి కొలది నిన్ను! భక్తి గొలతు 

చెరకు వంగ తీపి, చెడని చందమ్మునన్ 

లలిత పదముల మది లలిత గొలుతు

65

పరుస వేది దగుల పసిడి గాదె యినుము 

కీటకమ్ము గాదె తేటి రీతి 

నిన్ను చేరి నిల్వ నేనల్పు డెట్లని 

లలిత పదముల మది లలిత గొలుతు

66

జగము లెల్ల కన్న జగదంబ తానెట్లు 

పుట్టె నద్రి ముద్దు! పట్టి గాను 

బిడ్డ తల్లిని గన! విడ్డూర మంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

67

మూర్తు లెవ్వరేని కీర్తింప వలెనిన్ను 

నీ పదమ్ముల కడ నిల్చి యుండి 

దివ్య తేజ మీవు, దివిటీలు మేమంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

68

పెట్టెననగ తనకు! పుట్టినదే సాక్షి 

పిట్ట కున్న తనకు! పుట్టబోదు 

ఎట్టి ఫలముకైన గుట్టిదే నంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

69

యోగముండవలెను యోగ సాధన చేయ 

రాగ భోగ దోష రహితముగను 

యోగిగాగ కోరి యోగ్యత పొందంగ 

లలిత పదముల మది లలిత గొలుతు

70

నీటి చుక్క యొకటి నీట గలియ వచ్చు 

ఇలను గలియు వచ్చు. నిగుర వచ్చు 

ఉన్నచోటు బట్టి యునికి మారుననినే 

లలిత పదముల మది లలిత గొలుతు

71

సురపతి, ధనపతుల సరసన్ నిలువజాల 

నిన్ను వేడుకొనను, నిలిచి యుండి 

చంకనెక్కి నీదు| చనుబాలుత్రాగంగ 

లలిత పదముల మది లలిత గొలుతు

72

శాస్త్ర చర్చ చేత! జపతపాదుల చేత 

కామ్య మంద వచ్చు కాదు ముక్తి 

ఆత్మ తత్వమెరుగ అపవర్గ మందగన్ 

లలిత పదముల మది లలిత గొలుతు

73

మందు పేరు పలుక! మానదు రోగమ్ము 

తినిన గాని రాదు, దాని ఫలము 

అనుభవించ ముక్తి ఆశతో కాదని 

లలిత పదముల మది లలిత గొలుతు

74

తానె గూడు గట్టి తనదు తంతువులలో 

సాలె పురుగు జిక్కి చక్కగాను 

దేహ భావన మున్న తెలియదు నిజమని 

లలిత పదముల మది లలిత గొలుతు

75

తిమిర బాధ నణచ దినమణి కావలె 

నిప్పు బాధ నణచ నీటి శాంతి 

కలిని బాధ లణచ  కలిమల హారణిన్ 

లలిత పదముల మది లలిత గొలుతు

76

చీమ చిటుకు మనగ చిగురాకు కదలంగ

జగతి నెట్టి పనులు! జరుగ గాను 

ఆజ్ఞ లిచ్చు తల్లి! యాపదల్ బాపంగ 

లలిత పదముల మది లలిత గొలుతు

77

బూతు కూత గూడఁ నీతి మాటగ దోచు

నీతి మాట తోచు! బూతు గాను 

భావ బలము గెలుచు| భాష కాదంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

78

తనకు దాహమైన, తానె జలము త్రాగు 

మందు తినక జబ్బు! మాన బోదు 

స్వానుభవము లేని చదువెట్టి ఫలమంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

