Showing posts with label దేవాలయాలు. Show all posts
Showing posts with label దేవాలయాలు. Show all posts

Saturday 22 August 2020

శ్రీ భూవరహస్వామి దేవాలయం, కల్లహల్లి,కర్ణాటక

మెల్కోటెకి 42 కిలోమీటర్ల దూరంలో మాండ్య జిల్లాలోని కల్హల్లి అనే చిన్న గ్రామంలో శ్రీ భూవరహస్వామి దేవాలయం హేమవతి నది ఒడ్డున ఉంది. విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి విగ్రహం 18 అడుగుల ఎత్తు మరియు బూడిద రాయితో తయారు చేయబడింది. వరాహ స్వామి కుడిచేతిలో సుదర్శన్చక్రం, ఎడమతొడ మీద భూదేవీ ఆసీనులై కూర్చొని దర్శనమిస్తున్నది. 

ఈ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నదిలో ఈత కొట్టడం,  పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉండదు. వర్షా కాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడకు చేరుకుంటుంది. ఏప్రిల్ మరియు మేలో నీరు తగ్గిన తరువాత వార్షిక ఉత్సవాలు జరుగుతాయి.

భూవరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది. స్థలపురాణం ప్రకారం, ఈ ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడని చెపుతారు. ఈ దేవాలయానికి రాజ వీర్ బాలాల గురించి ఒక పురాణ కథ ఉంది. వేట కోసం రాజు అడవికి వెళ్ళిన సమయంలో విశ్రాంతి కొరకు ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో అక్కడ ఒక వింత దృశ్యాన్ని గమనించాడు. ఒక కుక్క చిన్న కుందేలును తరుముకుని రావడం చూశాడు. మరి కొద్ది సేపటికి కుందేలు కుక్కను తరుముకునిపోవడం  గమనించాడు.

అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు మరియు ఈ ప్రదేశంలో 16 అడుగుల లోతు తవ్వి చూడగా  అక్కడ వరాహస్వామి విగ్రహం దాగి ఉండటాన్ని కనుగొన్నాడు. 

ఈ సంఘటన తరువాత, ఈ రాజు అక్కడ వరహాస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతీ రోజు పూజలు చేయడం ప్రారంభించాడు.




Thursday 6 August 2020

శ్రీ యోగానంద గురునరసింహ స్వామి (Shi Yogananda Guru Narasimha Swami) క్షేత్రం సాలిగామ, కర్ణాటక

హిరణ్య స్థంభ సంభూత ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లదార్తి ముషే జ్వాలానారసింహాయ మంగళమ్

భక్తుని మాటను నిజం చేయడానికి తనను తాను ఒక స్తంభంలో ఫ్రకటించుకున్న నరసింహస్వామి భక్తుల కోర్కెలు తీర్చడం కోసం ఎన్నో క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. అలా నరసింహస్వామి గురువుగా కొలువైన క్షేత్రం  ఉడిపికి 25 కి.మీ. దూరంలోని సాలిగ్రామాలోని గురునరసింహ క్షేత్రం. 

పద్మపురాణం ప్రకారం

నారదమహర్షి ఈ క్షేత్ర ప్రాంతానికి వచ్చిన సమయంలో భయంకరమైన ఉరుములు మెరుపులతో భూమి కంపించింది. ఆ సమయంలో అక్కడి మునులు,రుషులు నారదమహర్షిని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశవాణి “ఈ ప్రాంతంలో బ్రహ్మరుద్రాది దేవతలు అర్చించిన శంఖ చక్రములను ధరించి శంఖ, చక్ర తీర్థముల మధ్య ఆశ్వర్థ వృక్షం వద్ద నరసింహస్వామి మూర్తి ఉన్నదని నారదమహర్షి ఈ క్షేత్రంలో విగ్రహప్రతిష్ట చేయాలని” పలికింది. నారద మహర్షి నరసింహ స్వామివారి విగ్రహాన్ని వెతికి తీయించి స్వామి వారి ఆనతి ప్రకారం ఈ ప్రాంతంలో విగ్రహప్రతిష్ట గావించారు.

