జన్నమాంబ - భీమకవి




                జన్నమాంబ ఉదంతము కూడా ఇలాంటిదే. భీమకవి రాజసందర్శనార్థం వెళ్తూ ఒక గ్రామమును చేరారు. ఇంటి ముందు నిలుచున్న జన్నమాంబ అనే వితంతువును చూసి భీమకవి “అమ్మా! భోజనము చేసి పెట్టవా?” అని అడిగారు. అందుకామె “నాయనా నా కంఠమ్మీద ఉన్న వ్రణము(గడ్డ) ఎన్నో రోజుల నుంచి నన్ను బాధ పెడుతోంది. నాకు ఓపిక లేదు.” అంది. బహుశా ఆమెకు వ్రణవిముక్తి కల్గించడానికే ఆమె ఇంటికి వచ్చినట్లు భీమకవి “ఆ వ్రణమును నేను పోగొట్టెదను. వండి పెడతావా?” అని అడిగారు. “వ్రణమును పోగొట్టిన ఎందుకు చేసి పెట్టను. భోజనము చేసి పెడితే పాపము రాదుకదా!” అలానే అని బదులిచ్చింది.

భీమకవి ఆమె వ్రణమును పోగొడుతూ ఈ పద్యమును చెప్పారు.
                             ఘనరోగంబుల బలమా
                                కనుగొనగా జన్నమాంబ కర్మపు ఫలమా!
                                నినుఁ బ్రార్థించెద వినుమా
                                మునుకొని యో గండమాల మునగకుఁ జనుమా
భావము: కనుగొనగా జన్నమాంబ కర్మల ఫలితంగా అంటిన భయంకర రోగపు బలమా!  ఓ గండమాలా(వ్రణమా)! నా ప్రార్థన విని వెళ్ళి మునగ చెట్టును పట్టుకో!

                వెంటనే ఆ వ్రణము జన్నమాంబ కంఠమును వదిలి ఇంటి ఎదురుగా ఉన్న మునగ చెట్టును చేరింది. బాధానివృత్తిని పొంది మహదానందంతో భీమకవికి వండి పెట్టింది.

                వెళ్ళిన పని ముగించుకొని తిరిగి వస్తూ, భీమకవి ఆమెను పరీక్షించదలచి మళ్ళీ ఆమె ఇంటి ముంగిటికి వెళ్ళి “అమ్మా ఈ ఒక్క పూటకు భోజనము చేసిపెట్టవా?” అని అడిగారు. జన్నమాంబ చేసిన ఉపకారమును మరచినదై, మిట్టమధ్యాహ్నమున భోజనానికి వచ్చిన అర్థికి సహాయం చేయకుండా, “ నాకు ఇదేపనా నయనా! ఇంకేం పని లేదా? నేను వండి పెట్టను. ఇంకొకరి ఇంటికి వెళ్ళి అడుగు” కఠినస్వరంతో సమాధానం చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ మునుపు మునగ చెట్టును చేరిన వ్రణమును తిరిగి ఆమె కంఠమును చేరేలా చేసి వెళ్ళిపోయారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...