79

స్వప్న మందు గాంతు సకల విషయములు 

నిద్ర లేవ గానే నిజము దెలియు 

జ్ఞాన ముద్భవించి, నణగనజ్ఞానమ్ము 

లలిత పదముల మది లలిత గొలుతు

80

కనకమన్న నిజము కంకణాదులు కల్ల 

పాత్రలందు మట్టి మాత్రముండు 

కలది నేనెరింగి! కల్పితాలు మరువ 

లలిత పదముల మది లలిత గొలుతు

81

చెడ్డ నీటి లోన! చిల్ల గింజను వేయ 

నీరు చక్క బడును! నిముషమందు 

మదిని నిన్ను నిల్ప మలిన ముడుగునంచు 

లలిత పదముల మది| లలిత గొలుతు

82

నిమ్మ చెట్టు కొట్టి నీరున్న చిగురించు 

అహము చావ నట్లు! అహితు డయ్యు 

విషయ వాంఛలున్న వీడద హమనగ 

లలిత పదముల మది లలిత గొలుతు

83

ఎంత చీకటైన, కొంత వెలుగుచాలు 

అంధకారము నది, యణచి వేయు 

అమల బావ దీప్తి యహమును జీల్చంగ 

లలిత పదముల మది| లలిత గొలుతు

84

చేత నున్న బంతి! చేజార మెట్లపై 

మొట్టు మొట్టు జారి గట్టు జేరు 

చేరి నన్ను వాడు చిత్తంపు గతియని 

లలిత పదముల మది| లలిత గొలుతు

85

పాల యందు పాలు! జలయందు జలమును 

నూనె యందు జేరు, నూనె లాగు 

ఆత్మలోన కలిసి యాత్మ తత్త్వ మెరుగ 

లలిత పదముల మది లలిత గొలుతు

86

భాష యందు పటిమ, భక్తి యందు గరిమ 

తోటి వారి యందు, మేటి యయ్యు 

షడ్రిపుల దునుము సాధించు తానేట్లు 

లలిత పదముల మది లలిత గొలుతు

87

తద్భవములు మారు! తత్సమమ్ములు గాను 

తత్వ మరసి తాను! తలచి తలచి 

కుత్సి తిమ్ములుడిగి సత్సంగ లబ్ధి కై 

లలిత పదముల మది లలిత గొలుతు

88

ఆపద యని బల్క ఆ! పదమని పల్కు 

వాడె జూడ సుఖం తోడు నీడ 

ఆప దలచి మించి ఆ పదమ్ముల పట్టి 

లలిత పదముల మది! లలిత గొలుతు

89

వాన పడిన వేళ తాను సూర్యుని గోరు 

ఎండ వేళ వాన! కెదురు చూచు 

లేని దాని మరచి లేమి భారము వీడ

లలిత పదముల మది| లలిత గొలుతు

90

కష్ట మొచ్చె నేని కన్పించు దైవము 

సుఖము గల్గునేని! చూడ బోడు 

స్వార్థ రహిత భక్తి! సాధింపగానెంచి 

లలిత పదముల మది లలిత గొలుతు

91

నిప్పు దగుల పసిడి నిజవర్ణ మొందురా 

మట్టి గాల్చ మిగులు! నొట్టి బూది 

భయము లేక మేము, బాధల దాటంగ 

లలిత పదముల మది లలిత గొలుతు

92

కంఠసీమ నున్న! కంటె కానగ రాక 

వెదుక తిరుగుతున్న, వెర్రి గాక 

లోన నున్న నీదు, వైనమ్ము తెలియంగ 

లలిత పదముల మది లలిత గొలుతు

93

పద్యరచన చేయఁ పండితుడనుగాను 

భావ పటిమ లేదు| భాష లేదు 

తల్లి చెంత చేత! పిల్ల చేష్టయనగ 

లలిత పదముల మది లలిత గొలుతు

94

నిత్య శుద్ధ వంచు! నిత్య బుద్ధాయంచు 

నిర్వికల్ప వంచు నిత్యవంచు 

నిత్యముక్త వంచు! నిరపాయవంచునే 

లలిత పదముల మది లలిత గొలుతు

95

భద్రమూర్తి వీవు! భక్తి గమ్యవు నీవు 

భక్తి వశ్య వీవు శక్తి వీవు

శాంతమూర్తి వీవు, శాంభవి నీవంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

96

నిన్ను చేరి నిల్చి మన్నింప వేడంగ 

మాట రాక పోతే మనసు దాటి 

వాంఛి తార్థ మివ్వ వాసిగా రాశిగా 

లలిత పదముల మది లలిత గొలుతు

97

కామధేను వనగ కాలి సందుల దూరి

కొరత లేక పాలు, గుడుతు నేను 

వత్సమౌదు నమ్మ వాత్సల్యతను గావ 

లలిత పదముల మది లలిత గొలుతు

98

బాససేయ వమ్మ! బాసట నిల్వంగ 

దోష పంక్తి జూచి, రోష పడక 

చేయి సాచి నాడ చేకొని కాపాడ 

లలిత పదముల మది లలిత గొలుతు

99

ఇడములుడుగ జనులు కడిమి చెట్టగు నిన్ను 

దరిని జేరగానె దయను జూపు 

చేరి మమ్ము బ్రోవు! చారుహాసా యంచు 

లలిత పదముల మది లలిత గొలుతు

100

పావనమ్ము గాఁ దీవెనలు వడయ 

పట్టు సడలక నిను పట్టు కొందు 

నీదు పదమె శరణు నిశ్చయమ్ముగనంచు

లలిత పదముల మది లలిత గొలుతు

101

ఒక్కపద్యమైన, చక్కగ దలపంగ

ఎల్ల శుభము లొందు! కల్లగాదు 

నన్ను కన్న తల్లి! నామాట నిల్పంగ

లలిత పదముల మది లలిత గొలుతు

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...