స్కాందపురాణం ప్రకారం

కదంబవంశానికి చెందిన మయూరవర్మ కుమారుడైన లోకాదిత్య తన సైన్యంతోపాటి భట్టాచార్యుల నాయకత్వంలోని బ్రాహ్మణులతో ఈ ప్రాంతానికి వచ్చారు. రాజు రాజ్యంసుభిక్షంగా ఉండాలని లోకాదిత్యుడు ఈ బ్రాహ్మణులతో ఎన్నో యాగాలను చేయించారు.  

భట్టాచార్యులవారు ఈ ప్రాంతంలో ఏనుగులు, సింహాలు జంతువులు సహజ వైరం మరచి జీవించడం గమనించి ఈ ప్రదేశానికి నిర్వైర్యప్రదేశం గా నామకరణం చేసారు.

భట్టాచార్యునికి 10 చేతులతో వినాయకుడు కలలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలోని యోగా నరసింహుని విగ్రహాన్ని పునఃప్రతిష్ట కావించమని చెప్పారు. అలా ఆయన నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట చేసారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టతో పాటు నిర్వైర్యప్రదేశం అను పేరుకు గుర్తుగా మహాగణపతిని కూడా ప్రతిష్టించారు.    

ఈ బ్రాహ్మణులు ఇక్కడ నరసింహస్వామిని గురువుగా పూజిస్తుండడంతో క్షేత్రం పేరు గురునారసింహక్షేత్రంగా సుప్రసిద్ధమయ్యింది.ఇక్కడ స్వామివారి విగ్రహం సాలగ్రామ స్వాయంభూ విగ్రహం.

ఈ క్షేత్రంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీ గురు అన్నదాయినీ మంటపంలో అన్నదానము జరుపబడుతుంది.  


 


Saturday 1 August 2020

గరుడ దేవాలయము కోలాదేవి (GaruDa Temple Koladevi; Mulbagilu)

కర్ణాటకలో ఏకైక గరుడ దేవాలయం కోలారు జిల్లా, ములబాగుల తాలూకాకు 18 కిలోమీటర్ల దూరంలోని కొలాదేవి గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో ఉన్నట్లు ప్రపంచంలో మరెక్కడా విగ్రహం లేదని ప్రతీతి. 
ఈ దేవాలయానికి త్రేతాయుగ, ద్వాపరయుగాల నాటి చరిత్ర ఉంది.
ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణు వాహనమైన గరుక్మంతుడు. ఇక్కడ ఉన్నట్లు గరుడ విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని స్థానికులు చెబుతుంటారు. గరుక్మంతుడు నేల పైన ఓ మోకాలును ఉంచి మరో కాలు మోకాలు పైకి లేచి ఉంటుంది. ఇక కుడి భుజం పై విష్ణువు ఉండగా ఎడమ భుజం పై లక్ష్మిదేవి ఉంటుంది. అంతే కాక ఇక్కడి విగ్రహానికి పాములు ఆభరణాలుగా ఉంటాయి.

ఈ దేవాలయం ఆవరణంలోనే భక్తిభావం ఉట్టిపడే హనుమంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం సరిగ్గా గరుడ విగ్రహానికి ఎదురుగా ఉంటూ ఒకదానికొకటి చూస్తున్నట్లు ఉంటాయి.
ఈ దేవాలయానికి సంబంధించి 2 కథనాలు ఫ్రాచుర్యంలో ఉన్నాయి.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం,
త్రేతాయుగంలో రావణుడు సీతా దేవిని అపహరించే సమయంలో ఓ గరుడ పక్షి రావణుడితో ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో పోరాటం మొదలు పెడుతుంది. అయితే చివరికి ఆ పోరాటంలో ప్రణాలు కోల్పోతుంది. తుది గడియల్లో రామ..రామ అని కలవరించింది. ఈ విషయాన్ని దూర ద`ష్టితో చూసిన రాముడు గరుడ పక్షికి మోక్షం ప్రసాదించడమే కాకుండా ఈ ప్రాతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

ద్వాపరయుగంలో అర్జునుడు వేటాడుతున్నపుడు శరప్రచండానికి అడవి దహించుకుపోవడం వల్ల అందులోని సర్పాలు కుడా అగ్నికి ఆహుతి అవుతాయి. అలా అగ్నికి ఆహుతై మరణించిన సర్ప శాపాన్ని (సర్పదోష) పరిహారము చేసుకోవడానికి అర్జునుడు ఇక్కడ గరుడ దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించాడని కూడా స్థలపురాణం ఉంది.

సాధారణంగా ఈ దేవాలయానికి సంతానం లేని దంపతులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి తప్పక సంతానం కలుగుతుందని స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు సైతం నమ్ముతుంటారు.

బెంగళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాదేవి గ్రామానికి దాదాపు 2.30 గంటల ప్రయాణం.


Saturday 25 July 2020

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

ప్రాచీన కాలంలో ప్రాంతంలో గొరవన హళ్లి ప్రాంతంలో గోవుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అవి చేసే శబ్దాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాంతానికి గొరవన హళ్లి అని పేరు వచ్చినట్లు చెబుతారు.

ప్రాంతంలో అరసు వంశానికి చెందిన అబ్బయ్య నిత్యం పశువులను మేపుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆయన నరసయ్యనపాళ్య గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా తనను ఇంటికి తీసుకు వెళ్లాల్సిందిగా ఒక ఆడస్వరం వినిపించింది.

దీంతో అతను స్వరం వినిపించిన చోటు వెదుకగా విచిత్ర రంగులో మెరిసిపోతున్న ఒక రాతి పలక కనిపింది. దీంతో తన తల్లి అనుమతి తీసుకుని శిలా రూపాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించాడు.

దీంతో అతడు కొద్దికాలంలోనే ధనవంతుడిగా మారిపోయి తన కుటుంబంతో సుఖంగా జీవించసాగాడు. దీంతో అతని ఇంటికి లక్ష్మీ నివాసం అని పేరు వచ్చింది.

కొన్ని రోజుల తర్వాత అబ్బయ్య తమ్ముడైన తోటప్పయ్య లక్ష్మీ దేవిని పూజించడం మొదలుపెట్టాడు. ఒకరోజు లక్ష్మీ దేవి ఆయన కలలో కనిపించి తనకు గొరవనహళ్లిలో ఒక దేవాలయాన్ని నిర్మించి తన విగ్రహాన్ని అక్కడ పున:ప్రతిష్టించాలని సూచించింది.

దీంతో ఆయన లక్ష్మీ దేవి చెప్పినట్లే చేశారు. కొన్ని రోజుల పాటు దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్యాన్నదానాలు బాగానే జరిగాయి. అయితే అటు పై ఆలయం ఆలనా పాలనా పట్టించుకునేవారు కరువై పోయారు.

దీంతో ఆలయంలో పూజలు జరగలేదు. నేపథ్యంలో గొరవన హళ్లికి కోడలిగా వచ్చిన కమలమ్మ దేవాలయం స్థితిగతులను చూసి చాలా బాధపడింది. అటు పై ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని దేవాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థితికి అభివ`ద్ధి చేసింది.

క్రమంగా దేవాలయానికి భక్తుల రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవిని కొలిచిన వారి కష్టాలు తీరి వారు సంపన్నులుగా మారుతూ వచ్చారు.

అంతేకాకుండా పెళ్లికాని అమ్మాయిలు 48 రోజుల పాటు గొరవన హళ్లి లక్ష్మీ దేవిని ఆరాదిస్తే వివాహ యోగం కలుగుతుందని నమ్ముతున్నారు.

దీంతో కేవలం కర్నాటక నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

అంతేకాకుండా ఆషాఢమాసం చివరి శుక్రవారం ఇక్కడ జరిగే చండికా హోమంశ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సమయంలో వేల సంఖ్యలో మహిళా భక్తులు హాజరవుతారు.

ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కోసం కమలమ్మ మార్గదర్శనంలో ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి వచ్చే భక్తులకు వసతి కల్పిస్తున్నారు. ఇక్కడ నిత్యం రెండు పూటలా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

తుమకూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరవన హళ్లికి చేరుకోవడానికి తుమకూరు హైవేలోని దాబాస్ పేట మీదుగా రోడ్డు మార్గం చాలా బాగుంది. తుమకూరు నుంచి వచ్చేవారు కొరటగెరె మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

గొరవనహళ్లికి సమీపంలో చుట్టు పక్కల దేవరాయన దుర్గా, సిద్దర బెట్ట, సిద్ధగంగా, శివ గంగా వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

Locality/village : Goravanahalli
State : Karnataka
Country : India
Nearest City/Town : Koratagere Taluk
Best Season To Visit : All
Languages : Kannada, Hindi & English
Temple Timings : 6:00 AM to 12:30 PM and 5:30 PM to 8:00 PM

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...